మిర్చిమసాలా

ఇదే రాజకీయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం ఉండవన్నది నిజమే. ఏపిలో ఇప్పటికే 21 మంది వైకాపా ఎమ్మెల్యేలు రాజకీయ వైరం వీడి అధికార టిడిపిలో చేరారు. ప్రస్తుతం శాసనసభ ప్రసారాలను టీవీల్లో వీక్షించే వారికి అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన తీరును చూసి వీరంతా ఆగర్భ శత్రువులని అనుకుంటారు. అదే పొరబాటు. ఒక్కసారి నేరుగా గ్యాలరీ నుంచి చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. సభ వాయిదా పడిన సమయాల్లో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎమ్మెల్యేలు పక్కపక్కనే కూర్చొని ఎంతో అప్యాయంగా ముచ్చట్లు చెప్పుకోవటం చూస్తుంటే ‘ఔరా’ అనిపించక మానదు.
- నిమ్మరాజు చలపతిరావు

మళ్లీ చెప్పాలా?
అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయాలని విపక్షం విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఐతే, తెలంగాణ శాసనసభలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంత్రులు ఇచ్చే సమాధానాలతో విపక్ష సభ్యులు విలవిలలాడుతున్నారు. పరిశ్రమల అభివృద్ధిపై దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన మంత్రి కెటిఆర్ గణాంకాలు మళ్లీ చెప్పాలా? అని నిలదీయగానే అధికార, విపక్ష సభ్యుల్లో నవ్వులు విరిశాయి. కెటిఆర్ మాటలతో విపక్ష సభ్యులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మంత్రులు మాత్రం తమ సమాధానాలతో విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనేది సభలో ఉన్న వారి మాట.
- బివి ప్రసాద్

నేనే నెంబర్ వన్..
ఏ విషయంలోనైనా ‘నంబర్ వన్’ అని చెప్పుకోవడం ఏపి సిఎం చంద్రబాబుకు అలవాటు. తాజాగా అసెంబ్లీ సమావేశంలో- ‘అవినీతిలో, అభివృద్ధిలో మనమే నంబర్ వన్’ అని ఆయన అనడంతో టిడిపి సభ్యులు విస్తుపోయారు. సర్దిచెప్పే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అసెంబ్లీ రికార్డుల్లోకి ‘అవినీతి రికార్డు’ ఎక్కిపోయింది. ఆ మధ్య ఓ సంస్థ చేసిన సర్వేలో ‘అవినీతిలో నంబర్ వన్‌గా ఏపి నిలించిందని’ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసేది. స్వయంగా చంద్రబాబే ఈ మాట అనడంతో టీవీ చానళ్లు హడావుడి చేశాయి. మరుసటి రోజు ఏదో పొరపాటున ఆ మాట అన్నానని బాబు చెప్పుకున్నారు.
- మురళి

ఇక్కడ చర్చ.. అక్కడ రచ్చ
తెలంగాణ అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చలు జరుగుతుండగా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం ఉన్నా, అది అక్కడివరకే పరిమితం. ఇక, ఏపి అసెంబ్లీని చూస్తే కురుక్షేత్ర సంగ్రామం గుర్తుకువస్తోంది. ఇంతవరకూ ఒక అంశంపైనా సరైన చర్చ జరగలేదు. అధికార, విపక్ష పార్టీల వైఖరితో కాలహరణం జరుగుతోంది. తెలంగాణను చూసైనా ఏపి అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నేర్చుకుంటే బాగుంటుదేమోనని ప్రజాస్వామ్య ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
- శైలేంద్ర

బాహుబలి కోసం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక బాహుబలి, మరో యోగి రాబోతున్నా రు! అదేమిటా అని తెగ ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ సిఎల్‌పి నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ చ్చే ఎన్నికల్లో త మకు విజయం సా ధించి పెట్టేందుకు ఓ బాహుబలి వస్తునట్టు ప్రకటించారు. ఆ మాట ఆ నోటా ఈ నోటా వెళ్ళి చివరకు బాహుబలి ఎవరా? అని పార్టీ నేతలంతా తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, తెలంగాణకు మరో యోగి (యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్) రాబోతున్నారనగానే, టిఆర్‌ఎస్ సభ్యులు యోగి కాదు భోగి వస్తారంటూ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వుల జల్లు కురిసింది.
- వి.ఈశ్వర్ రెడ్డి