సబ్ ఫీచర్

గురు ముఖత నేర్చుకున్నదే విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విద్య అయినా గురుముఖత నేర్చుకోవాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. దేశంలో అందరూ ఆఘమేఘాలమీద విద్యావంతులై పోవాలని మన ప్రభుత్వం అత్యాశతో విద్యనేర్పడానికి అనేక సంప్రదాయేతర విధానాలను ప్రవేశపెట్టింది. ముందుగా వయోజన విద్య ప్రారంభమైంది. ఇది రాత్రివేళ జరిగేది. తరువాత కొంతకాలానికి రద్దయింది. తిరిగి ఈ శతాబ్ది ప్రారంభంలో పెద్ద యెత్తున ప్రారంభించారు. ప్రతి గ్రామంలోను వయోజన విద్యాకేంద్రాలు వెలిశాయి. పర్యవేక్షకులను కూడా నియమించారు. ఇది కూడా విజయవంతం కాలేదు. ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటో తెలియదు. ఈ రెండిటికి మధ్య అనియత విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంగ్లీషులో దీన్ని ‘నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్’ అన్నారు. ఇది 1980వ దశకంలో ప్రారంభమైంది. ఇందుకు బోధకులను పర్యవేక్షకులను నియమించి శాశ్వత పద్ధతిలో నడపాలని ప్రయత్నం చేశారు. అదికూడా తగిన స్పందన లేక రద్దయింది. ఇటీవల ఓపెన్ స్కూల్ విధానం మొదలైంది. ఈ కేంద్రాలు ఏవో మొక్కుబడిగా సాగుతున్నాయి. వీటిపై కొన్నిచోట్ల అధికార్లు అసంతృప్తి చెందారు.
దూరవిద్య అనే మరొక విధానం ప్రవేశించింది. ఇది గురువుల ద్వారా అభ్యసించేది కాదని పేరునుబట్టే తెలుస్తున్నది. ఈ పద్ధతి ప్రకారం ఎవరైనా పదవతవరగతి నుండి ఎం.ఎ. వరకు ఏ పరీక్షకైనా హాజరు కావచ్చు. వీరికి అప్పుడప్పుడు కొన్ని కేంద్రాలలో ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇస్తారు. స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తారు. ఇలాంటి పద్ధతిలో చదువు ఎక్కడ ఉంది? చదువంటే ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడమే కాబోలు. ముందుముందు ఇంజనీరింగ్ వైద్యం వంటి విద్యలకు కూడా ప్రైవేటు విధానంలో అవకాశం కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాఠశాలలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్న వారి ప్రమాణాలే ఇప్పుడు దిగజారిపోయాయి. ఇంక ఇలాంటి చదువులలో ప్రమాణాలు ఎలా ఉంటాయి? అందరికి చదువు అంటే అందరూ ఎంఎ చదవాలా? అక్షరాస్యత చాలు. అనగా పటిష్టమైన ప్రాథమిక మరియు సెకండరీ విద్య చాలును.
చదువు ఇంటివద్దకే రావాలని కోరుకోకూడదు. అందుకు కొంత దూరం అవసరమైతే వెళ్లాలి. శ్రమకు ఓర్చాలి గురుముఖత అభ్యాసం చేయాలి. అదియే సరియైన విధానం. పూర్వం ఇంజనీరింగు విద్యకి మద్రాసు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లేవారు. న్యాయవిద్య విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఉండేది. ఇప్పుడు అన్నిరకాల విద్యాలయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పల్లె ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కనుక ప్రమాణాలు పెరగడానికి సాంప్రదాయ విద్యా విధానమే శ్రేష్టమైనది. ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు విధిగా ఉండాలి. ముందుప్రాథమిక విద్య అందరికీ అందేలా చేస్తే చాలును. అందువల్ల అందరూ అక్షరాస్యులు అవుతారు. 6-11 వయసు గల పిల్లలందరిని పాఠశాలల్లో చేర్చాలి. కొందరిని వివిధ కారణాల వల్ల చేర్చలేము. అందుకు కారణాలు అనే్వషించి తగిన పద్ధతుల ద్వారా వారిని కూడాక్రమంగా చేర్చాలి. ఈ పని నిదానంగా జరగాలి. ఇందువలన అందరూ అక్షరాస్యులు అవుతారు. తరవాత ఏవరికి అనుకూలమైన విద్య వారు అభ్యసించవచ్చును.
