సంపాదకీయం

న్యాయానికి గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్మాన్‌ఖాన్ తప్పించుకోవడంతో, న్యాయానికి మరోసారి తీవ్రమైన గాయమైంది! సర్వోన్నత న్యాయ స్థానానికి ఈ ‘తీర్పు’ను మహారాష్ట్ర ప్రభుత్వం నివేదించడం మినహా ‘గాయాన్ని’ మాన్పడానికి మార్గం లేదు! ‘‘వందమంది నేరస్థులు తప్పించుకున్నప్పటికీ ఒక నిర్దోషికి శిక్ష పడరాదన్నది’’ వౌలిక న్యాయ సూత్రం! బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ఎఆర్ జోషి గురువారం చెప్పిన తీర్పు ప్రకారం సల్మాన్‌ఖాన్ అనే ఈ ‘అసాంఘిక బీభత్సకారుడు’ ఆ ‘ఒక’ నిర్దోషిగా నిగ్గుతేలాడు. కానీ తప్పించుకున్న వంద నేరస్థులు, తప్పించుకుంటున్న వంద నేరస్థులు కూడ ఉన్నారు.. దేశమంతా ఉన్నారు. అలా తప్పించుకున్న వారిలో సల్మాన్‌ఖాన్ అనే హిందీ నటుడు ఉన్నాడన్నది జనంలో వినబడిన మాట! సల్మాన్‌ఖాన్ తప్పతాగి నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపై నిర్దాక్షిణ్యంగా బీభత్సకాండ నిర్వహించాడన్నది పోలీసులు చేసిన ‘ఆరోపణ’. ‘ఆరోపణ’ అన్నది సాంకేతికమైన లాంఛనం మాత్రమే! ఆరోపణ వాస్తవమేనన్నది విచారణ జరిపిన న్యాయస్థానంలో నిగ్గుతేలింది. సల్మాన్‌ఖాన్ ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడన్నది ‘ప్రమాదం’ జరిగిన స్థలంలోని ఇరుగు పొరుగులకు తెలిసిన వాస్తవం కూడ! కొందరు సాక్ష్యులు కోర్టుకెక్కి వాస్తవాలను వెల్లడించడానికి ముందుకు రారు, ‘మనకెందుకులే..’ అన్న పలాయనవాదం కారణం! మరి కొందరు సాక్ష్యులు ముందుకు రావాలని భావిస్తారు! కానీ నేరం చేసిన ‘ఘరానా’లు అలా ముందుకు రాకుండా నిరోధిస్తారు! కాదు కూడదని ధైర్యం చేసి న్యాయస్థానం ముందు హాజరు కావడానికి వెళ్లే సాక్ష్యులను గూండాలు, ఇతర ‘అభిమానులు‘, ‘అనుచరులు’ ఏమైనా చేయగలరు! సల్మాన్‌ఖాన్ వంటివారికి సంజయ్‌దత్ వంటి వారికి ఇంకా కొందరికి కూడ ‘అభిమానులు’, ‘అనుచరులు’ ఉన్నారు మరి! కానీ ఇలాంటి అవరోధాలన్నీ మొదటి న్యాయస్థానంలో నేర విచారణ పూర్తయ్యేసరికి తొలగిపోయాయి. సల్మాన్‌ఖాన్ నేరం చేసాడని ధ్రువపడింది! ఇప్పుడు హైకోర్టు వారు తమ కింది కోర్టును తప్పుపట్టారట! సల్మాన్‌ఖాన్ నిర్దోషియట! పైన సుప్రీంకోర్టు ఉంది! హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వ నిరసిస్తోందట! అందువల్ల అభియోగాన్ని సుప్రీంకోర్టునకు నివేదించే విషయమై పరిశీలిస్తోందట! ‘అప్పీలు’ దాఖలు చేయవలసిందేనని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేయడం హైకోర్టు తీర్పుపట్ల అసంతృప్తికి నిదర్శనం. మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీహరి అనే్న ఏమి నిర్ణయిస్తాడో మరి...
