సంపాదకీయం

‘హద్దులు’ లేని వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో వేలకోట్ల రూపాయల అవినీతి కలాపాలు నిర్వహించినవారు శిక్షలను తప్పించుకొని విదేశాలకు పారిపోవడం కొనసాగుతున్న ప్రక్రియ... ఈ ‘ప్రక్రియ’ పేరు ప్రపంచీకరణ! విజయమాల్యా, నీరవ్ మోడీ వంటివారు పారిపోయినవారిలో కొందరు మాత్రమే! పారిపోవడం, పారిపోయినవారిని మళ్లీ మనదేశానికి తరలించుకుని వచ్చే ‘తతంగం’ దశాబ్దుల పాటు కొనసాగడం ‘ప్రపంచీకరణ’... స్వేచ్ఛావాణిజ్య అంతర్జాతీయ సూత్రం ప్రాతిపదిక!! అవినీతిపరులు ‘స్వేచ్ఛ’గా విదేశాలకు పారిపోయి స్థిరపడిపోయి మన ప్రభుత్వంవారిని వెక్కిరిస్తున్న దృశ్యాలు నిరంతరం వికృతంగా ఆవిష్కృతం అవుతుండడం ‘ప్రపంచీకరణ’... ‘‘సరిహద్దులు చెరిగిపోవడం’’ అని అంటే ఇదే మరి! వివిధ దేశాలలోని ప్రభుత్వేతర రంగాలలోని వాణిజ్య, పారిశ్రామిక, ద్రవ్యనిధి- బ్యాంకింగ్ - సంస్థలలోని అవినీతిపరులు సరిహద్దులను చెరివేయడం ప్రపంచీకరణ! సార్వభౌమ దేశాల సరిహద్దులు చెరిగిపోయి ‘పుడమి’ మొత్తం ఒకే వాణిజ్య మండలంగా ‘పుడమిపల్లె’- గ్లోబల్ విలేజ్‌గా రూపొందడానికి ప్రాతిపదిక అంతర్జాతీయ అవినీతి! ఇదీ ప్రపంచీకరణ... మరీ ప్రధానంగా మన దేశంలో రాజకీయవేత్తలు, ప్రభుత్వ నిర్వాహకులు ప్రతి కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయినిబట్టి ‘అద్దుతున్నారు’. అంతర్జాతీయ స్థాయి నగరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి ప్రసంగ వేదికలు... ఇలా మన దేశంలోని ప్రసిద్ధులలో అత్యధికులకు ప్రతి విషయంలోని ‘అంతర్జాతీయ స్థాయి’ గురించి ఆర్భాటించటం అలవాటైపోయింది! భారతీయత, స్వజాతీయ సముత్కర్ష ప్రమాణాలు వీరికి పనికిరావడం లేదు.. వీరి దృష్టిలో ‘దేశంలోనివన్నీ నాసిరకం, బయటనుంచి వచ్చేవాటికి మాత్రమే ప్రాధాన్యం..’. ‘ప్రపంచీకరణ’ వాణిజ్య జీవనశైలి మన సమాజాన్ని అలముకుంటున్న తీరు ఇది... ‘‘గిరాకీ లభ్య’’- డిమాండ్ అండ్ సప్లైతో ఈ రెండే సర్వస్వం అయిపోవడం ప్రపంచీకరణం.. అవసరం, ఆతిథ్యం, మానవత్వం, సౌశీల్యం, సంస్కారం, దేశం, దేశం పట్ల మమకారం వంటివి విద్యాధికులకు తెలియకపోవడం, ‘ప్రపంచీకరణ’ విద్యార్థులకు తెలియచెప్పకపోవడం ‘ప్రపంచీకరణ’... అందువల్ల విద్యావంతులు, మేధావులు వంచకులుగా మారి రాక్షసులుగా మారి అవినీతి కలాపాలు నిర్లజ్యగా కొనసాగిస్తున్నారు. మిగిలిన కార్యకలాపాలకు అంతర్జాతీయ స్థాయి లభించినట్టు లేదు.. అవినీతికి మాత్రం మన దేశంలో ‘అంతర్జాతీయ గరిమ’, ‘ప్రపంచ’ స్థాయి ఎప్పుడో లభించేసాయి! వేలకోట్ల రూపాయల ప్రజల సొమ్మును దిగమింగి, ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన ‘్భరీ పారిశ్రామిక ఘరానా వాణిజ్య జీవులు’ మన దేశమాతను ‘రొమ్ముగుద్ది’ విదేశాలకు పారిపోవడం సాధారణ సూత్రం...
