ఈ వారం తార

స్వర్ణయుగాన్ని మళ్లీ చూడగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవిత గాథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసి స్వర్ణ యుగ ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. ఆమె అభిమానులు అంటే అప్పటి ప్రేక్షకులందరూ ఆ చిత్రం ‘మహానటి’ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఆమె సాదా సీదా నటి కాదు. నటనకే భాష్యం చెప్పగల నటి. నవరసాలను అలవోకగా ప్రదర్శించగల గొప్పనటి. భారతదేశ చలన చిత్రరంగం గర్వించదగ్గ నట శిఖరం. నటనలో పండిపోయి తన అపూర్వ నటన తో మహానటి అనిపించుకున్నది. ఆ నటి జీవిత గాథను తెరకెక్కించడం ద్వారా ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నట్టే. ఆమెను గౌరవిస్తూ మన తెలుగు చిత్రసీమ ఆమెకు నీరాజనాలు అర్పించినట్టే. నటనలో ఆమెకు సాటి ఆమే. ప్రేమ, త్యాగం, హాస్యం, చిలిపితనం, హద్దులు దాటని శృంగారం, మానసిక వేదన రస నటనతో ప్రేక్షకులను మెప్పించగలదు. అగ్రనటులైన అక్కినేని, నందమూరి నటనకు తీసిపోని నటనతో వారి నటనతో పోటీపడి సై అనిపించుకున్న ఏకైక నటి సావిత్రి. అలాంటి నటి ఇంతవరకు మరొకరు కనిపించలేదు. ముందు తరంలో కూడా అలాంటి నటి రాదు. మనం చూడలేం. ఆమె నటనలో పదిశాతం నటన కనబరిచే నటీమణులు నేడు కనిపించరు, లేరన్నది అతిశయోక్తి కాదనుకుంటాను. పైరవీలు చేయని మహానటి కనుకనే పద్మశ్రీ, పద్మ విభూషణ, పద్మ భూషణ లాంటి గౌరవాలు ఆమెకు దక్కలేదు, రాలేదు, ఇవ్వలేదు. ఆమె నటనకు ఆమడ దూరంలో వున్న తారలకు ఎనె్నన్నో పురస్కారాలు అందాయి. పెట్టుడు బిరుదులు దక్కాయి. కానీ ఎవరెన్ని పురస్కారాలు పొందినా, పెట్టుడు బిరుదులు పెట్టించుకున్నా, గౌరవం గుర్తింపు లేని సంస్థలనుండి చానళ్లనుండి ‘ఉత్తము’ లు అనిపించుకున్నా, మర్రి వృక్షం లాంటి మహానటి నటన ముందు వీరంతా ఆముదం చెట్లనుకోవాల్సిందే. ఆలస్యంగా స్పందిచిన కేంద్రప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని సావిత్రి ముఖ చిత్రంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి గౌరవం చాటుకుంది. ఆ మహానటికి ఏ పురస్కారం ప్రకటించినా, ఆ పురస్కారానికే గౌరవం కలుగుతుంది, ఆ పురస్కారం పులకించిపోతుంది. ప్రేమ, పెళ్లి, త్యాగం అనే రెండక్షరాల పదాలకు తన నటనతో అర్ధం చెప్పగల, చూపించగల గొప్పనటి. రచయితలు ఆమెను గురించి ఎంత విశే్లషించినా సశేషమే అవుతుంది. తామర రేకుల వంటి నయనాలతో భావాలు పలికించగలదు. చూపులతో భాష్యం అందించగలదు. ముఖ కవళికలతో చిరు దరహాసంతో పువ్వు లు పూయించగలదు. భావాలకు అర్ధం పలికించగలదు. సంభాషణల తీరు, ఆ స్వర మాధుర్యం, ఆ నటనతో పాత్రలకు జీవం పోయగలదు. ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు జీవం పోయగలదా మహానటి. నేటి ప్రేక్షక తరానికి ఆమెను గురించి తెలియకపోవచ్చు. ఆమె నటన గురించి, ఆమె ప్రస్థానం గురించి అవగాహన వుండకపోవచ్చు. ‘మహానటి’ చిత్రం ద్వారా నేటి ప్రేక్షకులకు నటన అంటే ఏమిటి, నటించడం పాత్రలో జీవించడమెలా అని తెలుస్తుంది. నటనకు అర్ధం గ్రహించగలుగుతారు. ‘కెవ్వుకేక, నేను పక్కాలోకల్, లెట్స్‌డు కుమ్ముడు’ లాంటి చెత్త సాహిత్యానికి అలవాటుపడిన ప్రేక్షకులకు అభిమానులకు ఆ చిత్రం నచ్చుతుందా? ‘తీయండ్రా బండ్లు, కనపడిన వారిని కనపడినట్టు నరికేయండి, నా గురించే వాడికి తెలియదు’ లాంటి రొటీన్ డైలాగ్స్‌కు అలవాటుపడిన నేటి యువతరానికి ఆ చిత్రం నచ్చుతుందా? ‘ఈ గీత దాటి ఎవరు ముందుకు వస్తారో రండి, ధైర్యముంటే నా నిర్మలను తాకండి చూద్దాం, నే కొడితే నేరుగా కోమాలోకే’ లాంటి పంచ్ డైలాగ్స్‌కు అలవాటుపడిన నవతరం ప్రేక్షకులకీ చిత్రం నచ్చుతుందా? తమ హీరో నటన పరమ చండాలంగా వున్నా, పట్టుమని పదిరోజులు కూడా ప్రదర్శించబడని చెత్త చిత్రాలను చూస్తున్న నేటి వీరాభిమానులకీ చిత్రం నచ్చుతుందా? ఐటం సాంగ్స్‌కే పరిమితమై అంగాంగ ప్రదర్శన చేస్తూ పీలికల దుస్తులతో అలరించే తారలను అభిమానించే ప్రేక్షకులకీ చిత్రం నచ్చుతుందా? చిత్రాల స్థాయి నానాటికీ దిగజారుతున్న ఈ రోజుల అభిమానుల స్థాయి ఎలావుందో మనకు తెలియంది కాదు. ఇలాంటి స్థాయి గల అభిమానులకీ చిత్రం రుచిస్తుందా? ఉత్తమ స్థాయి చిత్రాలను నేటి ప్రేక్షకులు అంటే యువతరం అభిమానులు చూడగలరా? చాక్లెట్స్ తినే వారికి తేనె రుచి తెలుస్తుందా? గనే్నరు పూలను అభిమానించేవారికి గులాబి పువ్వు విలువ తెలుస్తుందా? పాత్రలో జీవించే మహానటి వెండితెర కథను చూడగలరా, ఆదరించగలరా? వందేళ్ల భారతీయ చిలనచిత్ర రంగం, ఉత్తమ వంద చిత్రాల జాబితా ప్రకటిస్తే మన తెలుగు ఎవర్ గ్రీన్ చిత్రం ‘మాయాబజార్’ మొదటి ఉత్తమచిత్రంగా స్థానం సంపాదించుకుంది. అక్కినేని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మాయాబజార్‌‘ చిత్రంలో మేమెవరం హీరోలం కాదు, మాయాబజార్ చిత్రంలో ఆ మహానటి సావిత్రే హీరో అన్నారు. అంటే ఆమె నటన ఏ స్థాయిదో ఇట్టే అర్ధమైపోతుంది. ఆ మహానటి తన సంపాదనలో ఎక్కువ భాగం గుప్తదానాలకు ఖర్చు చేసింది. చిన్న ఆలోచన లేని పొరపాటుతో తమిళ నటుడు జెమినీ గణేశ్‌ను వివాహం చేసుకుని బాధల్లో పడి ఆ పెళ్లి ముక్కలు చెక్కలు కాగా చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులలో మునిగి తాగుడుకు అలవాటుపడి విషాద పరిస్థితుల్లో అసువులు బాసింది. అలా తెలుగు చలనచిత్ర రంగంలో స్వర్ణయుగ అభినేత్రి మహానటి జీవితం విషాదంగా ముగిసిపోయింది. అటువంటి మహానటి జీవిత గాథను చిత్రంగా నిర్మించాలనుకున్న నిర్మాత నిజం గా అభినందనీయుడే. ‘నన్ను వదిలి నీవు పోలేవులే’, ‘ఈనాటి ఈ బంధ మేనాటిదో’, ‘అహ నా పెళ్లంట’, ‘నీవు లేక వీణ’, ‘ఏమండోయ్‌శ్రీవారు’, ‘నీ చెలిమి నేడె కొరితిని’ ఇలా మృధు మధుర గీతాలు విన్నప్పుడంతా మనసుల్లో కళ్లలో ఆ నటి అపూర్వ నటన గుర్తువచ్చి తీరుతుంది. నేటి నటీనటులకు ఆమె నటన నిఘంటువని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం ‘మహానటి’ చిత్రం నిర్మాణంలో వుంది. మహానటి పాత్రకు నేటి యంగ్ తార ‘కీర్తి సురేష్’ను ఎంపిక చేసారు. అప్పటి నిర్మాత దర్శకుల కళాకారుల సహచర నటీనటుల పాత్రలకు నేటి నటీనటులు కనిపించనున్నారు. కనిపించినంత మాత్రాన అప్పటి నిండుతనం , అప్పటి సినీ రంగ వాతావరణం కనిపిస్తుందని మాత్రం చెప్పలేం. ఆ మహానటి చిత్రంలో ఫలానా పాత్ర చేస్తున్నాం అని నేటి నటులు గర్వంగా ప్రకటించుకున్నా, సోషియల్ మీడియా హైప్, ప్రమోషన్ వెల్లువలా ప్రవహించినా అంత గొప్ప వుండదనుకోవచ్చు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటి నటిస్తుందే తప్ప ఆ పాత్రలో జీవిస్తుందా? ఆమె నటనా స్థాయి ప్రదర్శించగలదా? స్వర్ణయుగ ప్రేక్షకులకు తృప్తి కలిగిస్తుందా? సావిత్రి, అక్కినేని, నందమూరి, ఎస్‌విఆర్, జమున, గుమ్మడి, ఆదుర్తి, జగ్గయ్య, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం లాంటి పాత్రలను నేటి నటీనటులు ధరించినా అలనాటి నిండుతనం వస్తుందా? ఆ గొప్ప నటన కనిపిస్తుందా? నటించడం తప్ప పాత్ర ల్లో జీవించగలిగే నటులు నేడు కన్పిస్తున్నారా? ఆనాటి స్థాయిగా చిత్రం వస్తుందా? స్వర్ణయుగాన్ని వెండి తెరపై చూడగలమా? ఆ మహానటి స్థాయికి తగ్గట్టు చిత్రం నిర్మించాలని, ఆమె జీవితగాథను నేటి తరానికి కానుకగా చూపించాలని, మరో వందేళ్లు తెలుగు ప్రేక్షకులు వారి వారి గుండెల్లో ఆమెను, ఆమె నటనను పదిలపరుచుకుంటారని, ఆ నటికి రెండు వేడి కన్నీటి చుక్కలు నీరాజనంగా అంకితం చేస్తారని ఆశిద్దాం. ఆ మహానటి చిత్రం కోసం అందరం ఎదురు చూద్దాం, వారి ప్రయత్నం విజయం కావాలని ఆశిద్దాం. కీర్తిసురేష్ నటి సావిత్రి పాత్రకు న్యాయం చేస్తుందా? మెప్పిస్తుందా? చూద్దాం
ఆ మహానటిని అభిమానించే అభిమాన రచయితలు పలు రచనలు చేసారు. ఆ పుస్తకాలు పరిశీలించి, ఆమె సమకాలికులెవరైనా వున్నా, లేదా ఆ మహానటి కుమార్తె విజయ ద్వారా సావిత్రి జీవిత విశేషాలు సేకరించి, స్క్రీన్‌ప్లే తయారుచేసుకుని చిత్ర యూనిట్ చిత్రం నిర్మించాలని సలహా ఇద్దాం. సావిత్రి వచ్చి చిత్రంలో నటించదు కాబట్టి నటనపై బలమైన ముద్ర పడకపోవచ్చు. ఎందుకు కొరగాని నేటి చెత్త చిత్రాలను చూసి ఆనందించే నేటి ప్రేక్షకులు మహానటి చిత్రం చూడగలరా? ఆదరించగలరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా ఆ మహానటిని మరిచిపోకుండా ఆమె జీవిత గాథను తెరకెక్కించబోవడం ప్రశంసించదగ్గ విషయమే. ఆ చిత్రయూనిట్ కృషి ఫలించాలని, స్వర్గం లో ఆమె ఆత్మ ఆనందించాలని, మనం ఆ ‘మహానటి’ చిత్రం చూసి స్వర్ణయుగంలోకి తొంగి చూసి పరవశిద్దాం, ఆనందిద్దాం!

-మురహరి ఆనందరావు