ఈ వారం కథ

థాంక్స్.. అమ్మ కోరిక తీరింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజాత వంటిల్లు సర్ది వచ్చి మంచంమీద నడుం వాల్చింది. అప్పటికే మూడేళ్ళ కూతురు చిన్నా ముడుచుకు పడుకుని నిద్రపోతోంది. భర్త రఘు ఆఫీసు పనిమీద విశాఖపట్నం వెళ్ళటంతో చాలాసేపు పుస్తకం చదువుకుంటూ పడుకున్నది.
అప్పుడు సమయం పది దాటి అరగంటయింది. ల్యాండ్‌లైన్ మ్రోగుతుంటే చేయి జాచి టీపాయ్ మీద వున్న ఫోన్‌ను అందుకున్నది, భర్తే చేసి వుంటాడనుకుంటూ ఆత్రంగా. ఆయన వెళ్లి మూడు రోజులే అయినా చూడక చాలా రోజులయినట్లనిపిస్తోంది.
‘‘సుజాతేనా మాట్లాడుతున్నది?’’
అవతల కంఠం కొత్తగా వుండటంతో గుర్తుపట్టలేక, ‘‘ఎవరు మాట్లాడుతున్నది?’’ అన్నది కాస్త నీరసంగా, అది భర్తనుండి కాకపోవటంతో.
‘‘నేను జగన్నాథరావునండి.. అమెరికానుంచి మాట్లాడుతున్నాను.. సుజాతతో మాట్లాడాలి!’’ మాటల్ని తూచి తూచి మాట్లాడుతున్నట్టుగా అన్నాడు అవతల ఆయన చిన్నగా.
‘‘మీరెవరు?’’ గుర్తున్నంతవరకూ అమెరికానుంచల్లా ఫోన్ చేసి మాట్లాడే ఆ పేరున్న పరిచయస్థులు తనకు ఎవరూ లేరు.
‘‘ఆ అమ్మాయి తండ్రిని!.. నేను తెలుసుకోవచ్చా ఎవరు మాట్లాడుతన్నది?’’ అయోమయమయింది సుజాతకు ఆ మాట వింటూనే. తన తండ్రి మాట్లాడమేమిటి? పుట్టిన తరువాత ఇంతవరకూ చూడని ఆయన తనతో మాట్లాడాలనుకోవటం వింతగా తోచింది. కలవరపాటు శరీరాన్ని స్వేదంతో నింపివేస్తోంది. నరాలు వణుకుతున్నాయి. గొంతు మూగబోయింది.
‘‘సుజాత మీకేవౌతుందో నాకు తెలియదు గాని.. ఒక్కసారి ఆ అమ్మాయిని పిలుస్తారా?’’ ఆ మాటల్లో మృదుత్వం ఆమె ఆందోళనమీద మంచు కురిపిస్తున్నది.
గొంతు పెగుల్చుకుని గొణుగుతున్నట్లుగా, ‘‘సుజాతనే మాట్లాడుతున్నాను’’ అన్నది.
ఆ మాట వింటూనే అవతల కంఠం ఉద్విగ్నతకు లోనయింది. ‘‘అమ్మా! నేను నువ్వెన్నడూ ఇంతవరకూ చూడని నీ తండ్రినమ్మా!’’ జీరబోయింది ఆ కంఠం. ‘‘ఈ క్షణాన నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురి కంఠాన్ని వినటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదమ్మా!’’ ఆవేశంగా అంటున్న ఆయన మాటలకు విభ్రాంతి చెందింది సుజాత.
మాట్లాడలేదు.
‘‘అమ్మ ఎప్పుడూ నా గురించి చెప్పలేదా?’’
సుజాతకు ఏం మాట్లాడాలో తెలియటంలేదు. ఇంతకాలానికి తను పుట్టిన ముప్ఫయి సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్న ఆయన...
ఆయన ప్రశ్నను దాటవేస్తున్నట్లుగా, ‘‘చెప్పండి!’’ అన్నది అతి కష్టంమీద నోరు తెరిచి కోలుకున్నట్లుగా.
‘‘రెండు నెలల క్రితం మీ తాతగారు పోయారమ్మా!’’
‘‘తెలుసు.. అక్కడ అప్పుడు కార్యక్రమాలు నిర్వహించవలసిన మీరు రాకపోయినా.. నేనంటే ఎంతో ఆప్యాయత చూపే తాతయ్యను చివరిసారిగా చూడటానికి వెళ్లాను!’’ నుదురు ముడివేస్తూ అన్నది- ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చిందా అన్నట్లుగా సంశయిస్తూ.. ఆమె సమాధానానికి నోరు బిగుసుకుపోయినట్లుగా అతడు కొద్ది క్షణాలపాటు మాట్లాడలేకపోయాడు.
‘‘తొంభై ఆరో సంవత్సరంలో కాలుపెట్టిన ఆయన ఎవరికీ చిటికంత ఇబ్బంది కలిగించకుండా వెళ్లిపోయారు.. ఎంతో అదృష్టవంతుడు!’’ తండ్రి పోయాడనే బాధ ఆయన కంఠాన్ని కించిత్ తడుపుతున్నట్లే అనిపించింది.
తాతయ్య తమింటికి అప్పుడప్పుడూ వస్తుండేవారు తను చిన్న పిల్లగా ఉన్నప్పటినుంచి. తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుండేవారు. అవీ ఇవీ కొనుక్కొస్తుండేవారు. తనను తీసుకుని తమింటికి వచ్చి వెళ్ళమంటూ వచ్చినపుడల్లా చెబుతుండేవారు అమ్మతో. తామయితే ఎప్పుడూ వెళ్ళలేదు. అమ్మకు వాళ్ళింటికి వెళ్ళటం అంతగా ఇష్టం లేదని తనకు తెలుసు..
‘మీరేమీ అనుకోవద్దు మామయ్యగారూ! ఆ ఇంటితో నాకు ఋణం తీరిపోయింది.. నన్ను బలవంతం చేయవద్దు!’
కానీ నాలుగు సంవత్సరాల క్రితం బామ్మ పోయినపుడు మర్యాదకు వెళ్లి రావాలని అనుకున్నది గాని, ఆ సమయంలోనే తనకు బాగా జ్వరం రావటంతో ఒంటరిగా వదిలి వెళ్లలేకపోయింది.
‘‘ఆయన పోయిన సంగతి నీకెలా తెలిసిందమ్మా!’’
‘‘బాబాయి ఫోన్ చేసి చెప్పాడండి!’’
తిరిగి మరల ఇద్దరి నడుమా కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం.
‘‘నువ్వెలా వున్నావమ్మా!’’ అడిగాడు తరువాత ఆయనే గొంతు పెగల్చుకుని.
‘‘బాగానే ఉన్నానండి!’’ అమ్మ ఎలా వున్నదని అడుగుతాడేమోనని అనుకున్నదిగాని అడగలేదు. ‘ఆమె పోయిన విషయం తెలియకుండా ఉండి ఉంటుందా, తాతయ్య చెప్పకుండా ఉంటారా.. తెలిసే ఉంటుంది.. లేకపోతే ఇప్పుడు ఆమెకే ఫోన్ చేసి వుండేవాడు కదా.. ఒకవేళ ఈమధ్యే తెలిసి తనను ఓదార్చటానికి ఫోన్ చేయటం లేదు గదా!’ అన్న అనుమానమొచ్చింది.
తనకు తెలిసినంత వరకూ అమ్మే అప్పుడప్పుడూ ఆయన్ను తల్చుకుంటూ, ఎక్కడో పాత ట్రంకు పెట్టెలో వున్న ఆరునెలల సంసార జీవితంలో తామిద్దరూ కలిసి తీయించుకున్న ఓ ఫొటోను తీసి చూసుకుంటుండేది.
తన తల్లికి ఆయన ఎంతో అన్యాయం చేశాడనే విషయం గుర్తుకురాగా, ‘‘తాతగారు పోయినప్పుడు నాకంటే గూడా అమ్మ ఎక్కువగా బాధపడి ఉండేదేమోగాని, అప్పటికే ఆమె వెళ్లిపోయింది!’’ అన్నది ఆమె పోవటాన్ని ఇంకా తను జీర్ణించుకోలేక పోతున్నానన్నట్లుగా బాధాతప్త కంఠంతో.
పెళ్ళయిన ఆరునెలలకే వదిలేసిన ఆమె పోవటం ఆయన్ను పెద్దగా కలవరపరుస్తుందని తను అనుకోదు.
‘‘తెలుసు! జానకి పోయిందని నానే్న ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు!’’
ఆ మాటకు సుజాత మనసు విలవిలలాడింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న భార్య పోయినా సరైన స్పందన లేని ఆయన మాటలు వినటం ఆమె మనస్సుకు బాధ కలిగించింది.
అమ్మ చనిపోవటానికి వారం రోజులు ముందు అన్నది. ‘‘నాకెందుకో ఈ చివరి రోజుల్లో ఆయనతో మాట్లాడి, ఒక్కసారి నిన్ను- ఇది మీ కూతురుండీ అని చూపించాలని వున్నదే!’’ అని అంటే ‘మనం కాదనుకుని వెళ్లిపోయినవాళ్ళు మనల్ని వచ్చి చూడాలనుకోవటం ఎంత అవివేకం?’ అన్నది నవ్వుతూ తను.
‘నీకు తెలియదు.. ఆయన మనల్ని మరిచిపోయాడని అనుకోవటమే మన అవివేకం.. మన గురించి ప్రతి చిన్న విషయం ఆయన తెలుసుకుంటున్నారని నాకు తెలుసు!’ అన్నది పేలవపు నవ్వుతో.
‘మరి ఇండియా వచ్చినపుడన్నా ఆరు నెలలు కాపురం చేసిన ఈ భార్యామణిని ఒక్కసారి మురిపెంగా పలకరించి వెళ్లవచ్చుగదా!’ ఎగతాళిగా అన్నది.
‘మన ఇంటికి రావటానికి ముఖం చెల్లకపోయివుండవచ్చు’ తల్లి నిర్లిప్తంగా అన్నా.. మనస్సులో బాధపడుతుండటమే కాదు- తన భర్తను ఎవరూ- కూతురయినా సరే- నిర్లక్ష్యంగామాట్లాడటం సహించలేదని గ్రహించింది తను.
‘ఆ నీ అమాయకత్వమే నిన్ను నిలువునా ముంచిందిగాని మాట్లాడకుండా పడుకో!’
తల్లిపోతే, తన భర్త అన్నీ తనే అయి ఆమె అంతిమయాత్రను నిర్వర్తించాడు.
‘‘చెప్పండి.. దేనికోసం ఫోన్ చేశారు ఇప్పుడు?’’ అన్నది, జీవితంలో ఆయన మూలంగా అన్యాయయమయిపోయి మోడులా బ్రతికిన తల్లి రూపం కళ్ళముందు కదులుతుండగా కాస్త అసహనంగా.
ఆయన సమాధానం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లుగా ఆగింది.
‘‘నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలని ఫోన్ చేశానమ్మా!’’ మాటల్లో తడబాటు స్పష్టంగా కనబడుతున్నది.
‘‘దేనికి?’’’
‘‘అదేవిటి.. నా కూతురు యోగక్షేమాలు తెలుసుకోవాలనుకోవటంలో తప్పేమున్నది!’’
నవ్వు వచ్చింది సుజాతకు. తన తల్లిని పెళ్లి చేసుకొన్న కొద్దికాలానికే అమెరికా వెళ్లిపోయాడని, తిరిగి ఇండియాకురాలేదని, అక్కడే ఎవరో దొరసానిని వివాహం చేసుకుని స్థిర నివాసమేర్పరచుకున్నాడని అమ్మ ఎప్పడయినా తన కొద్దికాలపు సంసార జీవితాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ చెబుతుండేది.. ఆ సమయమే ఆమె జీవితంలో వెయ్యి దీపాల వెలుగు నింపినట్లుగా తన్మయంగా.
వెళ్లిన కొత్తల్లో రెండు రోజులకొకసారి ఫోన్ చేసేవాడట.. తరువాత వారానికి.. ఆ తరువాత నెలకు.. సంవత్సరంలో తిరిగి వస్తానని వెళ్లి ఆయన సంవత్సరం తరువాత ఫోన్ చేయటం కూడా మానివేశాడు.
చదివిన చదువుకు, చదివిన స్కూల్లోనే తండ్రికి తెలిసిన వారి ద్వారా గుమాస్తాగా ఇప్పిస్తే జేరింది తనను కన్న సంవత్సరానికి అమ్మ! బ్రతికి వున్నందుకు జీవితం గడవాలిగా మరి.. అప్పటినుంచి తమ ఇంట్లో ఇద్దరే సభ్యులు.. తరువాత తరచూ వస్తుండే తాతయ్యలు, అమ్మమ్మ, మామయ్యలు.. బామ్మ ఒకటి రెండుసార్లు వచ్చిందేమో అంతగా గుర్తుకురావటంలేదు.
‘‘నేను మీ అమ్మకూ, నీకూ చేసిన అన్యాయానికి నాలో నామీద బాగా కోపం వుండి వుండవచ్చు!’’
‘‘ఆప్యాయతలు, కోపాలు ఉండేది తెలిసిన మనుషుల నడుమే!’’ ఆయన మాటల్ని కత్తిరిస్తున్నట్లుగా అన్నది.
ఆ మాటకు మనస్సు చివుక్కుమనిపించగా అతి కష్టంమీద నోరు పెగల్చుకుని, ‘‘నిజమే.. నిజమే!’’ అన్నాడు జగన్నాథరావు తత్తరపాటుతో. ‘‘నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికి లభించిందని అనుకుంటున్నాను.. జానకికి ఏమీ చేయలేకపోవచ్చు.. నీకైనా!’’ అంటూ శ్వాసపీల్చుకోవటానికి అన్నట్లుగా ఆగాడు.
‘‘ఎలా?’’ అన్నది సమయం పదకొండు చూపబోతున్న గోడ గడియారం వంక చూస్తూ.
‘‘తాతయ్య పోయారు గనుక నాకూ మా తమ్ముడికీ నడుమ ఆస్తుల పంపకాలు జరిగినయి.. నేను ఇక ఇండియాకు వచ్చే ప్రసక్తే లేదు.. అందులో కొంత నీకిద్దామని!’’ అన్నాడు త్వరత్వరగా.
ఆయన మాటలకు సుజాత ఆవేశానికి లోనయింది.
‘‘అమ్మా నాన్నా డబ్బుకు ఇబ్బంది పడకుండా బ్రతికున్నంతకాలం ప్రతినెలా డాలర్లు పంపిస్తూ ఉండేవాడిని!’’ త్వరత్వరగా అన్నాడు. ‘‘గుంటూరులో వున్న పెద్ద ఇంటిని పూర్తిగా మీ బాబాయికి ఇచ్చేద్దామనుకుంటున్నాను!.. వాడికి నలుగురు పిల్లలున్నారు కాబట్టి అది వాడికెంతో ఉపయోగకరంగా వుంటుంది. ఇక మిగిలిన నా భాగంగా వచ్చిన రెండెకరాల పొలాన్ని నీకిద్దామని!’’
‘‘అయితే ఆరు నెలలు మీ సహచరణిగా వెలగబెట్టిన మా అమ్మ ఋణాన్ని కూడా తీర్చేద్దామనుకుంటున్నారన్నమాట!’’ అన్నది కంఠాన్ని కాస్తంత హెచ్చింది ఎగతాళిగా.
‘‘అవును.. ఆమె కూతురిగా నీకిస్తున్నదాంతో ఆమె ఋణం తీరినట్లే కదా?’’ కూతురు ఎగతాళిని గుర్తించానన్నట్లుగా అన్నాడు.
పకపకా నవ్వింది సుజాత. ‘‘మీరు నన్ను ఆమె కూతురే అన్నారంటే మీ కూతురుగా గుర్తించటం లేదన్నమాటేగా!’’
జగన్నాథరావు తడబడ్డాడు. కూతురు చాలా తెలివిగలది!
‘‘అందరి ఋణాలు తీర్చేసుకుంటున్న మీ మంచితనాన్ని, మీ దాతృత్వాన్ని ఎలాంటివారైనా మెచ్చుకోవాల్సిందే.. కానీ నాక్కొటే అనుమానం.. బాంధవ్యపు ఋణాలు డబ్బుతో తీరుతయ్యా అని!’’
‘‘కానీ, నాకు అంతకుమించిన దారి మరొకటేమున్నది?’’
ఆమెకు చర్రున కోపమొచ్చింది. ‘‘అభిమానంతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో...!’’ ఇక కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది.
‘‘అవన్నీ ఉంటేనే గదా మనం ఎవరికైనా డబ్బు ఇవ్వగలిగేది.. ఇపుడు నేనిద్దామనుకుంటున్న రెండెకరాలు ఆంధ్రప్రదేశ్ కొత్తగా నిర్మించుకోబోతున్న రాజధాని పరిసరాలల్లో ఉన్నది.. దాని విలువ ఎంతో తెలుసా.. రెండు కోట్లు.. అది ఒక మనిషి సంపాదించాలంటే, ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎంతకాలం పడుతుందో ఊహించగలవా?’’’ అన్నాడు కాస్త గీరగా, ‘‘దాన్ని నా రక్తం పంచుకు పుట్టిన కూతురుగా నీకిద్దామని!’’
‘‘నాకు ఒక్కటి చెప్పండి.. మనిషి మగగాని, ఆడగాని వివాహం ఎందుకు చేసుకుంటారు?’’
‘‘మన పెద్దలు అలాంటి జీవన విధానాన్ని ఏర్పరిచారు గనుక!’’
‘‘అంటే అందులో మన స్వార్థం ఏమీ లేదంటారు!’’
‘‘ఎలా లేదంటాను.. ప్రకృతి కోరికలు తీర్చుకోవాలనుకోవటం స్వార్థంలో భాగమే కదా!’’
‘‘అంటే పవిత్రమయిన మంత్రాల నడుమ మూడు ముళ్ళూ వేసి, ఆ స్ర్తికి జీవితాంతం అండగా ఉంటానని మాట ఇచ్చినందుకే, ఆమె గర్భంలో నాకు బీజమేసి ఋణం తీర్చుకున్నారన్నమాట.. ఫైన్!’’ అన్నది పకపకా నవ్వుతూ.
అతడికి అర్థమయింది కూతురు తన తల్లిని, తనని పట్టించుకోకుండా వదిలివేసినందుకుగాను బాగా కోపంతో ఉన్నదని.
‘‘సుజాతా! ఎకసెక్కాలు వద్దు.. ఇన్ని సంవత్సరాలయినా మిమ్మల్ని మర్చిపోకుండా కోట్లు విలువ చేసే ఆస్తిని ఇవ్వటానికి ముందుకు వస్తున్నానంటే నన్ను చూసి నువ్వు సంతోషపడాలి, గర్వపడాలి!’’
‘‘సంతానాన్ని కని భార్యను, కన్నవాళ్ళని గాలికి వదిలేయటం గర్వపడాల్సిన విషయం కాదు జగన్నాథరావుగారూ!.. ఏ తండ్రయినా గర్వపడవలసింది కన్నవాళ్ళను తీర్చిదిద్ది, సమాజంలో ప్రయోజకులుగా చేసినపుడే.. అదే తండ్రిగా బాధ్యత నెరవేర్చటమంటే.. అప్పుడే ఆ వ్యక్తిని చూసి కన్న పిల్లలూ గర్వపడేది.. నేను గర్వపడుతున్నది నన్ను ఇలా తీర్చిదిద్దిన మా అమ్మను తలుచుకుని గాని, ఎవరో, ఏమిటో తెలియని మిమ్మల్ని గుర్తుకుతెచ్చుకుంటూ కాదు!’’ అని అంటూనే, ‘‘నా గురించి గాని మీ ఊళ్ళోని మీ ఆస్తిని గురించి గాని అనవసరంగా హైరాన పడబోకండి.. బాంధవ్యాలను డబ్బుతో నిలుపుకోవానుకోవటం హేయం.. మీ ఆలోచనకు మీతో ఆరు నెలలు సంసారం చేసి చనిపోయిన మా అమ్మ అయితే ఎలా స్పందించేదో నాకు తెలియదు కాని, నేను మాత్రం మీ నుండి ఒక్క పైసా తీసుకోను!... నాకు అమ్మయినా, నాన్నయినా ఒక్కరే!’’’ చాలా దృఢంగా అన్నది.
సుజాత మాటలకి బిత్తరపోయాడు జగన్నాథరావు.
కోపంతో కుతకుతలాడిపోతున్న సుజాత అసహనంతో గొంతు హెచ్చించింది. ‘‘మీరు ఈనాడు నాకిస్తానంటున్న ఈ ఆస్తి మీ స్వార్జితం కాదని గుర్తించుకోండి. మా తాతగారి నుండి సంక్రమించింది. అవునా?.. అందులో సహజంగా నాకూ హక్కుంటుంది. నిజంగా నాకు కావాలీ అనుకుంటే కోర్టుకైనా వెళ్లి సాధించుకోగలను!’’ అన్నది కంఠాన్ని కఠినంగా మార్చి. ‘‘చెప్పాను కదా.. మీ కుటుంబం నుంచి వచ్చేదేదయినా నాకు తృణప్రాయమే!’’
జగన్నాథరావుకు రోషమొచ్చింది. కోపమొచ్చింది సుజాత మాటలకు.
‘‘నా భర్త నన్ను పువ్వులమీద నడిపిస్తున్నాడు.. నాకు పుట్టిన పిల్లను ఇద్దరం అత్యున్నతమైన ఆప్యాయతతో పెంచి పెద్ద చేస్తున్నాం.. సంస్కారానికి, నిబద్ధతకు ప్రాణం పెట్టే మా అమ్మ ఎన్నుకున్న వ్యక్తి నా భర్త!’’ గర్వంగా అన్నది.
‘‘తెలివితక్కువగాను, పొగరుబోతుగాను మాట్లాడబోకు’’ కూతురుమీద కోపం గుండెల్లోనుంచి ఎగతన్నుతుండగా అన్నాడు.
‘‘కొన్ని నిజాలు ఎప్పుడూ గుండెల్ని గాయపరుస్తునే ఉంటాయి జగన్నాథరావుగారూ!.. మా అమ్మ బ్రతికున్న చివరి క్షణాలలో కూడా మీరు ఒక్కసారి కనబడితే చూసి సంతృప్తిపడాలనుకున్నది. మీ వలన కన్న నన్ను మీకు చూపించాలని ఆరాటపడింది.. కానీ ఆమె గుండెల్లో గూడుకట్టుకున్న ఆ కోరిక తీరకుండానే ఆమె వెళ్లిపోయింది’’.
అటు ఫోను పట్టుకుని వున్న జగన్నాథరావు కళ్ళు మూసుకున్నాడు.
‘‘ఆమె ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది’’ కావాలని మరోసారి అన్నది. ‘‘ఎప్పటికయినా ఇలా మనం మాట్లాడుకుంటామని ఆమె ఊహించి ఉండదు.. అమ్మ ఆత్మ ఇక్కడే తిరుగుతుంటే ఈ క్షణాలను చూసి తప్పకుండా ఎంతో తృప్తిచెంది మిమ్మల్ని ఋణవిముక్తుల్ని చేస్తుంది.. ఆమె తృప్తే నాకు కోట్లు విలువ చేసే ఆనందాన్ని కలిగిస్తుంది.. అది చాలు.. మీనుండి ఒక్క పైసా నాకు అక్కరలేదు.. గుడ్‌నైట్!’’ రిసీవర్ని క్రెడిల్ చేసేసింది సుజాత అమ్మ రూపం కళ్ళముందు కదులుతుండగా. *

రచయిత ఫోన్ నెం:040-23713835

-పి.ఎస్.నారాయణ, 040-23713835