సంపాదకీయం

‘నిష్క్రమణ’ పథం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ పార్లమెంటు ‘ప్రతినిధుల సభ’- హవుస్ ఆఫ్ కామన్స్- ఎన్నికలలో ప్రధాని బోరిస్ జాన్‌సన్ నాయకత్వంలోని ‘కన్సర్వేటివ్ పార్టీ’ సాధించిన ఘన విజయం బ్రిటన్ ప్రజల ‘జాతీయ నిష్ఠ’కు మరో ధ్రువీకరణ. గురువారం ‘మత ప్రదానం’-పోలింగ్- జరిగిన ఈ ఎన్నికలలో ఐరోపా ఆర్థిక సమైక్యవాదులు ఘోర పరాజయం పాలుకావడం చారిత్రక పరిణామం. ఈ చారిత్రక పరిణామం ‘విపరిణామం’కాగలదా? ‘శుభ పరిణామం’ కాగలదా? అన్న మీమాంస మరికొన్ని ఏళ్లపాటు కొనసాగక తప్పదు. గత మూడున్నర దశాబ్దుల కాల వ్యవధిలో ‘కన్సర్వేటివ్’ పార్టీకి ఎన్నికలలో ఇంత భారీ మద్దతు లభించడం ఇదే మొదటిసారి. మార్గరెట్ థాచర్ ప్రధానమంత్రిగా ఉండిన క్రీస్తుశకం 1970వ 1980వ దశకాలలో సమకూడిన రాజకీయ విభవాన్ని ‘కన్సర్వేటివ్’ పార్టీవారు మళ్లీ సంతరించుకొనడం ఈ ఎన్నికలలో ప్రస్ఫుటించిన ప్రధాన పరిణామం! అయితే ఇందుకు కారణం కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వ గరిమ కాదన్నది స్పష్టం! ‘ఐరోపా సమాఖ్య’నుంచి తమ దేశం నిష్క్రమించే కార్యక్రమాన్ని- బ్రిటన్ ఎగ్జిట్- బ్రెక్జిట్- వేగవంతం చేయాలన్న బ్రిటన్ మతప్రదాత- వోటర్-ల కృత నిశ్చయం ఈ ఘన విజయానికి కారణం. ఇలా నిష్క్రమించే కార్యక్రమానికి గత రెండేళ్లుగా ‘పార్లమెంటు’లోని రెండు ప్రధాన పక్షాలలోను అధిక సంఖ్య ప్రతినిధులు అడ్డుతగలడం చరిత్ర! డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి పదవీ పరిత్యాగం తరువాత ‘కన్సర్వేటివ్ పార్టీ’ నాయకత్వాన్ని ప్రధాని పదవీ బాధ్యతలను స్వీకరించిన థెరీసా మాయ్ ఆర్భాటంగా ప్రకటించిన ‘నిష్క్రమణ’ కార్యక్రమం ఈ వ్యతిరేకత కారణంగానే ఆగిపోయింది, థెరీసా మాయ్‌కి పదవీచ్యుతి ఏర్పడింది. మాయ్ తరువాత ‘కన్సర్వేటివ్’నాయకత్వాన్ని ప్రధాని పదవిని స్వీకరించిన బోరిస్ జాన్‌సన్ కూడ ఏడాదికిపై పార్లమెంట్‌లో ‘బ్రెక్జిట్’ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు, సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత ఏర్పడడం సొంత పార్టీ ప్రతినిధులు సైతం అయిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ‘వోటు’వేయడం ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య వౌలిక నియమాలకు’’ కలిగిన విఘాతం! మధ్యంతరపు ఎన్నికల ప్రత్యామ్నాయాన్ని బోరిస్ జాన్‌సన్ అందువల్లనే ఎంచుకోవలసి వచ్చింది... ‘బ్రెక్జిట్’అనుకూల, ప్రతికూల ప్రతినిధులు, రాజకీయవేత్తలు ‘కన్సర్వేటివ్ పార్టీ’లోను ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీలోను ఉండడం 2012 నుంచి కొనసాగుతున్న చరిత్ర! ఇదంతా బ్రిటన్ అంతర్గత వ్యవహారం. కానీ ఈ అంతర్గత రాజకీయ పరిణామక్రమం అంతర్జాతీయ వాస్తవ స్థితిని ప్రభావితం చేస్తోంది. ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- ఘోరంగా విఫలం అవుతుండడం, వివిధ దేశాలలో ‘జాతీయ ప్రయోజన’ ఆర్థిక విధానాలు పునఃప్రారంభం కావడం ఈ అంతర్జాతీయ వాస్తవం! ‘బ్రెక్జిట్’ బ్రిటన్ ‘జాతీయ ఆర్థిక ప్రయోజన’ విధానం!! మన దేశంతో సహా వివిధ ప్రపంచ దేశాలు గ్రహించవలసిన పాఠం ఇది. బ్రిటన్ ఎన్నికల ఫలితాల విశే్లషణకు ఇదీ ప్రాతిపదిక...
