సంపాదకీయం

కాంగ్రెస్ ‘నిరసన’..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కడం అన్న సామెతకు బహుశా ఇది మరో కార్యాచరణ.. వాణిజ్య ప్రపంచీకరణను భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెత్తికెత్తి 2014లో నిష్క్రమించిన కాంగ్రెస్ వారు ఇప్పుడు భాజపాను విమర్శిస్తున్నారు. ఈ ‘ప్రపంచీకరణ ఆర్థికనీతి’ భాజపా నిర్వాహక కేంద్ర ప్రభుత్వం మెడలో గుదిబండలా వేలాడుతోంది. ఈ గుదిబండను తయారు చేసింది 2004-2014 సంవత్సరాల మధ్య దేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ ఆధ్వర్యవంలోని కేంద్ర ప్రభుత్వం, మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వం.. కాంగ్రెస్ వారు గతంలో తాము తయారుచేసిన గుదిబండను, ప్రపంచీకరణను ఇపుడు తామే దూషించడం ‘మొగుణ్ణి చితకబాది మొగసాలకెక్కడం..!’. ఆగ్నేయ, పూర్వ ఈశాన్య ఆసియా దేశాలతో కలసి ఏర్పడిన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’- స్వేచ్ఛా వాణిజ్య- వ్యవస్థలో చేరరాదన్న సోమవారం నాటి ప్రభుత్వ నిర్ణయం తమ వ్యతిరేకత ఫలితమేనని కాంగ్రెస్ వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి గత పదిరోజులుగా ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’- రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్- ర్సెప్- వ్యవస్థను తాము వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ వారు చెప్పుకొచ్చారు. కానీ ఏడేళ్ల క్రితం ‘ఆసియాన్’- ఆగ్నేయ ఆసియా దేశాల కూటమితో ఇలా ‘స్వేచ్ఛా వాణిజ్య అంగీకారం’- ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్- ఎఫ్‌టీఏ- కుదుర్చుకొనడానికి రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే! ఈ స్వేచ్ఛా వాణిజ్య అంగీకారం చైనా వాణిజ్య విస్తరణకు మాధ్యమం. చైనా తదితర దేశాలు చేరిన తర్వాత ఇది ‘ర్సెప్’గా అవతరించింది. అందువల్ల ‘ర్సెప్’పై చర్చల ప్రహసనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభించడం చారిత్రక వాస్తవం. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వారే నిర్వహించగలిగి ఉండినట్టయితే బహుశా ‘ర్సెప్’ ఈపాటికి మన నెత్తికెక్కి ఉండేది. ఇప్పటికే చైనాతోను ఆసియాన్ దేశాలతోను మనం జరుపుతున్న వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడి ఉంది. ‘ర్సెప్’లో మనం చేరినట్టయితే ఈ లోటు తక్షణం రెట్టింపు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రహసనం వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని భాజపా ప్రభుత్వం నిరోధించింది. ఇదీ వాస్తవం!
కానీ తమ వ్యతిరేకతకు తలఒగ్గి భాజపా ప్రభుత్వం ‘ర్సెప్’లో చేరరాదని నిర్ణయించినట్టు కాంగ్రెస్ చెబుతోంది. ఏడేళ్ల క్రితం తాము ఈ ప్రతిపాదనపై చర్చలకు అంగీకరించిన సంగతి బహుశా కాంగ్రెస్‌కు గుర్తు ఉంది. అందువల్ల తమ ప్రభుత్వం ఏడేళ్ల క్రితం పెద్ద తప్పిదం చేసిందని కాంగ్రెస్ వారు ఇప్పుడు అంగీకరించాలి. ఇలా అంగీకరించినపుడు మాత్రమే ఈ విషయమై మాట్లాడే నైతిక అధికారం కాంగ్రెస్‌కు లభిస్తుంది. నిజానికి ప్రపంచీకరణ మన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. ప్రపంచీకరణను మన దేశం నెత్తికెక్కించిన వ్యక్తి- అంతర్జాతీయ ఆర్థికవేత్త అయిన మన్‌మోహన్ సింగ్! 1991- 1996 సంవత్సరాల మధ్య ఆర్థిక మంత్రిగా, 2004-2014 సంవత్సరాల మధ్య ప్రధానిగా మన్‌మోహన్ ప్రపంచీకరణను వ్యవస్థీకరించాడు. ‘పుడమి పల్లె’- గ్లోబల్ విలేజ్- అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం, అంతర్జాతీయ విస్తృత ప్రయోజన సాధన, సంకుచిత జాతీయ ప్రయోజనాలు, స్వేచ్ఛావిపణి- మార్కెట్ ఎకానమీ- వంటివి ప్రపంచీకరణలో భాగంగా పుట్టుకొచ్చిన పారిభాషిక పదజాలం. ఈ ముద్దుమాటలను మన్‌మోహన్ బృందం వారు మన దేశంలో ప్రచారం చేశారు. కానీ ప్రపంచీకరణ వల్ల ‘పుడమి పల్లె’ ఏర్పడ లేదు. సార్వభౌమ దేశాల సరిహద్దుల గోడలు కూలిపోయి ప్రపంచమంతా అంతర్జాతీయ అద్వితీయ సమాజంగా ఏర్పడాలని ప్రపంచీకరణ కర్తలు ప్రచారం చేశారు. దీన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత మన్‌మోహన్ ప్రభుత్వానిది. అంతర్జాతీయ ప్రయోజన విస్తృత సిద్ధి జరిగిందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు. కానీ మన అంతర్గత ఆర్థిక వ్యవస్థ మాత్రం కల్లోలగ్రస్తమైపోయింది. ఈ ‘కల్లోలం’ ప్రగతి అన్న ‘భ్రాంతి’ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకంటే భాజపా నిర్వాహక ప్రభుత్వం కూడ మన్‌మోహన్ ప్రధానమంత్రిత్వం నాటి ప్రపంచీకరణ వారసత్వ ఆర్థికనీతిని కొనసాగిస్తోంది. చిల్లర వ్యాపారంలోకి విదేశీయ సంస్థలను, బహుళ జాతీయ సంస్థల చొఱబాటును అనుమతించడం మన అంతర్గత ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రపంచీకరణ బట్టీలో తయారుచేసిన ఈ ‘గొడ్డలి’ని మోదీ ప్రభుత్వం స్వీకరించింది! పెట్రోలియం ఉత్పత్తులను అంతర్జాతీయ విపణితో అనుసంధానం చేసినప్పటి నుంచి వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ అనుసంధానం సాధించిన ఘనత కూడ మన్‌మోహన్ ప్రభుత్వానిదే. ఈ అనుసంధాన కబంధ బంధం నుంచి ఇప్పటికీ బయటపడక పోవడం, పెట్రోలియం ఉత్పత్తులను ‘వస్తుసేవా సుంకాల’- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సెస్- జీఎస్‌టీ- పరిధిలోకి తేలేకపోవడం మన్‌మోహన్ ఆర్థికనీతి కొనసాగింపునకు నిదర్శనం.. ఉదాహరణలు ఇంకా ఉన్నాయి!!
మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వారు మంగళవారం ఆరంభినట్టు ప్రచారమవుతున్న నిరసనలకు, రుసరుసలకు ఔచిత్యం లేదు. కాంగ్రెస్ వారు గతంలో తాము అనుసరించిన ఆర్థికనీతిని తామే ఇప్పుడు నిరసించినట్టవుతోంది. కాంగ్రెస్ పాలననాటి ఆర్థికనీతి మాత్రమే ఇప్పుడు కూడ అమలు జరుగుతోంది- అవినీతి తప్ప! అందువల్ల కాంగ్రెస్ వారి ‘నిరసన’ స్వీయ అభిశంసన.. బొగ్గు, ఇనుము- ఉక్కు, సిమెంటు, విద్యుత్తు, ఇంధనతైల- ఇంధనవాయు, ఎరువుల ఉత్పత్తుల రంగాలు ఆర్థిక ప్రగతికి వౌలికమైన పారిశ్రామిక వ్యవస్థలు. ఈ ఆరు వౌలిక రంగాల్లో మాత్రమే విదేశీయ బహుళజాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీనేషనల్ కంపెనీస్- పెట్టుబడులను పెట్టడానికి అనుమతిస్తామన్నది 1993-1994 సంవత్సరాల్లో అప్పటి ఆర్థిక మంత్రి మన్‌మోహన్ చెప్పినమాట! కానీ ఈ రంగాల్లో తప్ప అన్ని ఇతర రంగాల్లోను విదేశీయ సంస్థలు చొఱబడి ఉండడం నడుస్తున్న చరిత్ర. సేవల రంగం, పంపిణీ రంగం, చిల్లర వ్యాపారం, వ్యవసాయం.. ఇవన్నీ బహుళ జాతీయ సంస్థల భయంకరమైన చొఱబాటుకు గురై ఉన్నాయి. ఈ విదేశీయ సంస్థలు మన దేశంలో అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదు. ఆవకాయలను, అప్పడాలను తయారుచేసి భయంకరమైన ధరలకు మన దేశంలోనే విక్రయిస్తున్నాయి. లాభాలను తమ దేశాలకు తరలిస్తున్నాయి. ఇదీ విదేశీయ సంస్థల పెట్టుబడుల బండారం.. బొగ్గును ఉత్పత్తి చేసి సరఫరా చేయడం లేదు, ఇంటింటికీ భోజనం సరఫరా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాయి! ఇలా ‘హోమ్ డెలివరీ’- ఇంటికి చేరవేత-లో ఒక భోజనం ధరతో ఇంట్లో వండుకుంటే పదిమంది తినవచ్చు. ప్రయాణం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ‘ఓలా’, ‘ఉబర్’ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. అడిగే దిక్కులేదు. ఇదీ ప్రపంచీకరణ! ఆటోరిక్షాల్లో మీటర్లు పనిచేయవు!!
అంతర్గత దేశ భద్రతను, సరిహద్దుల రక్షణను పెంపొందిచడంలో భాజపా ప్రభుత్వం మన్‌మోహన్ ప్రభుత్వం నాటి మెతక విధానాలకు పూర్తి విరుద్ధమైన పటిమను ప్రస్ఫుటింప చేస్తోంది. ప్రత్యామ్నాయ విద్యా పద్ధతులను, పాలనానీతిని రూపొందించింది. ‘యోగం’, సౌరశక్తి వినియోగం వంటి కార్యక్రమాల ద్వారా స్వజాతీయ అస్తిత్వ పునరుద్ధరణకు, సాంస్కృతిక గరిమను పెంపు చేయడానికి యత్నిస్తోంది. ఇలా ఆర్థికేతర సర్వ రంగాల్లోనూ కాంగ్రెస్ నీతికి ప్రత్యామ్నాయ రీతిని సమకూర్చగలుగుతున్న భాజపా ప్రభుత్వం కాంగ్రెస్ ఆర్థిక నీతిని, ప్రపంచీకరణ వైపరీత్యాన్ని మాత్రం వదిలించలేక పోవడం జాతీయ వైపరీత్యం. ‘ర్సెప్’లో చేరక పోవడం ప్రపంచీకరణ, వాణిజ్య వైపరీత్యాన్ని వదిలించుకొనడానికి శుభారంభం కాగలదా..?