సంపాదకీయం

నైరోబీలో సంపన్న తంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికాలోని కెన్యాదేశం రాజధాని నైరోబీలో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం తీవ్రమైన ఆర్థిక వైరుధ్యాలకు ఆలవాలం కావడం ఆశ్చర్యకరం కాదు. ప్రవర్ధమాన దేశాల పేద దేశాల ప్రయోజనాలకు భిన్నంగా సంపన్న దేశాలు దోహా వాణిజ్య ప్రక్రియ కొనసాగిస్తుండడమే ఇందుకు కారణం. విప్లవాత్మకమైన పరిణామాలు హఠాత్తుగా సంభవిస్తే తప్ప నైరోబీ సమావేశంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయే అవకాశం లేదు. ఖతార్ రాజధాని దోహాలో కుదిరిన ‘ఒప్పందం’ వాస్తవరూపం ధరించకుండా ఏళ్ల తరబడి అడ్డుపడిన సంపన్న దేశాలు ఇప్పుడు ప్రక్రియను అర్థాంతరంగా పరిసమాప్తం చేయడానికి యత్నిస్తుండడం కూడ ఆశ్చర్యకరం కాదు. వర్ధమాన దేశాలకు అనుకూలంగా దోహా ఒప్పందం ప్రక్రియలు అమలు జరుగవలసిన వాణిజ్య నిబంధనలను నీరుకార్చడం సంపన్న దేశాల లక్ష్యం. అందువల్ల దోహా ప్రక్రియలోని అంశాలను పక్కకు పెట్టి కొత్త అంశాలను నైరోబీ సదస్సులో చర్చించడానికి సంపన్న దేశాలు చేస్తున్న ప్రయత్నం ప్రతిష్ఠంభానికి కారణం. ఇలా దోహా ప్రక్రియను పక్కదారి పట్టించి ఒప్పందాన్ని నీరు కార్చడానికి సంపన్న దేశాలు చేస్తున్న ప్రయత్నాన్ని మనదేశం సహా వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి. నలబయి ఎనిమిది వర్ధమాన, వెనుకబడిన దేశాల కూటమి సంపన్నుల పన్నాగాన్ని ప్రతిఘటిస్తుండడంతో ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు గురువారం సన్నగిల్లిపోయాయి. అగ్ర రాజ్యాల, సంపన్న దేశాల మాటతప్పిన వైఖరి మన వాణిజ్య మంత్రి సీతారామన్ బుధవారం చేసిన ప్రసంగంలో తేటతెల్లమైంది. 2001లో మొదలైన దోహా ప్రక్రియలోని ప్రధాన అంశాలన్నింటినీ నైరోబీ సదస్సు ధ్రువీకరించాలన్నది సదస్సులో అమె చేసిన ప్రసంగంలోని ఇతివృత్తం. దోహా ప్రక్రియ వర్ధమాన దేశాలకు పేద దేశాలకు కల్పించిన ప్రత్యేక భద్రతా వాణిజ్య వ్యవస్థను రద్దు చేయడానికి నైరోబీ సదస్సు సందర్భంగా సంపన్న దేశాలు యత్నిస్తున్నాయి. అంతేకాక సంపన్న దేశాలలో వ్యవసాయ రంగానికి లభిస్తున్న రాయితీలను క్రమంగా తగ్గించాలన్న దోహా స్ఫూర్తిని సైతం నైరోబీలో సంపన్న దేశాలు నీరుకార్చాయని నిర్మలమ్మ చేసిన నిర్ధారణ. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాలలో సబ్సిడీలను తగ్గించాలన్న కొత్త అంశాన్ని నైరోబీలో ప్రధాన సమస్యగా మార్చడానికి ధనిక దేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. గురువారం వెలువడిన సమావేశం ముసాయిదా తీర్మానం సంపన్నుల అభీష్టానికి ప్రతిబింబం కావడం ప్రతిష్టంభానికి కారణం. మనదేశం సహా వివిధ వర్ధమాన దేశాలు ఈ ముసాయిదాను వ్యతిరేకించడం గురువారం నాటి స్థితి. ప్యారిస్‌లో కుదిరిన పర్యావరణ ఒప్పందం తరహాలో నైరోబీ వాణిజ్య ఒప్పందానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా తుది రూపునివ్వాలన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ అధినేత రాబర్టో అఝెవెడో సూచిస్తున్న రాజీ మార్గం.
మనదేశం అనుసరిస్తున్న స్వతంత్ర విధానం మన రైతుల నిరుపేదల ప్రయోజనాలను నిలబెట్టేదానికి దోహదం చేస్తోంది. నైరోబీ సదస్సులో భారత్ తమకు కొరకరాని కొయ్యగా మారనున్నదని సదస్సుకు ముందే అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానించింది కూడ. ‘ఆహార భద్రత’ పథకాన్ని అమలు జరిపితీరుతామన్న మన ప్రభుత్వ దృఢ నిశ్చయం, వ్యవసాయ సబ్సిడీలను కొనసాగించాలన్న పట్టుదల అమెరికా వంటి సంపన్న దేశాలకు నచ్చని వ్యవహారం. ఇలా నచ్చనందువల్లనే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మనదేశానికి అమెరికా సహకరించడం లేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్యలో మనదేశానికి భాగస్వామ్యం కల్పించాలన్న ప్రతిపాదనను గతంలో సమర్ధించిన అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అంత ఉత్సాహం చూపడంలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థతో తమ అధిపత్యాన్ని మన దేశం ప్రతిఘటిస్తుండడం ఇందుకు కారణం. 1989లో ఏర్పడిన ఈ వాణిజ్య ఆర్థిక సమాఖ్యలో ఆసియాలోని ఇతర ప్రముఖ దేశాలైన రష్యా, చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు సభ్యత్వం ఉంది. థాయ్‌లాండ్, ఇండొనేసియా వంటి వర్ధమాన దేశాలకు సైతం సభ్యత్వం ఉంది. కానీ మనదేశానికి సభ్యత్వం లభించడం లేదు. చైనా నడిపిన తెరవెనుక నాటకం ఇందుకు కారణం. ఇటీవలి కాలంలో చైనా, రష్యాలు మరింత సన్నిహితంగా మారడం మనకు వ్యతిరేకంగా సంభవించిన వాణిజ్య విపరిణామం. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య-అపెక్-లో మన దేశానికి సభ్యత్వాన్ని కల్పించడానికి గత జనవరిలో అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్‌లో నిర్మలా సీతారామన్ అమెరికాకు వెళ్లినప్పుడు కూడ ఈ సంగతి ప్రస్తావనకు వచ్చింది. అపెక్‌లో చేరినట్లయితే ఆసియా పసిఫిక్ దేశాల స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థలో కూడ మనకు భాగస్వామ్యం లభిస్తుందట. ప్యారిస్ పర్యావరణ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాతో మన ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చలలో కూడ అపెక్ సభ్యత్వం ప్రస్తావనకు వచ్చిందట. కానీ అమెరికా ఇప్పుడు మొండి చేతిని ప్రదర్శిస్తోందనడానికి కారణం ప్రపంచ వాణిజ్య సంస్థలో మన స్వతంత్ర వైఖరి...
సంపన్న దేశాలనుంచి వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు,పరికరాలు భారీగా వర్థమాన దేశాలకు దిగుమతి అవుతున్నాయి. సంపన్న దేశాల ప్రభుత్వాలు తమ వ్యవసాయ రంగానికి కల్పిస్తున్న భారీ రాయితీలకు కారణం ఆ దేశాలలోని వ్యవసాయావసర పదార్ధాల ధరలు, ఉపకరణాల ధరలు, వ్యవసాయోత్పత్తుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మనదేశం వర్ధమాన దేశాలలోని వ్యవసాయ ఉత్పత్తులు ఎరువులు, పరికరాలు, సంపన్నుల ఉత్పత్తులతో పోటీ పడలేకపోతున్నాయి. సంపన్న దేశాలనుంచి దిగుమతులు వర్ధమాన దేశాలను ముంచెత్తుతున్నాయి. ఈ దిగుమతుల కారణంగా వర్ధమాన వాణిజ్యం లోటు పెరిగిపోతున్నది.. వైపరీత్య ప్రభావాన్ని తగ్గించడానికి వీలుగా ప్రత్యేక భద్రతా వ్యవస్థ-ఎస్‌ఎస్‌ఎమ్-ఏర్పాటైంది. దోహా ప్రక్రియలో భాగంగా ఏర్పడిన ఎస్‌ఎస్‌ఎమ్ ప్రాతిపదికగా వర్ధమాన దేశాల ప్రభుత్వాలు దిగుమతులపై సుంకాలను పెంచవచ్చు. ఈ వ్యవస్థను రద్దు చేయాలన్నది సంపన్న దేశాల అభీష్టం. వర్ధమాన దేశాల ప్రభుత్వాల దిగుమతులపై సుంకాలను పెంచితే తమ దేశాలనుంచి ఎగుమతి అవుతున్న వ్యవసాయ సంబంధ వస్తువుల ధరలు పెరుగుతాయి. గిరాకీ తగ్గుతుంది. ఇదీ సంపన్నుల భయం. తమ దేశాలలో వ్యవసాయ రంగానికి భారీగా సబ్సిడీలను ఇస్తున్న సంపన్న దేశాల ప్రభుత్వాలు వర్ధమాన దేశాలలో మాత్రం ప్రభుత్వాలు ఇలాంటి సబ్సిడీలను రద్దు చేయాలని కోరుతున్నాయి. సబ్సిడీ వల్ల ఉత్పాదకాల, ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ విపణిలో ఎప్పుడూ వర్ధమాన దేశాల వస్తువులకంటె తమ వస్తువుల ధరలు తక్కువగా ఉండాలన్నదే సంపన్న దేశాల లక్ష్యం.
నైరోబీ ప్రతిష్టంభానికి ఇది నేపథ్యం. వ్యయసాయ రంగాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధి నుంచి పూర్తిగా తప్పించాలన్నది మనదేశంలోని స్వదేశీయ ఉద్యమకారుల లక్ష్యం. మన వ్యవసాయ రంగాన్ని విదేశీయ సంస్థలు దోపిడీ చేయకుండా నిరోధించడానికి అది ఏకైక మార్గం.