సంపాదకీయం

వ్రతం చెడిన శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. శివసేన ఇలా వ్రతం చెడింది, సైద్ధాంతికంగా దివాలా తీసింది. మహారాష్ట్ర రాజకీయ రంగంలో దశాబ్దుల పాటు ‘సైద్ధాంతిక నిబద్ధత’కు శివసేన పార్టీ ఒక ఆదర్శం. ఆ ‘ఆదర్శం’ భయంకర అవకాశవాదంగా పరిణమించడం విస్మయకరమైన విపరిణామం. మహారాష్టల్రో రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి ఊహించని రీతిలో గత మూడు వారాలుగా ప్రస్ఫుటించిన శివసేన దిగజారుడుతనం ఏకైక కారణం. ఈ రాజ్యాంగ సంక్షోభం మహారాష్టల్రో రాష్టప్రతి పాలన విధించడానికి దోహదం చేయడం మంగళవారం సంభవించిన సహజ పరిణామం. విజయం సాధించిన రాజకీయ పక్షాల కూటమి శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే విఘటితం కావడం బహుశా రాజ్యాంగ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్నికల్లో కలసి పోటీ చేసిన పక్షాల కూటమి, శాసనసభలో సంఖ్యాధిక్యం- మెజారిటీ- సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇన్ని దశాబ్దులువగా నడచిన చరిత్ర. అలాంటి సంకీర్ణ ప్రభుత్వాలు నెలల తర్వాత కూలిపోతుండవచ్చు. రాష్టప్రతి పాలనకు ఆయా రాష్ట్రాలు గురై ఉండవచ్చు. మధ్యంతర ఎన్నికలు తప్పనిసరై ఉండవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి చరిత్ర పునరావృత్తమై ఉండవచ్చు. శాసనసభ ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పక్షానికి కాని, వివిధ పక్షాల కూటమికి కాని ‘సంఖ్యాధిక్యం’ లభించని స్థితి కూడ అనేకసార్లు ఏర్పడింది. అలాంటి సందర్భాల్లో కూడ వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ముగిశాక రాష్టప్రతి పాలనను విధించారు. ఈ రెండు రకాల విపరిణామాలకు పూర్తి భిన్నంగా మహారాష్టల్రో శాసనసభ ఎన్నికల తర్వాత, గత మూడు వారాలుగా విచిత్ర పరిణామ క్రమం కొనసాగింది. ఈ వైచిత్రికి సూత్రధారి శివసేన, వ్రతం చెడినా ఫలితం దక్కని శివసేన. శాసనసభ ఎన్నికలకు ముందే ‘కూటమి’గా ఏర్పడి భారతీయ జనతాపార్టీ, శివసేన ఎన్నికల్లో పోటీచేశాయి. ఈ కూటమికి శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన ‘సంఖ్యాధిక్యం’ లభించింది. భాజపాకు నూట అయిదు, శివసేనకు యాబయి ఆరు స్థానాలు దక్కాయి. వెరసి ఈ కూటమికి రెండు వందల ఎనబయి ఎనిమిది స్థానాలున్న శాసనసభలో ఇలా నూట అరవై ఒక్క స్థానాలు లభించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన నూట నలబయి అయిదు కంటె పదహారు స్థానాలు అధికంగా ఈ కూటమికి లభించాయి. ఐదేళ్లు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత కలిగిన విశ్వాసం. కానీ ఈ విశ్వాసం మూడు వారాలు గడచినప్పటికీ వాస్తవం కాలేదు, విశ్వాసం వమ్మయిపోవడం ఊహించని పరిణామం. ఇలా విశ్వాసాన్ని వమ్ము చేసిన పాపం ఎన్నికల తర్వాత శివసేన ప్రదర్శించిన అతార్కికమైన, అన్యాయమైన విధానానిది. ప్రభుత్వం ఏర్పాటు చేయమని భాజపా-శివసేన కూటమికి లభించిన జనాదేశాన్ని శివసేన వమ్ము చేసింది. మొదటిసారి ఇలా ‘మూడవ తరహా’ వైపరీత్యం ఏర్పడింది. సంకీర్ణ మంత్రివర్గాలు అర్ధాంతరంగా అంతం కావడం మొదటి వైపరీత్యం. ఎన్నికల తర్వాత ఏ పక్షానికీ, కూటమికి కానీ ‘సంఖ్యాధిక్యం’ లభించక పోవడం రెండవ రకం వైపరీత్యం. కానీ స్పష్టమైన ‘సంఖ్యాధిక్యం’ లభించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం ‘మూడవ రకం’ వైపరీత్యం!
ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవడం కోసం శివసేన మిత్రఘాతానికి ఒడిగట్టింది. భాజపాకు అత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షం శివసేన అన్నది మూడు దశాబ్దులకు పైగా కొనసాగిన అభిప్రాయం. 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ విశ్వాసానికి మొదటిసారిగా విఘాతం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో భాజపా, శివసేన పరస్పరం ప్రత్యర్థులుగా పోటీ చేయడం చరిత్ర. అయినప్పటికీ ఉభయపక్షాల మధ్య సైద్ధాంతిక సాన్నిహిత్యం చెడిపోలేదు. 2014 ఎన్నికల్లో శాసనసభలో నూట ఇరవై రెండు స్థానాలను గెలిచిన భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎన్నికల సమయంలో భాజపా ప్రత్యర్థిగా మారిన శివసేన ఎన్నికల తర్వాత భాజపాతో మళ్లీ జతకట్టింది. ఇలా జట్టుకట్టడానికి ప్రధాన కారణం ఉభయ పక్షాల మధ్య ఉన్న సైద్ధాంతిక సాన్నిహిత్యం! అందువల్ల 2019 అక్టోబర్ నాటి శాసనసభ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన భాజపా-శివసేన కూటమి ఎన్నికలు జరిగిన వెంటనే ఇలా విచ్ఛిన్నమై పోతుందని ఎవరూ భావించి ఉండరు. కానీ ఎన్నికల తర్వాత శివసేన మొదలుపెట్టిన అతార్కిక వాదం మూడు వారాల్లో మరింత మొండికెత్తింది. నూట అయిదు స్థానాల భాజపాకు, యాబయి ఆరు స్థానాల తమ పార్టీకి మధ్య అధికార సమానత్వం కావాలన్నది శివసేన అతార్కిక ప్రవర్తనకు ప్రాతిపదిక! రెండున్నర సంవత్సరాల పాటు తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించే అవకాశం ఇవ్వాలన్నది ఈ అర్థం లేని వాదం.. భాజపా ఇందుకు ఒప్పుకోలేదు. వెంటనే ‘ఆది నుంచి తమకు ప్రబల సైద్ధాంతిక విరోధులైన’ కాంగ్రెస్ వారితోను, జాతీయ కాంగ్రెస్ పక్షం వారితోను జట్టుకట్టడానికి శివసేన నడుం బిగించడమే విస్మయకరం! ఈ సైద్ధాంతిక విరోధం దశాబ్దులు కొనసాగింది!
ఈ వైపరీత్యానికి ఒడిగట్టడం, ఉభయ కాంగ్రెస్ పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్లజ్జగా యత్నాలు సాగించడం శివసేన వారి దివాలాకోరుతనం. సైద్ధాంతికంగా ఇలా దివాలా తీసిన శివసేన ప్రాబల్యం, ప్రాధాన్యం మహారాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా క్షీణించి పోవడం ఖాయం. శివసేనకు ఒకప్పుడు వోట్లు వేసినవారు ఆ పార్టీని ఇప్పుడు అసహ్యించుకొంటున్నారు. ‘కూటమి’ ధర్మం ప్రకారం శాసనసభలో ఎక్కువ స్థానాలను గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాలి. గతంలో భాజపా-శివసేన కూటమి మహారాష్టల్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇదే ధర్మం వర్తించింది. ‘కూటమి’లో అధిక స్థానాలను పొందిన శివసేనకే ముఖ్యమంత్రి పదవి దక్కింది. మనోహర్ జోషి, నారాయణ రాణే వంటి శివసేన నాయకులు ముఖ్యమంత్రులు కాగలిగారు. అప్పుడు ‘కూటమి’లో తక్కువ స్థానాలు పొందిన భాజపా ముఖ్యమంత్రి పదవిని కోరలేదు. అదే సూత్రం ఇప్పుడు కూడ వర్తించడం న్యాయం. ఈ న్యాయమైన వాదననే భాజపాకు చెందిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినిపించాడు. గతంలో తాము రూపొందించిన అధికార భాగస్వామ్య సూత్రాన్ని శివసేన వారు ఇప్పుడు పాటించకపోవడానికి కారణం ‘శివసేన’లో గత ఆరేళ్లుగా అంకురించి ప్రస్తుతం విషవృక్షంగా వేళ్లూనిన అత్యాశ, అవకాశవాదం, సైద్ధాంతిక పతనం! మహారాష్ట్ర రాజకీయాల్లో భాజపా క్రమంగా ఎదుగుతోంది, రాజకీయ పక్షాలలో మొదటి స్థానం సాధించగలిగింది. ఈ వాస్తవం 2014 నాటి ఎన్నికల్లోనే స్పష్టమైపోయింది. భాజపా ఎదుగుదల వల్ల తమ ప్రాబల్యం క్షీణించిపోతుందన్న భయం శివసేన అగ్రనాయకులను ఆవహించింది. అందువల్ల భాజపాను నిరోధించడం కోసమే 2014లో శివసేన ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. 2014లో తామే అతి పెద్ద పార్టీగా అవతరించగలమన్న శివసేన వారి వ్యూహం బెడిసికొట్టింది. భాజపాకు శివసేన కంటె ఎక్కువ స్థానాలు లభించడం ఇలా బెడిసికొట్టడం.. అది శివసేనకు రాజకీయ పరాజయం! ఈ ఎన్నికల తర్వాత శివసేన వ్యూహం మరోసారి బెడిసికొట్టింది. ఇది సైద్ధాంతిక పతనం...
శివసేనను స్థాపించి పెంచి పోషించిన బల్ ఠాక్రే తొలిరోజుల్లో ‘మరాఠీ ఆధిక్య’ సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చాడు. కానీ ఆ తరువాతి కాలంలో బల్ ఠాక్రే ‘ప్రాంతీయ’ పరిధి నుంచి విస్తరించి జాతీయ నిష్ఠానిబద్ధుడుగా ఎదిగాడు. జీవన పర్యంతం ఆయన జాతీయ భావ ప్రాబల్యం ప్రభావం విస్తరింపచేయడానికి తమ పక్షాన్ని మాధ్యమంగా మార్చాడు. తమ కుటుంబానికి అధికారాన్ని కాని, ముఖ్యమంత్రి పదవిని కాని బల్ ఠాక్రే కోరలేదు. బల్ ఠాక్రే కుటుంబ వారసులు ఆ మహనీయుని సైద్ధాంతిక నిష్ఠను నీరుకార్చడం కాల వైపరీత్యం.. విధాత అక్కటా ఎవ్వరినెట్లు చేయడు..??