ఈ వారం స్పెషల్

అఖండ వ్రతం.. అన్న ప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నది పెద్దల మాట. ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదన్నది నిజం. కలియుగ వైకుంఠంగా భాసిల్లే తిరుమల కేవలం ధార్మిక క్షేత్రంగానే కాకుండా సామాజిక సేవలను కూడా విస్తృతంగా చేపట్టడంలో విశ్వవ్యాప్తం చెందింది.
ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తున్న భక్తులకు దేవస్థానం వారు చేస్తున్న సేవలు విభిన్నమైనవి. స్వామి దర్శనం దగ్గర నుండి కడుపునిండా అన్నప్రసాదం పెట్టేంతవరకు అన్ని ఉచితమే. శ్రీవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు ఆలయం లోపలే- స్వామివారికి నైవేద్యం పెట్టిన అన్నప్రసాదాలను టీటీడీ ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చింది. నెయ్యి పొంగళి, చక్ర పొంగళి, పులిహోర, దద్యోదనం, కదంబం, మాత్ర వంటి అనేక అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తూ వచ్చింది.
తిరుమలకు చేరుకునే సామాన్య భక్తులకు అల్పాహారం దగ్గర నుండి భోజనం వరకు అయ్యే వ్యయభారం భరించలేనిదిగా తయారైంది. ఈ నేపథ్యంలో 1983లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయించారు. ఆయన ఆదేశాల ఫలితంగా 1985, ఏప్రిల్ 6న ‘శ్రీవేంకటేశ్వర నిత్య అన్నదాన పథకం’ ప్రవేశపెట్టారు. ఎనె్నన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ చేతుల మీదుగానే తిరుమలలో నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. 1994 ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్య అన్నదాన పథకానికి ప్రత్యేకించి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల దీనికి ‘శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్’గా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలోని కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం నిర్వహిస్తూ వచ్చారు. 2011,జూలై 7 నుండి తిరుమలలో రాం భగీచ అతిథి భవనం సమీపంలో 33కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదాన భవనానికి ‘మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం’ అని నామకరణం చేశారు. ఈ అన్నప్రసాద భవనాన్ని అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2లోని కంపార్టుమెంట్లలో, బయటి క్యూలైన్లలో, పిఎసి2, కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని రాం భగీచ బస్టాండు, సిఆర్‌ఓ, పిఎ సి 1వద్ద ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
ఇక, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2లో వేచి ఉన్న భక్తులకు ప్రతి మూడు గంటలకు ఒకసారి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అలాగే దివ్యదర్శనం కాంప్లెక్స్, సర్వ దర్శనం కాంప్లెక్స్, 300 రూపాయల ప్రత్యేక దర్శన కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణకట్టలో టీ,కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. రోజుకు పదివేల లీటర్ల పాలను ఇందుకోసం టీటీడీ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. తిరుపతికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద వితరణను టిటిడి అందుబాటులోనికి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్‌లలో అన్నప్రసాత వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తిరుపతిలోని రెండవ సత్రం, మూడవ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఇక పేదవర్గాలకు చెందిన రోగులు చికిత్స పొందే రుయా సుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో ఈ అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
ప్రముఖ దినాల్లో భారీగా..
తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో గరడుసేవ రోజున 2లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. అలాగే, తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చట్నీతో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5 నుంచి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగళి, చట్నీ, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు భోజనం వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 10 నుంచి 12 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.
దాతల చేయూత
దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్ట్‌కు కనకవర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజూ అన్నప్రసాద ట్రస్ట్‌కు భారీ విరాళాలు ఇచ్చే దాతలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు చెందిన మాగుంట సుధాకర్‌రెడ్డి 25లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు. లక్ష రూపాయల నుండి కోట్ల రూపాయలు ఇచ్చే మనసున్న దాతలు లెక్కకు మించే ఉన్నారు. ఇలా గత 33 సంవత్సరాలుగా దాతలు ఇచ్చే విరాళాలు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 937 కోట్ల రూపాయలుగా వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. తొలుతగా భక్తులు ఇచ్చే విరాళానికి సరిసమానమైన మొత్తాన్ని టిటిడి ఇస్తూ ఈ మొత్తాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు. తద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ సాగించేవారు. అయితే, విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య పెరగడంతో టిటిడి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేసి భక్తులు ఇచ్చే విరాళాలను బ్యాంకులో డిపాజిట్ చేసి తద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు. రోజుకు 30 నుండి 50వేల మంది వరకు అన్నప్రసాద వితరణ చేసేవారు. నేడు తిరుమలకు వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నా, ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణను టిటిడి చేయగలుగుతోందంటే దాతల
ఔన్నత్యం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది.
అయిదేళ్లలో పెరిగిన విరాళాలు
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు దాతలు ఇచ్చిన విరాళాలతో 2013-14 నాటికి రూ.507.05 కోట్లు మాత్రమే ఉండేది. ఈ మొత్తం 2014-15 నాటికి రూ.592.23 కోట్లకు చేరింది. 2015-16 నాటికి రూ.693.91 కోట్లు, 2016-17 నాటికి రూ.809.82 కోట్లు, 2017-18 మార్చి నెలాఖరు నాటికి విరాళాలు రూ.937 కోట్లకు చేరాయి. ఈ ట్రస్టు ప్రతినిధులతో పాటు అన్నప్రసాద వితరణ కార్యకలాపాలను ప్రత్యేకాధికారి వేణుగోపాల్, తిరుమల క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్ర్తీ, తిరుపతి క్యాటరింగ్ అధికారి టి.దేవయ్య ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
క్యాంటీన్ సిబ్బంది సేవ
ఏ పని అయినా డబ్బుతోనే సాగుతాయని అనేక మంది నమ్ముతూ ఉంటారు. అయితే డబ్బు వచ్చినంత మాత్రాన దాన్ని వినియోగించే కార్యకలాపాల్లో భాగస్వాములైన సిబ్బంది శ్రమసేవ కూడా అంతకు మించి ఉంటుందన్నది అక్షరసత్యం. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చినా టిటిడి అన్నదానం క్యాంటీన్‌లో పనిచేసే సిబ్బంది విసుగూ విరామం లేకుండా అన్నప్రసాదాలను తయారు చేస్తూ భక్తులకు అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాలను అందించడంలో వారి శ్రమసేవ కూడా అంత గొప్పదనే చెప్పాలి.
సేవకుల సేవ ప్రశంసనీయం
భక్తులకు సాయం చేయాలని భావించే సేవకులను తిరుమలకు ఆహ్వానించాలని టిటిడి దశాబ్దకాలం క్రితం నిర్ణయించింది. తొలినాళ్లలో ‘శ్రీవారి సేవ పథకాని’కి ఆదరణ ఉంటుందా? అనే అనుమానాలు టిటిడి యాజమాన్యానికి ఉండేవి. కాలగమనంలో టిటిడి ఉద్యోగులకు దీటుగా శ్రీవారి సేవకులు భక్తులకు ఉచితంగా సేవలు అందించడానికి క్యూలు కడుతున్నారు. కొన్ని రోజులు పాటు తమ కుటుంబాలను కూడా వదులుకుని భక్తులకు సేవ చేస్తున్నారు. దేశం నలుమూలల నుండి ఇలాంటి భక్తులు ఎంతోమంది ఏడాది పొడవునా తిరుమలకు వస్తున్నారు. అన్నప్రసాద వితరణకు టిటిడికి సేవలు అందిస్తున్న వారిలో సేవకుల పాత్ర కూడా కీలకంగా మారింది. కూరగాయలు తరగడం దగ్గర నుండి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించేంత వరకు టిటిడి ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు.
నిరంతర పర్యవేక్షణ..
ప్రతిరోజూ తిరుమల తిరుపతిలో సుమారు 2 లక్షల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతున్న నేపధ్యంలో టిటిడి కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, సంయుక్త కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరాజు, సంయుక్త కార్యనిర్వహణాధికారి పోల భాస్కర్ పర్యవేక్షణలో అన్నదాన ట్రస్ట్ నిరంతరాయంగా సాగుతోంది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అన్నప్రసాద వితరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు సైతం..
ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నప్రసాదం ట్రస్ట్‌లో ఆయన అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇటీవల భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా అన్నప్రసాద ట్రస్ట్‌కు 25లక్షల రూపాయలను నారా కుటుంబం విరాళంగా ఇస్తోంది. గత మూడేళ్లలో మొత్తం 75 లక్షల రూపాయలను ఇలా అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు.

33 ఏళ్లలో 10 పథకాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక పరిరక్షణలో విశ్వవ్యాప్త కీర్తిని గడించింది. సామాజిక సేవలోనూ అదే స్థాయిలో వినుతికెక్కింది. 1984 నుంచి 2009 వరకు 10 పథకాలను, ట్రస్టులను టీటీడీ యాజమాన్యం రూపొందించింది. అధికారుల అంచనాలకు మించి దాతలు కూడా భూరి విరాళాలు ఇస్తూ వచ్చారు. 1984లో ఎస్వీ అన్నదాన ట్రస్టును ప్రారంభించగా ఇప్పటి వరకూ 33,369 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. ఇందులో లక్ష నుంచి రూ. 5 లక్షల్లోపు విరాళాలు ఇచ్చినవారు 29,113 మంది కాగా, రూ.5 నుంచి 10 లక్షల్లోపు విరాళాలు ఇచ్చినవారు 2,262 మంది. రూ. 10 లక్షల నుంచి కోటి లోపు విరాళాలు ఇచ్చినవారు 1943 మంది. కోటి రూపాయలు పైబడి విరాళాలు ఇచ్చినవారు 51 మంది. అదే ఏడాది ఎస్వీ బర్డ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా 2,376 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. ఇందులో లక్ష నుంచి రూ. 5 లక్షల్లోపు విరాళం ఇచ్చినవారు 1,187 మంది. 5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపు విరాళాలు ఇచ్చినవారు 195 మంది. రూ. 10 లక్షలు నుంచి కోటి రూపాయలలోపు విరాళాలు ఇచ్చినవారు 284 మంది. కోటికి పైబడి ఇచ్చిన వారు 10 మంది.
ఇక స్విమ్స్‌లో నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టును 2001లో ఏర్పాటు చేసింది. ఇందులో 6,513 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. వీరిలో లక్ష నుంచి 5 లక్షల్లోపు విరాళాలు ఇచ్చిన వారు 4,887 మంది. 5 లక్షల నుంచి 10 లక్షల్లోపు విరాళాలు ఇచ్చిన వారు 1,020 మంది. రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయలు ఇచ్చిన వారు 588 మంది. కోటి రూపాయలకు పైబడి ఇచ్చిన వారు 18 మంది. 2002లో ఎస్వీ గో సంరక్షణ ట్రస్టు ఏర్పాటు చేయగా ఇందులో 4,749 మంది దాతలున్నారు. వీరిలో లక్ష నుంచి 5 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 4,168 మంది. 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చినవారు 235 మంది. రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయలు ఇచ్చిన వారు 328 మంది. కోటి రూపాయలకు పైబడి విరాళం ఇచ్చిన వారు 18 మంది ఉన్నారు. 2004లో ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ ఏర్పాటు చేయగా 1892 మంది దాతలు ఉన్నారు. లక్ష నుంచి 5 లక్షల లోపు విరాళం ఇచ్చిన వారు 1,527 మంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపు ఇచ్చిన వారు 187 మంది. రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల్లోపు విరాళం ఇచ్చిన వారు 168 మంది. కోటి రూపాయలకు పైబడి ఇచ్చిన వారు 10 మంది ఉన్నారు.
2006లో ఎస్వీ హెరిటేజ్ రిజర్వేషన్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇందులో 147 మంది దాతలు ఉన్నారు. లక్ష నుంచి 5 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 113 మంది, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపు ఇచ్చిన వారు 11 మంది, రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల్లోపు విరాళం ఇచ్చిన వారు 21 మంది. కోటి రూపాయలకు పైబడి విరాళం ఇచ్చిన వారు ఇద్దరు. 2007లో శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్) ఏర్పాటు చేశారు. ఇందులో 4,216 మంది దాతలు ఉన్నారు. వీరిలో రూ. 1 నుంచి 5 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 2,726 మంది, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపు విరాళం ఇచ్చిన 482 మంది, రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల్లోపు విరాళం ఇచ్చిన వారు 950 మంది, కోటి రూపాయలకు పైబడిన ఇచ్చిన వారు 68 మంది. 2007లో ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టు ఏర్పాటు చేయగా ఇందులో 734 మంది దాతలున్నారు. వీరిలో లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 576 మంది. రూ. 5 నుంచి 10 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 54 మంది, రూ. 10 నుంచి రూ.కోటి లోపు విరాళం ఇచ్చిన వారు 88 మంది, కోటి రూపాయలు పైబడి ఇచ్చిన వారు 16 మంది ఉన్నారు.
2008లో ఎస్వీ విద్యాదాన ట్రస్టును ఏర్పాటు చేయగా ఇందులో 1902 మంది దాతలున్నారు. వీరిలో లక్ష నుంచి
5 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 1,622 మంది, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపు విరాళం ఇచ్చిన వారు 96 మంది, రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల్లోపు విరాళాలు ఇచ్చిన వారు 181 మంది. కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చిన వారు ముగ్గురున్నారు. 2009లో శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు ఏర్పాటు చేయగా ఇందులో 425 మంది దాతలున్నారు. వీరిలో లక్ష నుంచి రూ. 5 లక్షల్లోపు విరాళాలు ఇచ్చిన వారిలో 349 మంది ఉన్నారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపు ఇచ్చిన వారు 23 మంది, రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల్లోపు విరాళం ఇచ్చిన 53 మంది, కోటి రూపాయలకు పైబడి విరాళం ఇచ్చిన వారు ఒక్కరే ఉన్నారు. కోటి రూపాయలు లోపు ఇచ్చిన వారు 4,603 మంది కాగా, కోటి రూపాయలకు పైబడి ఇచ్చిన వారు 197 మంది ఉండటం విశేషం.
లక్ష నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతలకు వివిధ స్థాయిల్లో టీటీడీ వసతి, దర్శనం, లడ్డూ ప్రసాదాల సౌకర్యాలను టీటీడీ నిబంధనలకు అనుగుణంగా అందిస్తోంది. విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తోంది. కోటి రూపాయలకు పైబడి విరాళం ఇచ్చిన వారికి జీవితకాలం పలు సౌకర్యాలను కల్పిస్తోంది. ఏడాదిలో మూడు రోజులు రూ.2500 అద్దె గదిని, మూడు రోజులపాటు 5 మందికి సుప్రభాతం, మూడు వేర్వేరు దినాల్లో ఎల్-1 విఐపీ దర్శనం, వేదాశీర్వచనం, 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్‌ను దాత విరాళం అందించిన వెంటనే అందిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఏడాదిలో ఒకసారి సిల్క్ దుప్పటా, రవికెను, 10 మహాప్రసాదం ప్యాకెట్లను అందిస్తున్నారు. రూ.10 లక్షల నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన వారికి 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్‌ను తొలిసారిగా అందించడంతోపాటు దాతలు ఏడాదికోమారు తిరుమలకు వచ్చినప్పుడు 20 చిన్న లడ్డూలు, ఏడాదిలో మూడు రోజులపాటు ఎల్-2 దర్శనం, రూ. 500 ధర ఉన్న గదిని ఇస్తున్నారు. ఇలా దాతలు వెంకన్న దర్శనాన్ని సంతృప్తికరంగా చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది. విరాళాలను సేకరించడానికి తిరుమలలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.. *

-రామాపురం రాజేంద్ర