కొందరు పారిపోలేకపోవడం, పట్టుబడడం ఈ ‘సూత్రాని’కి అపవాదం- ఎక్సెప్షన్ - మాత్రమే! ‘ఎస్ బ్యాంక్’ను అవినీతిమయం చేయగలిగిన రాణాకపూర్ అనేవాడు ప్రస్తుతానికి ఈ అపవాదం. ఆయనను ఆదాయం పన్ను శాఖ ‘కార్యాచరణ కార్యాలయం’- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఇడి- వారు నిర్బంధించడం ఈ అపవాదం... విమానం ఎక్కి లండన్‌కు వెళ్లిపోతుండిన అతగాడి కుమార్తె రోశనీ అనే మహిళను ముంబయిలో ‘ఇడి’ అధికారులు నిరోధించారట! ఇలా ప్రభుత్వేతర ఘరానా సంస్థలు జనాన్ని వంచించడం, ‘దివాలాతీస్తున్నట్టు’ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు! అనేక ఘరానా ఆర్థిక సంస్థలు వాణిజ్య సంస్థలు పారిశ్రామిక ‘ముఠా’లు ఈ ‘దివాలా’ అభినయాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. సంస్థల నిర్వాహకులు ప్రజలు- వినియోగదారులు- జమచేసిన మొత్తాలను భారీగా దుర్వినియోగం చేస్తున్నారు. తమ బంధుమిత్ర పరివార ‘దళారీ’ గణాలకు ఈ నిర్వాహకులు భారీగా వందల వేల కోట్ల ఋణాలు మంజూరు చేసినట్టు సాక్ష్యాధారాలు సృష్టించడం అవినీతి పథకంలోని ప్రధాన అంశం! ఆ తరువాత ఆ ఋణగ్రహీతలు ఋణాలు తిరిగి చెల్లించలేదన్న ప్రచారం మొదలైపోతుంది! ఈ ‘ఋణాల ఎగవేత’ కారణంగా ‘సంస్థ’ డొల్లగా మారిపోయిందని నిర్వాహకులే నిర్థారించి ప్రకటించడం అతితెలివిగా ఆడుతున్న అవినీతి నాటకం... నిజానికి ఈ తథాకధిత- సోకాల్డ్- ఋణాలు రాణాకపూర్ వంటివారు సంస్థ ఖాతాలనుంచి స్వంత ఖాతాలకు మళ్లించి మాయం చేస్తున్నారన్నది జరిగిపోతున్న ప్రచారం! ‘ప్రపంచీకరణ’వల్ల దేశాల సరిహద్దులు ‘చెరిగిపోయిన’ నేపథ్యంలో ఇలాంటి అవినీతిపరులు ‘అక్రమ నిధుల’ను, ప్రజల సొమ్మును విదేశాలకు తరలించడం మరింత సరళమైపోయిందట!! ఈ రహస్యాలు, ఈ అవినీతి వ్యూహాలు మనలాంటి సామాన్య జనాలకు అర్థంకాకపోవడం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగమాయాజాలం.. దివాలాతీసేవరకు ప్రతి ప్రభుత్వేతర రంగసంస్థ కూడా బంగారపు జింకవలె మిరుమిట్లు కొలుపుతూ ఉండడం ప్రపంచీకరణ...
