సంపాదకీయం

చైనా ‘ఆత్మీయత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత, చైనా ప్రభుత్వ అధినేతల లాంఛన రహిత-ఇన్‌ఫార్మల్- సమావేశం జరగడం ఇది రెండవసారి. మదరాసులోను, మదరాసునకు యాబయి కిలోమీటర్ల దూరంలోని సముద్రతీర పట్టణం మహాబలిపురంలోను అక్టోబర్ పదకొండవ, పనె్నండవ తేదీలలో ఈ సమావేశం జరగడం గొప్ప చారిత్రక ఘటనగా ప్రచారం అవుతోంది! లాంఛన రహిత సమావేశానికి, లాంఛన సహిత ఆధికారిక- అఫీషియల్- సమావేశానికి మధ్య తేడా ఏమిటన్నది జనం మనసులలో తలెత్తే సహజమైన సందేహం. చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో మన ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి లాంఛన రహిత- ఆత్మీయ- సమావేశాలను జరుపడంలో ఔచిత్యం ఏమిటన్నది జనం నాలుకలపై నానుతున్న మరో ప్రశ్న. చైనాలోని ‘ఉవూహాన్’ నగరంలో ఇదివరకే ఉభయ నాయకులు ఒకసారి ఇలా ‘ఆత్మీయ’ సమావేశం జరిపి ఉన్నారు. అప్పటినుంచి ఈ ‘ప్రశ్న’ జనం మనసులలో మెదలుతూనే ఉంది. మదరాసు-చెన్నయ్- మహాబలిపురాలలో కొలువుతీరనున్న శుక్ర శనివారాల ‘కలయిక’ రెండవ ‘ఆత్మీయ’ సమావేశం! ‘ఉవూహాన్’ స్ఫూర్తిని కొనసాగించడానికే మహాబలిపురం సమావేశం జరుగుతోందన్నది జరుగుతున్న ప్రచారం. ‘ఉవూహాన్’ స్ఫూర్తి ఏమిటన్నది మరో అనిర్వచనీయమైన అనుభూతి! చైనా క్రీస్తుశకం 1962లో మన దేశంపై దొంగదెబ్బ తీసింది, మన దేశంలోకి చొఱబడింది, మైత్రి ముసుగులో వెన్నుపోటు పొడిచింది, అనేక చదరపుమైళ్ల మన భూభాగాన్ని దురాక్రమించి తిష్ఠవేసి ఉంది. అలాంటి శత్రు దేశమైన చైనాతో మన ప్రభుత్వం వివాద పరిష్కారం కోసం ‘అధికార చర్చలు’ జరుపవచ్చు. కానీ ఆత్మీయ సమావేశాలను జరుపడం కూడ మన జాతీయ సంప్రదాయం.. మహాకవి ‘కరుణశ్రీ’ అన్నట్టు మనజాతి, ‘‘చచ్చిన జాతి కాదు, మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతికాదు, పగనెంచు విరోధిని పట్టి కౌగిటన్ గుచ్చిన జాతిరా ఇది...!’’ నరేంద్ర మోదీ ఈ జాతీయ సంప్రదాయానికి అనుగుణంగా బహుశా ఈ లాంఛన రహిత సమావేశాలను ఆరంభించాడు. గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడవ, ఇరవై ఎనిమిదవ తేదీలలో చైనాలోని ‘ఉవూహాన్’లో మొదటి ‘ఆత్మీయ’ సమావేశం జరిగింది. ఇప్పుడు రెండవ సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొనడానికై ఝీజింగ్ పింగ్ మన దేశానికి వస్తున్నాడు...
అధికార సమావేశాలు ప్రభుత్వ అధినేతల మధ్య, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరుగుతున్నాయి. ఆత్మీయ సమావేశాలు అధికారంలో ఉన్నవారు వైయక్తిక స్థాయిలో నిర్వహించుకునేవి. ఇలా నిర్వహించుకోవడంవల్ల రెండు దేశాల నిర్వాహకుల మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం పెరుగుతుంది, చెలిమి చిగురిస్తుంది. ఇలా ప్రభుత్వ అధినేతల మధ్య వికసించే వినూతన మైత్రి ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి దోహదం చేయాలి. అలా జరిగినట్టయితే ప్రభుత్వ అధినేతల మధ్యగల మైత్రి దేశాలమధ్య మైత్రిని పెంపొందిస్తుంది. ఇరుగుపొరుగు దేశాల విషయంలో ఇలాంటి ‘పరిణామక్రమం’ మరింత ప్రధానమైనది. గతంలో మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇలా చైనీయ మహానాయకులతో వ్యక్తిగత స్నేహసంబంధాలను పెంపొందించుకున్నట్టు చరిత్ర.. ‘‘జవహర్‌లాల్ నెహ్రూ పెట్టుబడి దేశాల, సామ్రాజ్యవాదుల తొత్తు! ఆయన వారి వీపుమీద ఎక్కి కూర్చుని ఉన్నాడు!’’అని చైనా కమ్యూనిస్టు నియంతృత్వ ప్రచారం వారి అధికార ప్రచార యంత్రాంగం 1949వ సంవత్సరంలో దుమ్మెత్తిపోసింది. ఈ ‘దుమ్మెత్తిపోయడం’ 1950వ దశకం ఆరంభంలో కూడ కొనసాగింది! అందువల్ల నెహ్రూ మిక్కిలి బాధపడినట్టు చరిత్ర... ఈ అపవాదును మాన్పుకొనడానికై 1949-1962 సంవత్సరాల మధ్య మన ప్రధానమంత్రి హోదాలో జవహర్‌లాల్ నెహ్రూ అవిరళ కృషిచేశాడు! ఈ కాలవ్యవధిలో అంతర్జాతీయ వేదికలపై మన జవహర్‌లాల్ చేసిన ప్రసంగాల ప్రధాన ఇతివృత్తం కమ్యూనిస్టు చైనాపై ప్రశంసల వర్షం కురిపించడం. అంతర్జాతీయ అశాంతికి ప్రధాన కారణం ఈ ‘కమ్యూనిస్టు’- నవ- చైనాకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేకపోవడమే కారణమని నెహ్రూ పదేపదే వాక్రుచ్చడం చరిత్ర. ‘సమితి’లో సభ్యత్వంతోపాటు ‘సమితి’ భద్రతామండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించడం ‘విశ్వశాంతి’ వికసనానికి దోహదం చేయగలదని నెహ్రూ అభిభాషించేవాడు...
