ఈ వారం స్పెషల్
స్వామియే శరణం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
========================================
‘సతీ సహగమనం’ లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉందా? - అంటే లేదనే అంటున్నారు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా. అయితే, ఆమె అభిప్రాయాన్ని పక్కన పెట్టి ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళల నిషేధంపై ఉన్న ఆంక్షలను సుప్రీం కోర్టు తొలగించింది. దీంతో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఇపుడు చర్చనీయాంశమైంది. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లను ఉల్లంఘించి, ‘సుప్రీం కోర్టు చెప్పింది కదా..’ అని శబరిమల సన్నిధానం వరకూ దూసుకువెళ్లిన 12 మంది మహిళలకు అయ్యప్ప దర్శనం మాత్రం లభించలేదు. భక్తుల నిరసనల మధ్య వారు వెనక్కు రావాల్సి వచ్చింది. సుప్రీం తీర్పుతో ప్రస్తుతం శబరిమల ఆలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజుల పూజల తర్వాత అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు కనుక కొంతకాలం పరిస్థితులు సద్దుమణిగినా, నవంబర్ 5న తిరిగి ఆలయం తెరుచుకున్నాక మరోమారు యాగీ మొదలవుతుంది. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దాఖలైన 19 పిటిషన్లను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఆలయ వ్యవహారాల్లో జోక్యానికి కోర్టుల పరిధి ఎంత వరకూ అనే ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తెరిచింది. అన్ని మతాల అంశాల్లో ప్రత్యక్షంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయా? లేదా కొన్ని మతాల విషయంలోనే తమ ప్రతాపాన్ని , చట్టంలో నిబంధనలను గుర్తుచేస్తాయా? అన్నది ఎదురుచూడాల్సి ఉంది.
=====================================
హిందూ ధర్మాన్ని , సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచారాలను విస్మరించి, ‘మహిళల పట్ల వివక్ష’ కోణంలో అయ్యప్ప ఆలయాన్ని ఒక వర్గం చూస్తోంది. విశ్వాసానికి, రాజ్యాంగానికి మధ్య చర్చను ఆ వర్గం వారు లేవనెత్తారు. లైంగిక సమానత్వం, వివక్ష అనేవి ఇక్కడ అంశమే కాదు, అయ్యప్పను ఆరాధించే విషయంలో పురుషులు, మహిళలు పాటిస్తూ వస్తున్న నియమాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. మహిళల బలవంతపు ఆలయ ప్రవేశం హిందూ మతాచారాలను దెబ్బతీయడమే అన్న వాదనలు లేకపోలేదు. హిందూ సంస్కృతిపై చాలా కాలంగా జరుగుతున్న దాడి పతాకస్థాయికి చేరిందనడానికి ఇదో ఉదాహరణగా కొందరు భావిస్తున్నారు.
ఘనమైన చరిత్ర..
శబరిమల పుణ్యక్షేత్రానికి కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వెళ్తున్నారు. ఆధారాలు వెతికి చూస్తే 500 ఏళ్లుగా భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. 1819లో ఈ ఆలయానికి వచ్చిన ఆదాయం ఏడు రూపాయలు మాత్రమేనని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907లో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి)ను ఎండుగడ్డి, ఆకులతో కప్పారు. అపుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని పున:నిర్మించి, పంచలోహాలతో తయారైన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1935 వరకూ ఈ దేవాలయం ట్రావెన్కూర్ మహారాజా సంస్థానం ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డుకు అప్పగించారు. ఆ తర్వాతనే భక్తుల సంఖ్య పెరగడంతో ‘జ్యోతి దర్శనాని’కి మాత్రమే కాకుండా మండల పూజకు కూడా శబరిమల దేవాలయాన్ని తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయ , వడిపెరియార్ మార్గం ఏర్పడిన తర్వాత పంబా ప్రాజెక్టు నిర్మాణంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. 1945 నుండి భక్తుల రద్దీ దృష్ట్యా విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగ దినాల్లోనూ ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. ఆలయ బోర్డు శ్రద్ధ తీసుకుని పంబాపై వంతెన , పంబ నుండి విద్యుద్దీపాలు, నీటి కుళాయిలు, స్వాముల కోసం విశ్రాంతి భవనాలు నిర్మించింది. 1984 వరకూ పదునెట్టింబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతిమెట్లపై నుండే వెళ్లేవారు. ఆ రాతిమెట్లపై కొబ్బరికాయలు కొట్టడంతో అవి కాలక్రమంలో అరిగిపోయాయి. దాంతో 1985లో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో వేశారు. తొక్కిసలాట జరగకుండా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టి దానిపై నుండి పదునేట్టాంబడికి ఎక్కిన తర్వాత భక్తులు ‘క్యూ’లో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 1989లో పంబామార్గంలో కొంత భాగం సిమ్మెంట్ కాంక్రీట్ చేశారు. 1985 తర్వాత పక్కా భవనాలు ఎన్నో నిర్మితమయ్యాయి. బెంగలూరు భక్తుడు ఒకరు గర్భగుడి చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించడంతో శబరిమల స్వర్ణదేవాలయం మాదిరి మారిపోయింది.
