Others

మొనగాళ్ళకు మొనగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడరన్ థియేటర్స్ బ్యానర్‌పై ‘సతీ అహల్య’తో టిఆర్ సుందరం చిత్ర నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. మోడరన్ థియేటర్స్ పేరిట సేలంలో స్టూడియో నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన 102వ చిత్రం ‘మొనగాళ్ళకు మొనగాడు’.హిందీలో యంయం సాగర్ నిర్మించిన ‘ఉస్తాదోంకె ఉస్తాద్’ చిత్రం హక్కులు తీసుకొని, మోడరన్ థియేటర్స్ ఈ సినిమాను తొలుత తమిళంలో ‘వల్లవణుక్కు వల్లవన్’గా అశోకన్, మణిమాల కాంబినేషన్‌లో రూపొందించారు. తరువాత తెలుగులో మొనగాళ్లకు మొనగాడు, కన్నడంలో ‘్భలే భాస్కర్’గా నిర్మించారు. హిందీలో ‘రమేష్‌పంత్’ కథ సమకూర్చిన చిత్రానికి తమిళంలో, తెలుగులో కొన్ని మార్పులు చేశారు.

మాటలు: పినిశెట్టి
సంగీతం: వేదా
కెమెరా: యస్‌యస్ లాల్
ఎడిటింగ్: ఎల్ బాలు
కళ: కె వేలు
నృత్యం: బి జయరాం
స్టంట్స్: పరమశివం, పులకేశి
దర్శకత్వం:
యస్‌డి లాల్

ఓ బ్యాంక్ దోపిడీతో చిత్రం ప్రారంభమవుతుంది. భుజంగం (ప్రభాకర్‌రెడ్డి), అతని అసిస్టెంటు మాల (రత్న) తన అనుచరులతో బ్యాంక్ కొల్లగొట్టి 5 లక్షలు కాజేస్తాడు. ప్రతిభగల ఇంజనీరు రమేష్ (హరనాథ్), కోటీశ్వరుడు మాధవరావు (రావుకొండలరావు)ను కలిసి తక్కువ పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మించే ప్లాను చెబుతాడు. దానికి అంగీకరించిన మాధవరావు అతన్ని ఫ్యాక్టరీ స్థలం చూసి రమ్మంటాడు. మాధవరావు కుమార్తె గీత (కృష్ణకుమారి) అతన్ని ప్రేమిస్తుంది. బస్సులో రమేష్ ప్రయాణిస్తుండగా, లక్ష దోపిడీ సొమ్ముతో ప్రయాణిస్తున్న మాల సూట్ కేసుతో రమేష్ సూట్‌కేస్ మారిపోతుంది. రమేష్‌పై బ్యాంక్ దొంగతనం నేరం మోపబడి జైలుపాలవుతాడు. మాలను రమేష్ గుర్తిస్తాడని భయపడిన భుజంగం, అతన్ని చంపమని, మొనగాళ్ళకు మొనగాడు, రౌడీ అయిన కత్తుల రత్తయ్య (ఎస్‌వి రంగారావు)ను పురమాయిస్తారు. రమేష్‌ను జైలునుంచి తప్పించిన రత్తయ్య అతని నిజాయితీ గుర్తించి, అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తాడు. ఇది గ్రహించిన అసలు దొంగలముఠా నాయకుడు ప్రకాష్ (బాలయ్య) రత్తయ్యపై హత్యాయత్నం చేయిస్తాడు. గాయపడిన రత్తయ్య గీత వల్ల కోలుకుంటాడు. ఆమెను చెల్లెలుగా భావిస్తానంటాడు. రమేష్ స్నేహితుడు బుజ్జి (చలం)తో కలిసి రమేష్‌ను తెలివిగా దొంగల బారినుంచి రక్షిస్తుంటాడు. మాల దగ్గరవున్న భుజంగం డైరీని చేజిక్కించుకుంటాడు. మాలను భుజంగం మనుషులు హత్యచేయటం, గీత -రమేష్, రత్తయ్యను అనుమానించటం, చివరకు రత్తయ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ అని, ప్రకాష్ అసలు నేరస్తుడని తెలియటం, బోటులో గీతతో పారిపోతున్న ప్రకాష్‌ను రమేష్ ఎదిరించి బయటపడటం, బోటు ప్రమాదం నుంచి బయటపడిన ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేయటంతో కథ శుభంగా ముగుస్తుంది. తమిళంలో, తెలుగులో ఓ ఖవాలి గీతంలో సావిత్రి అతిథి నటిగా నటించారు. తెలుగులో క్లబ్ కార్యదర్శి గజలక్ష్మిగా జూనియర్ భానుమతి గెస్ట్‌రోలు పోషించింది.
