సంపాదకీయం

ఆర్భాటానికి అంతరాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విట్జర్లాండ్‌కు చెందిన నెజల్-నెస్లే-వారి వాణిజ్య దురాక్రమణకు బుధవారంనాటి సర్వోన్నత న్యాయ నిర్ణయం నిరోధకంగా మారడం హర్షణీయం! ముంబయి హైకోర్టు వారి ఉత్తర్వు ప్రాతిపదికగా మళ్లీ పెద్దఎత్తున మాగీ సేమ్యాలతో మార్కెట్‌లన్నీ ముంచెత్తడానికి నెజల్ సంస్థ యాజమాన్యం చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు అవరోధం ఏర్పడింది! మాగీ సేమ్యాలను మరోసారి అధీకృత ప్రయోగశాలలలో పరీక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో ఈ పరీక్షలు పూర్తయ్యేవరకు వినియోగదారులకు మాగీ సేమ్యాల బెడద తప్పినట్టే! మోనోసోడియం గ్లుటమేట్-ఎమ్‌ఎస్‌జి అన్న రసాయనంతో మాగీ సేమ్యాలు కల్తీ కావడం గత జూన్‌నుంచి నడుస్తున్న వివాదానికి కారణం!ఈ సేమ్యాలలో అనుమతించిన పరిమాణం కంటె మించి సీసం చేరి ఉండడం జూన్‌లో జరిగిన పరీక్షలలో బయటపడిన మరో వాస్తవం. ఈ రెండు కారణాల ప్రాతిపదికగా ఆహార భద్రత, ప్రమాణాల భారత సంస్థ-్ఫడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- వారు మాగీసేమ్యాలను జూన్ ఐదవ తేదీన నిషేధించారు! ఈ కల్తీ సేమ్యాలను అమ్మిన నెజల్ కంపెనీ వారు దాదాపు ఆరువందల నలబయి కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వారు ఆగస్టులో జాతీయ వినియోగ వివాద పరిష్కారమండలి-నేషనల్ కన్జూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్-ఎన్‌సిడిఆర్‌సిలో దావా వేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారి ప్రయోగశాలలలో పరీక్షలు జరిపే విధానాన్ని ముంబయి హైకోర్టు తప్పుపట్టింది. అందువల్ల మాగీ సేమ్యాలను మరో మూడు గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో పరీక్షించాలన్నది హైకోర్టు చేసిన నిర్ధారణ! మాగీ సేమ్యాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విధించిన నిషేధాన్ని కూడ హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా మూడు ప్రయోగశాలలలో జరిగే పరీక్షల ఫలితాల ప్రాతిపదికగా మాగీ సేమ్యాలను మళ్లీ విక్రయించుకోవచ్చునన్నది హైకోర్టు చేసిన నిర్ధారణ. ఈ పరీక్షలలో తమ మాగీ సేమ్యాలు స్వచ్ఛమైనవని నిరపాయకరమైనవని నిగ్గుతేలినట్టు నెజల్ సంస్థ వారు గత నెలలో ప్రకటించారు. అయితే మూడు ప్రయోగశాలల పరీక్షల ఫలితాలను ముంబయి హైకోర్టు వారు ధ్రువీకరించినట్టు మాత్రం సమాచారం లేదు. ఈ ఫలితాల ప్రాతిపదికపై మాగీ సేమ్యాలను నెజల్ వారు నవంబర్‌లో మళ్లీ మార్కెట్లకు విడుదల చేసారు. ఈ విడుదల సందర్భంగా జరిగిన ఆర్భాటం అంతా ఇంతా కాదు! మొదటి రోజుననే వేలాది ప్యాకెట్లు సేమ్యాలు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరిగింది. మళ్లీ పరీక్షలు జరపాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం నిర్ధారించడం ఈ ఆర్భాటానికి గొప్ప అంతరాయం...
