ఈ వారం స్పెషల్

మంచీ చెడూ మన చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశాల మధ్య సరిహద్దులుంటాయి..
కానీ- ఇక్కడ అలాంటివేవీ ఉండవు..
ఖండాంతరాలు పరచుకున్న క్లాస్- మాస్ హబ్..
అల్లంత దూరాలను కూడా అరచేతిలో చూపించే దుర్భిణీ..
అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని మానవాళిపై రహస్యాల ‘వల’ పన్నింది.. అదే ‘సోషల్ మీడియా’.. మూడు పూటలా తినడానికి తిండి లేని వాడి చేతిలో కూడా నేడు స్మార్ట్ఫోన్.. ఇక ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డిన్, ట్విట్టర్.. అంటూ సగటు మానవ జీవితాన్ని పెనవేసుకుపోయింది. కేవలం వ్యక్తులే కాదు.. వ్యాపార సంస్థలు, సినిమాలు, రాజకీయ పార్టీలు.. ఇలా అన్నీ దీనికి బాగా కనెక్ట్ అయిపోయాయి.
‘సోషల్ మీడియా’ అనే పదాన్ని అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జె.ఎ. బార్నెస్ 1950వ సంవత్సరంలో ఉపయోగించాడు. కుటుంబం, వృత్తి, అభిరుచులు, అలవాట్ల ప్రాతిపదికగా ఏర్పడే ప్రజాబృందాలనే ‘సోషల్ నెట్‌వర్క్’గా బార్నెస్ నిర్వచించాడు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆధారంగా లభించే ఆన్‌లైన్ వేదికను ‘సోషల్ నెట్ వర్క్’ అంటారు. ఇది మనదేశంలోకి అతి తక్కువ కాలంలోనే ప్రవేశించింది. ఇంటర్నెట్ వాడకం అగ్రదేశాలతో పాటుగా మనకూ చేరువైంది. ముఖ్యంగా యువతలో దీనికి విపరీత ఆదరణ లభించింది. సోషల్ మీడియా వృద్ధికి స్మార్ట్ఫోన్‌లు కూడా దోహదమయ్యాయి. సోషల్ మీడియా ప్రభావంతో వార్తాపత్రికలు చదవడం, న్యూస్ చానళ్లు చూడడం తగ్గిపోయినట్లు ఓ అధ్యయనం తేల్చింది. ఒకప్పుడు ఫొటోలు షేర్ చేయడం, చాటింగ్ చేయడం వంటివాటికే పరిమితమైన సోషల్ మీడియా.. నేడు.. రోజువారీ అప్‌డేట్లను అందిస్తోంది. తాజావార్తలు, సినిమా ప్రమోషన్లు, రాజకీయాలు, క్రీడావార్తలు, బిజినెస్ ప్రమోషన్లు, లేటెస్ట్ ట్రెండ్స్.. ఇలా సోషల్ మీడియా సైట్ల వాడకం విపరీతంగా పెరిగిందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
రాజకీయాల్లో..
మనదేశంలో భావజాలం కొత్తకాదు..
తర్కానికి, హేతుబద్ధతకూ మనం ఎంతో విలువను ఇచ్చాం.. ఇస్తాం..
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునే సంస్కృతి మనది..
కానీ నేడు..
భావజాలాలతో కానీ..
సిద్ధాంతాలతో కానీ..
తర్కాలతో కానీ..
మేధావులతో కానీ పనిలేదు..
ఒక వ్యక్తికానీ, వర్గం కానీ తమకు వ్యతిరేకమైన శిబిరానికి చెందిన వాడైతే చాలు.. ఆ వ్యక్తి గురించి, ఆ వర్గం గురించి దూషణలు, అసభ్య ప్రచారాలు అనేకం.. ఇక్కడ తిట్లకున్న ప్రాధాన్యత చర్చకు ఉండదు. అసత్యం, పుకార్లకు ఉన్న విలువ వాస్తవాలకు లేదు. దుష్ప్రచారాలకు ఉన్న విలువ, నిజాయితీతో చేసిన పనులకు ఉండదు. ఒకరిపై బురద చల్లితే నమ్మేవారికన్నా.. వారి గురించి మంచి చెబితే నమ్మేవారు తక్కువ.. ఒకప్పుడు ఇంటి అరుగుల మీద అమ్మలక్కలు.. ఊరి నడిబొడ్డున రచ్చబండలపై మగవాళ్లు.. ఇళ్లలోని వ్యవహారాల నుంచి రాజధాని రాజకీయాల వరకు.. అన్నీ చర్చించుకునేవారు. కానీ నేడు వీటన్నింటికీ సోషల్ మీడియా వేదికైంది. అందుకేనేమో.. మన రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారందరినీ పిలిచి అభినందించారు.. కానీ ఈ మాధ్యమంలో సభ్యత పాటించాలని కానీ, విలువలను పాటించాలని కానీ ఆయన చెప్పకపోవడం గమనార్హం. 2014లో మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా 2019లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి మరి! ఏది ఏమైనా.. ‘సత్యమేవ జయతే..’ అనే సుభాషితాన్ని ఎప్పుడో మరిచారు మన రాజకీయ నాయకులు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయానికి..