‘బ్రెక్జిట్’ ఐరోపాలో విస్తరిస్తున్న ‘ భాషా జాతీయవాదాని’కి మరో ప్రతీక మాత్రమే! ‘ప్రపంచీకరణ’వల్ల సార్వభౌమ దేశాల సరిహద్దుల గోడలు కూలిపోతాయని ప్రపంచమంతా ‘పుడమి పల్లె’గా ఏర్పడుతుందని భావించిన వారి కలలు కల్లలుకావడం పాతికేళ్ల చరిత్ర. భాష కాని మతం కాని ఒక జనసముదాయం లేదా కొన్ని జన సముదాయాలు కలసి ఒకే జాతిగా వికసించడానికి ప్రాతిపదికలు కాజాలవు! ‘‘్భషలకు మతాలకు సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, విచార ధారలకు, ఆలోచన రీతులకు అతీతమైన, వీటికీ, మరెన్నో వైవిధ్యాలకూ ప్రాతిపదిక అయిన ‘సంస్కృతి’మాత్రమే జాతీయతకు, జాతి వికసనానికి నిజమైన ప్రాతిపదిక కావడం సనాతన వాస్తవం’’. భారత జాతి ఈ సనాతన వాస్తవం! కానీ ఇందుకు భిన్నంగా ఐరోపాలోను ఇతరచోట్ల ‘్భష’ప్రాతిపదికగా కృతకమైన ‘జాతులు’ ఏర్పడినాయి. మరికొన్ని దేశాలలో ‘మతం’ ప్రాతిపదికగా కృత్రిమమైన ‘మత జాతులు’ ఏర్పడడం వేఱుకథ. ‘ఐరోపా సమాఖ్య’లో విభేదాలు, విభజనలు నిక్షిప్తం అయి ఉండడానికి ఈ ‘కృతకమైన భాషాజాతులు’ వౌలిక ప్రాతిపదిక! ‘ఐరోపా సమాఖ్య’- యూరోపియన్ యూనియన్- ఇ.యు.-నుంచి బ్రిటన్ వైదొలగిపోతుండడానికి ఇదీ వౌలిక కారణం. ఐరోపానుంచి బ్రిటన్ విడిపోతోంది. బ్రిటన్ నుంచి ‘స్కాట్‌లాండ్’ విడిపోయి ‘స్వతంత్ర దేశం’గా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమాంతర విపరిణామాలకు కారణం ‘‘్భష పేరుతో జాతి’’- అన్న కృత్రిమ సిద్ధాంతం! ‘బ్రెక్జిట్’నుంచి బ్రిటన్ నుంచి నేర్వదగిన గుణపాఠం ఇది.
‘ఐరోపా సమాఖ్య’కు మరింత విస్తృతి ‘ప్రపంచీకరణ’. ‘ఐరోపా సమాఖ్య’లో కొనసాగడంవల్ల తమ ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ అస్తిత్వం దెబ్బతింటాయన్న బ్రిటన్ ప్రజల భయం ‘బ్రెక్జిట్’కు కారణం! 2012లో పెద్దఎత్తున ఈ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇతర ఐరోపా దేశాల ప్రజలు ‘వీసా’లతో అవసరం లేకుండా తమ దేశంలోకి చొఱబడి స్థిరపడిపోతున్నారన్నది ఈ భయం. ‘ఐరోపా సమాఖ్య’ దేశాల మధ్య ఎగుమతి, దిగుమతి సుంకాలు లేవు. అందువల్ల ఇతర ఐరోపా దేశాల వస్తువులు తమ దేశాన్ని ముంచెత్తుతున్నాయన్నది బ్రిటన్ ప్రజల భయం. ఒకప్పుడు, శతాబ్దులపాటు, ప్రపంచ దేశాలను తమ వస్తువులతో ముంచెత్తిన బ్రిటన్‌కు ఇప్పుడు ఇతర దేశాల వస్తువులు తమను ముంచెత్తుతున్న భయం పట్టుకొంది.
2004నుంచి ఐరోపా సమాఖ్య దేశాలకు ‘ఉమ్మడి ద్రవ్య వినిమయ’ వ్యవస్థ ఏర్పడింది. కానీ బ్రిటన్ మాత్రం ఈ ఉమ్మడి ‘ద్రవ్య వినిమయ’-యూరో- వ్యవస్థలో చేరలేదు. ఇందుకు కారణం కూడ స్పష్టం. అందువల్లనే ‘ఐరోపా సమాఖ్య’ ఆర్థిక రాజకీయ బంధం నుంచి బయటపడాలన్న ప్రజాందోళన మొదలైంది. కన్సర్వేటివ్ పార్టీ అధినేత, అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ విషయమై ‘ప్రజాభిప్రాయ సేకరణ’కు 2012లో అంగీకరించవలసి వచ్చింది. ప్రజాభిప్రాయసేకరణ- రెఫరెండమ్- జరిగినట్టయితే అధిక సంఖ్యాక మత ప్రదాతలు ‘ఐరోపా సమాఖ్య’లో తమ దేశం కొనసాగాలని తీర్పు చెబుతారని కామెరాన్ విశ్వసించాడు. 2015 మేలో జరిగిన ‘ప్రతినిధుల సభ’ ఎన్నికలలో తమ పార్టీ ఘన విజయం సాధించడం కామెరాన్ విశ్వాసం మరింత బలపడడానికి దోహదం చేసింది. ఇరవై ఏళ్ల తరువాత బ్రిటన్‌లో మొదటిసారి ‘ఒకే పార్టీ’కి ప్రతినిధుల సభలో ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ లభించడం అప్పటి కథ. కానీ 2014 జూన్ 23న జరిగిన ‘రెఫరెండమ్’లో కామెరాన్ విశ్వాసం వమ్మయింది, తమ దేశం ‘ఐరోపా సమాఖ్య’నుంచి వైదొలగాలని బ్రిటన్ ‘మత ప్రదాతలు’ తీర్పుచెప్పారు!!
అప్పటినుంచి ఇప్పటివరకు ‘సమాఖ్య’నుంచి బ్రిటన్ వైదొలగే ప్రక్రియ సాగుతూనే ఉంది. ‘రెఫరెండమ్’ ఏ పార్టీకి విజయం కాలేదు, ఏ పార్టీకి పరాజయం కూడ కాలేదు... ఎందుకంటె ‘నిష్క్రమణ’- బ్రెక్జిట్-వాదులు రెండు ప్రధాన పక్షాలలోను ఉన్నారు. ‘కామెరాన్’ చివరివరకు తమ దేశం ‘ఐరోపా సమాఖ్య’లో కొనసాగాలని వాదించాడు. ఇలాంటి ‘సమీకృత’వాదులు ‘లేబర్ పార్టీ’లో కూడ ఉన్నారు. అయినప్పటికీ నైతిక బాధ్యత వహించిన డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి పదవికి, ప్రతినిధుల సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, రాజకీయాల నుంచి నిష్క్రమించాడు, అత్యున్నత ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని నిలబెట్టాడు. ఆయన తరువాత కన్సర్వేటివ్ పార్టీని నడిపిన ప్రధాని థెరీసా మాయ్ అన్ని రంగాలలో విఫలమైంది. 2015లో ఘన విజయం సాధించిన కన్సర్వేటివ్ పార్టీ 2017 నాటి ఎన్నికలలో ‘సభ’లో సంఖ్యాబాహుళ్యం- మెజారిటీ- కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ ‘కన్సర్వేటివ్’లకు ఘన విజయం లభించింది, 650 స్థానాల సభలో ఈ పార్టీకి 364 స్థానాలు లభించాయట! ప్రతిపక్ష లేబర్ పార్టీకి 203 స్థానాలు లభించాయి. ‘బ్రెక్జిట్’ ఐరోపా సమాఖ్య వైఫల్యానికి మాత్రమేకాదు ‘ప్రపంచీకరణ’ వైఫల్యానికి సైతం ప్రతీక...