రాష్ట్రీయం

ఇక ఆన్‌లైన్ ట్రాకింగ్ చెక్‌పోస్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటకు వెళ్లే పడవల పర్యవేక్షణే లక్ష్యం
కాకినాడ, నవంబర్ 28: సముద్రంలో వేటకు వెళ్ళే పడవలను పర్యవేక్షించేందుకు గాను ఆన్‌లైన్ ట్రాకింగ్ చెక్ పోస్ట్‌లు అతి త్వరలో ఏర్పాటు కానున్నాయి. అన్ని పడవలను ఎప్పటికపుడు పర్యవేక్షించి, ట్రాకింగ్ చేసేందుకు వీలుగా వివిధ ప్రథాన ప్రాంతాల్లో ఈ చెక్ పోస్ట్‌లను ఏర్పాటుచేయనున్నారు. తూర్పు తీర ప్రాంతంలో ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నుండి చేపల వేటకు వెళ్లే పడవలపై ఈ ఆన్‌లైన్ ట్రాకింగ్ చెక్‌పోస్ట్‌ల నిఘా ప్రారంభం కానున్నది. సముద్రంలో చేపల వేట కోసం ఏ రోజు, ఏ ప్రాంతం నుండి ఎంతమంది వెళ్తున్నది, ఎన్ని రోజులకు తిరిగి వచ్చింది వంటి వివరాలను ఎప్పటికపుడు మానిటరింగ్ చేస్తూ తెలుసుకునేందుకు ఈ విధానం తోడ్పడనున్నది. అలాగే తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, సముద్రంలో మత్స్యకారులకు ఏదైనా ప్రమాదం వాటిల్లినపుడు ఈ ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానం ద్వారా గమనించి, తగు సహాయక చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. వాతావరణం అనుకూలించక పడవలు దారి తప్పి వేరే రాష్ట్రాలకు లేక వేరే దేశాలకు దారి మళ్ళిన సందర్భాల్లో వారికి శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్ విధానంలో సూచనలు జారీ చేస్తూ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు మన జలాల్లోకి ప్రవేశించకుండా నివారించేందుకు సైతం ఈ విధానం భద్రతా దళాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తూర్పు తీరంలోని కాకినాడ ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ, అమీనాబాద, కుంభాభిషేకం, మట్లపాలెం, భైరవపాలెం, ఓడలరేవు, అంతర్వేదిపల్లెపాలెం ప్రాంతాల నుండి సముద్రంలోకి 663 మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు, 1645 మోటరైజ్డ్ బోట్లు, 546 కంట్రీబోట్లు మొత్తం 2308 బోట్లు చేపల వేట సాగిస్తున్నాయి. ప్రాధమిక దశ కింద ఈ ఏడు కేంద్రాల్లో డిసెంబర్ 15వ తేదీ నుండి ఈ ప్రత్యేక చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక చెక్ పోస్ట్‌ల వద్ద వేటకు వెళ్లే ప్రతి బోటుకు సముద్రంలోకి వెళ్ళేముందు ఒక టోకెన్‌ను జారీ చేస్తారు. వారు వేటకు వెళ్ళి వచ్చిన తరువాత ఆ టోకెన్‌ను సదరు చెక్ పోస్ట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఏయే పడవలు ఏరోజు వేటకు వెళ్ళాయి? తిరిగి ఎప్పుడు వచ్చాయి? తదితర వివరాలన్నీ ఈ చెక్‌పోస్ట్‌ల్లో రికార్డ్ అవుతాయి. ఇంకా రావల్సిన పడవలను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు ఈ విధానం ద్వారా అవకాశం ఉంటుంది. ఆయా చెక్‌పోస్ట్‌ల్లో మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు ఇంకా తమ సహాయకులను నియమించి, వారికి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చి, సముద్రంలోకి వెళ్ళే పడవల వివరాలను రికార్డ్ చేస్తారు. పడవల వివరాలు, వాటిపై వెళ్లే మత్స్యకారుల వివరాలను, గుర్తింపుకార్డులు, ఫొటోలు తదితర వివరాలను నమోదుచేసి, జిల్లా కలెక్టరేట్‌లో ఉండే ఎన్‌ఐసిలో ఏర్పాటుచేసిన ట్రాకింగ్ విధానానికి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి, పర్యవేక్షిస్తారు. ప్రతి చెక్‌పోస్ట్‌లో ప్రత్యేక లాగ్‌బుక్‌ను నిర్వహిస్తూ ఈ ట్రాకింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారు. ఈ ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానం తొలి దశ ప్రాజెక్ట్ విజయవంతం కాగానే మరిన్ని తీర ప్రాంతాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నట్టు అధికారిక వర్గాలు తెలియజేశాయి.