వీరాజీయం

జయమ్మ సుస్తీ.. అందరి బెంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడుకి ఇంచుమించు ‘అమ్మనాడు’ అన్నది పర్యాయపదం అయిపోయింది. ‘అమ్మ’ అంటే అక్కడ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి జయలలితని ఆమె మంత్రివర్గ సహచరులు మొదలు కాయకష్టం చేసుకునే కడుపేదల వరకూ అందరూ ‘అమ్మ’ అనే రిఫర్ చేస్తారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో దిగంగానే- అమ్మ ఇడ్లీ, పూరీ, పొంగల్ తినేసి, అమ్మ మినరల్ వాటర్‌ని దాహం తీరా సేవించితే గానీ ‘జర్నీ’ సార్థకం కాదు. జయ మకుటం లేని మహారాణి- ‘ఎంగెయిరిక్కార్?’ అంటే- ఎక్కడున్నారు? ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో వున్నది.
అరవై ఎనిమిది సంవత్సరాల జె.జయలలితకు ఆ రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు ‘జేజే’లు కొడుతూనే వుంటారు. పదవిలో వున్నా, జైలులో కటికనేలమీద శయనించి వున్నా- జయలలితమ్మ కోసం అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి పట్టే జనాలు- ‘అమ్మమాట’ ‘తమ బాట’ అనుకునే అభిమాన జనాలు ఆమెకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఆమెకొక రికార్డు. అక్కడ నెంబర్ ‘టూ’ కూడా ఎవరూ లేని ఏకచ్ఛత్రాధిపత్యం ఆమెది. సెప్టెంబర్ 22న అమ్మకి జ్వరం వచ్చినందున అపోలో ఆస్పత్రిలో చేరవల్సి వచ్చింది. కావేరీ నదీ జలాల వివాదం- ఉప్పెన రీతి చెలరేగిన సమయంలో ఆమె అస్వస్థతకు గురైంది. మొత్తం మీద కావేరీ జలాలను తమిళనాడుకి కొంతలో కొంత ఇస్తామని కర్నాటక అంగీకరించిన తరుణంలో- జనమంతా ‘యిది అమ్మ మహిమ’ అంటూ కీర్తించారు. ఇప్పుడు ఈ ‘జనమాత’ ఊపిరాడని స్థితిలో మృత్యువుతో పోరాడుతున్నది.
అత్యధిక సంఖ్యాకులు దేవాలయాలలో పూజలు చేస్తుంటే-వందలాది మంది ఆసుపత్రి గేటు ముందు ప్రార్ధనలు చేస్తూ చతికిలబడి పోయారు. అవతల గవర్నమెంటు నడక ‘బాగానే’ సాగుతూ ఉంది. ఇవతల లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు, ఢిల్లీ ఎయిమ్స్ నుండి వచ్చిన మరో నలుగురు డాక్టర్లు -హృద్రోగం మొదలు ఊపిరి తిత్తుల వ్యాధుల దాకా- ఉబ్బసం మొదలు మధుమేహం దాకా అన్ని రోగాలు నివారించగల నిష్ణాతులు తమిళనాడు ప్రజల ఇష్టదేవతకు నిర్విరామ చికిత్యా శుశ్రూషలు చేస్తున్నారు.
జనాలలో అలనాటి పాత వారు చెప్పినదాన్ని బట్టి- 30 ఏళ్ల క్రితం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ వ్యాధిగ్రస్తుడై ఆసుపత్రిలో చేరిన దృశ్యాలు ముప్పిరి గొంటున్నాయి. నాడు ఎంజిఆర్‌కు జయలలిత బాసట ఉన్నది. ఎవరు వద్దన్నా, కాదన్నా ఆమె అతని చెంతనే ఉన్నది. అతని అంతిమయాత్ర శకటం మీదనుంచి ఆమెను కిందకి త్రోసేశారు ప్రత్యర్థులు. ఇవాళ్టికీ అదే ఎంజి రామచంద్రన్ పార్టీనీ, పేరునీ జయలలితమ్మ కాపాడుకొస్తున్నది. అది ఒక పార్శ్వం.
మరోవైపు- ఆస్పత్రిలో ఉన్న అమ్మకు బదులు.. ఆమె బాధ్యతలు ఏ మంత్రికీ ఇవ్వలేదు. ఆరుగురు సభ్యులు- అందరూ కార్యదర్శి స్థాయి ‘బ్యూరోక్రాట్‌లే’గల కమిటీ- లా అండ్ ఆర్డర్ మొదలు రాజకీయ పటిష్టత దాకా అన్ని సంగతులూ ‘అమ్మే’ పేరిట చూసుకుంటోంది. ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం వున్న చోట- ఇన్‌చార్జి ముఖ్యమంత్రి లేకపోవడం- డిఎంకె అధినేత కరుణానిధికి ఓపిక లేకపోయినా వృద్ధ వ్యాఘ్రంలా గాండ్రించడానికి అవకాశం ఇచ్చింది.