దివాలాతీస్తున్న ప్రభుత్వేతర రంగ సంస్థలనుంచి మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవడం లేదు.. ప్రజలు కూడా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుండడం మరింతఘోరమైన వైపరీత్యం! రాష్ట్రప్రభుత్వా రోడ్డు రవాణా సంస్థల బస్సులు ఖాళీగా వెడుతున్నాయి. ప్రయాణీకులలో ఎక్కువమంది ప్రభుత్వేతర సంస్థల బస్సులో ఊరేగడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ప్రభుత్వేతర వాహనాలలో చోదకులు- డ్రయివర్లు- నిర్వాహకులు - కండక్టర్లు ఎక్కువ సందర్భాలలో ‘గూండా’లు! వారు తమపై ‘గూండాగిరీ’ చేయడాన్ని సైతం ఈ ప్రయాణీకులు ప్రశంసాభావంతో స్వీకరిస్తున్నారు. ఈ ప్రభుత్వేతర వాహనాలు సమయానికి బయలుదేరవు, సమయానికి రావు. రెండు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఈ బస్సులు ఆ తరువాత అమిత వేగంగా దూసుకొనిపోవడం నిత్యకృత్యం! ప్రభుత్వేతర విమాన సంస్థల విమానాలు తరచూ ఆటంకాలకు గురి అవుతున్నాయి, అర్థాంతరంగా దిగిపోతున్నాయి! దివాలా కూడా తీస్తున్నాయి! అయినప్పటికీ ‘ఎయిర్ ఇండియా’ను ప్రభుత్వేతరులకు అప్పగించడానికై ఆర్భాటం చేస్తోన్న మన ప్రభుత్వ విధానాన్ని ఏమని అభివర్ణించాలి! బస్సులు, విమానాల ప్రభుత్వేతర రంగం చేస్తున్న దోపిడీ చాలదట, తీస్తున్న దివాలా చాలదట! రైళ్లను కూడా ప్రభుత్వేతర సంస్థల కబంధంలో ఇరికించడానికి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతూనే ఉంది. ప్రభుత్వేతరులు నిర్వహిస్తున్న రైళ్లలో భారీగా ‘ప్రయాణ శుల్కాల’’తో ప్రజలపై ‘మోపు’తున్నారట! ఇలా మోదించుకొనడం ప్రభుత్వేతర రైళ్లను ఎక్కుతున్న వారికి గౌరవ ప్రతీక -స్టేటస్ సింబల్! భారతీయతను పూర్తిగా దిగమింగడానికి ‘ప్రపంచీకరణ’ పెద్దగా వేలకొలదీ నోళ్లను తెరుస్తోంది.. ‘ఎస్ బ్యాంకు’ బహుశా మరో నోరు!!
ఇరవై ఏళ్ల క్రితం వరకూ ప్రభుత్వం వారి ‘‘కాఫీ మండలి’’- ‘‘కాఫీ బోర్డు’’ నగరాలలో పట్టణాలలో చిల్లర దుకాణాలను నడిపేది. ఈ ‘మండలి’ దుకాణాలలో మిగిలిన చిల్లర కాఫీ దుకాణాలలో కంటే దాదాపు ఇరవై ఐదు, ముప్పయి శాతం తక్కువ ధరలకు మరింత నాణ్యమైన ‘కాఫీ’పొడిని అమ్మేవారు! మధ్య తరగతి ప్రజలు కొనేవారు.. ‘పపంచీకరణ’ వచ్చింది, ‘్భరతీయత’ను దిగమింగింది. ప్రభుత్వేతర రంగంలోని ‘కాఫీ దినం’- కాఫీ డే సంస్థ విస్తరించింది. ఈ విస్తరణకు పూర్వరంగంగా ప్రభుత్వ సంస్థ ‘కాఫీ మండలి’ దుకాణాలను మూసివేశారు. ‘‘కాఫీ డే’’ సంస్థవారు దోపిడీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు ‘కాఫీ డే’ దుకాణం ఉన్నచోట చిల్లర కాఫీ దుకాణాలు మూతపడిపోయాయి. వేలమంది చిల్లర వర్తకులు ‘కాఫీ పొడి’ దుకాణాలను మూసివేసి, ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కున్నారు... వారిలో కొందరు ప్రభుత్వేతర ‘కాఫీ డే’ దుకాణాలలో ఉద్యోగులు.. కూలీలు!! ఇదీ ‘ప్రపంచీకరణ’!!