సంపాదకీయం

‘పౌరసత్వ’ మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ‘జాతీయ పౌర సూచిక’ను రూపొందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ముదావహం. ప్రస్తుతం అస్సాం ప్రాంతానికి మాత్రమే ఈ ‘జాతీయ పౌర సూచిక’- నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సీ- పరిమితమై ఉంది! ఆగస్టు ముప్పయి ఒకటవ తేదీన వెలువడిన తుది జాబితా ప్రకారం ‘అస్సాంలో మూడు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల నలుగురు భారతీయ పౌరులు ఉన్నట్టు’ ధ్రువపడింది. అస్సాంలో ‘పంతొమ్మిది లక్షల ఆరు వేల ఆరువందల యాబయి ఏడుగురు భారతీయ పౌరులు కానివారు తిష్ఠవేసి ఉన్నట్టు’ ఈ తుది జాబితా వల్ల వెల్లడైంది! ‘జాతీయ పౌర సూచిక’ ఒకరోజు ఆరంభమై మరోరోజు ముగిసే కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది దేశ ప్రజల సమష్టి అస్తిత్వ పరిరక్షణకు సంబంధించిన శాశ్వతమైన భద్రతా వ్యవస్థ. అందువల్ల అస్సాం ప్రాంతానికి మాత్రమేకాక మొత్తం దేశానికి ‘జాతీయ పౌర సూచిక’ ఏర్పడడం సహజ పరిణామ క్రమం. క్రీస్తుశకం 1951లోనే ఈ ‘జాతీయ పౌర సూచిక’ను రూపొందించే కార్యక్రమం దేశవ్యాప్తంగా వ్యవస్థీకృతం కావడం చరిత్ర.. కానీ ఈ చరిత్ర కొనసాగకపోవడం ఆ తరువాత ప్రస్ఫుటించిన జాతీయ వైపరీత్యం. ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు దేశ భద్రత పట్ల, జాతీయ సార్వభౌమ అధికార గరిమ పట్ల, సాంస్కృతిక స్వభావ పరిరక్షణ పట్ల, మాతృదేశం పట్ల మమకారం పలచబడడం ఈ నిర్లక్ష్యానికి కారణమన్నది నిరాకరింపజాలని నిజం. ఫలితంగా ఏడు దశాబ్దులుగా మన దేశంలోకి చొరబడిపోయిన విదేశీయులు దేశమంతటా తిష్ఠవేసి ఉన్నారు. లక్షల మంది విదేశీయ అక్రమ ప్రవేశకులు ఇప్పటికే అక్రమ పద్ధతుల ద్వారా వివిధ వ్యవస్థలలో నమోదయి భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా తదితర ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడి తిష్ఠవేసి ఉన్న దాదాపు రెండు కోట్ల మంది విదేశీయులలో వేలమంది మతోన్మాదులు, అసాంఘిక స్వభావులు, బీభత్సకారులు, విద్రోహులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 1951 నుంచి ‘జాతీయ పౌర సూచిక’ వ్యవస్థీకృతం అయి ఉండినట్టయితే దేశానికి ఈ దురవస్థ తప్పి ఉండేది. ఇప్పుడైన, దేశవ్యాప్త ‘జాతీయ పౌర సూచిక’ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించడం, అందువల్ల హర్షణీయ శుభ పరిణామం!
ఇలా దేశవ్యాప్తంగా ‘జాతీయ పౌర సూచిక’ను రూపొందించాలన్నది గత కొనే్నళ్లుగా వినబడుతున్న ప్రతిపాదన. కానీ ఈ ప్రతిపాదనను కార్యాచరణకు తెస్తున్నట్టు ప్రభుత్వం ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఇప్పుడు కూడ ప్రభుత్వం వారు తమంత తాముగా పార్లమెంటులో ఈ ప్రకటన చేయలేదు. అస్సాం ప్రాంతానికి రూపొందిన ‘సూచిక’లో స్థానం లభించనివారు ‘‘చెందుతున్న ఆందోళన’’ గురించి బుధవారం రాజ్యసభలో సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయమై స్పష్టీకరణ ఇచ్చిన దేశ వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా ‘‘దేశవ్యాప్తంగా జాతీయ పౌర సూచికను రూపొందించే కార్యక్రమం ఆరంభం కానుంది..’’అని ప్రకటించాడు. అందువల్ల ఈ దేశవ్యాప్త కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎన్ని ఏళ్లలో మొదటి ‘జాతీయ పౌర సూచిక’ ఆవిష్కృతం అవుతుంది? అన్న వివరాలు వెల్లడికావలసి ఉంది. అస్సాం ప్రాంతానికి ‘జాతీయ పౌర సూచిక’ ఏర్పడడం కూడ సర్వోన్నత న్యాయ నిర్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పుడు అస్సాంలో తిష్ఠవేసి ఉన్నట్టు ధ్రువపడిన పంతొమ్మిది లక్షల పైచిలుకు విదేశీయులను వారి దేశాలకు తరలించడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం...
కానీ కేంద్ర ప్రభుత్వం ఈ కర్తవ్యాన్ని నిర్వహించరాదని, ‘‘విదేశీయులకు మద్దతు పలుకుతున్న’’ రాజకీయవేత్తలు కోరుతున్నారు. ‘‘కొండను తవ్వి తొండను పట్టిన చందం’’గా అస్సాంలో కేవలం పంతొమ్మిది లక్షల విదేశీయులు మాత్రమే అక్రమంగా స్థిరపడి ఉన్నట్టు ధ్రువపడింది. మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి దశాబ్దుల తరబడి కోటిన్నర మంది అక్రమంగా చొరబడినట్టు ప్రభుత్వమే అనేక పర్యాయాలు ధ్రువపరచింది. అనధికార కథనం ప్రకారం ఈ అక్రమ ప్రవేశకుల సంఖ్య ఇంకా ఎక్కువే! ఈ అక్రమ ప్రవేశకులను గుర్తించడానికై 1983లో రూపొందిన ‘‘న్యాయ మండలుల ద్వారా అక్రమ ప్రవేశకుల నిర్ధారణ’’- ‘ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్’- ఐఎమ్‌బిటి- చట్టం ఘోరంగా విఫలమైంది. ఇరవై మూడేళ్ల తరువాత ఈ గుదిబండ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. విదేశీయులను గుర్తించి బయటికి పంపించే ప్రక్రియను అమలు జరుపడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం వారి ఆదేశాలను 2013వరకు ప్రభుత్వం పట్టించుకొనకపోవడం ‘్భద్రత’ పట్ల నిర్లక్ష్యం. చివరికి సర్వోన్నత న్యాయ ప్రమేయంతోనే అస్సాంలో ఈ ‘ఎన్‌ఆర్‌సి’ కార్యక్రమం మొదలైంది. కానీ ధ్రువపడిన పంతొమ్మిది లక్షల విదేశీయులను ఎప్పుడు దేశం నుంచి వెళ్లగొడతారన్నది స్పష్టం కావడం లేదు. అక్రమ ప్రవేశకులను దేశం నుంచి బహిష్కరించక పోయినట్టయితే ‘జాతీయ పౌర సూచిక’ను రూపొందించినందువల్ల ప్రయోజనం ఏమిటి? బర్మా- మ్యాన్‌మార్- నుంచి ఇటీవలి కాలంలో చొఱబడి తిష్ఠవేసి ఉన్న ‘రోహింగియా’లు వేల సంఖ్యలో దేశమంతటా విస్తరించి ఉన్నారు. వీరి సంఖ్య డెబ్బయి వేలన్నది ఆధికారిక నిర్ధారణ, కానీ వీరి సంఖ్య లక్షకు పైనే ఉందన్నది అనధికార అనుమానం! అస్సాంలోని అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టకపోతే, ‘రోహింగియా’ల నిష్క్రమణ సైతం అనుమానస్పదం కాగలదు. దేశవ్యాప్తంగా రూపొందనున్న ‘ఎన్‌ఆర్‌సీ’ వ్యవస్థలో భాగంగా అస్సాంలో కూడ మళ్లీ పౌర గణన జరుగుతుందన్నది దేశ వ్యవహారాల మంత్రి చెప్పిన మాట. అస్సాంలో మాత్రమే కాదు దేశమంతటా కూడ నిర్ణీత కాల వ్యవధిలో సమీక్ష జరుపవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు! కానీ అది మొదలయ్యే వరకు ధ్రువపడిన ఈ పంతొమ్మిది లక్షల ‘‘పౌరులు కాని’’వారి సంగతిని ఏం చేస్తారు? వారందరినీ బయటకు పంపించాలి కదా? ఎప్పుడు..??
జాతీయ పౌర సూచిక నుంచి విదేశీయులను తొలగించడాన్ని అన్ని రాజకీయ పక్షాలు, మాతృదేశం పట్ల మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ సమర్ధించాలి! కానీ కొందరు వ్యతిరేకించడమే అంతుపట్టని వ్యవహారం. ఇలా దేశ భద్రతను ‘‘వ్యతిరేకిస్తున్నవారు’’ ప్రభుత్వం రూపొందించిన ‘పౌరసత్వ సవరణ’ బిల్లు- సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్-ను కూడ వ్యతిరేకిస్తున్నారు. ఈ ‘సవరణ’వల్ల అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి గెంటివేతకు గురి అయిన ‘అఖండ భారత్’ పౌరులకు మన దేశంలో మళ్లీ పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగంగా ఉండిన సమయంలో ఈ మూడు దేశాలలోను సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లింది. ఈ దేశాలు స్వతంత్ర దేశాలుగాను, ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు’గాను ఏర్పడిన తరువాత ఈ దేశాలలో దశాబ్దులుగా ఇస్లామేతర మతాల నిర్మూలన జరిగింది, జరుగుతోంది. అందువల్ల ఈ దేశాలలో హత్యాకాండకు, పైశాచిక బీభత్సకాండకు లక్షల మంది ‘ఇస్లాం మతేతరులు’ బలైపోయారు. తప్పించుకొని పారిపోయి శరణార్థులై మన దేశంలోకి వచ్చిన వారికి మన దేశపు పౌరసత్వం లభించడం సహజ న్యాయం. ఎందుకంటె ఈ ఇస్లామేతర మతాల వారి దయనీయ స్థితి దశలవారీగా జరిగిన ‘అఖండ భారత’ విభజనతో ముడివడి ఉంది! అందువల్ల ఈ శరణార్థులకు మన దేశ పౌరసత్వం కల్పించడం తక్షణ కర్తవ్యం!!