ఆచారాలు.. జీవన విధానం
సంప్రదాయబద్ధంగా, మతపరంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది. మత సహనం దేశ సంస్కృతిలో భాగం. దాదాపు అన్ని మతాలు భారతీయ ఆధ్యాత్మికతతో అనుబంధం కలిగి ఉన్నవే. దేశ జనాభాలో 80 శాతానికి పైగా హిందువులే. రాజ్యాంగం ప్రకారం భారతదేశం లౌకిక గణతంత్ర దేశం. పౌరులు ఏ మతాన్నైనా, విశ్వాసాన్నైనా పాటించి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా భారతీయ జీవన మార్గంలో మతం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆచారాలు, వ్యవహారాలు, ప్రార్థనలు, ఇతర మత పరమైన కార్యక్రమాలు వ్యక్తిగత దైనందిన జీవితంలో ముఖ్యభాగమైపోతాయి. జీవన విధానమే కాదు, ఆహారపు అలవాట్లు, సాంఘిక సంస్కారం వంటివి మతనిష్ఠతో ముడిపడే ఉంటాయి. ఈ సంప్రదాయ నుండి వచ్చిందే కొన్ని దేవాలయాల్లో స్ర్తిలను అనుమతించ రాదనే నిబంధన. ఈ నిబంధన వెనుక హక్కులు కంటే సంప్రదాయాలే ప్రధానంగా ఉన్నాయి. సమాజం సంప్రదాయాలు వైపు చూస్తుంటే, న్యాయస్థానాలు రాజ్యాంగం వైపు చూస్తాయి. ప్రజల ఆలోచనలు,కట్టుబాట్లు, మనోభావాలే చివరికి ప్రామాణికం అవుతాయి. తాత్కాలికంగా సంఘర్షణ , ఉద్రిక్తతలు, ఉద్వేగాలు అనివార్యం.
ప్రచార కాంక్ష...
సుప్రీం తీర్పును అడ్డం పెట్టుకుని ప్రచార కాంక్షతో కొంతమంది మహిళలు శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతా చేస్తే ఐదు రోజుల్లో వెళ్లింది 12 మందే, కానీ అక్కడేదో జరిగిపోయిందనేంత పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. కేరళలో శబరిమలలో మాత్రమే అయ్యప్ప దేవాలయం లేదు, ఆ రాష్ట్రంలో చాలా అయ్యప్ప దేవాలయాలున్నాయి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. కుళతుపుళలో అయ్యప్పను బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్‌లో పుష్కల, పూర్ణ దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమల ఆలయాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రంగా చూడాలా? లేదా రాజ్యాంగపరమైన పౌరహక్కుల కోణంలో చూడాలా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలూ, పౌర హక్కుల సంఘాలూ సుప్రీం తీర్పును స్వాగతించినా, మరికొన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, శబరిమల బోర్డు ‘సర్వోన్నత’ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేవాలయం తలుపులు తెరుచుకోవడం, 12 మంది మహిళలు బలవంతంగా అందులో ప్రవేశించడానికి ప్రయత్నించడం, ఆ మహిళలను అడ్డుకుంటూ మహిళా సంఘాల కార్యకర్తలు బహిరంగంగా అడ్డుకోవడం.. మొత్తం మీద బాహాబాహీకి దిగడంతో శబరిమలలో ఉద్రిక్తత ఏర్పడింది.
మీమాంసకు తావులేదు...
అయ్యప్ప ఆలయంలోకి బాలికలు, వృద్ధ మహిళలు మినహా మిగిలిన స్ర్తిలను అనుమతించరనేది అందరికీ తెలిసిందే. ఇదేం కొత్త విషయం కాదు, అలాంటి ఆంక్షలు ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే దానిపై చారిత్రక ఆధారాలు, వాస్తవాలు ఉన్నాయి. భక్తులు మాత్రం మహిళల ప్రవేశంపై అయ్యప్ప స్వామి నిషేధం విధించారని చెబుతుంటారు. ఈ విషయం తెలిసి కోట్లాది మంది భక్తులు బాలికలను లేదా 50 ఏళ్లు దాటిన మహిళలను తీసుకునే అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తుల ప్రార్థనలకు సమాధానం ఇచ్చేందుకు బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి దృష్టి కేంద్రీకరిస్తాడని, ఆ సమయంలో యువతులను అనుమతిస్తే ఆయన మనసు చంచలమవుతుందనే గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఏటా కొత్త్భక్తులు (కనె్నస్వాములు) రావాలని అయ్యప్ప స్వామి కోరుకుంటాడు. బ్రహ్మచారిగా దర్శనం ఇస్తాడు కనుక యువతులను అనుమతించరన్నది మరో కథనం.
చైత్రమాసంలో జననం
అయ్యప్పను భక్తజనులు హరిహర సుతుడిగా భావిస్తారు. చైత్రమాసం ఉత్తరా నక్షత్రం సోమవారం నాడు అయ్యప్ప జన్మించాడు. జ్యోతి రూపంగా ఆయన అంతర్థానమైన రోజు- మకర సంక్రాంతి. క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినీ అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆకర్షితుడవుతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు పంచమి తిథి ఉత్తరానక్షత్రం వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు శివులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. అయ్య (విష్ణువు), అప్ప (శివుడు) అనే పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టిందని ప్రశస్తి. ఈ ప్రదేశం పశ్చిమకనుమల్లో ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల పరిధిలో ఉంది. సముద్ర మట్టం నుండి సుమారు 4వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, కొండల మధ్య ఆలయం ఉంటుంది. ఇక్కడి యాత్రలు అక్టోబర్‌లో ప్రారంభమై జనవరిలో సంక్రాంతితో ముగుస్తాయి. ఈ క్షేత్రానికి భారతీయులే కాదు, అనేక మంది విదేశీయులు కూడా ఏటా వస్తుంటారు. నవంబర్ 17న జరిగే మండల పూజ, జనవరి 14న జరిగే మకరవిళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14న ఆలయంలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. మలయాళ నెలలో ఐదు రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసి ఉంచుతారు. మొత్తంగా చూస్తే 127 రోజులు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు 18 పవిత్రమైన మెట్ల మీద నుండి వెళ్లాలి. అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయాలి. అలా ఉపవాసం చేసిన వారే 18 మెట్లను దాటగలుగుతారని భక్తుల నమ్మకం. పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా భక్తులు ప్రయాణిస్తారు. తమతో తెచ్చిన బాణాన్ని శరమ్ గుత్తి అనే చోట ఉంచుతారు. ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి కిలోమీటరు దూరం ఉంటుంది. మందిరంలోకి వెళ్లే ముందు భక్తులు అన్ని నియమాలను పాటించాలి. నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. దీక్షలో అన్ని రోజులూ గడ్డం ఉంచుకోవాలి, రోజూ ఉదయానే్న చన్నీటితో స్నానం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. శబరిమలలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీరిని పరశురాముడు పూజ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో హరిహరుల కలయిక జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ నుండి తీసుకువెళ్లారనేది పురాణ గాధ. మేల్ శాంతిని (పూజారిని) ఏటా లాటరీ ద్వారా ఎన్నుకుంటారు.
చారిత్రక గాథలు...
అయ్యప్ప ఒక చారిత్రాత్మక పురుషుడు. కేరళలోని పట్టానంతిట్ట జిల్లాలోని పాంతాల రాజు ఆయన. అయ్యప్ప పెరిగిన రాజ భవనం ఇప్పటికే సందర్శనకు అందుబాటులో ఉంది. వావర్ అయ్యప్పకు పరమ భక్తుడు. వావర్ ఒక సూఫీ సన్యాసి. అందుకే శబరిమల యాత్రలో భక్తులు వావర్‌స్వామి మసీదును దర్శించుకుంటారు. అత్యంత క్లిష్టతరమైన అటవీమార్గంలో 40 కిలోమీటర్లు దూరంలో కొండ శిఖరంపై ఉన్న ఆలయానికి చేరుకోవడంలో వావర్ తమకు రక్షణగా ఉంటాడని యాత్రీకుల విశ్వాసం. మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా వచ్చిన భక్తులు ‘స్వామియే శరణం అయ్యప్పా..’ అంటూ చేసే నినాదాలు మిన్నంటుతాయి.
శబరిమల యాత్ర మనస్సుకు సంకల్పాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని, శారీరక శక్తిని, ధార్మిక విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. పురాణేతిహాసాలను చూస్తే అయ్యప్ప విష్ణు- శివుడి అంశతో జన్మించిన వాడు. మహిషి అనే రాక్షసిని మట్టుబెట్టేందుకు అయ్యప్ప జనిస్తాడు. ఆ రాక్షసిని చంపిన వెంటనే, ఆమె శాపవిమోచనం పొంది అందమైన స్ర్తి రూపం పొందుతుంది. తనను వివాహం చేసుకోమని ఆ స్ర్తి అయ్యప్పను వేడుకుంటుంది, కాని తన మార్గం, లక్ష్యం శబరిమల వెళ్లడమేనని, తన భక్తులు వేడుకునే కోర్కెలను తాను తీర్చాల్సి ఉందని చెబుతాడు. అయ్యప్ప రాక కోసం ఆమె అక్కడే అలా వేచి ఉండిపోతుంది. ఇపుడు ఆ ప్రదేశాన్ని ప్రధాన ఆలయానికి సమీపంలోని మాలికా పురోత్తమ కేంద్రంగా భక్తులు కొలుస్తున్నారు. అయ్యప్ప కోసం ఆమె వేచి ఉన్నందున ఇతర యువతులను అనుమతించడం లేదనేది మరో విశ్వాసం. తన భక్తుల ప్రార్థనలకు జవాబుగా అయ్యప్ప అక్కడ అందర్నీ ఒకేలా ఆదరించడానికి నిదర్శనంగా కూడా మాలికా పురోత్తమను చూస్తారు. అండం విడుదలయ్యే సమయంలో మహిళలు వెళ్లకూడదనే నిబంధనను దీనితో ముడివేయడం అసత్య ప్రచారమే. ఏ పవిత్ర స్థలానికి ఎవరు వెళ్లినా నిజానికి పరిశుద్థంగానే వెళ్తారు, ఆ విషయం ఎవరికీ ఎవరూ చెప్పనవసరం లేదు. అలాంటి పవిత్రత తమలో లేదనుకున్నపుడు వారు దూరంగానే ఉంటారు. ఒక వేళ బలవంతంగా వెళ్లినా తమ ఆకాంక్షలు, ప్రార్థనలు నెరవేరబోవని కూడా వారికి తెలుసు. కాగా, ప్రపంచంలో మహిళలను అనుమతించని ఆలయం శబరిమల ఒక్కటేనా? కానే కాదు, అనేక మతాల్లో మహిళలను అనుమతించని ప్రాంతాలు, క్షేత్రాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. మసీదుల్లోకి మహిళలను అనుమతించరనే విషయం మన స్పృహ నుండి వెళ్లిపోయింది.
సుప్రీం తీర్పు ...
శబరిమల మందిరంలోకి మహిళల ప్రవేశంపై దేవస్థానం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. లింగ సమానత్వానికి అది విరుద్ధమని పేర్కొంటూ మహిళా న్యాయవాదుల బృందం తరఫున ఇందిరా జైసింగ్ 2006లో సుప్రీంలో పిటిషన్ వేశారు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ (రుతుక్రమం) వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదని దేవస్థానం అధికారులు కోర్టుకు చెప్పారు. ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళలకు రాజ్యాంగపు హక్కు అని, ఈ విషయంలో లింగవివక్షకు తావులేదని, నిషేధం విధించడం వారి హక్కును కాలరాయడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినపుడు , మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26 ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకూ వర్తిస్తాయంటూ అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో ప్రవేశానికి మహిళల వయస్సుకు సంబంధించిన నిబంధనలు విధించడాన్ని ‘అత్యవసర మతపరమైన విధానం’గా తాము పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని, మహిళలను తక్కువగా, బలహీనులుగా చూడటానికి వీలు లేదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. మహిళలపై నిషేధం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, మతం అనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని అన్నారు. మహిళలు జీవ సంబంధ లక్షణాల ఆధారంగా రాజ్యాంగంలో మార్పు ఉండబోదని వెల్లడించారు. అయితే, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే అంశం కోర్టుకు సంబంధించింది కాదని ఆమె పేర్కొన్నారు. లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకున్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయవద్దని అభిప్రాయపడ్డారు. రుతుక్రమం సమయంలో మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదనేది వందల ఏళ్లుగా ఆచారంగా ఉందని ఆమె గుర్తుచేశారు.
ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 2016లో వ్యతిరేకించిన కేరళ ప్రభుత్వం- 2017 నవంబర్‌లో విచారణ సమయంలో మాత్రం పిటిషనర్లకు మద్దతు తెలిపింది. అన్ని వయస్సుల మహిళలనూ మందిరంలోకి అనుమతించేందుకు తాము సిద్ధమేనని ప్రభుత్వం పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా? తప్పనిసరి పాటించాల్సిన మతాచారం కిందకు వస్తుందా? అనే విషయాన్ని పరిశీలించేందుకు 2017లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
భగ్గుమన్న వివాదం...
‘రుతుచక్రం మొదలు కాని వారు, అది ఆగిపోయిన వారు అని గుర్తించగలిగే యంత్రాన్ని కనిపెట్టిన తర్వాతనే మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామ’ని 2015లో శబరిమల దేవస్థానం చైర్మన్ ప్రయర్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించడంతోనే అంతవరకూ స్తబ్దుగా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఉద్యమమే ప్రారంభించారు. ఆ వ్యాఖ్యలు ఖండిస్తూ ‘హాపీ టూ బ్లీడ్’ పేరుతో ‘ఫేస్‌బుక్’లో పెద్ద ఉద్యమమే నడిచింది. అది కాస్తా చినికి చినికి గాలివానై సుప్రీం కోర్టు తలుపులు తట్టింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం చివరికి ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు పంపించింది.
సమాజంలో చీలికలు... శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలను ప్రవేశించేందుకు అనుమతించాలన్న సుప్రీం నిర్ణయం సమాజంలో చీలికలు తెచ్చినట్టు కనిపిస్తోందనే విమర్శలు మిన్నంటాయి. రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిలోమార్పు తెచ్చుకోవల్సి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలుత తీర్పును స్వాగతించినా, ఆ తర్వాత ఆందోళన కారులకు మద్దతు ఇస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను వ్యతిరేకిస్తూ, సంప్రదాయానికి మద్దతుగా భారీ సంఖ్యలో మహిళలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు చేతులు కలిపారు. తీర్పును సమీక్షించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆందోళన కారులు కోరుతున్నారు. కానీ తాము అలా చేయలేమని కేరళలో అధికారంలో ఉన్న ‘లెఫ్ట్ డెముక్రటిక్ ఫ్రంట్’ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తీర్పును అమలు చేసే విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కేరళ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ఆలయ నిర్వాహకులు, పందాళం రాచకుటుంబ ప్రతినిధులు, ఆలయ ప్రధాన పూజారి రాజీవర్ కందారరు నిరాకరించారు. పీపుల్ ఫర్ ధర్మ, తళమన్ తాంత్రి కుటుంబం, నాయర్ సర్వీసు సొసైటీ, పందాళం రాచ కుటుంబం తదితర హిందూ సంస్థలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. సుప్రీం తీర్పుపై అనుకూల, ప్రతికూల వర్గాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు, నాయర్ వర్గాలను దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యర్థులుగా ఈ ఉద్యమం నిలిపింది. దీంతో కుల విభజన కనిపిస్తోంది.
పున: సమీక్ష...
ఇప్పటికే సుప్రీం కోర్టులో తీర్పుపై పున:సమీక్ష కోరుతూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు ఇంప్లీడ్ కాదల్చుకోలేదు. కోర్టు వివరణ కోరితే ప్రస్తుత స్థితిపై వివరణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మత విశ్వాసాలను కట్టడి చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందా? లేదా? అన్న చర్చకు ఇది బీజం వేసింది. మున్ముందు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో ఎదురుచూడాలి.
*