సంపాదకీయం

కాలుష్య ‘విలయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నది దాదాపు పదకొండువేల మంది ప్రముఖ శాస్తవ్రేత్తలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. చెప్పినమాట కొత్తది కాదు. దశాబ్దుల తరబడి శాస్తవ్రేత్తలు, మేధావులు, విద్యాధికులు, పర్యావరణ పరిరక్షక ఉద్యమకారులు చెబుతున్న మాట ఇది. కానీ పదకొండువేల మందికి పైగా పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణ నిష్ఠకల శాస్తవ్రేత్తలు ఇలా సమష్టిగా ఈ వాస్తవాన్ని పునరావిష్కరించడం సరికొత్త శుభ పరిణామం. నూట యాబయి మూడు దేశాలకు చెందిన ఈ పదకొండువేల రెండు వందల యాబయి ఎనిమిది మంది శాస్తవ్రేత్తలు సంతకాలు పెట్టి విడుదల చేసిన అధ్యయన పత్రంలో ‘ముంచుకొస్తున్న పర్యావరణ విలయం’ గురించి ప్రపంచ ప్రజలను హెచ్చరించారట. ‘బయోసైన్స్’- జీవశాస్త్రం- అన్న ఆంగ్లపత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన పత్రంపై అరవై తొమ్మిది మంది భారతీయ శాస్తవ్రేత్తలు కూడ సంతకాలు చేశారట! ప్రపంచమంతటా పర్యావరణ విపత్కర పరిస్థితి- క్లయిమేట్ ఎమర్జెన్సీ- ఏర్పడి ఉన్నట్టు ఈ పత్రంలో శాస్తవ్రేత్తలు నిర్ధారించడం కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న ‘ప్రపంచీకరణ’ వాణిజ్య విధానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వాల నిర్వాహకులకు కనువిప్పు కలిగించగల పరిణామం. అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతుజాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారి ఉండడం ఈ శాస్తవ్రేత్తల హెచ్చరికకు నేపథ్యం. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. ఆకుపచ్చని అడవులు, సతత హరిత వ్యవసాయ క్షేత్రాల విస్తీర్ణం ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతోంది. తమలపాకుల తోటలను ధ్వంసం చేసి ఆ స్థలంలో ‘డబ్బాల తిండి’ని తయారుచేసే ‘ఆహార శుద్ధి’ పరిశ్రమలను స్థాపిస్తున్నారు. ఈ ‘శుద్ధి’ సహజ ప్రాకృతిక శుద్ధి కాదు. ఈ ‘శుద్ధి’ విష రసాయన శుద్ధి! లక్షల ఏళ్లుగా మనదేశంలో ఆహార శుద్ధి పరిశ్రమ దాదాపు ప్రతి ఇంట్లోను పరిఢవిల్లింది. ఎలాంటి విష రసాయనాలను వాడకుండానే ఇళ్లలో ఆహారం శుద్ధి చేసి నెలల తరబడి నిలువ చేశారు. ఆవకాయలు, అప్పడాలు, ఒరుగులు, బొరుగులు, అటుకులు, పేలాలు, తీయటి పండ్ల గుజ్జు, తేనెలు.. ఇంకా ఎనె్నన్నో రకాల ‘ఆహారం’ సహజ శుద్ధిని పొంది నిలువ ఉండేది. ఈ ప్రక్రియలో కాలుష్యం అంకురించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ గత కొన్ని దశాబ్దులుగా ఈ సహజ ప్రక్రియ, పర్యావరణకు హాని కలుగని శుద్ధి క్రియ మూలపడిపోయింది. విష రసాయనాల- ప్రిజర్వేటివ్స్, ఆర్ట్ఫిషియల్ ఫ్రాగ్నెనె్సస్, ఆర్ట్ఫిషియల్ కలర్స్-ను విరివిగా ఉపయోగించి ఆహారశుద్ధి- ఫుడ్ ప్రాసెసింగ్-ని భారీ ప్రాంగణాలలో కేంద్రీకృతం చేస్తున్నారు. ఫలితంగా కాలుష్యం కేంద్రీకృతమైంది. ఈ కాలుష్యం పర్యావరణ పటానికి ప్రకృతి పటలానికి కన్నాలను పొడిచింది. ప్రాకృతికమైన ఆకులు లేవు, ప్లాస్టిక్ విస్తరాకుల్లో ఈ ‘ప్రాసెస్డ్ ఫుడ్’ను పెట్టుకొని ఆరగించడం నడుస్తున్న కథ. దశాబ్దుల ఈ వ్యధ ఈ పదకొండువేల మంది శాస్తవ్రేత్తల హెచ్చరికకు నేపథ్యం. ప్రకృతికి ఏర్పడిన, ఏర్పడుతున్న గాయాలు ఇలాగే కొనసాగితే, ఆ గాయాల నుంచి కారే కాలుష్య రసాయనాలు మానవాళికి పెనుముప్పుగా మారనున్నాయి. శాస్తవ్రేత్తలు తమ అధ్యయన పత్రంలో పేర్కొన్న ‘‘అక్షరాలకు అందని వ్యధ..’’ ఇదీ!
