రాష్ట్రీయం

నిఘా నీడలో ‘ఎర్రవల్లి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండువేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు
ఆరుగురు ఎఎస్పీలు, 25 మంది డిఎస్పీలు

సంగారెడ్డి, డిసెంబర్ 19: లోక కల్యాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించ తలపెట్టిన అయుత మహా చండీ యాగం ప్రాంగణం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. రాష్టప్రతి సహా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జగద్గురువులు, రుత్విజులు తరలి వస్తుండటంతో పటిష్టమైన పోలీసు బందోబస్తుకు ఉపక్రమించారు. ఐదు రోజుల పాటు యాగం నిర్విఘ్నంగా కొనసాగనుండటంతో ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులను మొహరిస్తున్నారు.
40 ఎకరాల సువిశాలమైన స్థలంలో యాగం నిర్వహణకు ఏర్పాట్లు చేయడం, రెండు వైపుల నుంచి దారులు ఉండటంతో సందర్శకులను సైతం అన్ని రకాలుగా సోదాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటుపై ఎస్పీ సుమతి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల నుంచి పోలీసు అధికారులు, పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ నిమిత్తం తరలివస్తున్నారు. ఆరుగులు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 60 మంది సిఐలు, 185 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు, 40 మంది మహిళా ఎస్‌ఐలు, 300 మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, వెయ్యి మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 400 మంది కేంద్ర భద్రత దళాల సిబ్బందిని బందోబస్తుకు ఉపయోగించనున్నారు. యాగశాల, రుత్విజులు, జగద్గురువుల విడది కుటీరాలు, హెలిప్యాడ్లు, వంటశాల, పార్కింగ్ స్థలాలు, విఐపిల గ్యాలరీలు, బోజనశాల, క్యూలైన్ల వద్ద పోలీసులను మోహరించనున్నారు. అయుత చండీ యాగం ముగింపు రోజున ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానుండటంతో మరో 200 నుంచి 300 మంది పోలీసుల బందోబస్తును అదనంగా ఉపయోగించే అవకాశం ఉంది. రాష్టప్రతి పర్యటన సందర్భంగా యాగశాలను ఎస్‌పిజి సిబ్బంది సైతం సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే యాగాన్ని తిలకించడానికి అవకాశం కల్పించనున్నారు.
కరీంనగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజ్ఞాపూర్ మీదుగా గణేష్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాన్ని దాటుకుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నరగ్, మెదక్ జిల్లాలకు చెందిన ములుగు మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారి నుంచి పాములపర్తి, గంగాపూర్ మీదుగా ఎర్రవల్లికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాలపై కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌లతో ఐడి పార్టీ బృందాలు నిశిత పరిశీలన చేయనున్నాయి. నిరంతర పర్యవేక్షణ నిమిత్తం అత్యధికంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఆరోగ్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయడమే కాకుండా 108 అంబులెన్స్‌లు, అగ్నిమాపకదళాలను అందుబాటులో ఉంచబోతున్నారు. బందోబస్తును డిజిపి అనురాగ్ శర్మ పర్యవేక్షణలో ఐజిలు, డిఐజిలు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించనున్నారు.