సస్పెన్స్, యాక్షన్ చిత్రాలు రూపొందించటంలో పేరొందిన దర్శకులు ఎస్‌డి లాల్ ఈ రీమేక్ చిత్రాన్ని తనదైన శైలిలో మన నేటివిటీకి తగ్గట్టు ఉత్కంఠ కలిగించేలా పట్టుతో చిత్రీకరించారు. కత్తుల రత్తయ్యను భుజంగం అనుచరుడు కలుసుకోవటం, అతనికి కత్తి చూపిస్తూ ‘కత్తుల రత్తయ్య, పచ్చినెత్తురు తాగుతాడు’ అని ఎస్‌విఆర్‌చే చెప్పించిన డైలాగ్ చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. రమేష్ తెలివిగా ఫ్యాక్టరీ ప్లాను చెప్పటం, అన్యాయంగా శిక్షపడినందుకు బెంగ, దొంగలను ఎదిరించటంలో కొంత పిరికితనం, తెగువ, సాహసం, గీతకోసం బాలయ్యతో తలపడినపుడు ధైర్యం, బాలయ్య పాత్ర ప్రవేశించినపుడల్లా ఓ హుందాతనం, చివరలో గీత, రమేష్‌లను తప్పించుకుని వెళ్ళమనటంలో మానవత్వం, కొండను గుద్దుకొని బోటు పగిలిపోతుందన్న ఉత్కంఠ, దాన్నించి తప్పించుకొని పారిపోవటం, మరో పాలిష్‌డ్ విలన్‌గా ప్రభాకర్‌రెడ్డి మాలతో వ్యవహరించే తీరు, ప్రేమించిన ప్రియునితోనే జీవితం అని ధైర్యంగా నిలిచే గీత, కృష్ణకుమారితో సన్నివేశాలు, తమాషా చేస్తూనే రమేష్‌కు సాయపడే బుజ్జిలాంటి సన్నివేశాలను ఈజ్‌తో రూపొందించిన విధానం అద్భుతం. కథ తెలిసిపోయినా చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా తీర్చిదిద్దారు దర్శకులు.
టైటిల్‌కు తగ్గట్టు ‘మొనగాళ్ళకు మొనగాడు’గా ఎస్‌వి రంగారావు ఆహార్యం వైవిథ్యంగా, సన్నివేశానికి తగ్గట్టు ఉంటుంది. మధ్యలో గెటప్ మార్చటం, దొంగల ముఠాను ఎదుర్కోవటంలో చాకచక్యం, రమేష్‌తో ఖవాలి పాటలో రకరకాల భావాలను పసందుగా అభినయించి అలరించారు. ప్రకాష్‌గా బాలయ్య నట జీవితంలోనే ఓ వెరైటీ పాత్రను ఎంతో ఈజ్‌తో నటించారు. హరనాథ్, కృష్ణకుమారి జంటగా పాటల్లో, ప్రణయ సన్నివేశాల్లో అలుక, కోపం, అభిమానం మొదలైన సన్నివేశాల్లో, దొంగలను ఎదిరించటంలో సమర్ధవంతమైన ప్రతిభ చూపారు. మాలగా రత్న, బుజ్జిగా చలం, తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహానటి సావిత్రి తన చూపులతో, పెదవి విరుపులతో, చక్కని చిరునవ్వుతో, చేతుల కదలికతో, హరనాథ్, ఎస్‌విఆర్‌లతో కలిసి అభినయం చూపుతూ ‘వచ్చామే నీకోసం’ ఖవాలి పాటలో ఆకట్టుకునేలా నటించారు. ఊస్తాదోంకె ఉస్తాద్ హిందీ చిత్రంలోని ‘మిల్తేహి నజర్ తుమే సేహమ్’ పాటకు తెలుగులో సి నారాయణరెడ్డి ‘వచ్చామే నీకోసం, మెచ్చామే నీ వేషం’ వ్రాసారు. ‘రేకుల చాటున ముళ్ళు కనలేరో మీరు’ ‘అరెరే కాదని పిల్లా/ అందని చక్కెరబిళ్ళ’ ‘మధువు లేకనే మత్తురేపినది/ అందమంటే ఆమెదే కాదా’ (గానం మాధవపెద్ది, పి సుశీల, పిబి శ్రీనివాస్ బృందం) పాటల్లో పదాలు సావిత్రికి సరిపోయేవే. ఇక కృష్ణకుమారి, హరనాథ్‌లపై చిత్రీకరించిన గీతం -అందాల బొమ్మలాగ ముందు నిలచి ఉన్నది (పి.బి.శ్రీనివాస్, పి.సుశీల). కృష్ణకుమారి, స్నేహితురాళ్లను ఉద్దేశించి హరనాథ్ పాడే టీజింగ్ సాంగ్ -ఆహ ఆహా చూడు అందం చూడు (సినారె- పిబి శ్రీనివాస్). చలం, రత్నలపై ఆరుబయట చిత్రీకరించిన గీతం -కన్ను చెదరిపోయినదోయి కనె్నవయసు పొంగినదోయ్ (కొసరాజు-ఎల్‌ఆర్ ఈశ్వరి, పిఠాపురం). చలం, రత్నలపై క్లబ్బులో చిత్రీకరించిన మరో గీతం (మారువేషంలో హరనాథ్, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌వి రంగారావులను చూపిస్తూ సాగుతుంది) -చూశానోయి నీలాంటి చిన్నోడ్ని (ఎల్‌ఆర్ ఈశ్వరి, పిఠాపురం). కృష్ణకుమారిపై చిత్రీకరించిన గీతం -కళకళ నవ్వే కన్నులలోనే (పి సుశీల). కృష్ణకుమారి, హరనాథ్‌లపై తమిళనాడులోని హోగెన్‌కల్ జలపాతం వద్ద చిత్రీకరించిన గీతం (హిందీ చిత్రంలోని సౌబార్ జనంలేంగే అనుసరణతో) -నేనున్నది నీలోనే- నీవున్నది నాలోనే- నా రూపము నీదేలే (రచన- సినారె, గానం-పిబి శ్రీనివాస్). రమేష్ మరణించాడని తెలుసుకుని గీత ఆవేదన పడే సమయంలో వినిపించే గీతం అద్భుత చిత్రీకరణతో సాగుతుంది. ఈ జలపాతంవద్ద కొన్ని ఫైటింగ్ సన్నివేశాలూ చిత్రీకరించారు.
మోడరన్ థియేటర్స్ నిర్మించిన ఈ చిత్రం హిందీలోనేకాక తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ విజయం సాధించటం, హిందీలో షేక్‌ముఖ్తార్ పోషించిన పాత్రను తెలుగులో ఎస్‌వి రంగారావు పోషించటం, ఆ పాత్రను ఆయన మెప్పించిన తీరు ఎందరి ప్రశంసలనో అందుకోవటం విశేషం. కత్తుల రత్తయ్య -ఎస్‌విఆర్ నట జీవితంలో ఓ ప్రత్యేకతగా మిగలటం చెప్పుకోదగ్గ అంశం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి