రాష్ట్రీయం

దేవాలయ భూములపై ప్రత్యేక సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాం భూముల స్వాధీనానికి ప్రయత్నాలు
రెవెన్యూ రికార్డులతో సరిచూస్తున్న దేవాదాయశాఖ బృందాలు
రాజమండ్రి, డిసెంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు చెందిన భూములపై దేవాదాయశాఖ సర్వే జరుపుతోంది. దేవాలయాలకు అసలు ఉన్న భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? రెవెన్యూ రికార్డుల ప్రకారం సక్రమంగా ఉన్నాయా? తదితర అంశాలను దేవాదాయశాఖ సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కోసం జిల్లాల వారీ దేవాదాయశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. దేవాలయాలకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలతో సరిచూసి, తేడాలు ఉంటే సరిచేసే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చేపట్టాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. దేవాలయాలకు ఉన్న భూముల్లో తేడాలు అంతగా లేకపోయినప్పటికీ, ఈనాం భూముల విషయంలో మాత్రం చాలా చోట్ల తేడాలు కనిపిస్తున్నట్టు సమాచారం అందుతోంది. దేవాలయాల్లో సేవలందించే వివిధ వర్గాలకు అప్పగించిన ఈనాం భూములు చాలా చోట్ల చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈనాం భూములు స్వరూపం మారి, వ్యవసాయ భూములు కాస్తా ఇళ్ల స్థలాలుగా మారటంతో పాటు, ఎవరు అనుభవించేందుకు మంజూరయ్యాయో వారి చేతుల్లో కాకుండా ఇతరుల చేతుల్లోకి మారినట్టు దేవాదాయశాఖ సిబ్బంది జరుపుతున్న సర్వేల్లో బయపడుతున్నాయి. దేవాలయానికి దాతలు ఇచ్చిన భూముల్లో చాలా చోట్ల కొంత మంది రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేసినట్టు తెలుస్తోంది. దేవాలయాలకు చెందిన ఈనాం భూములు ఎవరి చేతుల్లో ఉన్నా, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని, అందువల్ల ఈనాం భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు. 800ఎకరాలు ఉన్న ఈనాం భూముల్లో ఏకంగా 200ఎకరాల్లో వివిధ వర్గాలకు చెందిన కాలనీయే ఉందని, ఇలాంటి వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలో అర్ధంకావటం లేదని దేవాదాయశాఖ అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. దేవాయాలకు చెందిన భూముల్లో కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారో అర్ధంకావటం లేదన్నారు. ఈనాం భూములు పొందిన వ్యక్తులు తమ ఆడపిల్లలకు కట్నంగా ఇవ్వటం, ఇతరులకు అమ్మేయటం వంటి అనేక పరిణామాలు గత 50ఏళ్లుగా చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల అసలు దేవాలయాలకు చెందిన ఈనాం భూముల వివరాలే పూర్తిస్థాయిలో లభించకపోవటంతో, జిల్లా కలెక్టరేట్‌లోని ఈనాం ఫెయిర్ రిజిస్టర్‌లో దాతలు ఇచ్చిన భూముల వివరాలను వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. చేతులు మారిన ఈనాం భూములను స్వాధీనం చేసుకునే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుండి దేవాదాయశాఖ అధికారులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతరుల చేతుల్లో ఉన్న దేవాదాయశాఖకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఈసారి పట్టుదలతో ఉండటంతో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఒత్తిడి వచ్చినాగానీ తమ పని తాము చేసుకుపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం దేవాదాయశాఖ రికార్డుల్లో అధికారికంగా కనిపిస్తున్న భూముల విస్తీర్ణం భవిష్యత్తుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.