ఈ వారం కథ

ఔరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వైద్యో నారాయణో హరిః గురు పరబ్రహ్మ’ అని అంటారు మన పెద్దలు. ఎంత మంచి సామెతలు. సామెతలు పురాణాల్లో, పుస్తకాల్లో భద్రంగా వున్నాయి.. ఉంటాయి. మన పురాణాలను, పురాణ పురుషుల్ని విమర్శిస్తే ఈ దేశంలో ఎంతోమందికి చిర్రెత్తుకొస్తుంది. కానీ, పురాణాలు, పురాణ పురుషులు చెప్పిందేదీ ఈ మహాత్ములు చేయరు. చేసినవాడ్ని పిచ్చోడి కింద జమ చేస్తారు.
రామారావు ఆ రోజు రోజూలానే సాయంకాల నడకకు బయలుదేరాడు. మరో ముగ్గురు నడక మిత్రులు జత కలిశారు. రోజూ ఆరు గంటల నుండి ఏడు గంటలవరకు సుమారు ఓ నాలుగు కిలోమీటర్లు నడుస్తారు నలుగురు మిత్రులు. నడక తరువాత కాసేపు నిలబడి లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. పక్కింటి మీనాక్షి దగ్గర నుండి అమెరికా అధ్యక్షుడిదాకా సాగుతుంది వీరి సంభాషణ. ఆ రోజు నడుస్తుండగానే ఉన్నట్టుండి రామారావుకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టి కళ్ళు మసకబారిపోయాయి. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక కూలబడిపోయాడు. మిత్రులంతా కలిసి కంగారుగా ఆటోలో తెలిసిన స్థానిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. వైద్యుడు వెంటనే నొప్పి తగ్గటానికి ఓ సూది మందిచ్చి, స్కానింగ్ చేయించమని రాశాడు. ‘‘బహుశా కిడ్నీలో రాయి వుండవచ్చు, స్కానింగ్ రిపోర్టు జూసి ఏం చేయాలో చెబుతాను’’ అన్నాడు. పది నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది. ‘‘ఈ వేళప్పుడు ఎందుకు, రేపు స్కానింగ్ చేయించుకుంటాలే’’ అన్నాడు రామారావు. సరే అనుకొని రామారావును ఇంటి దగ్గర దింపి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు.
మరుసటి రోజు రోగ నిర్థారణ కేంద్రానికి వెళ్లాడు రామారావు. రిపోర్టు తీసుకొని నిన్న జూసిన వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. వైద్యుడు ఆ రిపోర్టును జూసి, ‘‘రామారావుగారు! మీ ఎడమ వైపు కిడ్నీలో ఇరవై మిల్లీ మీటర్ల రాయి వుంది. సాధారణంగా ఐదారు మిల్లీ మీటర్ల రాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగడంవలన, కొన్ని మందులు వాడటంవలన మూత్రం ద్వారా పడిపోతాయి. కానీ, ఇది పెద్ద రాయి. దీన్ని ఆపరేషన్ ద్వారా తొలగించాలి. కానీ, మీకు మధుమేహం, రక్తపోటున్నాయి. అందువలన ల్యాపరోస్కోపి ద్వారా తొలగిస్తారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం కోసం కొన్ని మందులు రాస్తున్నాను. సాధ్యమైనంత తొందరలో యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నడక ప్రస్తుతం మానండి’’ అని రెండు రకాల మందులు రాసి పంపించారు.
ఐదు రోజులకు మందులు తీసుకొని రామారావు ఇంటికి వచ్చాడు. పెద్దామ్మాయి బెంగుళూరులో వుంటుంది. చిన్నమ్మాయి అమెరికాలో వుంది. వాళ్ళకు తెలియజేశాడు. కొందరి మిత్రుల సలహా మీద హైదరాబాద్ వెళ్లడానికి నిర్ణయించుకున్నారు రామారావు దంపతులు.
రామారావు నలభై సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనే్జసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి పంపించాడు సర్వీసులో ఉండగానే. సొంతిల్లు, భార్యా, నెలకు పదివేలు పెన్షన్, జీవితం హాయిగా గడిచిపోతుంది. పదవీ విరమణ చేసినపుడు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు. పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. దాచుకున్నదీ లేదు. భార్య నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి వో యాభై వేలు అప్పు తీసుకుని, భార్య తోడుగా హైదరాబాద్ వెళ్లాడు.
పెద్ద కార్పొరేటు హాస్పిటల్. పేరున్న వైద్యుడు. వెయ్యి రూపాయలు సంప్రదింపు రుసుము చెల్లించాక ఎదురుచూపుల చలువ గదిలో కూర్చోబెట్టారు. అక్కడో టీవీ. అందులో వారి ఘన చరిత్ర ప్రదర్శన. కొంతమంది చికిత్స చేయించుకున్న రోగులతో పరిచయాలు. వారి అనుభవాలు. మూడు గంటల నిరీక్షణ తరువాత వైద్యుడి అద్దాల గదిలోకి పిలుపు. మూడు ముక్కల్లో విషయం తేల్చేశాడు.
‘‘చూడండి రామారావుగారూ! మీ కిడ్నీలో వున్న రాయి చాలా పెద్దది. నలభై మిల్లీ మీటర్లుంది. ల్యాపరోస్కోపి చేసి తొలగించాలి. మూడు రోజులు హాస్పిటల్లో వుండాలి. ఐతే, మీకు మధుమేహం, రక్తపోటు ఉన్నాయి. కనుక వేరే కొన్ని పరీక్షలు చేయించాలి’’ అంటూ ఏవో పరీక్షల పట్టిక ఓ కాగితంమీద రాసి ‘‘ఈ పరీక్షలు చేయించుకొని రిపోర్టులు తీసుకొని రేపు రాండి’’ అని ఆ కాగితం చేతికిచ్చాడు.
‘‘అయ్యా! డాక్టర్‌గారూ! మాదీ వూరు కాదు. ఈ నగరంలో బంధువులెవరూ లేరు. ఆ పరీక్షలేవో అన్నీ మీరే చేయించండి. నేనెంత చెల్లించాలో చెప్పండి’’ అని తన సమస్యను సావధానంగా చెప్పాడు రామారావు. వైద్యుడికి సావధానంగా వినే తీరిక లేదు. వేరే ఓ వ్యక్తిని పిలిపించి ఈ విషయం చూడమని పురమాయించాడు. ఆ వ్యక్తి అదే హాస్పిటల్‌లో డబ్బుల వ్యవహారం తదితర కార్యాలయ పనులు జూసేవాడు.
వైద్యుడుగారు రాసిచ్చిన కాగితం జూసి ‘‘రామారావుగారూ! మీకీ చికిత్స చేయడానికి మీరు మూడు రోజులు ఇక్కడ ఉండటానికి అన్నీ కలిపి ఓ యాభై వేలు ఖర్చౌతుంది. ఇక ఈ పరీక్షలన్నీ బయట చేయించుకోవాలి. వారి ఖర్చు మీరే చెల్లించాలి’’ అని తన పని ముగించుకున్నాడా వ్యక్తి.
‘‘ఆ ఖర్చెంత కావచ్చండి?’’
‘‘పది పదిహేను వేలు కావచ్చు. మీ యిష్టం. ఆలోచించుకోండి’’ అని ఇక తన పని ఐపోయిందన్నట్టుగా మరో వ్యక్తితో తన సంభాషణ ప్రారంభించాడు.
రామారావు భార్యతో చర్చించాడు. ఇక్కడదాకా వచ్చి ఇక చేయగలిగిందేముంది? ఏదో రకంగా డబ్బు సమకూర్చుకోవాలి.
ఇంతలో ఓ నడక మిత్రుడు ఫోన్ చేశాడు. ‘‘రామారావుగారూ, డబ్బు గురించి ఆలోచించమాకండి. ఆరోగ్యం ముఖ్యం. మీకేమైనా సొమ్ము కావలసి వస్తే చెప్పండి. ఇప్పుడే మీ ఖాతాలో డబ్బు వేస్తాను. లెక్క తరువాత చూసుకోవచ్చు’’.
రామారావు దంపతులకు కొండంత ధైర్యం వచ్చింది. సరే నయమై ఇంటికి వెళ్లాక, మిత్రుడి ఋణం వీలుచూసుకొని తీర్చవచ్చుననుకున్నారు. ఓ ఇరవై వేలు తన ఖాతాలో బ్యాంకులో వేయమని మిత్రునికి ఫోనే్జసి చెప్పాడు. ఆ పూటే హాస్పిటల్లో చేరిపోయాడు. అడ్వాన్స్‌గా పాతిక వేలు కట్టించుకుని వారికో గది ఇచ్చారు. దాని అద్దె రోజుకు మూడు వేలు. గదిలో చేరిన కాసేపటికి వో నర్సు వచ్చి వ్యానులో సమీప రోగ నిర్థారణ కేంద్రానికి రామారావును తీసుకువెళ్లింది. రకరకాల పరీక్షలు చేశారు. గుండె సంబంధ పరీక్షలకై, ఈసీ, టూడీ, టియంటీ వంటి పరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు జూసి, గుండె సంబంధ వైద్యుడు, ‘‘మీ రిపోర్టులన్నీ చూశాను. మీకు ముందుగా యాంజియోగ్రాం చేయాలి. అది చేయించుకున్న తరువాతనే కిడ్ని రాయికి ఆపరేషన్ చేయడం కుదురుతుంది’’ అని సలహా ఇచ్చాడు.
‘‘దానికీ దీనికి సంబంధమేమిటి సార్? ఆ.. నాకు తెలీక అడుగుతున్నాను’’ అని డాక్టర్‌ను ప్రశ్నించాడు రామారావు.
‘‘మీకు ల్యాపరోస్కోపి చేసేటప్పుడు మత్తు మందు ఇస్తారు. అది మీ గుండెపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి యాంజియోగ్రాం చేయించుకోండి’’.
‘‘దానికెంత ఖర్చౌతుందండీ?’’
‘‘మా హాస్పిటల్లో ఓ పాతిక వేలౌతుంది. ఒక పూట వుండి వెళ్లిపోవచ్చును’’.
‘‘సరేనండి. నా మిత్రుడు డా కుమార్ వున్నారు. వారు గుండెకు సంబంధించిన వైద్యులే. వారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను’’.
‘‘డా కుమార్ మీకెలా మిత్రుడు?’’
‘‘డా కుమార్ ఇంటర్ వరకు నా క్లాస్‌మేట్’’
‘‘ఓ.. అలాగా! అయితే మీ యిష్టం. ఇక మీరు వెళ్లవచ్చు’’.
రామారావుకు మరో సమస్య వచ్చి పడింది. ఉన్న డబ్బులు సరిపోవు. గుండె వైద్యుడేమో రిస్క్ అంటున్నాడు. యాంజియోగ్రామ్‌కు పాతికవేలు. పరీక్షలు, మందులు, గది అద్దె, కిడ్నీ ఆపరేషన్ అన్నీ కలిసి లక్ష దాటేటట్టుంది. ఏం చేయాలి? ఈ ఆలోచనలతో రక్తపోటు పెరిగింది.
‘‘ఎందుకు ఆవేశపడ్తారు? రిపోర్టులు రానివ్వండి. అనవసరంగా బీపీ పెంచుకోకండి’’ అని అనునయించే ప్రయత్నం చేసింది భార్య.
మరుసటి రోజు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. డాక్టర్ వచ్చారు. ‘‘రామారావుగారూ! మీ రిపోర్టులన్నీ చూశాను. బాగున్నాయి. మరో గంటలో మీకు సర్జరీ చేస్తాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
అదేమిటి? యాంజియోగ్రాం చేయకుండా ఆపరేషన్ రిస్క్ అన్నాడే గుండె డాక్టర్- అని అనుకొని నర్స్‌ని పిలిచి తన రిపోర్ట్స్ తెప్పించుకొని చూశాడు. ఆ రిపోర్ట్స్‌లో సర్జరీ చేయవచ్చునని రాసి ఉంది. అంటే డా కుమార్ పేరు చెప్పగానే రిపోర్ట్ మార్చేశాడన్నమాట.
మూడు రోజులు తరువాత- ఇక మీరు వెళ్లవచ్చునని చెప్పి, లక్షా ఇరవై వేల బిల్లు చేతిలో పెట్టారు హాస్పిటల్ వాళ్ళు. తెచ్చుకున్న డబ్బు పరీక్షలకు, భోజనాలకు ఖర్చైపోయింది. మిత్రుడిచ్చిన పాతిక వేలు మాత్రమే తన దగ్గరున్నాయి. లక్షా ఇరవై వేలు కట్టాలి. బిల్లు చూడగానే, రామారావు రక్తపోటు పెరిగింది. నర్స్ హడావుడిగా వైద్యుడికి కబురు పెట్టింది. డాక్టర్ వచ్చి పరీక్షించి, ఆక్సిజన్ తగిలించారు. వార్డుబోయ్స్ నర్స్ డాక్టర్ల హడావుడి చూసి రామారావు భార్య కంగారుపడింది. ఆమెను బయటకు పంపించారు. ఆంగ్లంలో డాక్టర్లు మాట్లాడుకునే మాటలామెకు అర్థంకాకపోయినా, విషయం సీరియస్సని మాత్రం అర్థమైంది. రెండు గంటలు పోరాడి, బయటకు వచ్చిన డాక్టర్లు ‘‘అమ్మా! మీరు ఆ బిల్లు ముందు చెల్లించండి. వారిని వెంటనే వేరే హాస్పిటల్‌కు పంపించాలి. ఇప్పుడు అంబులెన్స్ వస్తోంది’’ అని తొందర చేశారు. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. బెంగుళూరులో వుంటున్న పెద్దమ్మాయికి ఫోను చేసింది. విషయం చెప్పింది. వాళ్ళు డబ్బులు తండ్రి ఎకౌంటుకు మార్చినా రేపటికికానీ రావు. ఆమాటే చెప్పింది. ఈ విషయం నర్స్‌తో చెప్పింది రామారావు భార్య.
‘‘లేదమ్మా, మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. డాక్టర్‌గారు ఒప్పుకోరు. బిల్లు కట్టకపోతే రోగిని వేరే ఆసుపత్రికి పంపించరు. వెంటనే పంపించకపోతే రిస్క్. మీ ఇష్టం’’ అంది కోపంగా.
రామారావు స్పృహలో లేడు. భార్యకు ఏం చేయాలో తోచడంలేదు. ఎవరి పనుల్లో వారున్నారు. పట్టించుకునే నాధుడే లేడు. ఆమె ఆలోచించి వైద్యుడి గదిలోకి వెళ్లింది.
‘‘అమ్మా! నేనేం చేయలేను. బిల్లు వ్యవహారం నాకు తెలీదు. ఆఫీసులో మాట్లాడండి’’ అని ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడి తన పని తాను చేసుకుపోతున్నాడు.
ఎంతో ఆదుర్దాగా బయటకు వచ్చిన ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. నర్స్ వెంటనే వైద్యుడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది. డాక్టరు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని చూసి పెదవి విరిచాడు. ఈ విషయమే రామారావుకు చెప్పాలని గదిలోకి వెళ్లింది నర్స్. కానీ అప్పటికే రామారావు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
*

-మండవ సుబ్బారావు