ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సీపీఎం పుంజుకోగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా పార్టీ సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించినంత కా లం వామపక్షాలకు మోక్షం లేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ప్లీనంలో లోతు గా ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ వ్యవస్థల్లో సమూల మార్పులు చేయటంలోనూ,వ్యూహాన్ని మార్చుకోవటంలో సీపీఎం విఫలమైంది. జాతీయ రాజకీయ ముఖ చిత్రంతోపాటు తమకు పెట్టని కోటగా ఉండిన పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా సీపీఎం మరుగున పడిపోయే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితికి దారి తీసిన పరిస్థితులను నిర్దారించి పరిష్కార మార్గాలను ప్లీనంలో రూపొందించలేకపోయారు.
వామపక్షాల మధ్య సమైక్యత సాధించటం ద్వారా గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని నిర్ణయించటం సమర్థనీయమే కానీ సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేది బూడిద మాత్రమే అనే వాస్తవాన్ని వామపక్షాలు గుర్తించిన సూచనలు కనిపించటం లేదు. విద్యా, ఉపాధి అవకాశాలు పెరిగి కొద్ది యువత వామపక్షాలకు దూరమైపోతోంది. యువతతోపాటు రైతు లు, దళిత, బడుగు,బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజలు కూడా వామపక్షాలకు దూరమైపోయారు. వామపక్షాలు సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించి మిగతా వర్గాలను దూరం చేసుకోవటం వల్లనే సీపీఎంకు ఈ దుర్గతి పట్టింది. సీపీఎం అధినాయకత్వం ఇలాంటి పలు ముఖ్యమైన అంశాలపై ఎందుకు దృష్టి సారించలేదనేది అర్థం కావట లేదు.
వామపక్షాలు మొదట్లో దేశంలోని పలు ప్రాంతాల్లోకి విస్తరించిన ఆ తరువాత కొంత కాలానికి అవి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకే పరిమితమై పోయాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో కూడా సీపీఎం తదితర వామపక్షాలు అధికారం కోల్పోయి రాజకీయ నిర్జనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వామపక్షాలు పక్క రాష్ట్రంలో కూడా ఎదగలేకపోయాయి. కేరళలో పలు సంవత్సరాల పాటు అధికారం చెలాయించినా పక్క రాష్ట్రాల్లో కాలు మోపలేకపోయాయి. అవిభాజిత ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వామపక్షాలు పుంజుకునేందుకు మంచి అవకాశాలుండినాయి. కానీ ఈ రాష్ట్రాల్లో కూడా వామపక్షాలు ఎదగలేకపోయాయి. తెలంగాణాలో సాయుధ విప్లవాన్ని నిర్వహించిన వామపక్షాలు ఒకప్పుడు ఎంత బలంగా ఉండేవనేది అందరికి తెలిసిందే. అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో ఒక శక్తిగా ఉండిని వామపక్షాలు ఆ తరువాత ప్రాంతీయ పార్టీల భుజాలెక్కి బతకవలసి వచ్చింది. ఎందుకిలా జరిగిందని వామపక్షాలు ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజలకు దూరం అవుతున్నా పట్టించుకోకుండా క్యాపిటలజిం, ఇంపీరియలిజం అంటూ వూకదంపుడు ఉపన్యాసాలతో కాలం వెళ్లబుచ్చారు తప్ప వాస్తవాలను అర్థం చేసుకోలేకపోయారు.
సమాజంలోని పలు వర్గాలకు తాము ప్రాతినిధ్యం వహించట లేదని ఇప్పుడు ప్లీనంలో బాధ పడితే లాభం ఏమిటి? కాంగ్రెస్, భాజపా వంటి జాతీయ పార్టీలతోపాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా సమాజంలోని బడుగు,బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అప్రకటిత కోటా విధానాన్ని పాటించినా వామపక్షాలు మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి. కాంగ్రెస్, బి.జె.పితో పాటు పలు ప్రాంతయ పార్టీలు వెనుకబడని కులాలు, బడుగు,బలహీన వర్గాలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించలేకపోయినా కొంతైనా కల్పించాయనేది నిజం. వామపక్ష పార్టీలలో బడుగ,బలహీనవర్గాలకు ఇంత మాత్రం ప్రాతినిధ్యం కూడా లభించలేదనే ఆరోపణ వినిపిస్తోంది. బడుగు,బలహీన వర్గాలు, పీడిత ప్రజలు, శ్రామిక వర్గం అభ్యున్నతి తమ లక్ష్యమని చెప్పుకునే వామపక్షాలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవటం మంచిది. పార్టీ నాయకత్వంలో మహిళలు,దళితులు,యువతకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి, వీలుంటే పది శాతం కోటా ఇవ్వాలనే ప్రతిపాదనను ఇప్పుడు పరిశీలించటం వలన ఆశించిన లాభం కలుగుతుందా?
సీపీఎం ప్రజలకే కాదు కార్యకర్తలకు సైతం దూరమైపోయిందనే ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఆరోపణ నుండి బైట పటాలంటే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కోల్‌కతా ప్లీనంలో ఆశించిన తీవ్రమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు కాబట్టి సీపీఎం పరిస్థితి ఇప్పుడిప్పుడే బాగుపడుతుందని ఆశించలేం. సామ్యవాదం, లౌకికవాదం వంటే నినాదాలు ఇప్పుడు పని చేయటం లేదనే వాస్తవాన్ని సీపీఎం ఇప్పటికైనా గ్రహించటం మంచిది. కులం ఆధారంగా పని చేస్తున్న అవకాశవాద ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పాలన కొనసాగిస్తున్న ఇతర పార్టీలకు దూరంగా ఉండాలని సీపీఎం నిర్ణయించుకోవటం సమర్థనీయమే. అయితే కులతత్వం, మతతత్వాన్ని పరోక్షంగా పాటిస్తున్న జాతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోకూడదు. కుహనా లౌకికవాదాన్ని పాటించటం కూడా మంచిది కాదనే వాస్తవాన్ని సీపీఎం గ్రహించటం మంచిది.
గత లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులను విశే్లషిస్తూ కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ.కె.ఆంథోని చేసిన వ్యాఖ్యలను గుణ పాఠం నేర్చుకోవలసిన బాధ్యత సీపీఎంఅధినాయకత్వంపై ఉన్నది. మెజారిటీ హిందువులను దూరం చేసుకోవటం వలన కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని ఆంథోని అభిప్రాయపడటం తెలిసిందే. బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్‌ను విమర్శిస్తూ కాలం వెళ్లబుచ్చే బదులు దేశ ప్రజలకు ఆచరణీయ ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రతిపాదించి చిత్తశుద్దితో పని చేయటం వల్లనే సీపీఎం గత వైభవాన్ని తిరిగి సాధించుకోగలదు. గత లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్‌కు ఎందుకు పట్టం కట్టారనేది అధినాయకత్వం అర్థం చేసుకుంటే సీపీఎం బాగుపడుతుంది.