సంపాదకీయం

‘పంచాయతీ’కి విద్యార్హత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవ తరగతి అయినా ‘పాస్’ కాని వారికి అట్టడుగు స్థాయి పరిపాలనలో పాలు పంచుకునే హక్కు లేదన్నది సుప్రీంకోర్టు చేసిన నిర్ధారణ! ఈ సర్వోన్నత న్యాయ నిర్ణయం విచిత్రంగా ఉంటున్నప్పటికీ గ్రామీణ అక్షరాస్యతను పెంపొందించడానికి దోహదం చేయవచ్చు! పంచాయతీ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నించే వారికి కనీసపు వయసు మాత్రమే ఇంతవరకు అర్హతగా ఉండేది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరో అర్హతను నిర్దేశించింది. అది కనీసపు విద్యార్హత! ఇలా కనీసపు విద్యార్హతను నిర్దేశించడం వల్ల ఆ స్థాయి వరకు విద్యనభ్యసించలేనివారు, అభ్యసించలేకపోయినవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. ఇలా కనీసపు విద్యార్హతను నిర్దేశించడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధం కాదా? రాజ్యాంగపు పదునాలుగవ అధికరణంలో నిర్దేశించిన ‘సమానత్వాని’కి విరుద్ధం కాదా? అన్నవి తలెత్తిన ప్రశ్నలు! ‘కాదు..’ అని డిసెంబర్ 10వతేదీ నిర్ధారించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం హర్యానా ‘చట్టాన్ని’ సమర్ధించింది. అయితే ‘సమానత్వం’ గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘మీమాంస’ మొదలుకావడానికి సైతం ఈ సర్వోన్నత న్యాయ నిర్ణయం దోహదం చేస్తోంది! పదవ తరగతి వరకు విద్యనభ్యసించలేని వారి గతేమిటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది ఇప్పుడు ప్రభుత్వం. పదునాలుగు ఏళ్లవరకు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను నేర్చుకునే ప్రాధమిక అధికారం ఇప్పుడుంది. ‘విద్యనేర్చుకునే హక్కు‘ను ప్రాధమిక రాజ్యాంగ అధికారంగా నిర్దేశిస్తూ పార్లమెంటు చట్టం చేసింది! అందువల్ల ప్రతి ఒక్కరు పదునాలుగవ ఏడు వచ్చేసరికి ఎనిమిదవ లేదా తొమ్మిదవ తరగతి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ఆ తరువాత ‘మెట్రిక్యులేషన్’ లేదా పదవ తరగతి వరకు చదవడం-ఒకటి రెండేళ్లలో-పెద్ద సమస్య కాదు! ‘పంచ్’-ప్రాదేశిక సభ్యుడు-వార్డ్ మెంబర్-లు ‘సర్‌పంచ్’ను ఎన్నుకోవడం పరోక్ష పద్ధతి! వోటర్లు ‘పంచ్’లను ఎన్నుకుంటారు. వోటర్లు అందరూ నేరుగా ‘సర్‌పంచ్’ను ఎన్నుకోవడం ‘ప్రత్యక్ష పంచాయతీ ప్రజాస్వామ్య’ విధానం. హర్యానా ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టం ‘పంచ్’ పదవికి పోటీ చేసే సాధారణ అభ్యర్థులకు, మహిళలకు, అనుసూచిత కులాల-షెడ్యూల్డ్ కాస్ట్స్ వారికి విభిన్నరీతిలో కనీసపు విద్యార్హతను నిర్దేశించారు. ‘పంచ్’గా ‘సర్‌పంచ్’గా పోటీ చేయదలచిన సాధారణ తరగతి అభ్యర్థి పదవ తరగతి వరకు చదివి ఉండాలి. మహిళా అభ్యుర్థులు కనీసం ఎనిమిదవ తరగతి వరకు చదువుకుని ఉండాలి! అనుసూచిత కులాల అభ్యర్థులు కనీసం ఎనిమిదవ తరగతి వరకు, ఈ కులాలకు చెందిన మహిళా అభ్యర్థులు ఐదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి ఉండాలట! ‘నిర్బంధోచిత విద్యార్జన’ హక్కు వాస్తవంగా మారి అమలు జరిగితే వోటర్లందరికీ ఈ కనీసపు అర్హతలు లభించడం అసాధ్యం కాదు. కానీ ఆ చట్టం ప్రచారానికి మాత్రమే పరిమితమైపోతే రెండు వర్గాల వోటర్లు కొనసాగడం ఖాయం!
ఒకవర్గం వోటర్లు కేవలం వోటు మాత్రమే వేయడానికి అర్హులు. మరో వర్గంవారు వోటు వేయగలరు, పోటీ చేయగలరు! హర్యానాలో ఈ ‘వైపరీత్యం’ తక్షణమే దాపురించింది. ఎందుకంటే అనుసూచిత కులాలకు చెందినవారిలో నలబయి ఒక్క శాతం పురుషులు ఎనిమిదవ తరగతి వరకు చదవలేదు. వీరు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయజాలరు. అనుసూచిత కులాలకు చెందిన మహిళలలో అరవై ఎనిమిది శాతం ఐదవ తరగతి వరకు చదవలేదు. అందువల్ల వీరు కూడా అనర్హులే! ఎన్నికలలో పోటీ చేయడం సంగతి ఎలా ఉన్నప్పటికీ హర్యానాలోని అనుసూచిత కులాలలో ఇంత తక్కువ శాతం ప్రాథమిక విద్యనేర్చిన వారు ఉండడమే మన ప్రజాస్వామ్య వ్యవస్థను నిలదీస్తున్న వైపరీత్యం. అందువల్లనే హర్యానా చట్టాన్ని ముగ్గురు మహిళలు న్యాయస్థానంలో సవాలు చేసారు. విద్యార్హత లేదన్న కారణంగా ఈ ముగ్గురికీ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు కలగలేదు. ఏమయినప్పటికీ కనీసపు విద్యార్హత ప్రాతిపదికగా ఇలా ‘రెండు వర్గాల వోటర్లు’ ఏర్పడడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, అభయ్ మనోహర్ సమర్థించారు. ఇలా విద్యార్హతను నిర్ణయించడం ‘అతార్కికం’ కాని ‘శాసన వ్యతిరేకం’ కాని కాదని, ఇది ‘అసంబద్ధమైన’ నియమం కాదని వారు స్పష్టం చేసారు. విద్యార్జన వల్ల అభ్యర్థులు పంచాయతీ పాలనలో విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలు కలుగుతుందన్నది న్యాయమూర్తులు చేసిన నిర్ధారణ.
