సంపాదకీయం

ఎవరు ‘సూపర్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ. అందుకు కారణం అంతర్జాతీయంగా దానికి ఉన్న అర్థబలం, అంగబలం, సాయుధ సంపత్తి. అన్ని విధాలా అగ్రపథాన నిలిచిన అగ్రరాజ్య అధ్యక్ష పీఠం నిరుపమానం. దీన్ని అధిరోహించే వ్యక్తికి తిరుగులేని అధికారం ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలుగా ఆకట్టుకునే మార్గాలూ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సమున్నత పదవికి ఎన్నిక జరగడం అంటే మామూలు మాట కాదు. ఇందుకు పోటీపడే వ్యక్తులూ అన్ని విధాలుగా ఆరితేరినవారై ఉంటారు. ప్రపంచంలో సమున్నత ప్రజాస్వామ్య విలువలు, తిరుగులేని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పిస్తున్న అమెరికా అధ్యక్ష పదవికి తాజాగా జరుగుతున్న ఎన్నికలు అనేక కోణాల్లో ఆసక్తికరమైనవే. ఉత్కంఠను, ఉద్విగ్నాన్నీ రేకెత్తించేవే. పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దక్కించుకోవడం ఎంత కష్టమో.. అన్ని వర్గాల ప్రజలను తమ విధానాలు, ఆలోచనలు, భవిష్యత్ దృక్పథంతో ఆకట్టుకోవడమూ అంతే కష్టం. ఇప్పుడా అగ్ని పరీక్ష రిపబ్లికన్ అభ్యర్థులుగా అధ్యక్ష పదవికి నామినేషన్‌కోసం పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్, టెడ్ క్రజ్‌లకు, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రాట్ తరపున రంగంలోకి దిగిన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, సాండర్స్‌కు ఎదురవుతోంది. ఇప్పటివరకూ తమ తమ పార్టీల తరపున జరిగిన ప్రైమరీల్లో ఆశనిరాశల చందంగానే వీరి పరిస్థితి కొనసాగింది. ఎక్కడా కూడా ఆయా రాష్ట్రాల ప్రజలు వీరి ఆలోచనలను, విధానాలనూ పూర్తి స్థాయిలో విశ్వసించిన దాఖలాలు కనిపించడం లేదు. లోవా రాష్ట్రంతో మొదలైన ప్రైమరీల పోరు ఇరు పార్టీల అభ్యర్థులకు ఓచోట విజయం, మరోచోట పరాజయం అన్న చందంగానే సాగుతూ వచ్చింది. అమెరికా యువతను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు అనేక వివాదాస్పద మార్గాలనే ఎంచుకున్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ నామినేషన్‌కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలూ భారత్-అమెరికాల మధ్య మరింత దూరాన్ని పెంచేవిగానే ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి పోటీ చేసినప్పుడు అమెరికా పరివర్తనే ధ్యేయంగా, ఆశయంగా తన విధానాలను తెరపైకి తెచ్చారు.
అదే క్రమంలో దేశీయ నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఔట్‌సోర్సింగ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అవన్నీ ఆయనకు కలిసొచ్చాయి. ఎంతవరకూ అమెరికా యువతకు ఉపాధి అవకాశాల్ని ఒబామా పెంపొందించగలిగారు, ఎంత మేరకు ఔట్‌సోర్సింగ్‌కు అడ్డుకట్ట వేయగలిగారన్నది ప్రశ్నార్థకమే అయినా రెండోసారి ఆయనకే ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు రిపబ్లికన్ టికెట్‌కోసం ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల అంశాన్ని బలమైన ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు పట్టం కడితే 3లక్షల మంది భారతీయులుసహా లక్షలాదిగా ఉన్న అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేస్తానంటున్నారు. ఇది సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే అమెరికా ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని రగిలించడానికి, ఆ విధంగా తన అభ్యర్థిత్వ బలాన్ని చాటుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. డెమోక్రాట్ తరపున పోటీ పడుతున్న హిల్లరీ, సాండర్స్‌లు ఇలాంటి వివాదాల జోలికి పోకపోయినా తమ విధానాల బలంతో అమెరికన్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల తరపున వీరిలో ఒక్కొక్కరికే నామినేషన్ దక్కుతుంది కాబట్టి అంతిమంగా పోటీలో నిలిచేది డెమోక్రాట్ పార్టీ తరపున హిల్లరీనా లేక సాండర్సా అలాగే రిపబ్లికన్ల తరపున డొనాల్డ్ ట్రంపా లేక టెడ్ క్రజ్జా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన ప్రైమరీలు ఒక ఎత్తు సూపర్ ట్యూస్‌డేగా పేర్కొనే మంగళవారం ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో జరుగబోతున్న మహాప్రైమరీలు మరో ఎత్తు. పది రాష్ట్రాల్లో జరిగే ఏకకాల ప్రైమరీల్లో 83.5మిలియన్ మంది ఓటర్లు తమ తీర్పునివ్వబోతున్నారు. అరకొర ఆధిక్యతనే ఇప్పటివరకూ కనబరుస్తూ వచ్చిన హిల్లరీ క్లింటన్, డ్రొనాల్డ్ ట్రంప్‌లు ఈ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ తమ పార్టీల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసే నామినేషన్ దక్కుతుందా లేదా అన్నది పోటీలో ఉన్నవారికి సూపర్ ట్యూస్‌డేలో వెలువడే తీర్పుతో దాదాపుగా తేలిపోతుంది. అలాబామా, కర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, మినె్నసొటా, ఒక్లహోమా, టెనె్నసీ, టెక్సాస్, వెర్మోంట్, వర్జినియాల్లో జరిగే అత్యంత కీలక ప్రైమరీలు అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల జాతకాలు తేల్చేసేవే కాబట్టి అమీతుమీ అన్న రీతిలో వీరి ప్రచార హోరు సాగుతోంది.
