సబ్ ఫీచర్

తగ్గుతున్న మాతృభాషాభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువత తెలుగు భాషకు దూరం కావడానికి వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, విద్యాలయాలే కారణం అని చెప్పవచ్చు. భారతీయ భాషల్లోకెల్లా అతి గొప్పది మన తెలుగు భాష. ఇప్పటివరకు ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా తెలుగు భాషకి ప్రాచీన హోదా లభించింది. అలాంటి భాషను నేడు తెలుగువారే నిర్లక్ష్యం చేయడం బాధాకరం. మాతృభాషను చిన్నచూపుచూస్తూ పరాయి భాషను నెత్తిన పెట్టుకోవడంతో మన పిల్లలు తెలుగు పదాలనే మరచిపోతున్నారు. ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే భవిష్యత్తులో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. పరభాషను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ, మాతృభాషను చిన్నచూపుచూడడం బాగులేదు. విదేశాలు సైతం మన భాషను మెచ్చుకుని ఆదరిస్తుంటే, మనం మాత్రం పరభాషా మోజులోపడి మాతృభాషకు ద్రోహం చేస్తున్నాం.
తెలుగు భాషలోని గొప్పదనాన్ని భావితరాలకు అందించడానికి మన పిల్లలను తెలుగు భాషలో చదివిస్తే, వాళ్లకి తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాషను నేర్చుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు వుంటాయన్న నమ్మకాన్ని యువతలో కల్పించాలి. ఉద్యోగ అవకాశాలలో తెలుగు భాషకి అధిక ప్రాధాన్యత కల్పిస్తే, యువత తెలుగుభాష పైన మక్కువ చూపుతారు. అదే విధంగా అధికార భాషాసంఘం చిత్తశుద్ధితో పనిచేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషను నిర్లక్ష్యంచేస్తున్న కార్పొరేట్ కాలేజీలని నియంత్రించాలి. మన అవసరాలకోసం వేరే భాషను వాడినా, వ్యవహారికలో మాత్రం మాతృభాషను ఉపయోగించాలి. ప్రభుత్వ ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులో లేకపోవడంతో ప్రతిఒక్కరూ ఆంగ్లభాషకు అలవాటు పడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మాతృభాషకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేస్తే ప్రజలల్లో తప్పకుండా మార్పువస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగులకు తెలుగు వ్రాయడం, చదవడం తెలిసి ఉండాలనే నిబంధన ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలలో అన్ని స్థాయిల్లో విధిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా, సరళమైన తెలుగు భాషను అమలుపరచాలి. అధికార పత్రాలు మాతృభాషలో ముద్రించి అందరికీ అర్థమయ్యేలా చేయాలి. ఇళ్ళల్లో, కార్యాలయాల్లో నిత్యజీవన వ్యవహారాల్లో విరివిగా తెలుగు వాడకం పెంపొందించుకోవాలి. మనం పలికే మాటల్లో సాధ్యమైనంతవరకు ఆంగ్ల పదాలు రాకుండా చూసుకోవడం అవసరం.
విదేశాలలో నివసిస్తున్న తెలుగువారు తమ మాతృభాష పట్ల శ్రద్ధ చూపిస్తూ, తమ పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను నేర్పుతూ వాళ్ళను తెలుగు భాషకు దగ్గర చేయాలని తాపత్రయ పడుతున్నారు. మనకన్నా మెరుగ్గా మన పండుగలను, మన పద్ధతులను అనుసరిస్తూ జరుపుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే ఇక్కడ మనం తెలుగు భాషకు మరెంత చేయాలో ఒక్కసారి ఆలోచించండి. యువతీ యువకులు తెలుగు భాషను నేర్చుకునేటప్పుడు వ్యాకరణం గురించి, సంస్కృత పదాల గురించి అసలు పట్టించుకోకూడదు. మనం వాడే తెలుగు పదాలు సరళంగా, తేలికగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా ఉంటే చాలు. కవులు, రచయితలు తమ రచనల్లో ఆంగ్ల పదాల వాడకాన్ని పక్కనపెట్టి అచ్చ తెలుగు పదాలతో భాషా సౌందర్యంతోపాటు భావ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దితే బాగుంటుంది.
తెలుగు భాషను అణగతొక్కడానికి తెలుగు మీడియా, తెలుగు సినిమాలు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు భాషకు హాని చేస్తున్నది టీవీ, సినీ రంగాలేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. చానళ్ళ నిర్వాహకులు, సినీ పెద్దలు మాతృభాషని సంస్కరించే ప్రయత్నం చేయాలి. తెలుగు భాషలోని ఆంగ్ల పదాలను ఇరికిస్తూ తెలుగు భాషను కలుషితం చేస్తున్నారు. తెలుగు సినిమాలకి ఆంగ్లంలో పేర్లుపెడుతూ తెలుగువారి పరువు తీస్తున్నారు. ఇక తెలుగు చానల్స్ తెలుగు భాషలో మంచి పదాలు లేనట్లు ఆంగ్ల పదాలతో కార్యక్రమాలను తయారుచేసి ప్రజల మీద రుద్దుతున్నారు. ఇప్పటికైనా టీవీ చానళ్ళవాళ్ళు కళ్ళుతెరచి, పర భాషా వ్యామోహాన్ని తగ్గించి తెలుగు భాషలోని మాధుర్యాన్ని. ఉచ్ఛారణను తెలుగువారి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాథమిక స్థాయినుంచి ఉన్నత విద్య వరకు పాఠాల్లో పాఠ్యాంశాల్లో తెలుగుదనం నింపాలి.

- కాయల నాగేంద్ర