‘ఆమె ఎలా వున్నదో ప్రజాహితం కోసం- సాక్ష్యాధారాలతో బయట పెట్టండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. ‘ఇది ఒక పబ్లిసిటీ స్టంట్’ అంటూ ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆదిలోనే కొట్టిపారేసినప్పటికీ న్యాయస్థానం పూనిక మీద- ‘అమ్మ’ కృత్రిమ శ్వాస ఆసరాతో అత్యవసర చికిత్సా విభాగంలో- పోరాటం సాగిస్తున్నది’-అని లోకానికి వెల్లడి అయింది. ‘ఎవ్వరికీ అనుమతి లేదు’ అన్నచోట జయలలితమ్మ ప్రయివేటు సలహాదారుగా వేసుకున్న మాజీ ఐఎఎస్ అధికారిణి షీలా భాస్కరన్ ఒక్కరికే అన్ని అధికారాలు అనధికారికంగా ఉన్నాయి. ఆమె మాటకి మంత్రులయినా, మామూలు ఉద్యోగస్తులయినా తలలూచి నడుచుకుంటున్నా, అమ్మ ఆరోగ్య పరామర్శ పేరిట షీలమ్మ దగ్గర ఆదేశాలు అందుకుంటున్నారు. ఆఖరికి లోగడ రెండు పర్యాయాలు- ‘అందాకా కూర్చో..’ అని జయ తన సీట్లో కూర్చోబెట్టిన పన్నీర్ సెల్వన్ (ఇప్పుడు మంత్రి గాదు)కు కూడా ఏమీ ‘వాయిస్’ లేదు. పరిపాలన స్తంభించిందని ప్రతిపక్ష డిఎంకెలో ఆందోళన అందరికన్నా ఎక్కువైంది. ‘ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రినయినా నియమించాలి లేదా రాష్టప్రతి పాలనకు విజ్ఞప్తులు పంపండి’-అన్న సణుగుడు ఎక్కువై అది క్రమంగా ‘డిమాండ్’గా మారింది.
చికిత్సకు ‘అమ్మ’ సహకరిస్తున్నది. కోలుకుంటున్నది. కనుక ఇక ఫోటోలు విడుదల చెయ్యం- అంటున్నారు. వైద్యుల ప్రకటన మాత్రం వెలువడింది. జయలలిత 68వ ఏట కూడా, తన 18వ ఏట - ‘మనుషులు-మమతలు’ అనే తెలుగుసినిమాలో నటించినప్పటి గ్లామర్‌తోనే వెలుగుతోంది. అనితర సాధ్యమైన జనాకర్షణ కలిగి ఉన్నది. జైలులో వున్నా, లిటిగేషన్‌లో వున్నా, సకలాభరణాలు ధరించి వున్నా- బోసిమెడతో, ఆకుచెప్పులతో వున్నా-అంతులేని పోరాటం సాగించిన అసాధారణ వ్యక్తిత్వం ఆమెది. కటిక నేలమీద జైలులో శయనించడానికి తనకు ఏ మాత్రం సంకోచం లేదు సరే-అదే కటిక నేలమీద ప్రతిపక్ష నాయకుడు కరుణానిధినీ కూడా శయనింపచేయడానికి కూడా ఆమెకు సంకోచం లేదు.
‘ఒక సుబ్రమణ్య స్వామి కాదు.. వందమంది కరుణానిధులను కలుపుకుని మరో వంద మంది సుబ్రమణ్యాలు వచ్చినా మా ‘అమ్మ’కి లెక్కలేదు’ అనే జనాలు, ఆమె ఏం చేసినా పేదల కోసమే అని విశ్వసించే ప్రజానీకం ఆమె సొత్తు. ఆమె బలం అదే! ఆసుపత్రికి అకస్మాత్తుగా పోయే ముందామె- పేదల కోసం పదకొండు ‘అమ్మ కల్యాణ మండపాల’ నిర్మాణం గురించి ప్రకటించి జేజేలందుకున్నది. ఆమె కోలుకొని స్వస్థురాలై తిరిగి వస్తుందని జనం అందరికీ నమ్మకం!
యస్! హెర్ లైఫ్ హాజ్ బీన్ ఎ ‘సాగా’!