తమ తమ విధానాలను ఎలుగెత్తి చాటుకోవడానికి ఆయా రాష్ట్రాల వీధుల్లో భారీ పోస్టర్లు, హోర్డింగులు, ఓటర్లను వ్యక్తిగతంగా కాఫీ షాపుల్లో కలుసుకోవడానికే ఇప్పటివరకూ పరిమితమైన అభ్యర్థుల ప్రచారం అత్యంత కీలక, నిర్ణయాత్మక దశకు చేరుకుంది. క్షణాన్ని వృధా చేసుకోకుండా అభ్యర్థులు అన్ని మార్గాల్లోనూ దూసుకుపోతున్నారు. ఆగ మేఘాలపై పరుగులు పెడుతున్నారు. మీడియానూ తమ విధానాల ప్రచారం కోసం విస్తృతంగానే ఉపయోగించుకుంటున్నారు. మొత్తం మీద హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌ల చూట్టూనే మొత్తం వ్యవహారం సాగుతోంది. బుధవారం ఉదయానికల్లా వీరిద్దరి అభ్యర్థిత్వాలూ ఆయా పార్టీల తరపున ఖరారు దశకు చేరుకుంటాయన్న సంకేతాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌లు తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోలిగితే.. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు వీరిద్దరూ అమీతుమీ అన్న రీతిలో పోటీలో దిగుతారు.
ఒబామా హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసి ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలను ఔపోసన పట్టిన హిల్లరీ క్లింటన్ చాలా సునాయాసంగానే ఏ అనుభవం లేని డొనాల్డ్ ట్రంప్‌ను చిత్తు చేయగలరన్న ధీమా డెమొక్రాట్ పార్టీ నేతల్లో వ్యక్త మవుతోంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే అనుభవం, వాస్తవిక దృక్పథం మెండుగా ఉన్న హిల్లరీకి ఇప్పటికే సానుకూల స్పందన వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఆమె ప్రత్యర్ధి అయితే మాత్రం హిల్లరీ విజయం నల్లేరుపై నడకే అవుతుందన్నది స్పష్టం. మొదటి రెండు మూడు ప్రైమరీల్లో హిల్లరీ జనకార్షక శక్తి అంతగా పని చేయనప్పటికీ ప్రజాదరణను క్రమంగా పుంజుకుంటూ వచ్చారు. ఇప్పుడు సూపర్ ట్యూస్‌డే అమెకు అన్ని విధాలుగా సానుకూల ఫలితాలనే అందించడం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది. వీరిద్దరే కాదు రిపబ్లికన్, డెమొక్రాట్ టికెట్లకోసం పోటీ పడుతున్న ఇతర అభ్యర్థులూ ఈ పదిరాష్ట్రాల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొత్తం పది రాష్ట్రాలూ అభ్యర్థులిద్దరికీ కీలకం కాబట్టి అక్కడి డెలిగేట్లను ఏ మేరకు ఆకర్షించగలుగుతారు.. ఆ విధంగా తమ ఆధిపత్యాన్ని ఏ విధంగా నిరూపించుకోగలుగుతారన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటివరకూ ఎదులైన ప్రతికూలతలను అధిగమించి అన్నింటినీ అనుకూలంగా మార్చుకునేందుకు ఇదే అవకాశం. అందుకే అమీతుమీ అన్న రీతిలో పోరాటం!