ఈ వారం స్పెషల్

ఏమని వర్ణించనూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ గీతం అనునిత్యం తీరాన్ని తాకే కెరటం. ఎగసిపడే భావాలను ఒడిసి పట్టుకునేందుకు భావ తీరాలు ఎదురు చూస్తూంటాయి. హాయి, ఆనందం, ఉత్సాహం, ఉత్తేజంతో తరాలు తరిస్తూంటాయి. మొన్నటి పింగళి, సముద్రాల తరం నిన్నటి తరం ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వేటూరి, సిరివెనె్నల సమాహారం.. నేటి తరానికి చెందిన చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ సినీ సంద్రంలో భావ తీరాలను తాకే సాహితీ నావికులే. కాలంతో పాటు పరుగులు పెడుతూ సాహిత్యానికి సరికొత్త గుబాళింపులందిస్తూ సాగుతున్న సినీ గేయం రసప్లావితం. ఆస్వాదించేకొద్దీ అక్షయపాత్రలా అపరిమిత ఆనందాన్నందించే సుమధుర భావ స్వప్నం...
*****
ఏమని వర్ణించనూ...
తెలుగు మాట ఎంత మధురమో.. తెలుగుపాటా అంత కమనీయం. నిండైన తెలుగు పదాలు సంగీత ఝరిలో కర్ణపేయంగా పరుగులు పెడుతూంటే.. ఆ పదాల సవ్వడులు మనసుని రంజింపజేస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తాయి. భావసాగరం పింగళి, సృజన విశారద ఆరుద్ర, మనసుకు మల్లెల సుగంధాన్నిచ్చిన ఆత్రేయ, సినీసాహితీ సవ్యసాచి సినారె, నిండైన భావ సుగంధం దాశరథి, కొంటెపాటల అమ్ములపొది కొసరాజు పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి పాటల్లో సింగారించుకున్న తెలుగు పదాలు తెలుగు నేల నలుమూలలా మార్మోగాయి. ఈ సినీ దిగ్గజాలు తమ భావాలను రంగరించి కల సంధానం చేసి అందించిన గీత మాధుర్యాలు అమృత తుల్యం. వారి అక్షరాలు భిన్న భావాలకు బీజాక్షరాలు. ఆనందం, ఆహ్లాదం, ఆత్మీయత, అనురాగం, సింగారం, శృంగారం.. ఒకటేమిటి..? మనిషికి, మనసుకు మధ్య ఉండే భిన్న రకాల బాంధవ్యాలకు భావపుష్ఠిని చేకూర్చిన సాహితీ దురంధరులు వీరు. అందుకే వారి గీతాలన్నీ భావసాగరాలే. అందులో పొదివిన రసగుళికల్లాంటి పదాలన్నీ ఆ సాగరంలో నిక్షిప్తమైన మణిమాణిక్య సమాహారాలు. అలాంటి సినీసాగర నిక్షిప్త రసగుళికెల్లో మనసుకు హాయి, ఆనందం, చిరస్మరణీయమైన అనుభూతిని కలిగించే గీతాలెన్నో.. ఎనె్నన్నో.. రసప్లావిత ఆ సినీ గేయానందసాగరాన్ని మధిస్తే.. నాటి క్షీర సాగర మధనంలో అంతిమంగా ఉద్భవించిన అమృత కలశం చందంగా రసమయానందం ఉప్పొంగుతుంది.
మనసుకు, మాటకు అనిర్వచనీయ బంధం. ఆ మనసుకు కలిగే భిన్నానుభూతులే భాపపరంపరలు. ముఖ్యంగా మానసికానందం అన్నది ఏకాంతంలోనూ ఉండొచ్చు.. చెలిచెంత చేరిన తడవునే కలగొచ్చు. ‘ఖుషీఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ..’ అంటూ సాగే దాశరథి పాట ప్రేయసీ ప్రియుల అనురాగానికి, ఒకరి మనసులోని భావాలను మరొకరు ఎత్తిపొడుపుగా చెప్పుకునే కమనీయత్వానికి నిదర్శనం. ‘ఈ వౌనం.. ఈ బిడియం’ అంటూ వినిపించే సుశీల గానామృత ప్రవాహమూ మనసును కట్టి పడేస్తుంది. ఈ పాటలో దొర్లే ప్రతి పదం అమృతాన్ని పుణికిపుచ్చుకున్న ఆత్మీయ సుగంధం. ఘంటసాల, సుశీల స్వర మాధుర్యం ఈ పాట సాహిత్యానికి తేనియలు జోడిస్తే.. అక్కినేని, కృష్ణకుమారి భావయుక్త అభినయం నిండుతనాన్నిచ్చింది. ఇ టు దృశ్యంగా చూసినా.. దూరం నుంచి విన్నా అయస్కాంతం ఆకర్షించినట్టుగా ఈ పాట కట్టి పడేస్తుంది. డాక్టర్ చక్రవర్తిలోని మరో అద్భుత గీతం ‘నీవులేక వీణ పలకలేనన్నది’ అంటూ సాగే రసమయ గీతం. సుశీల ఆలపించిన ఈ కమనీయ గీతానికి సావిత్రి జోడించిన హావభావావిష్కరణ మనసును పులకింపజేసేదే. ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివితీరని మాధుర్యం ఈ పాటలో ఉంది. మనసు మెచ్చిన, కాలం మెచ్చిన రసగుళికెల్లో ‘కొండగాలి తిరిగింది..గుండె ఊసులాడింది’ అంటూ ఆరుద్ర ఆవిష్కరించిన సీనీ గీతామృతంలోని పల్లవి, చరణం భావ గోదావరీ విహారమే చేస్తాయి. ఘంటసాల మాధుర్యంతో చిరస్మరణీయతను సంతరించుకున్న ఈ పాట ఎప్పుడు వినిపించినా ఆ హాయిలో ఓలలాడనివారుండరంటే అతిశయోక్తి ఏమీకాదు. అలాగే ఆరుద్రే రాసిన శ్రీమతి చిత్రంలోని ‘మోగింది గుడిలోని గంట..’ అన్న గీతమూ నిండైన దాంపత్యాన్ని కోరుకునే యువ జంట తాదాత్మ్యతకు, తమ బంధాన్ని ఆనంద సౌధంగా మార్చుకోవాలన్న వారి వాంఛకు భావ నగిషీ. ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి లపాపాయి’ అంటూ ‘ఆడబ్రతుకు’ చిత్రం కోసం దాశరధి రాసిన పాటా మనసును రంజింపజేసేదే. ఎక్కడ ఉన్నా అనిర్వచనీయ అనుభూతిని కలిగించే భావగాఢత ఈ పాటలో దొర్లిన ప్రతిపదంలోనూ ఉంది. అలాగే ‘అత్తఒడి పువ్వువలే మెత్తనమ్మా..’ అంటూ సుశీలమ్మ ఆలపించిన పాట వింటే కలిగే హాయి గురించి ఎంత చెప్పుకుంటే తనివి తీరుతుంది? మనసంటే మనకు గుర్తొచ్చేది మనసుకవి ఆత్రేయ. మనసును ఆయన మధించారు. దాన్ని రంగరించి రసరమ్య సినీ ప్రపంచానే్న ఆవిష్కరించారు. ‘చందమామా అందాల మామా’ అంటూ మానసిక ఆనందాన్ని చంద్రుడంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆత్రేయ మనసు పాటలు హాయి, ఆనందం, ఆత్మీయ భావాలకు ప్రతీకలే. ప్రేయసీ ప్రియుల భావాలను రంగరించినా, ఒంటరిగా ఒకరినొకరు ఊహించుకుంటూ భావిబంధాన్ని నిర్మించుకుంటూ ఆలపించినా ఆత్రేయ పాట భిన్న భావాలు మేటవేసిన సాహితీ మూట. మనసుతో ఆయన ఎంత హాయిని పంచారో ‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అంటూ తన ఆక్కసునూ చాటారు. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా వినిపించిన ప్రతిసారీ ఆగిపోతాం. మన ఇంట్లోని రేడియోలో అలాంటి పాట వచ్చినా.. మనం టీ తాగే హోటల్‌లో అది వినిపించినా అప్రయత్నంగానే నిలుచుండిపోతాం. అలాంటి గీతాలకు మనకు కొదవే లేదు. ఇలాంటి పాటల్లోని కవ్వింపు, నవ్వింపు, విసుర్లూ, కసుర్లూ కట్టిపడేస్తాయి. పాడిపంటలు చిత్రంలోని ఇరుసులేని బండి ఈశ్వరుని బండి అంటూ సాగే ఓ జంట కవ్వింపూ ఇలాంటిదే. ఏళ్లు గడిచినా ఆ పాట ఓ రసగుళికే. అలాగే ‘కలలు గనే కమ్మని చిన్నారీ..నీ సొగసులన్ని నావే వయ్యారీ’ అంటూ సాగే పాట.. ‘గుంతలకిడి గుంతలకిడి గుంత లకిడి గుమ్మ’ అన్న గీతం, ‘డూడూడూ గంగిరెద్దు దాసరొచ్చాడూ.. డూడూడూ బసవన్నను తోలుకొచ్చాడూ’ అంటూ చలాకీగా సాగే మాటలు మనకు విన్న ప్రతిసారీ ఆనందాన్ని కలిగించేవే. మరోసారి వినాలన్న కోరికనూ రగిలించేవే. దేవదాసు చిత్రంలోని ‘పల్లెకు పోదాం.. పారును చూదాం చలో చలో..’ అన్న పాట ఓ పరుగే.. చలాకీ తనానికి, యవ్వనంలోని ఉత్సాహానికి ఈ పాట ప్రతిరూపం. ‘ఎంతహాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి’ అన్న పాటలోని హాయిని ఏమని వర్ణించగలం? అలాగే ‘హాయిహాయిగా జాబిల్లి’ అన్న పాట నిండైన ఆహ్లాదానికి అద్దం పడితే ‘నెలవంక తొంగిచూసింది’ అనే మరోగీతం ఆ హాయికి ఊతాన్నిస్తుంది. ‘కనుల ముందు నీవుంటే కవిత పొంగిపారదా.. తొలి చిగురులు చూడగానే ఇల కోయిల కూయదా’ అంటూ తన భావాన్ని అడుగులు వేయించిన సినారె ‘నను వలచిన చెలివని తెలుసు.. నా మదిలోన ఏముందో అది నీకు తెలు’సంటూ మరింత కవ్విస్తాడు. ‘మల్లియలారా మాలికలారా వౌనంగా ఉన్నారా మా కథలే విన్నారా’ అంటూ సున్నిత పదాలతో సునిశిత భావాలతో సాగే సినారె గీతం నిత్య సుగంధం. ఇందులోని ఆర్ధ్రత మనసును కట్టిపడేస్తుంది. ఆహ్లాదంతో పాటు మానవ బంధాల్లోని వైరుధ్యాలనూ అంతగానూ ఆయన పండించారనడానికి ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’అని సాగే పాట. ‘అనగనగా ఒకరాజు అనగనగా ఒకరాణి’ అని చిన్న పిల్లలకు కథ చెప్పినట్టుగా పల్లవి అందుకుని ఒక జీవితానే్న స్మృశించిన సినారె ‘రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్’ అంటూ పరుగులూ పెట్టించారు. ‘ఈవేళ నాలో ఎందుకో ఆశలూ’ అని సాగే మరోపాట వింటే మది పులకించాల్సిందే. హిందీలోనూ జనరంజకమైన ‘తుమ్హారీ నజళ్ క్యూ కఫా హో గరుూ’అన్న పాటను అనుకరించినట్టుగా సాగే ఈ పాటా అంతే పాపులర్ అయింది.
ఘంటసాల యుగంలో ఆనంద విహారం చేసిన తెలుగు పాట ఎస్పీ బాలు శకం రావడంతో మరింత వేగాన్ని సంతరించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే హిందీలో కొనసాగిన ఒరవడే తెలుగులోనూ కొనసాగింది. రఫీ గంభీరమైన పాటలకు కొలమానమైతే తెలుగులో ఘంటసాల ఆ రకమైన ఒరవడికి కేంద్ర బిందువయ్యారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా ఉత్సాహం, ఉత్తేజం రంగరించిన ఎన్నో పాటలకు జీవం పోశారు. అనంతర యుగంలో ఇటు బాలు, అటు కిశోర్ రాజ్యమేలారు. హిందీ పాటకు కిశోర్ కొత్త పరుగునిస్తే తెలుగుపాటకు బాలు తనదైన మేనరిజాన్ని జోడించారు. అలాగే అటు లత, ఆశా, ఇటు సుశీల, జానకి. ఎవరికివారే సాటిలేని సుమధుర వసంతాలే. సినీ గీత రచయితలూ మారుతున్న కాలానికి అనుగుణంగా సరికఒత్త పద గుంభనలతో ఎప్పటికప్పుడు వర్తమాన తరాన్ని అలరిస్తూనే వచ్చారు. అరవై దశకంలో తెలుగు, హిందీ పాట తీరు వేరు. ఆ హుషారు వేరు. అదే 70 దశకం వచ్చేసరికి సంగీతం, సాహిత్యం మారిపోయింది. నవతరం, నవ భావాలు, నవ్యత ఇలా అన్నింటా కొత్తదనం తొణికిసలాడింది. సినీ తీరాన్ని నిరంతరం కొత్త కెరటాలు తాకుతూనే ఉంటాయి. అలా ఎగిసిపడే కెరటాలు అద్భుతమైన మణిహారాలను తీరానికి తెచ్చినట్టే కొత్త సినీ కెరటాలు తెలుగులో సరికొత్త భావగాఢతను తీసుకొచ్చాయి. వేటూరి సుందరరామ్మూర్తి తెలుగును పరుగులు పెట్టించిన తీరు, అద్భుతమైన భావాలను అనితర సాధ్యమైన రీతిలో తేలిక పదాలతో ఒలికించిన వైనం ఓ సాహితీ అద్భుతమే. ఏ ప్రక్రియలోనైనా తనదైన ముద్రను వేసుకున్న వేటూరి ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ అంటూ లాలిత్యాన్ని ఒలికించారు. ‘వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికీ’ అంటూ ఆహా ఏమి సాహిత్యమంటూ నీరాజనాలు అందుకున్నారు. సిరివెనె్నల రాక సినీ భావ కవిత్వానికి మరింత ఉద్వేగాన్ని చేర్చింది. సిరివెనె్నల సినిమాలో ఆయన రాసిన పాటలు వేటికవే సాటి. దేనికైనా వేగం పెరిగితే నాణ్యత తగ్గుతుందంటారు. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం కాదు. సాహిత్యమన్నది అక్షయం. ఎప్పటికప్పుడు అది కొత్త మెరుగులు దిద్దుకుంటూనే ఉంటుంది. యాభైల నుంచి నేటి తరం వరకూ సినీ గీతరచయితల ఆలోచనలు మారాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సంతరించుకుంటూ నేటి తరాన్ని అద్భుతమైన సాహిత్యంతో అలరిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన పాటలన్నీ యువతను ఉర్రూతలూగించడానికి కారణం వర్తమానానికి తగ్గట్టుగా సినీ కలం రాటుదేలడమే. వాస్తవికతను సంతరించుకుని యువ హృదయాల్లోకి చొచ్చుకు పోగలగడమే! కాలమేదైనా తెలుగు పాట అజరామరం. దేనికదే అన్నట్టుగా సాగిన సినీ గీతాయానం అనంతం. పాత మైలురాళ్లూ దాటేస్తూ కొత్త మైలురాళ్లను ఆహ్వానిస్తూ విలువైన సాహితీదారులు తీసే కవులకు నిత్యనూతన వేదిక తెలుగు సినిమా. కలానికి బలం.. భావానికి గాఢత.. రచయితకు సన్నివేశ స్పృహ ఉండాలే గానీ తెలుగు పాట ఎప్పటికప్పుడు సరికొత్త రెక్కలు విప్పుకుని సినీవెనె్నలనే కురిపిస్తుంది. మధురానుభూతిలో మైమరిపిస్తుంది.

-బి.రాజేశ్వర ప్రసాద్