సబ్ ఫీచర్

చేయూత లేని చేనేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రామిక శక్తి ఎక్కువగా వున్న దేశాలలో ఉపాధి కల్పన ముఖ్యం. మన దేశంలో ఎక్కువమంది శ్రామికులు వ్యవసాయం, చేనేత పైనే ఆధారపడి వున్నారు. మన చేనేత పరిశ్రమ చాలా ప్రాచీనమైనదైనా నిర్లక్ష్యతకు గురవుతూ వుంది. సుమారు కోటిన్నర మంది ఈ పరిశ్రమపై ఆధారపడి వున్నారు. దేశం మొత్తంమీద సుమారు 470 చేనేత క్లస్టర్లు (సముదాయాలు) వున్నాయి.
మన దేశంలో అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ చేనేతకు ప్రసిద్ధి చెందాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఇది కుటుంబ ఆధారిత పరిశ్రమ. తమిళనాడులో ఇది కుటుంబేతర పరిశ్రమగా వుంది. ఇప్పటికే దేశంలో 44 లక్షల మంది మగ్గానే్న నమ్ముకున్నారు. ఖాదీపై సరైన అవగాహన వుంటే పరిస్థితి ఇలా వుండేది కాదు. ఖాదీకి వేసవి కాలంలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే గుణం వుంది. ఖాదీ ఉత్పత్తికి అయ్యే నీటి పరిమాణం బాగా తక్కువ.
ప్రస్తుతం దేశీయ వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా 59 శాతంగా వుంది, రెడీమేడ్ వస్త్రాల శాతం 25, చేనేత శాతం 11, మిల్లుల శాతం 4, ఖాదీశాతం ఒకటిగా వున్నాయి. 2010-11, 2014-15 మధ్యకాలంలో వస్త్ర పరిశ్రమకు గ్రాంటులు, సబ్సిడీల రూపంలో రూ.11,232 కోట్లు అందాయి. అయితే, చేనేతకు అందింది దీనిలో రూ.2,176 కోట్లు మాత్రమే. చేనేత పరిశ్రమ రిజర్వేషన్లు, సబ్సిడీలపై ఆధారపడటం మంచిది కాదు. చేనేత వస్తువులకు మార్కెటింగ్ పెంచడమే సరైన మార్గం. ప్రస్తుతం ఎదుర్కొనే సమస్యలను కూడా అధిగమించాలి.
మన చేనేత పరిశ్రమ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వుంది. ఉత్పత్తి అసంఘటితంగా జరుగుతున్నది. ఉత్పాదకత, సాంకేతిక విజ్ఞానం తక్కువ స్థాయిలో వున్నాయి. నిధుల కొరత వుంది. అన్నిటికీ మించి మార్కెటింగ్ సమస్య. ఈ కారణాలవల్ల ఉత్పత్తిలో పెరుగుదల ఆశించిన స్థాయిలో లేదు. చేనేత కార్మికుల సంఖ్య ఏడాదికి 7 శాతం తగ్గుతున్నది. గత 15 సంవత్సరాలలో 22 లక్షల మంది ఇతర వృత్తులకు తరలిపోయారు. ఖద్దరు వాడే వాళ్ళే కరువయ్యారు. మిల్లు వస్త్రాలు తక్కువ ధరలో లభించడంతో చేనేత పరిశ్రమ కుంటుబడింది. కొన్ని వస్తువులు (దుప్పట్లు, తువ్వాళ్లు, లుంగీలు లాంటివి) చేనేత రంగంలోనే ఉత్పత్తి చేయాలని రూలు వున్నా దానిని పాటించేవారు లేరు.
చేనేత వస్తువులకు గల ఎగుమతి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి. మనం కూడా వారంలో కనీసం ఒక్క రోజైనా ఖాదీ/ చేనేత వస్త్రాలు ధరిస్తే ఈ పరిశ్రమ ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం చేనేత వస్తువులనే సమకూర్చాలి. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలలో 33 చేనేత సముదాయాలు రానున్నాయి. తెలంగాణ కూడా సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నది. కేంద్రం ఇ-మార్కెటింగ్ ద్వారా చేనేత వస్తువులకు డిమాండ్ పెంచడానికి కృషిచేస్తున్నది. శ్రామికులకు ఆర్థిక స్తోమత కల్పించడం ముఖ్యం. మన సంస్కృతీ వారసత్వంగా చేనేత, ఖాదీ మనతో వున్నాయని గ్రహించాలి. కాలానుగుణంగా డిజైన్లు మార్చుకునే సత్తా ఈ రంగానికి వుంది. చేనేత వినియోగం కనీసం ఐదు శాతం పెరిగినా శ్రామికుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ విషయంలో యువజనులు ముందుకు రావాలని మన ప్రధాని పిలుపునిచ్చారు. పర్యావరణానికి హానిచేయని వస్త్రాలనే వాడాలి.

- డా.ఇమ్మానేని సత్యసుందరం