ఫిలిప్పీన్ అధ్యక్షుడిగా డూటర్టీ విజయానికి కారణం సోషల్ మీడియానే..
ట్రంప్ విజయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి.. ఇరాక్ సిరియాలో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు విస్తరించడానికి.. 2004లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోవర్డ్ బ్రష్ డీన్ ఓడిపోవడానికి.. 2008లో ఆఫ్రికా అమెరికన్ అయిన బరాక్ ఒబామా గెలవడానికి.. 2011లో ఈజిప్టులో హోస్నీ ముబారక్ ప్రభుత్వం పడిపోవడానికి.. వీటన్నింటికీ ప్రధాన కారణం సోషల్ మీడియానే..
కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లునే నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సోషల్ మీడియాకు కూడా రెండు వైపులా పదునుంది. అది సానుకూలం - ప్రతికూలం, మంచి-చెడు, సృష్టించడం - ధ్వంసం చేయడం వంటివి. ప్రపంచంలో రాజ్యాలు, ప్రభుత్వాల ఉత్థాన పతనాలకు కారణమవుతున్న ఈ మీడియాలో వాస్తవాలతో పాటు అబద్ధాలు కూడా అదే స్థాయిలో ప్రసారమవుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌షాట్.. తదితర సోషల్ మీడియా సైట్లవీ ఇందుకు మినహాయింపు కాదు. సమాజంలో అన్ని రకాల మనుషులు సోషల్ మీడియాను ఉపయోగిస్తారు కనుక వారి ఆలోచనలు, అభిప్రాయాలు, మాటలు కూడా ఇందులో ప్రతిబింబిస్తాయి. రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రాధాన్యతను అందరికన్నా ముందు గుర్తించిన వారిలో మోదీ ఒకరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రముఖుల కన్నా ముందుగా ఆయన ట్విట్టర్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా నిర్వహించిన పాత్ర కొట్టివేయదగింది కాదు. సరిగ్గా అదే సమయంలో యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ నేతలు కుంభకోణాల్లో ఇరుక్కోవడం, మధ్యతరగతి, యువత, సంపన్న వర్గాలందరికీ నరేంద్ర మోదీ ఒక బలమైన నాయకుడుగా కనిపించడంతో భాజపా విజయంలో సోషల్ మీడియా చెప్పుకోదగిన పాత్ర పోషించింది. ఇదే అదనుగా మోదీ భక్తులు కొందరు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులపై ప్రజల్లో మరింత ద్వేషం పెంచడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకున్నారు. ఇప్పుడు సామాన్యుడి చేతిలోనూ స్మార్ట్ఫోన్ దర్శనమిస్తోంది కనుక ఏ సందేశమైనా క్షణాల్లో పంపే సౌలభ్యం లభించింది. దీంతో సైన్యాన్ని, దేశభక్తిని, మతాన్ని, దేవుళ్లను, మఠాధిపతులను, స్వాములను, ప్రవచనాలను.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వాడుకుంటున్నారు.
రాజకీయ పార్టీలు, నేతలతో పాటు సోషల్ మీడియాను వినియోగించుకునేవారి సంఖ్య పెరిగినా, ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత వరకూ ఉంటుందో చెప్పలేం. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడంలో సోషల్ మీడియా అద్భుతాలను సృష్టిస్తుందా? అవుననే అంటున్నాయి గతంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ‘ఎన్నికలు’ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీ సభలు, సమావేశాలు, ఓటుకు నోటు, మద్యం, తాయిలాలు, ఉచిత పథకాలను ఎరగా వేయడం నేడు ఓ సంస్కృతిగా మారింది. దశాబ్దాల పాటు అలవాటు పడిన ఈ తాయిలాల సంస్కృతికి ఓటర్లు చరమగీతం పాడగలరా? ఏమో వేచి చూడాలి మరి! అవినీతిని వ్యతిరేకించే యువతరాన్ని, అభివృద్ధిని ఆశించే మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు ‘అంతర్జాలం’ అనువైన వేదిక అని అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్న నిపుణుల సేవలను రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఈ నిపుణులు సంబంధిత రాజకీయ పార్టీల వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం పెడుతుంటారు. నేతల అవినీతిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం ఎక్కువగా సాగుతుంది. ఇప్పటి ఎన్నికల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికలవుతాయేమో వేచి చూడాలి మరి!