వాస్తవ ప్రగతికి కేవలం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- మాత్రమే గీటురాయి కారాదన్న ఈ శాస్తవ్రేత్తల నిర్ధారణ కూడ కొత్తది కాకపోవచ్చు! అన్ని దేశాలలోను హరిత పరిరక్షక ఉద్యమకారులు చెబుతున్న మాట ఇది. స్థూల జాతీయ ఉత్పత్తి- జీడీపీ-ని పెంచడం మాత్రమే వాస్తవ సమగ్ర ప్రగతి కాజాలదని మన సర్వోన్నత న్యాయస్థానం వారు కూడ గతంలో వ్యాఖ్యానించి ఉన్నారు. ఇంతమంది శాస్తవ్రేత్తలు సైతం ఇపుడు ఇదే మాట చెబుతున్నారు. కానీ మన ప్రభుత్వం సహా వివిధ దేశాల ప్రభుత్వాలు ‘జీడీపీ’ పెరుగుదలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, విదేశీయ సంస్థలు పర్యావరణాన్ని పాడుచేసి, ప్రకృతిని ధ్వంసం చేసి ‘పర్యాటక రంగం’ పేరుతో విలాస, వినోద కేంద్రాలను నిర్మిస్తున్నాయి. పర్యాటకుల- టూరిస్టుల-ను ఆకర్షించడమే లక్ష్యమైంది. ఇందులో భాగంగా రిసార్టులు, విల్లాలు, సముద్రతీర విహార కేంద్రాలు, నక్షత్రాల హోటళ్లు నిర్మించేశారు. అనేక చోట్ల నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఈ ‘కట్టడాలు’ కాలుష్య విస్తరణకు కారణమవుతున్నాయి. విదేశీయ ‘లావాసా’ సంస్థ మన దేశంలోని పూణె నగరం సమీపంలో పడమటి కనుమలను పిండి కొట్టడం ఒక ఉదాహరణ మాత్రమే! ఇలా ‘పిండికొట్టిన’ చోట విల్లాలు, రిసార్టులు వెలిశాయి. కేవలం ‘పర్యాటక పట్టణ’- టూరిస్ట్ టౌన్‌షిప్స్- వాటికలు వెలిశాయి. ఇలా పర్యాటక ప్రధానమైన సేవారంగం ద్వారా జీడీపీలో అధికశాతం లభిస్తోందట. మన జీడీపీలో యాబయి ఆరు శాతం ఇలా సేవల రంగం నుంచి లభిస్తుండడం ఆర్థిక వ్యవస్థలోని ‘డొల్లతనం’. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయిక ఉత్పత్తులను పెంచగల పరిశ్రమల విస్తరణ నిజమైన ప్రగతికి గీటురాళ్లు..
వ్యవసాయ విస్తరణ ఆకుపచ్చతనం పెరగడానికి, ప్రకృతి పరిమళించడానికి దోహదం చేస్తుంది. ఈ వ్యవసాయం కూడ రసాయన విషపుఎఱువులపైన, రసాయన క్రిమి సంహార విషాలపైన ఆధారపడిన వ్యవసాయం కారాదు. గో ఉత్పత్తుల, అటవీ ఉత్పత్తుల ప్రాతిపదికగా జరిగే సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం మాత్రమే ప్రకృతికి కాలుష్యం లేని హరితశోభలను సంతరించి పెట్టగలదు. కానీ మన జీడీపీలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ కేవలం పదిహేను శాతం కావడం వాస్తవ ప్రగతిలో నిహితమై ఉన్న వైపరీత్యం. ప్రపంచ వాణిజ్యంలో మన దేశం వాటా నలబయి శాతంగా ఉండిన వ్యవస్థ శతాబ్దుల పాటు కొనసాగింది. బ్రిటన్ దురాక్రమణ మొదలయ్యే వరకు ఈ మన వాణిజ్య ప్రాథమ్యం కొనసాగడం చరిత్ర. ఈ చరిత్ర సాగిన కాలంలో మన దేశం భూభాగంలో యాబయి శాతం అడవులతో నిండి ఉండేది. పల్లెపట్టులు, పట్టణ వాటికలు ఆవులతో నిండి ఉండేవి. భారతదేశం ‘అన్నపూర్ణ’ అయింది. వ్యవసాయ ఉత్పత్తులు నిండిన ఓడలు మన సముద్రతీరాల నుంచి పడమటిగా ఐరోపా వరకు, తూర్పుగా ఇండోనేసియా, జపాన్‌ల వరకు పయనించడం సహస్రాబ్దుల చరిత్ర!
అందువల్ల జీడీపీ పెరుగుదల ప్రధానం కాదు, జీవన సౌలభ్యం- ఈజ్ ఆఫ్ లివింగ్- ప్రధానం. సహజ జీవన సౌలభ్యం ప్రకృతిని కూడ పరిరక్షించడం చరిత్ర. ప్రపంచ ప్రజలు శాకాహారం ఎక్కువగా సేవించాలని మాంసాహారం తినడం తగ్గించాలని ఈ పదకొండువేల మంది శాస్తవ్రేత్తలు చేసిన సూచనకు జీవన సౌలభ్యం ప్రాతిపదిక. మన దేశంలో మాంసాహారం భుజించే వారి సంఖ్య ఎనబయి శాతం కంటె ఎక్కువే. కానీ మాంసాహారం ప్రతిరోజూ ఆరగించడం మన దేశపు సంప్రదాయం కాలేదు. మాంసాహారం తినడం ఒక ‘్భగం’- లగ్జరీ- మాత్రమే. అది మాంసాహారులకు నిత్యం అవసరం కాలేదు. అందువల్ల వారానికో నెలకో ఒకసారి మాత్రమే మాంసం తినడం మన దేశంలో సంప్రదాయమైంది. విదేశీయ దురాక్రమణ సమయంలో సైతం స్వదేశీయులు ప్రతిరోజూ మాంసం తినలేదు. కానీ గత కొన్ని దశాబ్దులుగా ప్రతిరోజూ మాంసం తినడం చాలామందికి అలవాటైపోయింది. దీనివల్ల యాంత్రిక వధశాలల సంఖ్య పెరిగి కాలుష్యం విస్తరించింది. మాంసాన్ని డబ్బాల్లో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చేస్తున్న పరిశ్రమలు కాలుష్య కేంద్రాలు కావడం బహిరంగ రహస్యం. ఆవుల, పాడి పశువుల సంఖ్య తగ్గిపోవడం జీవవైవిధ్య పరిరక్షక వ్యవస్థకు విఘాతకరంగా పరిణమించింది. మాంసం తినడం తగ్గించాలని, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తినాలని ఈ శాస్తవ్రేత్తలు సలహా ఇవ్వడానికి ఈ ప్రాకృతిక వాస్తవం ప్రాతిపదిక. ఆవులు, అడవులు ప్రకృతి పరిపుష్టికి ప్రతీకలు. హరిత పరిరక్షక నియమాలను బలిపెట్టి కాలుష్య పరిశ్రమలను కేంద్రీకరిస్తున్న ‘ప్రపంచీకరణ’ విధానాలకు స్వస్తి చెప్పడం ‘సార్ధశత జయంతుల’ను జరుపుకున్న గాంధీ మహాత్మునికి నిజమైన నివాళి కాగలదు!