హర్యానా రాష్ట్రంలో ఇలాంటి కనీసపు విద్యానిబంధన పంచాయతీ ఎన్నికలకు ఏర్పడినప్పుడు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఎందుకని ఏర్పడరాదన్న మీమాంస కూడ మొదలైపోయింది! అట్టడుగుస్థాయి ఎన్నికలలో పోటీ చేసేవారికి విద్యార్హత అనివార్యం అయినప్పుడు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సైతం కనీసపు విద్యార్హతను ఎందుకని నిర్ధారించరాదన్న చర్చ కూడ మొదలయ్యే అవకాశం లేకపోలేదు! ఎందుకంటే తీర్పునిచ్చినది సర్వోన్నత న్యాయస్థానం వారు..కొన్ని ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికలలో పోటీ చేయడానికి మాత్రమే కాదు, వోటరుగా నమోదు కావడానికి సైతం ‘రెండవ తరగతి’, ‘ఐదవ తరగతి’ ఉత్తీర్ణతలను కనీసపు విద్యార్హతలుగా నిర్ణయించి ఉన్నారు. ‘వోటరు’ కావాలన్న లక్ష్యంతోను, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములం కావాలన్న తపనతోను ప్రతి ఒక్కరు అక్షరాలు నేర్చుకుని అభ్యుదయం సాధించడానికి ఈ నిబంధన దోహదం చేస్తుంది. అందువల్ల వయో నిబంధనలకు వలెనే విద్యా నిబంధనలు ఎన్నికలలో పోటీ చేయడానికి రాజ్యాంగం ప్రసాదిస్తున్న ‘సమానత్వం’ హక్కుకు భంగకరం కాదని సుప్రీం తీర్పు వల్ల స్పష్టమైంది! సంపూర్ణ అక్షరాస్యత అన్న ఆదర్శం సాకారమైనప్పుడు, విద్యార్జన తపన సహజంగానే పెరుగుతుంది. అలాంటి స్థితిలో రెండు వర్గాల వోటర్లు ఏర్పడే వైపరీత్యం సహజంగానే తొలగిపోతుంది! అందువల్ల రోగగ్రస్తుడైన బలహీనుడు ఔషధం సేవించి ఆరోగ్యం పొందినట్టుగా, అనుభవజ్ఞులైన అట్టడుగు స్థాయి రాజకీయ వేత్తలు ‘విద్యా ఔషధం’ ద్వారా అవగాహనను పాలనా పటిమను పెంచుకొనగలరు! సమానత్వం మెరుగైన స్థితిని పొందడానికి సోపానం అన్నది వౌలిక ప్రజాస్వామ్య సిద్ధాంతం! అందువల్ల సమాజ సమష్టి స్వభావాన్ని మెరుగుపరచడానికి వీలైన నిబంధనలను రూపొందించడం ‘సమానత్వానికి’ విఘాతకరం కాదని, పరిపోషకమైన ప్రక్రియ అని సర్వోన్నత న్యాయ నిర్ణయం వల్ల మరోసారి స్పష్టమైంది!
అట్టడుగు స్థాయిలో పరిపాలన మెరుగుపడడంవల్ల ‘స్వయం సమృద్ధ గ్రామం’ వికసించడానకి వీలు కలుగుతుంది. విద్యావంతుడు వినయవంతుడు, శీలవంతుడు కావడం అన్నిటి కంటె ప్రధానం. ఇలాంటి వినయ శీలవంతులైన స్థానికులు ‘గ్రామీణ వ్యవస్థ’ను పరిపాలనను నిర్వహించడం మన దేశంలో అనాది...క్రీస్తునకు పూర్వం పాలించిన చోళుల కాలంలో పల్లవుల కాలంలో శాతవాహనుల కాలంలో ‘గ్రామసభలు’గ్రామ పాలనను నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ వికేంద్రీకృత రాజ్యాంగ వ్యవస్థ ఆధునిక ‘పంచాయతీ’రాజ్ వ్యవస్థ వంటిదే! ఈ స్వతంత్ర స్వయం సమృద్ధ గ్రామ పాలన ‘జనపదాలు’గా వికసించడం ప్రాచీన ప్రజాస్వామ్య చరిత్ర! ఈ చరిత్ర విదేశీయుల పాలనలో ధ్వంసమైంది. అందువల్ల సౌశీల్యవంతుల స్థానిక పాలన మళ్లీ వ్యవస్థీకృతం కావడానికి ‘కనీసపు విద్యార్హత’ నిబంధన దోహదం చేయవచ్చు!