మాగీ సేమ్యాలపై విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ముంబయి హైకోర్టు చెప్పిన తీర్పును ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు వెంటనే సర్వోన్నత న్యాయస్థానంలో ఎందుకని సవాలు చేయలేదు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆగస్టులో ముంబయి హైకోర్టు తీర్పు వెలువడినప్పటికీ నవంబర్ వరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు వౌనంగా ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం వారు నోరు మెదపలేదు! ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న స్వతంత్ర శాసకీయ సంస్థ! అందువల్ల అప్పీలు దాఖలు చేయవలసిందిగా ఈ కేంద్ర మంత్రిత్వ శాఖవారు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని కోరి వుండవచ్చు కోరలేదు! నవంబర్‌లో మాగీ సేమ్యాలను మళ్లీ అమ్ముతున్నట్టు నెజల్ కంపెనీవారు ప్రకటించిన సమయంలో మాత్రమే ఆహార భద్రత, ప్రమాణాల సంస్థవారు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసారు. అయితే బొంబాయి హైకోర్టు రద్దు చేసిన నిషేధాన్ని రద్దు చేయమని మాత్రం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కోరలేదు. తమ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పద్ధతి లోపభూయిష్టంగా వుందన్న హైకోర్టు వ్యాఖ్యలను రద్దు చేయాలని మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు తమ అప్పీలులో సుప్రీంకోర్టునకు నివేదించారట! విచిత్రమైన పరిణామం...హైకోర్టు వారి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు వారు రద్దు చేయడం మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారికి కావలసింది. మాగీసేమ్యాలు మళ్లీ దేశ ప్రజలను ముంచెత్తనప్పటికీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి అభ్యంతరం లేదు. అలాంటప్పుడు జూన్‌లో ఎందుకని ఈ సేమ్యాలను నిషేధించినట్టు?
హైకోర్టులో తీర్పు వెలువడుతున్న సమయంలోనే నష్టపరిహారం గురించి వినియోగ వివాద పరిష్కార మండలిలో కేంద్ర ప్రభుత్వం దావా వేసింది. మాగీ సేమ్యాల పదహారు నమూనాలను పరీక్ష చేయాలని పరిష్కార మండలి ఆదేశించింది. ఈ ఆదేశాలు అక్టోబర్ 15న జారీ అయ్యే నాటికి హైకోర్టు ఆదేశాల ప్రాతిపదికగా జరిగిన మూడింటిలో మొదటి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా రెండు ప్రయోగశాలల ఫలితాలు వెల్లడి కాకముందే నెజల్ వారు చంకలెగరేసి అంతా తమకు అనుకూలంగా జరిగినట్టు ఆర్భాటించారు! వినియోగదారుల వివాద పరిష్కార మండలి వారి డిసెంబర్ 9నాటి ఆదేశాలు అందువల్ల నెజల్‌కు నచ్చలేదు. ఇలా పదహారు నమూనాలను మళ్లీ పరీక్షలు జరిపినట్టయితే ఏమవుతుందో ఏమో? అందువల్ల మండలి ఆదేశాలను సవాలు చేస్తూ నెజల్‌వారు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసారు. ముంబాయి హైకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థవారు దాఖలు చేసిన అప్పీలును, నెజల్ వారి అప్పీలును కలిపివేసి ఒకే వివాదంగా విచారించాలని సుప్రీంకోర్టు మంగళవారం నిర్ధారించింది. మళ్లీ పరీక్షలు జరపాలని బుధవారం ఆదేశించింది! ఇలా రెండు వివాదాలను సుప్రీంకోర్టు ఒకేవివాదంగా పరిగణించడం వినియోగదారులకు మేలు చేకూర్చగల పరిణామం. సేమ్యాలలో ఎమ్‌ఎస్‌జి, సీసం ఉన్నట్టు కొత్త పరీక్షలలో ధ్రువపడినట్టయితే వాటిపై నిషేధం యధాపూర్వంగా కొనసాగడానికి అవకాశం ఉంది! విడివిడిగా రెండు వివాదాలను విచారించినట్టయితే కొత్త పరీక్షలు బహుశా నష్టపరిహారం నిర్ధారణకు మాత్రమే పరిమితం అయి ఉండేవి!
నెజల్ బహుళ జాతీయ వాణిజ్య సంస్థ వారు ఏళ్ల తరబడి అధిక ధరలకు సేమ్యాలను అమ్మి ఈ దేశ ప్రజలను దోచిపారేశారు. ఒకే పరిమాణంలోని సేమ్యాలను స్వదేశీయ సంస్థలకంటె చాలా ఎక్కువ ధరలకు నెజల్ వారు అమ్మేశారు. సేమ్యాలను మాత్రమే కాదు అనేక ఆహార పదార్ధాలను నెజల్ వారు మితిమీరిన ధరలకు మన దేశంలో అమ్ముతున్నారు. ఉదాహరణకు శిశువులకు అవసరమైన పాలపొడి ధర! స్వదేశీయ సంస్థల పాలపొడి కంటె నెజల్ వారి పాలపొడి ధర రెట్టింపు మాత్రమే! తమ సేమ్యాలలో కల్తీ లేదన్న నెజల్ వారి ఆర్భాటం నిజమైతే వినియోగమండలి ఉత్తరువులపై అప్పీలు ఎందుకు దాఖలు చేశారు? ఎన్ని నమూనాలను ఎక్కడ ఎప్పుడు పరీక్షించినా కూడ కల్తీ లేదని ధ్రువపడాలి కదా!