నేరం జరిగి పదమూడు ఏళ్లు దాటిపోయింది! 2002 సెప్టెంబర్ 28న తప్పతాగిన సల్మాన్‌ఖాన్ అడ్డదిడ్డంగా కారు నడిపి నూరుల్లా షరీఫ్ అనే శ్రామికుడిని గుద్ది చంపేశాడన్నది ఆరోపణ! మరో నలుగురు క్షతగాత్రులైపోయారు. ఈ అభియోగం ఇనే్నళ్లుపాటు విచారణకు గురి కావడం న్యాయ విలంబనానికి నిదర్శనం. గత మేనెలలో మాత్రమే ముంబయిలోని ఒక సెషన్స్ కోర్టు ఈ అభియోగంలో తీర్పు చెప్పగలిగింది. చంపాలన్న ఉద్దేశంతో కాక నిర్లక్ష్యంతోనో, ఆవేశంతోనో నిందితుడు హత్య చేయడం ‘కల్పబుల్ హోమిసైడ్’! సల్మాన్‌ఖాన్‌ను ‘కల్పబుల్ హోమిసైడ్’కు పాల్పడిన నేరానికి సెషన్స్ జడ్జి డబ్ల్యు డి.దేశపాండే ఐదేళ్లు జైలు శిక్ష విధించాడు. ఆ రోజే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన మే ఆరవ తేదీన హైకోర్టు అతగాడిని రెండు రోజులపాటు ‘బెయిల్’పై విడుదల చేసింది. ఇప్పుడు హైకోర్టు అతగాడికి పూర్తి విముక్తిని ప్రసాదించింది. అయితే సల్మాన్‌ఖాన్ నేరం జరిగిన రోజున మద్యం తాగలేదని, ఆయన కారును నడపలేదని కూడ హైకోర్టు నిర్ధారించడమే విస్మయకరం! సల్మాన్‌ఖాన్ ‘డ్రైవర్‌సీటు’నుంచి దిగి కారు బయటికి రావడం తాను చూసినట్టు గాయపడిన వారిలో ఒకరు కింది కోర్టులో సాక్ష్యం చెప్పాడు. కారువద్ద నుంచి సల్మాన్‌ఖాన్ పడుతు లేస్తూ ఊగుతూ తూలుతూ పారిపోయినట్టు మరో క్షతగాత్రుడు సాక్ష్యం చెప్పాడు! కింది కోర్టులో అభియోగం పరిసమాప్తి అవుతుండిన దశలో నిందితుని తరఫున అశోక్‌సింగ్ అనేవాడు రంగప్రవేశం చేసాడు. దుర్ఘటన జరిగిన రోజున కారు నడిపింది తానని సల్మాన్‌ఖాన్ కాదని ఈ అశోక్‌సింగ్ వినిపించిన కథనం...కానీ సెషన్స్‌కోర్టు ఈ ‘తప్పుడు’ సాక్ష్యాన్ని విశ్వసించలేదు. హైకోర్టు విశ్వసించినట్టు అయింది! ఏమయినా ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొన్నవాడు నలుగురిని గాయపరిచినవాడు ఎవడు? సల్మాన్‌ఖాన్ కాక పోయినట్టయితే ‘హంతకుడు’ ఎవరు? అన్నది హైకోర్టు తీర్పు తరువాత మళ్లీ ఉదయిస్తున్న ప్రశ్న!