మంచికి..
భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి ప్రకృతి విపత్తుల సందర్భంలో కూడా సోషల్ మీడియా విశేష పాత్రను పోషిస్తోంది. ఒకేరకమైన మనస్తత్వం కలిగిన ప్రజలను ఒకచోటకి చేర్చడంలో ఈ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తోంది. నేడు ప్రపంచంలో ఎవరూ ఏకాకి కాకుండా, రిటైరైన వారికి కాలక్షేపంగా పనిచేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు. మంచి ఆలోచనలు పంచుకుంటారు. చెడు ఆలోచనలూ పంచుకుంటారు. కానీ ఎవరికి నచ్చిన వాటికి వారు ‘కామెంట్’ చేస్తారు.. ‘లైక్’ చేస్తారు. కానీ మితిమీరినతనం ఎప్పుడూ పనికిరాదు.. అనే చందంలో సోషల్ మీడియా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు చెడును అరికట్టే చర్యలను తీసుకుంటే.. మున్ముందు సోషల్ మీడియానే ప్రపంచాన్ని శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇంటర్నెట్ వినియోగం సామాజిక, ఆర్థిక రంగాల్లో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన, లోతైన సమాచారాన్ని అందజేయడం ద్వారా అనేక రూపాల్లో ప్రభావం చూపనుంది. కళలు, వ్యాపారాలు, వాణిజ్య రంగాలను రూపుదిద్దడంలో, అణగారిన వర్గాలకు సాధికారత పరచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. డిజైనర్ షోరూంలు సోషల్ మీడియాను ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తమ బిజినెస్‌ను రెట్టింపు చేసుకుంటున్నాయి. ప్రొడక్ట్ యాడ్స్‌తో పాటు సందేశాత్మక వీడియోలు అప్‌లోడ్ చేస్తు చూసేవారి మనసులను గెలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో తమ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజూ చర్చలు జరిగేలా జాగ్రత్తపడుతూ తేలికగా కొనుగోలుదార్లకు చేరువ చేస్తున్నారు. సినిమా జగత్తు కూడా టీవీ మాధ్యమాల కంటే సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటోంది. సినీ సెలబ్రిటీలు కూడా స్వయంగా తమ తమ ఫ్యాన్సుతో ఇంటరాక్ట్ అవడం, వాళ్ల సినిమా ప్రమోషన్లకు దీనే్న మాధ్యమం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం, పుకార్లను చేయడం ద్వారా అయోమయం, అరాచకాలు ఏర్పడే పరిస్థితి దాపురిస్తోంది.
విలువలు..
సమాచార మాధ్యమాలు ప్రజల పురోగతికి తోడ్పడే సాధనాలుగా ఉండాలి. శాస్ర్తియమైన, సత్య నిబద్దతలతో కూడిన, నిర్మాణాత్మక ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. మన తొలి ప్రధాని నెహ్రూ మంత్రి వర్గం మనదేశంలో విదేశా ప్రసార మాధ్యమాలు ప్రవేశించడానికి వీలులేదని 1955లో తీర్మానించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ తీర్మానానికి తిలోదకాలిచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వాలు విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలకు మన మాధ్యమ రంగాన్ని అమ్మేశాయి. సమాజంలోని అనేక అంశాల్లో పాటిస్తున్న అనైతిక విలువ ప్రభావం మాధ్యమాలపై కూడా పడుతున్నదని గమనించాలి. సోషల్ మీడియా మన జీవిత ప్రమాణాలు, ఆలోచనలు, సంస్కృతి, సాహిత్యాలపై తీవ్రమైన ప్రభావాలను కలిగించి.. మన రాజకీయ, సామాజిక దిశ, దశలను మార్చి వేశాయి. సోషల్ మీడియా వల్ల మానవులు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోయింది. ఇవి నందులను పందులుగా, పందులను నందులుగా మార్చి చూపించగలవు. సమాజంలో హింసను పెంచుతాయి. చిన్నవయసులోనే పొగతాగడానికి, తాగుడుకు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడటానికి కారణం ఇదే.. మాధ్యమాలు పెట్టుబడిదారీ విధానాలను ప్రచారం చేస్తున్నాయి. ప్రకటనల ద్వారా కంపెనీల ఉత్పత్తులతో పాటు ఆదర్శనాలను, నీతినియమాలను కూడా అమ్ముకుంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అశ్లీల దృశ్యాలు పిల్లలపై మానసికంగా తీవ్ర దుష్ప్రభావాన్ని, మానసిక వికారాలను కలిగిస్తున్నాయి.
