ఫ్లాష్ బ్యాక్ @ 50

రాజూ-పేద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభనాచల స్టూడియోస్ చిత్ర నిర్మాణ వ్యవహారాలు, నిర్వర్తించే బుగతా అప్పల సుబ్బారావు (బి.ఏ.సుబ్బారావుగా పరిచితులు) 1949లో బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా మల్టీ స్టారర్ చిత్రం ‘పల్లెటూరిపిల్ల’ అక్కినేని, నందమూరి, అంజలిదేవిలతో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 1950లో విడుదలైన ఈ చిత్రం ద్వారా ఎన్.టి.రామారావుకు తొలిసారి హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ‘టింగురంగడు’ (52) ఆపైన ‘మార్క్‌ట్వైన్’ నవల ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ది ప్రిన్స్ అండ్ పాపర్ (1937)ను అనుసరించి బి.ఏ.యస్. ప్రొడక్షన్స్ బేనర్‌పై వీరు రూపొందించిన చిత్రం ‘‘రాజూ-పేద’’ 25-06-1954.
స్టేజి నటిగాను సినిమాల్లో సహాయ నటి పాత్రలు ధరించే, చిత్తజల్లు సుందరీమణి, హార్మోనిష్టు మాగాపు సాంబమూర్తిల కుమారుడు, మాస్టర్ సుధాకర్ చేత డబుల్ రోల్ చేయించారు. (యువరాజుగా పేదవాడుగా)
రాజూ-పేద చిత్రానికి, ఎడిటింగ్- కె.ఏ.మార్తాండ్, కెమెరా- ఆది ఇరాని, మాటలు- పినిశెట్టి శ్రీరామమూర్తి, కళ-వాలి, స్టంట్స్-పెద్ద రాఘవయ్య, సంగీతం- ఎస్.రాజేశ్వరరావు, నృత్యం- పసుమర్తి, వి.జె.శర్మ, దర్శకత్వం, నిర్మాత-బి.ఏ.సుబ్బారావు.
మహారాజు సురేంద్రదేవ్ (యస్.వి.రంగారావు) దొంగ పోలిగాడు (ఎన్.టి.రామారావు)లకు ఒకే రోజున మగ పిల్లలు జన్మిస్తారు. ఆ తరువాత 12 సం.లకు యువరాజుకు పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయి. అదే రోజున, గూడెంలో పోలిగాడి కొడుకు నారిగాడు (మాస్టర్ సుధాకర్) ఆరోజు తండ్రి అడుక్కు రమ్మంటే, ఎదిరించి, తల్లి అచ్చమ్మ (లక్ష్మీరాజ్యం) అక్క మల్లి (అమ్మాజి)లకు తెలియకుండా పారిపోతాడు. కోటవైపు వెళ్ళిన నారిగాడిని, యువరాజు నరేంద్రదేవ్ (మాస్టర్ సుధాకర్) తనతో, తన రాజమందిరంలోకి తీసుకువెళతాడు. అంతకుముందు మహారాజు తనకిచ్చిన రాజముద్రికను ఒక కోతి బొమ్మలో దాస్తాడు. ఆటల్లో అలసి నిద్రపోతున్న నారిగాడి బదులు సేనాపతి బిచ్చగాడి దుస్తుల్లో వున్న యువరాజును మందిరంనుంచి బయటకు పంపించి వస్తాడు. నారిగాడు తాను యువరాజును కాదని చెప్పినా మహారాజు, మిగిలిన మంత్రులు నమ్మకపోవటం, అతనికి చికిత్సలు చేయించటం, గూడెం వెళ్ళిన నరేంద్రదేవ్ తాను పోలిగాడి కొడుకు కానని ఎదురుతిరిగి, తండ్రిచే దెబ్బలుతినటం, ఆ ఊరిలో మాజీ సైనికుడు, వీరుడు అయిన సుధీర్ (రేలంగి) అతని మాటలు నమ్మటం జరుగుతుంది. సేనాధిపతి విక్రమవర్మ (ఆర్.నాగేశ్వరరావు), యువరాజు, నరేంద్రదేవ్, బదులు నారిగాడు రాజమందిరంలో వున్నాడని గ్రహించి, మహారాజు తదనంతరం, తానే సింహాసనం అధిష్టించాలని, ఆశతో, యువరాజును అంతమొందించమని, సైనికులను పురిగొల్పుతాడు. సుధీర్‌వల్ల విషయం గ్రహించిన పోలిగాడు, తన బృందంతో కోటలోకి ప్రవేశించి, నారిగాడికి జరుగుతున్న పట్ట్భాషేకం ఆపించి యువరాజు నరేంద్రదేవ్‌కి పట్ట్భాషేకం జరిగేలా చేస్తాడు. విక్రమవర్మ, తదితరులు మరణించటంతో పోలిగాడు కుటుంబం, రాజ్యంలో యువరాజుకు తోడుగా నిలవటంతో కథ శుభంగా ముగుస్తుంది.
దర్శకులు సుబ్బారావు సన్నివేశాలను ఎంతో అర్ధవంతంగా తీర్చిదిద్ది చిత్రీకరించారు. తొలుత యువరాజు, నారిగాడు దుస్తులు మార్చుకునే సమయంలోనే తెలివిగా రాజముద్రను దాచటం, పేదవాడిగా మారినా తనలోని రాజసం, దర్పం వెల్లడిచేయటం, పోలిగాడు ఎంత హింసించినా, నరేంద్రలో మార్పులేకపోవటం, చివరికి ఆకలికి గంజి తాగటం, సుధీర్ వద్ద పోలిగాడు దాచినా బయటకు వెళ్ళాలని అతని చెయ్యి కొరకటం, రాజకోటలో విక్రమ్‌ను ఎదిరించటం, ‘‘అలాగే నారిగాడు మతిలేని యువరాజని మహారాజు భ్రమించినా, అతడు ‘‘నౌకర్లను తగ్గించమనటం’, ‘ఎవరి పనులువారే చేసుకోవాలని’, (్భజనం, తల గోక్కోవటం) మహారాజు విధించే ‘‘పేదలపై పన్నులు జుట్టు పన్ను, కిటికీలమీద పన్ను వంటివి నిషేదింపచేయటం’’, తన తండ్రి దొంగ అని చెప్పగా మహరాజు దానిని తనకు అన్వయింప చేసుకోవటం. గూడెంలో ఓ నృత్యంలో సినిమా కథను ‘‘రాజే పేదయి బాధలు పడును, పేదే రాజై సుఖములందును’’చరణాల్లో చెప్పించటం వంటి నిత్యసత్యాలు పలికించటం. వీరుడైన సుధీర్ ఒక బొమ్మ కారణంగా పరాక్రమ చూపటం తమాషాగా, కొంత సీరియస్‌గానూ యుద్ధం చేసి దొంగలను, రాజభటులను చెదరగొట్టడం ‘మహామంత్రి విజయ్ (వక్కలంక కామరాజు) వివేకం. మహారాజు మరణించగా, సేనాపతి కుట్ర, నారిగాడికోసం వెతుకుతూ వచ్చిన అతని అక్కను, తల్లిని బంధించటం ఎంతో విపులంగా, ఆకట్టుకునేలా రూపొందించారు.
వృద్ధుడు, అనారోగ్యవంతుడైన మహారాజుగా ఎస్.వి.రంగారావు ఎంతో అర్ధవంతంగా, సేనాని విక్రమ్‌ను అదుపుచేసే సమయంలోనూ, అదే విధంగా కుట్రతో యువరాజుకు మతితప్పించారని బాధ, అతనిలోని వివేకానికి ఆనందం, యువరాజుకు రక్షకునిగా విజయ్‌ను నియమించబోతూ, అశక్తుడై మరణించటం, ఎంతో పరిపూర్ణమైన నటన చూపారు రంగారావు.
పేదదైనా, అభిమానం, వాత్సల్యంగల తల్లిగా, అచ్చమ్మ పాత్రను నిండైన నటనతో లక్ష్మీరాజ్యం ఒప్పించగా, మల్లిగా అమ్మాజి తమ్ముడి పట్ల ప్రేమా, బాధ్యతగల సోదరిగా అమ్మాజి ఎంతో అమాయక నటన చూపారు. ఈమె ఆ తరువాత, దైవబలం చిత్రం వరకూ అమ్మాజిగా, ఆపైన జయశ్రీగా పేరు మార్చుకున్నారు. నటి జయచిత్ర వీరి కుమార్తె. ఇక ఈ చిత్రంలో ‘‘పోలిగాడి’’ డీగ్లామరస్ పాత్ర. దీనికి ఓ ప్రత్యేకమైన గెటప్ దర్శకులు సిద్ధం చేశారు. ఓ పట్టాన ఈ పాత్రను పోషించటానికెవరూ సాహసించరు. కాని, సుబ్బారావు కోరిన వెంటనే, ఎన్.టి.రామారావు (తనను హీరోగా పరిచయం చేశారన్న కృతజ్ఞతా పూర్వక గౌరవ భావంతో) అంగీకరించటమే కాక దానికి పూర్తి న్యాయం చేకూర్చారు. నారిగాడి పుట్టినరోజుని, బెల్లంవేసి కాచిన గంజి తానే తాగివేయటం పాత్ర విసిరికొట్టి ‘పుట్టినరోజులు మారాజులకు కాని మనకేటి’ అని ఈసడించటం. దోమ మొహంపై వాలగా ‘‘్ఛ నీ యబ్బా’ అని చిరాకుగా తోలటం, ప్రతి చిన్న బిట్‌ను ఎంతో ‘ఈజ్’తో తన కొడుకు నారిగాడు కాదు యువరాజని తెలిశాక, సాహసంతో గుర్రం నడిపి సభకు తీసుకురావటం, అంతకుమందు, తరువాత సైనికులతో పోరాటంలో వారిపై వట్టి చేతులతో, ఎగిరి దూకి తన్ని మట్టి కరిపించటం- రాజ సభలో, యువరాజు, రాజగురువు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవటంతో, పోలిగాడి మొహంలో మార్పు చూపటం, ఈ పాత్రకు ఎన్.