ఈ ప్రశ్నను పోలీసుల-ప్రభుత్వం-తరఫున కేసును నిర్వహించిన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే కూడ సంధించడం హైకోర్టు తీర్పుపట్ల విస్తరిస్తున్న అసంతృప్తికి నిదర్శనం. ‘‘ఒక అమాయకుడు హతమయ్యాడు మరో నలుగురు క్షతగాత్రులయ్యారు. ఇందుకు ఎవరు కారకులు? అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగలింది...సమాజానికి మనం ఇస్తున్న సందేశం ఏమిటి? పలుకుబడి కలవారికి వ్యతిరేకంగా అభియోగాన్ని విచారించే సమయంలో ఎవరైనా న్యాయ ప్రక్రియనే అపహరించడానికి వీలుందని చెప్పదలుచుకున్నామా?’’ అన్నది సందీప్ షిండే సంధించిన ప్రశ్నలు! మేనెలలో సెషన్స్ కోర్టు తీర్పు చెప్పిన తరువాత సల్మాన్‌ఖాన్‌కు బెయిల్ లభించిన తరువాత ఒక ‘టాక్సీ’ డ్రైవర్ చేసిన వ్యాఖ్య అప్పుడు ప్రచారమైంది! భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యాఖ్యను ప్రస్తావించాడు కూడ! ‘‘పెద్దవాళ్లు ఎన్ని నేరాలు చేసినప్పటికీ వారికి ఏమీకాదు..’’ అన్నది ఆ టాక్సీడ్రైవర్ చేసిన వ్యాఖ్య! బొంబాయి హైకోర్టు తీర్పుతో ఈ వ్యాఖ్య నిజమైంది! షిండే అడిగిన ప్రశ్నలనే పలువురు ఉన్నత అధికారులు, పోలీసులు, విశ్రాంత పోలీసు అధికారులు అడుగుతున్నారు. మాజీ పోలీస్ డైరక్టర్ జనరల్ కె.సుబ్రహ్మణ్యం, ‘ఎవరో ఒకరు కారు నడిపి ఢీకొట్టి ఉండాలి! సల్మాన్‌ఖాన్ కాకపోతే మరెవరు నడిపారు? ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు..’ అని వ్యాఖ్యానించాడు! నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేరాలు రుజువయ్యే అవకాశాలు మృగ్యమై పోతున్నాయన్నది మరో మాజీ డిజిపి అరవింద్ ఇనామ్‌దార్ చేసిన వ్యాఖ్య...హైకోర్టు తీర్పుతో ముంబయి పోలీసుల నైతిక బలం నీరుకారిపోయిందన్న వ్యాఖ్యలు వినబడుతుండడం అసంతృప్తికి నిదర్శనం...
ఈ అభియోగం ఇన్ని ఏళ్లపాటు విచారణగ్రస్తం కావడానికి ‘న్యాయప్రక్రియ’ నిర్వహించిన వారి లోపాలు ప్రధాన కారణం! సల్మాన్‌ఖాన్‌పై మొదట నిర్లక్ష్యంగా వాహనం నడిపిన అభియోగం మాత్రమే దాఖలైంది. ఆ చిన్న అభియోగం రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే కోర్టు సల్మాన్‌ఖాన్‌కు విధించి ఉండేది. కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన అభియోగాన్ని విచారించిన మేజిస్ట్రేట్ సల్మాన్‌ఖాన్‌పై హత్యాభియోగం నమోదు చేయాలని 2011లో నిర్ధారించాడు. అందువల్ల అభియోగం సెషన్స్ కోర్టు పరిశీలన పరిధిలోకి వచ్చింది! ఇంత జరిగినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు! మరణించిన నూరుల్లా షరీఫ్ కుమారుడు ఫిరోజ్‌షేక్ దుర్ఘటన సమయానికి పదిహేను ఏళ్లవాడు! చదువు మానుకుని కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే భారాన్ని ఈ కుర్రవాడు నెత్తిన వేసుకున్నాడు! ఇప్పుడు అతడు ఇరవై ఎనిమిదేళ్లవాడు! ఫిరోజ్‌షేక్ చదువు మానకుండా నిరోధించి అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది, సమాజం విఫలమైంది, ‘న్యాయం’ విఫలమైంది!