1993లో అంతర్జాతీయ వినియోగదారుల సంఖ్య ప్రపంచ జనాభాలో 0.3 శాతం, 2014లో ఇది 40.4 శాతానికి పెరిగింది. ప్రపంచ అంతర్జాల వినియోగదారుల సంఖ్యలో చైనా, అమెరికా, భారత్‌లు వరుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సమస్య వీక్షకుల సంఖ్య పెరగడం కాదు.. అపసవ్య, అశ్లీల దృశ్యాలను చూడటం. బాలబాలికలు బడివేళల్లోనే.. అంటే తరగతి గదుల్లోనే అంతర్జాల శోధన చేస్తున్నట్లు, అంతర్జాల వినియోగదారుల్లో 55 శాతం పాఠశాల విద్యార్థులే ఉన్నట్లు ఒక నివేదిక. పది నుంచి పనె్నండు సంవత్సరాల మధ్య వయసు పిల్లలు అంతర్జాలంలో అభ్యంతరకర దృశ్యాలను చూస్తున్నారు. ఇతర వయసు వారందరి కంటే కూడా అధికంగా అంతర్జాల శోధన చేయడమే కాక అందులో అరితేరినట్లు కూడా ఆ నివేదిక తెలిపింది. వీరు బళ్ళలోనే స్నాప్‌చాట్, టిండెర్, పింటరెసెట్, టుంబిర్, ఫేస్‌బుక్.. వంటి అంతర్జాల స్థావరాలను యువత కంటే ఎక్కువగా చూస్తున్నారు. తమ పిల్లల ‘తెలివి’ని చూసి పెద్దలు కూడా సంబర పడుతున్నారు. కానీ భవిష్యత్తులో వారు ఏమవుతారో ఎవరూ ఆలోచించడం లేదు. ఈ విషయంలో ప్రథమ స్థానాన్ని చెన్నై నుండి హైదరాబాద్ లాగేసుకుంది.
స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు యువత ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను విరివిగా వాడుతోంది. రాను రానూ ఇది వ్యక్తిగత వ్యసనంగా మారిపోతోంది. ఇంటర్నెట్ వచ్చాక చాలామంది కమ్యూనికేషన్ అంటే కేవలం మెసేజ్‌లు, లైక్‌లు అనే స్థాయికి వచ్చారు. దీనివల్ల ముఖాముఖిగా ఎవరూ మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకరితో ఒకరు ఎదురుబొదురుగా కూర్చుని మాట్లాడటం ఎప్పుడో మర్చిపోయారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. వేరే పేర్లతో ఎదుటివారి ముఖం చూడకుండానే చాటింగ్ చేస్తున్నారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే ఒత్తిడి, ఆందోళన, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ విభాగం పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. సోషల్ మీడియాపై అతిగా ఆధారపడటం, అది లేకుంటే ఉండలేక పోవడం వ్యసనమే. సోషల్ మీడియాలో అవసరానికి మించి ఎక్కువసేపు గడిపే వారికోసం చైనా ప్రభుత్వం.. అక్కడి మానసిక చికిత్సా విభాగాల్లో ప్రత్యేక వార్డులను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
ఏదిఏమైనా ప్రజాచైతన్యమే సోషల్ మీడియా అక్రమాలకు విరుగుడు. మంచిని ప్రోత్సహించాలి. ప్రజాసమస్యలను సమర్థవంతంగా వివరించి, విశే్లషించి, పరిష్కరించడానికి ప్రయత్నించే ఇతర మాధ్యమాలను ఆదరించాలి. ప్రజలకు ఉపయోగపడని వార్తలను, విషయాలను, ప్రసారం చేస్తున్న మాధ్యమ సంస్థలను తిరస్కరించాలి. ప్రజల జీవన విధానం, జీవన చర్యల ప్రతిబింబమే సంస్కృతి. వస్తధ్రారణ, భాష, ఆలోచనా విధానం, ఆచారాలు, పండుగలు, వేడుకలు, వినోదాలు, జాతరలు, కుటుంబ విధానం, విలువల సమ్మేళనమే మన భారతదేశ సంస్కృతి. వ్యసనాలకు దూరంగా ఉంటూ మన సంస్కృతిని ఇలాగే పదికాలాలపాటు కాపాడుకుంటేనే సాంకేతికకు సార్ధకత.
*

- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి