AADIVAVRAM - Others
ఎవరి గొప్ప వారిది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒకానొక సమయంలో ఒక అడవి సమీపంలోని ఒక నదీ తీరానికి పక్షుల రాజైన గద్ద, జంతువుల రాజైన సింహం దాహంతో నీటి కోసం వచ్చాయి. ఆవలి గట్టున ఉన్న గద్ద ముందుగా తన ముక్కును నీటిలో ఉంచి నీరు పీల్చుకుంది. ఈవలి గట్టున ఉన్న సింహం నీరు తాగబోతూ నీటి నీడలో గద్ద ప్రతిబింబాన్ని చూసి కోపంతో ఊగిపోయింది. ‘ఎంత ధైర్యం నీకు? నా అడవికి వచ్చి నేను తాగే నీళ్లని ఎంగిలి చేస్తావా? అని గర్జించింది.
గద్ద సింహం మాటలు విననట్లే కావల్సినన్ని నీళ్లు తాగేసింది. ఆ తర్వాత పెద్దగా నవ్వింది.
‘ఓ సింహమా! నీవు అడవికి, జంతువులకు రాజువైతే నేను పక్షుల రాజును. అలా చూసుకున్నా నేను నీకు సమురాలను. పైగా నీవు నేల మీద మాత్రమే నడవగలవు. నేను, మా జాతీ ఆకాశంలో ఎగరగలం. నేలమీదా నడవగలం. నీవు నేల మీద మాత్రమే విశ్రమించగలవు. మేమో చెట్ల మీద విశ్రమించగలం. నేను మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని జాతివాడిని, పాలసముద్రంలో శయనించే స్వామిని మోసే జాతి మాది. ఎలా చూసినా నీవు నాకంటే తక్కువే. మారుమాట్లాడక కావలిస్తే నీరు తాగి వెళ్లు. లేదా నోరు మూసుకుని పో’ అంది నిర్లక్ష్యంగా.
సింహానికి ఎక్కడలేని కోపమొచ్చింది. ‘నేనేం తక్కువనుకోకు. మా జాతి సింహమే పార్వతీమాత వాహనం. మా కంటే మీరు ఎక్కువెలా అవుతారూ? మా వేగానికి ఎవ్వరూ నిలువలేరు. మాకంటే ఎనిమిది రెట్లు పెద్దదైన ఏనుగునే ఒక్క చరుపుతో చంపగలం. హూ... కాస్త తగ్గు’ అంది సింహం కోపంగా.
ఇంతలో నీళ్లలోంచీ పకపకమనే నవ్వు వినిపించింది. సింహమూ, గద్దా కూడా నీటిలోకి చూసాయి. నీళ్లలోంచీ ఒక పెద్ద చేప తలెత్తి, ‘ఎంత తెలివితక్కువవారు మీరిద్దరూ? దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారం ఎత్తారు సాక్షాత్తు విష్ణువు. మరి మేం ఎంత గొప్పవారమని చాటుకోవాలీ? పిచ్చివాళ్లల్లారా?! ఎవరి గొప్ప వారిది. ఊరికే కొట్టుకోక ఎవరి పని వారు చేసుకుంటూ, ఎవరి బతుకు వారు బతకండి. అసలు ఈ నీటిలో నివసించే మా ఎంగిలే అంతా తాగేది. అది గుర్తుంచుకుని రోజూ నీళ్లు తాగు మృగరాజా! ఎంగిలని నీరు తాగడం మానేస్తే ప్రాణం పోతుంది జాగ్రత్త!’ అంటూ గబుక్కున నీటిలోకి జారుకుంది ఆ మత్స్యరాజు.
పిల్లలూ! ఎవరి గొప్ప వారిది. ఊరికే వాదులాటలకు దిగక ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం.
*************************************************
ప్రపంచ శాస్తవ్రేత్తలు
ఎడిసన్
-పి.వి.రమణకుమార్
థామస్ ఆల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 సం.లో అమెరికాలోని మిలన్ అనే నగరంలో జన్మించాడు. తండ్రి శామ్యూల్ గృహ నిర్మాణ పరికరాలను తయారుచేసే చిన్న వ్యాపారం చేస్తుండేవాడు. తల్లి నాన్సీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుండేది.
చిన్నతనం నుండీ ఎడిసన్‌కు ప్రతి వస్తువూ ఎలా పని చేస్తుంది? అనే జిజ్ఞాస ఎక్కువగా ఉండేది. ఎడిసన్‌లోని సృజనాత్మక శక్తిని గ్రహించిన తల్లి ప్రోత్సహించేది. వ్యాపారంలో దెబ్బతినటం వల్ల శామ్యూల్ తన కుటుంబాన్ని మిషిగన్‌లోని పోర్ట్‌హరన్‌కు తరలించాడు. అక్కడి స్కూల్‌లో ఒక టీచర్ ఎడిసన్‌ను హేళన చేసి స్కూల్ నుండి పంపించేసింది. అలా హేళన చేసిన టీచరే చివరి దశలో థామస్ ఎడిసన్ లేబొరేటరీలో మేనేజర్‌గా పని చేసింది.
ఇంట్లోనే చదువు నేర్చుకుంటున్న ఎడిసన్ ఒకరోజు ప్రయోగశాలలో ప్రయోగం చేస్తుండగా పెద్ద పేలుడు సంభవించి ఇంట్లోని వస్తువులన్నీ భస్మమై పోయాయి. తండ్రి తన్ని ఇంట్లోంచి పంపించి వేశాడు.
తర్వాత డెట్రాయిట్‌లో ఒక పాసింజర్ రైలులో తినుబండారాలు అమ్మే సేల్స్‌బాయ్‌గా ఉద్యోగం చేశాడు. రైలు పెట్టెలోనే ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని ప్రయోగాలు చేస్తుండగా పేలుడు సంభవించడంతో రైల్వే అధికారి ఒకరు ఎడిసన్ చెవి మీద కొట్టాడు. దాంతో ఎడిసన్ చెవిటివాడు అయిపోయాడు.
ఉద్యోగం ఊడినా పట్టువదలక అవకాశం వచ్చినప్పుడు ప్రయోగాలు చేద్దామని తనకు వచ్చిన ఆలోచనలను ఒక చిన్న పుస్తకంలో రాసుకునేవాడు.
ఆ తర్వాత ఒక టెలిగ్రాఫ్ ఆఫీసులో చేరి ఉద్యోగం చేస్తూనే ఎన్నో కొత్తకొత్త ప్రయోగాలను మొదలుపెట్టాడు. ఎడిసన్ కృషిలో భాగంగా ఆవిష్కరింపబడినవి టెలిగ్రాఫ్ పరికరాలు, గ్రామ్‌ఫోన్ పరికరాలు, రక్షణ సామాగ్రి సాధనాలు, ఎలక్ట్రికల్ బల్బు, ఇతర పరికరాలు లాంటి నిత్య ఉపయోగ సాధనాలు దాదాపు 1300 కనిపెట్టి శాస్త్ర పరిశోధనా రంగంలోనే సంచలనాలను, చరిత్రను సృష్టించాడు.
మానవ జాతి ఉన్నంతకాలం థామస్ ఆల్వా ఎడిసన్ సృష్టించిన పరికరాలు ఉపయోగపడుతూనే ఉంటాయి. ఎలాంటి ఆడంబరాలకు తావివ్వక జీవనం సాగించిన ఆ మహాశయుడు 1931లో మరణించాడు.
************************************************
రంగు పెన్సిళ్లు
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
స్కూల్ నించి ఇంటికి వచ్చిన హిమవంత్ తల్లితో బాధగా చెప్పాడు.
‘దేవుడు నాకు మంచి కంఠాన్ని ఇవ్వలేదు’
‘ఏమైంది?’ తల్లి ప్రశ్నించింది.
‘మా సంగీతం మాస్టారు స్కూల్ డేకి పాటలు పాడటానికి చాలామందిని ఎంపిక చేశారు. నా కంఠం బాగా లేదని నన్ను వద్దన్నారు. కాని నాక్కూడా పాడాలని ఉంది’
‘ఆ పాటల్లో గాడిద కంఠం అవసరం ఉంటే నిన్ను తీసుకునేవారు’ అన్న ఏడ్పించాడు.
‘కుల్వంత్! వాడి కంఠం బాగా లేకపోవచ్చు. కానీ హిమవంత్‌కి వేరే విద్యలు తెలుసు. బొమ్మలు గీస్తాడు. జ్ఞాపకశక్తి కూడా ఉంది. భగవద్గీతలోని సగం అధ్యాయాలు ఇప్పటికే కంఠస్థం చేశాడు’ తల్లి పెద్ద కొడుకుని కోప్పడింది.
‘కానీ దేవుడు నాకు మంచి కంఠం ఇవ్వలేదు’ అదే బాధతో హిమవంత్ చెప్పాడు.
ఆ రాత్రి ఆవిడ హిమవంత్ గురించి తన భర్తకి చెప్పింది. మర్నాడు ఆఫీసు నించి వచ్చాక తండ్రి హిమవంత్‌కి ఓ పెట్టెని అందించి చెప్పాడు.
‘నీకు కొత్త రంగు పెన్సిళ్లు కావాలని అమ్మ చెప్పింది’
‘అవును. థాంక్స్’ ఆనందంగా చెప్పి హిమవంత్ పెట్టెని తెరిచి చూసి చెప్పాడు.
‘ఇందులో ఉన్న పెన్సిల్స్ అన్నీ నీలం రంగువే. ఒకే రంగుతో బొమ్మల్ని ఎలా గీయగలను?’
‘ఆకాశం, సముద్రం నీలం రంగువే కదా? ఆ బొమ్మలు గీయచ్చు’
‘కానీ ఒకే రంగు బొమ్మలు చూడడానికి విసుగ్గా ఉంటాయి. మంచి బొమ్మలకి అన్ని రంగులూ కావాలి’
తండ్రి నవ్వి ఇంకో పెట్టెని ఇచ్చి చెప్పాడు.
‘నువ్వు చెప్పింది నిజమే. అందమైన బొమ్మలు గీయడానికి అనేక రంగులు అవసరం’
హిమవంత్ ఆ పెట్టెని తెరిచి చూసి చెప్పాడు.
‘ఇది బావుంది. ఇందులో అన్ని రంగులూ ఉన్నాయి. నాకు మొదట నీలం పెన్సిళ్లు మాత్రమే ఉన్న పెట్టెని ఎందుకిచ్చావు నాన్నా?’ అడిగాడు.
‘అందరికీ ఒకే రకం నైపుణ్యం ఉంటే, ప్రపంచం ఒకే రంగుతో గీసిన బొమ్మలా ఉంటుందని నీకు అర్థమవ్వాలని. అందుకే పరమాత్మ ఒకో మనిషికి ఒకో రకం నైపుణ్యం ఇస్తూంటాడు’
‘అర్థమైంది. పరమాత్మ నేను పాడడం కన్నా, బొమ్మలు గీయడం మంచిదని ఆ నైపుణ్యం ఇచ్చి ఉంటాడు. అవునా?’
‘అవును’
ఆ వివరణతో హిమవంత్‌లోని బాధ పోయింది.