ఐదవ తరగతి అర్హత పరీక్ష తప్పనిసరి చేయాలి. తెలుగు భాషను సరిగా రాయలేకపోతున్న పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఏమిటి? ఈ పద్ధతి తొలగించాలి. ఈ పద్ధతి తొలగించి ఇంగ్లీషు ఒక భాషగా నేర్పాలి. విద్యాలయాలలో క్రమశిక్షణ పూర్తిగా లోపించింది. హాస్టళ్లు ధర్మసత్రాలుగా తయారయ్యాయి. వాటిలో అనేక అసాంఘిక కార్యకలాపాలు మితిమీరిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ బీఫ్ పార్టీలు. మాంసం తింటున్నామని మనదేశంలో ఎవరూ బాహాటంగా ప్రకటించరు. నేటికి కొందరు నిరక్షరాస్యులు శనివారం మాంసం ముట్టరు. బ్రిటిష్ వారసత్వమైన ఈ హాస్టలు విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పినప్పుడు ర్యాగింగ్ వంటి దుర్మార్గాలు కూడా తొలగిపోతాయి. ఇంజనీరింగ్, వైద్యం వంటి రంగాలలో అనర్హులు ప్రవేశిస్తున్నారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్నారు. ఇలాంటి రంగాలలో అసమర్ధులు ప్రవేశిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించండి. ప్రభుత్వ ఉదాసీన విధానాల వల్ల అనేక విద్యాలయాలు పుట్టగొడుగుల్లా బయలుదేరుతున్నాయి. తగిన వసతులు పరికరాలు మొదలైనవి లేకుండా మెడికల్ కళాశాలలు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు మంజూరు అవుతున్నాయి. వీటిపైని నియంత్రణ లేకుండా పోయింది. ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయాల వరకు వ్యాపార ధోరణితో సాగుతున్నాయి.
ఉద్యోగాలు ఇవ్వడానికి రిజర్వేషన్లు పాటించవచ్చు. కాని నిజర్వేషన్ల పేరుతో తక్కువ మార్కులు వచ్చినవారికి రాయితీలు కల్పించి పెద్ద చదువులకి అవకాశం ఇస్తున్నారు. ఈ పద్ధతి తొలగించాలి. ప్రాథమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనేక నూతన పద్ధతులు వివిధ శిక్షణల వల్ల నేడు ప్రాథమిక విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. వివిధ సర్వేలు ఈ విషయం వెల్లడించాయి. ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెరగడానికి బోధన మరియు వాచక రచనా విధానం సంప్రదాయ రీతిలో ఉండాలి. పుస్తకాలన్నీ రంగుల చిత్రాలతో నింపివేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రమాణాలు బాగుండడానికి విద్యాశాఖ పటిష్టంగా ఉండాలి. గత ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వం దీనిని కోర్టుల పాలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు విద్యాశాఖకు అనుకూలంగా వెలువడినా అమలు జరగడం లేదు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరిని విద్యాశాఖాధికార్లు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కనుక ఐటిడిఏ యొక్క పురపాలకు సంఘాల యొక్క ఎయిడెడ్ సంస్థల తాలూకు ఉపాధ్యాయులు కూడా పంచాయితీ రాజ్ ఉపాధ్యాయులకు కల్పించే సౌకర్యాలు తమకు కూడా కలిగించాలని ఉద్యమబాట పడతారు. మళ్లీ వ్యాజ్యాలు ప్రారంభమవుతాయి. తిరిగి అప్పీళ్లు. ఇది ఒక అంతుపట్టని కథ. కనుక విద్యాప్రమాణాలు ఇంకా దిగజారడం తథ్యం.

- వేదుల సత్యనారాయణ సెల్: 9618396071