టి.రామారావు తప్ప మరెవరూ సరిపోరని నిరూపించుకొని, తరువాతి నటీనటుల నటనకు మార్గదర్శకులయ్యారు. ఇక యువరాజు నరేంద్రేవ్‌గా, ధైర్యం, సాహసం, తెలివి, అచ్చమ్మవద్ద, పోలిగాడివద్ద, సుబేదారు వద్ద పరిస్థితులకు తల వంచక, రాజరికపు దర్పాన్ని, ఠీవిని ప్రదర్శించటం. సభలో తన్ను తాను నిరూపించుకోలేక కొంత విచారం ఆపైన నారిగాడిగా, కొంత ధైర్యం, తెలివి, సేనాధిపతివద్ద బెదురు, పదవి, ఐశ్వర్యం లభిస్తుందన్న దానికి ఆశపడక యువరాజుకోసం ఎదురుచూపు సభలో కూడా తండ్రి చూసి భయం, యువరాజుకు ముద్రిక కోసం గతం జ్ఞాపకం చెయ్యటం. ఇలా రెండు పాత్రలను వాటి వైవిధ్యాన్ని ఎంతో పరిపూర్ణతతో మెప్పించాడు. మాస్టర్ సుధాకర్, సుధీర్‌గా రేలంగి, ఆ పాత్రను తగిన విధంగా పోషించి రక్తికట్టించారు.
ఈ చిత్ర గీతాలు: యువరాజు పుట్టినరోజున చెలులు పాడే గీతం. ‘యువరాజువే మహరాజువులే’ (గానం- జిక్కి, కె.రాణి బృందం- ఆత్రేయ) యువరాజు, నారిగాడి మారిపోయాక వచ్చే నేపథ్య గీతం ‘వేడుకకోసం వేసిన వేషం’ (ఘంటసాల, రచన తాపీ ధర్మారావు), అమ్మాజిపై చిత్రీకరించిన గీతం ‘శ్రీమంతులు, ధీమంతులు ఇందరున్నారే’ (జిక్కి- రచన తాపీ ధర్మారావు), లక్ష్మీరాజ్యంపై చిత్రీకరించిన గీతం ‘‘అమ్మా, అమ్మా అని ఎంత హాయిగా’’ (జిక్కి- రచన తాపీ ధర్మారావు), అమ్మాజి, లక్ష్మీరాజ్యం పై మరో గీతం ‘నారిగా నాయినా నారిగా’ (పి.సుశీల, సత్యవతి- తాపీ ధర్మారావు). ఈ చిత్రంలో ఘంటసాల పాడిన మరో ప్రసిద్ధ గీతం రేలంగిపై చిత్రీకరణ, నృత్యంలో ‘జేబులోబొమ్మ, జేజేల బొమ్మా’(ఘంటసాల, రచన కొసరాజు), రాజు, పేద కథకు అన్వయించే నిత్యసత్య గీతం ‘‘కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా’ (జిక్కి- రచన కొసరాజు), యస్.రాజేశ్వరరావు సంగీతంతో ఈ గీతాలు అలరించేలా సాగాయి. యుగళ గీతాలు, ప్రేమ పాటలు లేకున్నా ఈ చిత్ర గీతాలు శృతిపక్వంగా సాగటం, ఈనాటికి ఆనందింపచేయటం విశేషం.
‘రాజూ-పేద’ చిత్రాన్ని తమిళంలో ఆందీ పిట్రాసెల్వమ్ పేరుతో (1957) డబ్బింగ్ చేశారు.
ఈ చిత్రాన్ని హిందీలో 1968, ‘రాజా అవుర్ రంక్‌గా నిర్మించారు. నిర్మాత యల్.వి.ప్రసాద్, యల్.వి.ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై కె.ప్రత్యగాత్మ, దర్శకులు, సంగీతం- లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పాటలు- ‘ఆనంద్ బక్షీ’ పోలిగాడిగా, (అజిత్) తల్లిగా నిరూప్ రాయ్, సోదరిగా నజీమా, మహారాజుగా బిపిన్‌గుప్తా సేనాని విక్రమ్ (కమల్‌కపూర్) సుధీర్‌గా సంజీవ్‌కుమార్, అతని జంట రాజనర్తకి మాధవిగా కుంకుమ్, రాజు పేదగా ‘మహేష్ కొటారి’ నటించారు. ఈ చిత్రాన్ని రంగుల్లో రూపొందించటం విశేషం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి