Others

మంచి మనసుకు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ కథా సినీ రచయిత, సంభాషణలకర్త అయిన
ఎకె వేలన్ తొలిసారి నిర్మాతగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -తాయి పిరందల్ వాసిపిరక్కు. ఆ చిత్రం విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత సుందర్‌లాల్ నహతా, విజయవాడ రామాటాకీసు
అధినేత అశ్వత్థనారాయణ కలిసి తమిళ చిత్రం హక్కులుకొని, శ్రీ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెలుగులో నిర్మించిన చిత్రం
మంచి మనసుకు మంచి రోజులు.
మాటలు: సముద్రాల (జూ.)
కళ: అణ్ణామలై
ఎడిటింగ్: ఎస్‌కె గోపాల్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
కెమెరా: కమల్‌ఘోష్
అసోసియేట్ దర్శకుడు:
యం. మల్లికార్జున్‌రావు
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం:
సిఎస్ రావు.
శ్రీపురం గ్రామంలో వ్యవసాయం చేస్తూ నిజాయితీగా జీవించే రాజు (ఎన్టీఆర్)కు చెల్లెలు జానకి (రాజసులోచన) అంటే పంచప్రాణాలు. ఆ ఊరి మోతుబరి వెంకటప్పయ్య (రేలంగి). అతని భార్య కాంతం (సూర్యాకాంతం). వారి కుమారుడు రఘు (రమణమూర్తి) డాక్టరు. వెంకటప్పయ్య, రాజుతో, రైతులతో పంట కాలువ విషయంలో గొడవ పడతాడు. ఆ కక్షతో రాజుపై తన మేనకోడలు లాయరు రాణి (గిరిజ) ద్వారా దావావేసి అతని చెల్లెలు జానకి పెళ్ళినాడే ఇల్లు వేలం వేయించి, అడ్డుపడిన రాజును ఖైదు చేయిస్తాడు. అన్న జైలుకు వెళ్ళటంతో, వీధినపడిన జానకిని, రఘు తన హాస్పిటల్‌లో నర్సుగా చేర్చుకుంటాడు. రఘును ప్రేమించిన రాణి, జానకినక్కడ నుంచి వెళ్లగొడుతుంది. రాణి అంటే ఇష్టంలేని రఘు, జానకిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకుంటాడు. రఘు క్యాంప్ వెళ్ళిన రోజు, ముందుగా జైలునుంచి విడుదలైన రాజు, పగతో వెంకటప్పయ్యను అంతం చేయాలని వారింటికి వస్తాడు. అక్కడ చెల్లెలు జానకి, వారి కోడలని తెలిసి ముందు విచారించి, ఆపైన ఆమెను ఆశీర్వదించి వెళ్తాడు. వచ్చింది జానకి అన్న అని తెలియని వెంకటప్పయ్య దంపతులు ఆమెను ఇంటినుంచి వెళ్ళగొడతారు. ఊరునించి వచ్చిన రఘు, ఆ నిందను నమ్మి ఆమెకై బాధపడుతుంటాడు. ఇల్లు వదిలిన జానకి హాస్పిటల్‌లో ఓ బాబునికని, ఓ దంపతులకు అప్పగించి, ఆత్మహత్య చేసికోవాలని నదిలో దూకుతుంది. నదిలో పడవ నడిపే రాజు ఆమెను కాపాడి, ఓ మారువేషంలో మేనల్లుడిని తెచ్చి చెల్లెలికిస్తాడు. మరో వేషంలో రాణికి దగ్గరై, రఘుపట్ల కోపంతో అతన్ని చంపమని కోరిన ఆమెను మాయచేసి, బావను, చెల్లెలిని కలుపుతాడు. రాణిని వివాహం చేసుకొని, వెంకటప్పయ్యతో సహా అందరికి జరిగింది వివరించి, వారిలో మార్పు తేవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రేలంగి నౌకరు కేతన్నగా అల్లు రామలింగయ్య, కాంపౌండరుగా పేకేటి శివరాం, రాణి తండ్రి గణపతిగా కెవియస్ శర్మ, మాలోకంగా నల్ల రామ్మూర్తి, డాక్టరుగా వసుంధరాదేవి, రౌడీ చిన్నపులిగా రాజనాల, మాయ సాధువుగా వేళంగి, వెంకట్రామయ్యగా ప్రభల కృష్ణమూర్తి, ఇంకా గంగారత్నం పోలీస్ ఇన్‌స్పెక్టరుగా ఎవి సుబ్బారావు ఇతర పాత్రలు పోషించారు.
చిత్రంలో ఎన్టీఆర్ అనురాగమూర్తియైన అన్నగా, చెల్లెలిపట్ల గారం, అభిమానం, పేద రైతులకు అండగా పంట కాలువ గండి తీయించటంలో, వెంకటప్పయ్యను ఎదిరించి తుపాకీకి ఎదురు నిలవటం, చెల్లెలి పెళ్ళినాడు వేలం ఆపుచేయమని కేతన్నను అర్ధించటం, అతని కాళ్ళు పట్టుకోవటం, ఆవేశంతో లెంపకాయ కొట్టడం, జైలునుంచి పగతో వెంకటప్పయ్య ఇంటికి వచ్చి చెల్లెలు పగవాని కోడలని ఆవేశం, ఆవేదన, చెల్లెలి స్వాంతనతో, ఆవేశం తగ్గించుకుని ఆమెను ఆశీర్వదించటం, అత్తింటికి, భర్తకు, బిడ్డకూ దూరమైన ఆమెను కాపాడడం, రాణి భర్తకోసం వేసిన ప్రకటనతో తమాషాగా, తెలివిగా ఆమెను మాయచేసి రఘుకు నిజం తెలియచేయడం, ధనవంతుని అల్లుడైనా స్వాభిమానం ప్రదర్శించటం ఇలా మమకారం, దైన్యం, ధైర్యం, తమాషాలతో కూడిన వైవిధ్యమైన నటనతో అలరించారు.
రాజసులోచన అన్నకుతగ్గ చెల్లెలుగా, రఘును ప్రేమించిన యువతిగా, భార్యగా, ఆ తరువాత భర్తకు, బిడ్డకు దూరమైన వేదన భావయుక్తమైన నటనతో మెప్పించింది. లాయర్‌గా, రఘును ప్రేమించి భంగపడిన యువతిగా వగరు, పొగరు, స్ర్తి సహజమైన భయం, పిరికితనం, పశ్చాత్తాపం గల రాణిగా గిరిజ ఆకట్టుకుంది. రఘుగా, ఆర్ రమణమూర్తి సాత్వికమైన, సన్నివేశానుగుణమైన నటన చూపారు. వెంకటప్పయ్యగా రేలంగి పాత్రోచితమైన విలనీనీ, కుటుంబ యజమానిగా విలక్షణతను, కట్నంకోసం కుమారునికి, అందవిహీనమైన వధువును కుదిర్చి, ఆమె తెచ్చే డబ్బుతో పోల్చుకుని తృప్తి చెందటంలాంటి సన్నివేశాల్లో వైవిధ్యమైన సహజనటనతో ఒప్పించారు. దర్శకులు సిఎస్ రావు సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించి, చిత్రీకరించగా, సముద్రాల జూనియర్ సందర్భోచిత, సెంటిమెంట్‌తో కూడిన సంభాషణలతో వాటికి పరిపూర్ణత కలిగించారు.
చిత్ర గీతాలు:
చిత్ర ప్రారంభంలో వచ్చే బృందగానంలో భరతమాత పటం చూపుతూ గ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకలు గంగిరెద్దు మేళం, గొబ్బిళ్ళు, పంట పొలాలు ఎడ్లపందేలు చూపుతూ ఎన్టీఆర్, రాజసులోచన తదితరులపై చిత్రీకరించిన గీతం -మంచి మనసు కలిగివుండే భాగ్యమే భాగ్యం (మాధవపెద్ది, పి.సుశీల బృందం -రచన కొసరాజు). ఎడ్లబండిపై పట్నంనుంచి వస్తూ ఎన్టీఆర్, రాజసులోచనలపై చిత్రీకరించిన గీతం -వినవమ్మా, వినవమ్మా ఒక మాట వినవమ్మా (ఘంటసాల, సుశీల- సముద్రాల జూ.). జైల్లో ఎన్టీఆర్, వూరిలో ఒకరింట పనులు చేస్తున్న రాజసులోచనలపై చిత్రీకరించిన గీతం -కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికయినా మారేనా (ఘంటసాల, పి.సుశీల- కొసరాజు). ఈ చిత్రంలోని ఘంటసాల గానం చేసిన హిట్‌సాంగ్ రమణమూర్తి, రాజసులోచనలపై డాబాపైన, రాత్రివేళ ఆహ్లాదకరంగా చిత్రీకరించిన అలరించే గీతం -రావే నా చెలియా, చెలియా నా జీవన నవ మాధురినీవే (పాటకు ముందువచ్చే సాకీ అద్భుతం -ఘంటసాల- సముద్రాల జూ). అత్తవారింటినుంచి వెళ్ళగొట్టబడిన రాజసులోచనను చూపుతూ సీతాదేవి గూర్చిన బుర్రకథ మిక్కిలినేని బృందంపై చిత్రీకరణ -్భరతనారి సీతామాతా పావన చరిత (ఘంటసాల బృందం- సమద్రాల జూ). నదిలో పడవ నడుపుతూ ఎన్టీఆర్ బృందంపై చిత్రీకరించిన గీతం -పొంగారు నడియేటి అలపైన దోనే ఊరించు పేరాశ (ఘంటసాల బృందం- సముద్రాల జూ). కన్నబిడ్డను వదిలి వచ్చిన రాజసులోచనపై నాగుల చవితి పూజలు చేసే అతివలు పైన పసిబిడ్డను ఒడిలో లాలిస్తూ అమ్మాజి (జయచిత్ర తల్లి) పైనా చిత్రీకరించిన తల్లిబిడ్డల అనుబంధానికి అద్దంపట్టే సెంటిమెంటు గీతం -్ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా (ఆర్.బాలసరస్వతిదేవి- సముద్రాల జూ). గిరిజ, రమణమూర్తిని కవ్విస్తూ పాడే గీతం -ఓ చిన్నిబావా, ఓహో చిన్నిబావా (జిక్కి- సముద్రాల జూ). ఈ చిత్రంలోని మరో తమాషా గీతం గిరిజ, ఎన్టీ రామారావులపై తోటలో రాత్రిపూట చిత్రీకరించిన గీతం -అనుకున్నదొక్కటి అయనది ఒక్కటి (ఘంటసాల- కొసరాజు).
‘మంచి మనసుకు మంచిరోజులు’ చిత్రం సక్సెస్ సాధించింది. శత దినోత్సవాలు జరుపుకుని, మంచి చిత్రంగా గుర్తింపుపొందింది. -రావే నా చెలియా, -అనుకున్నదొక్కటి పాటలు నేటికీ శ్రోతలనలరించటం హర్షదాయకం.
చిత్రం తమిళ మూలం కూడా నిర్మాత, రచయిత ఏకె వేలన్‌కు మంచి పేరూ, లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో వారు, వడపళనివద్ద స్థలం కొని అరుణాచలం స్టూడియో నిర్మించారు. ఏకె వేలన్ మనువడు శివకుమార్. గోపిచంద్ నటించిన శౌర్యం, శంఖం చిత్రాలకు, రవితేజా నటించిన ‘దరువు’ చిత్రాలకు దర్శకునిగా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్‌గా పలు తెలుగు, తమిళ చిత్రాలకు పనిచేశారు.
‘మంచి మనసుకు మంచిరోజులు’ చిత్రాన్ని ఎవిఎం వారు హిందీలో 1959లో ‘చార్‌ఖా’ పేరుతో జగదీప్, నందా, శుభాకోటీలతో రూపొందించారు. కృష్ణన్ పంజు దర్శకత్వం వహించారు.
అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి, భూస్వామి, పేదవారి స్థితిగతులకు అద్దంపడుతూ సాగిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకాదరణ పొందటం విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి