ఈ వారం కథ

వీడని హృదయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అరుణా! తలంతా తిరుగుతోంది. గంటనుండీ మగత కమ్మేస్తుంది. అందుకే ఆఫీసునుండి పర్మిషన్ తీసుకుని వచ్చాను’’ అంటూ సోఫాపై మత్తుగా వాలిపొయ్యాడు విజయ్. ఎప్పుడూ హుషారుగా వుండే తన భర్త అలా సోఫాపై నిస్త్రాణంగా పడిపోవటంతో అరుణను భయం ఆవహించింది. భర్త చెయ్యి పట్టుకుని నాడి పరీక్షించింది. నుదుటిపై చెయ్యి వేసి వేడిని చూసింది, ఏమీ అర్థంకాక, ఏం చెయ్యాలో పాలుపోక.
‘‘ఎందుకైనా మంచిదండి, ఒకసారి డాక్టర్‌ను కలుద్దాం’’ అంది. విజయ్ నుండి స్పందన ఏమీ లేకపోవడంతో, ఎదురింట్లో వుండే తన స్నేహితురాలైన సుమతి వద్దకు వెళ్లి విజయ్ పరిస్థితి వివరించింది. సుమతి వెంటనే తన కొడుకును ఆటో తీసుకురమ్మని పురమాయించింది. ఆటో వంశీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఆగింది. అరుణ ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీలో వున్న డాక్టర్ వద్దకెళ్లి పరిస్థితి వివరించింది. ఆయన రోగిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి తీసుకురుమ్మని నర్సులకు సూచననిచ్చి, అరుణను కాజువాలిటీ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫీజును కౌంటర్‌లో చెల్లించి రమ్మని పంపించాడు. అప్పటివరకూ ఆపుకున్న కన్నీటిని తుడుచుకుంటూ అరుణ వెళ్లి డబ్బు చెల్లించి, బిల్లును డాక్టర్ టేబుల్‌పై వుంచింది. డాక్టర్ సెలైన్ బాటిల్ ఎక్కించాక, కళ్ళు తెరిచాడు విజయ్.
‘‘ఏమిటీ సమస్య?’’ అడిగాడు డాక్టర్.
‘‘కొద్ది రోజుల క్రితం కడుపులో నొప్పి ప్రారంభమై, ఇలాగే ఆఫీసులో మగతగా పడిపోయాను. ప్రక్కనే వున్న హాస్పిటల్‌కు తీసుకెళితే, డాక్టర్ అనేక టెస్టులు చేసి, ఏవో మందులు రాసిచ్చాడు. తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా, అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వచ్చేది. ఒకసారి గుండెలో నొప్పి ప్రారంభమై వీపువరకూ ప్రాకినట్లు ఉండేది. ఈమధ్య ఎప్పుడూ మగతగా ఉంటోంది. రెండు రోజులనుండీ శరీరంలో శక్తిని ఎవరో చేత్తో తీసేసినట్లు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరిస్తుంది’’ చెప్పాడు విజయ్.
అక్కడి డాక్టర్ కూడా బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీ, స్కానింగ్ పరీక్షలు చేయించాడు. అబ్‌డామిన్ స్కానింగ్ నార్మల్ అని వచ్చింది. రిపోర్టులన్నీ పరిశీలించాక, ఎసిడిటీ వుందని, ఇసోజ్-డి మాత్రలు, గ్యాసెక్స్ సిరప్, విటమిన్-జడ్ మాత్రలు రాసిచ్చాడు. మందులు వాడుతున్నా విజయ్ ఆరోగ్య పరిస్థితిలో ఏం మార్పు రాలేదు. ఆఫీసుకు వెళ్ళలేనంటూ సెలవు పెట్టాడు. చిన్న చిన్న పనులు చేసుకోవటానికే అలసిపోతున్నాడు. అరుణకు ఏం చెయ్యాలో పాలుపోవటంలేదు. డాక్టర్లు ఆ టెస్టులు, ఈ టస్టులు అని రాస్తూ డబ్బు ఖర్చుపెట్టిస్తున్నారే కాని, అసలు రోగాన్ని కనిపెట్టకలేకపోతున్నారు. అరుణ కజిన్ వినీత ఎంబిబిఎస్ స్టూడెంట్. బావగారి పరిస్థితి తెలిసి హైదరాబాద్‌నుంచి వచ్చింది. తను డాక్టర్ రిపోర్టులన్నీ పరిశీలించింది. కాని తనకూ అసలు విషయం అర్థం కాలేదు. వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. తన ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి విజయ్ పరిస్థితి వివరించింది.
‘‘రిపోర్టులన్నీ నార్మల్ అంటున్నావు. పేషెంట్ చాలా తక్కువ వ్యవధిలో కదలలేని పరిస్థితికి చేరుకున్నాడని చెపుతున్నావు. అంత వేగంగా వృద్ధి చెందేది కాన్సర్ కణాలే! ఒకసారి కాన్సర్‌కు చెందిన టెస్టులు చేయిస్తే అసలు రోగం బయటపడొచ్చు’’ అంటూ సలహానిచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న అరుణ కళ్ళు అభ్రమేఘాలై వర్షించాయి. అక్కకొచ్చిన కష్టానికి వినీత తల్లడిల్లిపోయింది.
‘‘చూడక్కా! కన్నీటికి కాలం ఆగదు. మనం ఆలస్యం చెయ్యకుండా హైదరాబాద్‌కు వెళ్లి టెస్టులు చేయించాలి’’ అంది.
అరుణకు పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై తను ఎన్నోసార్లు తన బాధను విజయ్‌తో చెప్పుకుని విలపించేది.
‘‘పిచ్చిదానా! ఎందుకా కంటతడి. మనకెనే్నళ్ళని, నలభై అయిదేగా! అయినా నాకు నువ్వు, నీకు నేను పిల్లలం కాదా? నన్ను పసిపాప కంటే ప్రేమగా చూసుకుంటున్నావు. ననే్న నీ కొడుకుగా అనుకో అన్నాడు విజయ్. ఆ మాటలు విని అరుణ తనను తాను నిగ్రహించుకోలేక భోరున ఏడ్చేసింది. ఇలాంటి సమయాల్లో ఎదిగొచ్చిన కొడుకుంటే ఎంత అండగా ఉండేది అనుకుని భారంగా నిట్టూర్చింది అరుణ. ఆటో ‘జీవన్ కాన్సర్ హాస్పిటల్స్’ ముందు ఆగింది. వినీత అక్కకు తోడుగా వుండి అన్ని టెస్టులూ చేయించింది. మధ్యాహ్నానికల్లా మెడికల్ రిపోర్టులు వస్తాయని చెప్పారు.
అరుణ మనసు అల్లకల్లోలంగా వుంది. వినీత, తనని ఎంత బ్రతిమిలాడినా ఒక్క ముద్ద కూడా తినలేదు. చివరకు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయ్. విజయ్‌కి ‘లుకేమియా’ అని తేలింది. పదిహేను రోజులు మించి బ్రతకటం కష్టం అని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ వార్త విన్న అరుణ హృదయం ముక్కలైపోయింది. ఎంత హృదయ భారాన్ని తగ్గించుకుందామనుకున్నా ఒక్క చుక్క కన్నీరు కూడా రావటంలేదు. వినీత చేతిలో టెస్టు రిపోర్టు రెపరెపలాడుతోంది. అక్కా చెల్లెళ్ల మధ్య కొంచెం సేపు వౌనం చోటుచేసుకుంది.
‘‘పదహైదు రోజులు మించి బ్రతకటం కష్టం’’ ఈ మాటలే అరుణ చెవిలో పదే పదే వినిపిస్తున్నాయ్. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. బేలగా విలపించటంవల్ల ప్రయోజనం లేదనుకుంది. సత్యవంతుని కాపాడుకున్న సావిత్రి దృఢ సంకల్పం ఏదో ఆమెను ఆవహించింది. విజయ్‌కి లుకేమియా అన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలని అక్కా చెల్లెళ్ళు నిర్ణయించుకున్నారు.
****
విజయ్ పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడనుండి వస్తున్నాయో తెల్ల రక్తకణాలు ఇబ్బడిముబ్బడిగా మృత్యు విహంగాలై శరీరాన్ని పొడుచుకు తింటున్నాయి. నోరంతా అల్సర్స్ వ్యాపించాయ్. ఆహారం తినలేకపోతున్నాడు. పండ్ల రసం కూడా సహించటంలేదని బలవంతంగా తాగుతున్నాడు. పెరిగిన గడ్డం, ఉత్సాహపు ఉనికిని కోల్పోయిన కళ్ళతో మృత్యువు ఆలింగనానికి సిద్ధంగా ఉన్నాడు విజయ్.
ఒకరోజు ‘‘అరుణా! నేనింక ఎక్కువ రోజులు బ్రతకను. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు మనల్ని జలగల్లా పీల్చేస్తాయ్. నేను మరణించాక నువ్వు డబ్బుకోసం అవస్థ పడటం నేను ఊహించుకోలేను. నన్ను మనింటికి తీసుకెళ్ళు’’ అన్నాడు విజయ్.
‘‘అధైర్యపడకండి. బ్లడ్‌లో చిన్న సమస్య అని డాక్టర్లు చెప్పారు. నాలుగైదు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందన్నారు’’ అంటూ ధైర్యం చెప్పింది అరుణ.
‘‘పిచ్చిదానా! నేనేం పసివాణ్ణా? మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన నా స్నేహితుడు నాకెప్పుడో చెప్పాడు. ఇది ప్రాణాంతక వ్యాధి ‘లుకేమియా’ అని. నేను పోతున్నానని బాధలేదు. నిన్ను విడిచి వెళుతున్నాననే దిగులే నన్ను అమితంగా క్రుంగదీస్తోంది’’ జీవం కోల్పోయిన కళ్ళు తుడుచుకుంటూ పలికాడు విజయ్.
ఆ మాటలు విన్న అరుణ అప్రతిభురాలైంది. కంఠంలో అదిమిపెట్టిన దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళు కాసారాలయ్యాయ్. కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ‘‘నిన్ను పోనివ్వనండి. నా ప్రేమ అనే ఔషధంతో బ్రతికించుకుంటాను’’ అంటూ అతని ముఖాన్ని ముద్దాడింది. గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలి స్పర్శకు అతని జీవనాడుల్లో అమృతం నింపినట్లైంది. అతనిలో ఏదో క్రొత్త శక్తి ప్రవేశించింది. గుండె నిండుగా శ్వాస పీల్చుకున్నాడు. ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్నారు. ఎదురుగా కిటికీకి అవతల కుండీలో వున్న ఫెర్న్ మొక్క సూర్య కిరణాలలో మెరుస్తోంది. మరుసటి రోజు విజయ్ మంచంపై బద్ధకంగా పడుకుని వున్నాడు. వద్దంటున్నా అతన్ని కూచోపెట్టి అరుణ తనే విజయ్‌కి షేవ్ చేసింది. తెల్లటి బట్టల్ని తొడిగింది. రెండు ఇడ్లీలను తినిపించి పళ్ళరసం తాగించింది. క్రమం తప్పకుండా మందు బిళ్ళలు ఇచ్చి టానిక్‌ను తాపించింది. తను కాలేజ్ చదివే రోజుల్లో ఇంగ్లీష్ మేడమ్ నిర్మల చెప్పిన ఒక అద్భుతమైన పుస్తకం గుర్తొచ్చింది. డేల్ కార్నెగీ రాసిన ‘‘హౌటు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’’- వినీత చేత బుక్ రిసార్ట్‌నుండి ఆ పుస్తకాన్ని తెప్పించింది. రెండ్రోజులు తనే కొన్ని పేజీలు చదివి వినిపించింది. అంత తీవ్రమైన కష్టాలను ఎదుర్కొని అధిగమించి, అచంచల ఆత్మవిశ్వాసంతో కోలుకుని ఉన్నత దిశగా ప్రయాణం సాగించిన అనేకమంది విధి వంచితుల కథనాలు విజయ్‌కి ఉత్తేజభరితంగా అనిపించాయ్. సింప్లీ సూపర్బ్! ఆ పుస్తకాన్ని రెండుసార్లు చదివేశాడు. పదిరోజులు దాటిపొయ్యాయ్. పేషెంట్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. విజటింగ్ డాక్టర్ అతన్ని పరిశీలించి, కొద్దిగా ఆశ్చర్యపోయాడు. క్యాలెండర్‌లో తేదీలు వెనక్కి వెళ్లిపోతున్నాయ్. ప్రతిరోజూ అరుణ అందించే ప్రేమాదర చుంబనం, సెల్‌ఫోన్‌నుండి తక్కువ శబ్దంతో ఆమె వినిపించే ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, విజయ్‌కి కొత్త శక్తిని అందిస్తున్నాయ్.
***
డాక్టర్లు చెప్పిన పదహైదు రోజులూ దాటిపొయ్యాయ్.
విజయ్‌ని పరీక్షించటానికి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చాడు. అతను వచ్చే సమయానికి విజయ్ ‘హ్యాపినెస్ అండ్ పీస్ ఇన్ ఎవ్రీడే లైఫ్’ అనే పుస్తకాన్ని చదువుతున్నాడు.
‘‘గుడ్ మార్నింగ్ డాక్టర్’’ అంటూ విష్ చేశాడు విజయ్.
‘‘వాట్ మిస్టర్ విజయ్! దిస్ ఈజ్ ఎ మెడికల్ మిరాకిల్. తెల్ల రక్తకణాలతో పోరాటం సాగిస్తూ ఒక పేషెంట్ పదహైదు రోజులు దాటి నార్మల్‌గా కనిపించటం, ఐ కాంట్ జస్ట్ బిలీవ్!’’ అంటూ ఆశ్చర్యపోయాడాయన.
హాస్పిటల్‌లో చేరిన తొలి రోజునుంచీ అతనికి వెన్నంటి వుండి, సపర్యలు చేస్తూ, మనసుకు ఓదార్పు కలిగించే మాటలు చెపుతూ, అండగా నిలిచిన తన అర్థాంగి అరుణను డాక్టర్ అభినందనగా చూశాడు.
‘‘ఓ.కె. మీరు రేపే రిలీవ్ కావచ్చు’’ అని చెప్పాడు.
టాక్సీ నగరపు రణగొణుల ధ్వనుల్ని, వాహనాల రద్దీని దాటుకుంటూ కొద్దిగా ప్రశాంతంగా ఉన్న శివార్లను చేరుకుంది.
ఎక్కడినుండో, టీవీలోంచి ఒక పాట వినిపిస్తోంది.
‘‘దారి చూపిన దేవత
ఈ చేయి ఎన్నడు వీడక
జన్మ జన్మకు తోడుగా
నాదానివై నువు నడచిరా’’- దారి చూపిన
మూడు నెలలైంది.. ఆరు నెలలైంది.. ఏడాది దాటింది. విజయ్ ముఖంలో అదే ప్రశాంతత. హైదరాబాద్‌కు రీ చెకప్ వెళ్లినపుడు, విజయ్‌ని స్పెషలిస్ట్ డాక్టర్ ఒకే ప్రశ్న అడిగాడు ‘‘ఇదెలా సాధ్యమైంది?’’
‘‘ఏమో డాక్టర్, నేను వెళ్లిపోకుండా నా భార్యే అడ్డుకుంది’’ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు విజయ్.
సైన్స్ అనేక విషయాల్లో ఖచ్చితమైనదే కావచ్చు. అది నిజంగా అద్భుతమైనదే. కాని ప్రతి అద్భుతం వెనుకా సైనే్స ఉండకపోవచ్చు. ఈ అద్భుతం వెనుక ప్రేమ ఉంది, అనుబంధం ఉంది, దాంపత్య శక్తి ఉంది అని అనుకున్నాడు డాక్టర్.
*

-తోట శ్రీనివాసరావు, 8977066980

-తోట శ్రీనివాసరావు, 8977066980