చైనా 1949లో రెండుగా చీలింది. మొదటిది జాతీయ చైనా. ఇప్పుడిది ‘తైవాన్’గా మనుగడ సాగిస్తోంది. రెండవది కమ్యూనిస్టు చైనా! 1949లో జాతీయ చైనాకు ‘సమితి’లో సభ్యత్వం లభించింది, అసలు చైనాగా గుర్తింపు లభించింది. కమ్యూనిస్టు చైనాకు సమితి సభ్యత్వం దక్కలేదు, అసలు ‘చైనా’గా పరిగణన దక్కలేదు. అందువల్ల ‘సమితి’నుంచి జాతీయ చైనాను వెళ్లగొట్టి ‘కమ్యూనిస్టు చైనా’ను చేర్చుకోవాలని మన నెహ్రూ పదే పదే వాదించాడు. దీనివల్ల తనకు చైనా నాయకులతో మైత్రి పెరిగిందని నెహ్రూ భ్రమించాడు. నెహ్రూ జీవించి ఉండగా కమ్యూనిస్టు చైనాకు ‘సమితి’లో సభ్యత్వం లభించలేదు, అమెరికా అడ్డుకుంది. అమెరికా తన విధానాన్ని మార్చుకొని, ‘జాతీయ చైనాను సముద్రంలో ముంచెత్తడంతో’ 1971లో కథ మారింది... జాతీయ చైనాను ‘సమితి’నుంచి వెళ్లగొట్టారు, ఈ కమ్యూనిస్టు చైనాను అసలు చైనాగా గుర్తించారు, ‘సమితి’లో సభ్యత్వం కల్పించారు, ఫలితంగా ‘మండలి’లో కమ్యూనిస్టు చైనాకు శాశ్వత సభ్యత్వం, నిరోధక నిర్ణాయక అధికారం- వీటో పవర్- లభించాయి. కానీ ఈలోగా కమ్యూనిస్టు చైనా 1959లో మన ఉత్తరపు సరిహద్దులోని టిబెట్‌ను దురాక్రమించి దిగమింగింది, మనకు ఉత్తరపు సరిహద్దుగా మారింది. వెంటవెంటనే 1962లో మన దేశంలోకి చొఱబడింది. నెహ్రూ చైనా నాయకులతో పెంచుకున్న ‘ఆత్మీయత’ బెడిసికొట్టిన తీరు ఇది. ‘‘శామ్యేత్ ప్రతి అపకారేణ, న ఉపకారేణ దుర్జనః’’- ‘దుర్జనునికి ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ వాడు మైత్రిని పాటించడు, ప్రతిగా అపకారం చేసినప్పుడు మాత్రమే దుర్జనుడు అణగిపోతాడు.’ అన్నది చైనావంటి దురాక్రమణ శక్తుల పట్ల మన దేశం పాటించదగిన యుగయుగాల నీతి! మహాకవి గుఱ్ఱం జాషువా ఆకాంక్షించినట్టు ‘‘చైనీయ రుధిర నిరరుల స్నానంబాడి, భరత సైనిక కోట మరలునాడు’’మాత్రమే చైనాగ్రస్తమై ఉన్న మన భూమి మళ్లీ మనకు దక్కుతుంది, కైలాస మానస సీమలకు చైనా కబంధ బంధం నుంచి విముక్తి లభిస్తుంది. ‘ఆత్మీయ సమావేశం’లో మైత్రిని అభినయించిన ఝీజింగ్ పింగ్ ఉవూహాన్ సమావేశం తరువాత మనకు వ్యతిరేకంగా తమ విధానాన్ని ఉద్ధృతం చేయడం నడుస్తున్న కథ.. ఇదీ ఉవూహాన్ స్ఫూర్తి..
మనం సమితిలో చైనా సభ్యత్వం కోసం అవిరళ కృషిచేశాము. కానీ చైనా దశాబ్దులుగా మనకు సమితి ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. ‘అణు పదార్థ పరిజ్ఞాన పరికరాలను సరఫరా చేసే దేశాల కూటమి’- న్యూక్లియర్ సప్లయ్యర్స్ గ్రూప్- ఎన్‌ఎస్‌జి-లో మన దేశానికి సభ్యత్వం లభించకుండా అడ్డుకుంటోంది, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో చొఱబడి అక్రమంగా ఆర్థిక పథకాలను అమలు జరుపుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను ఆమోదిస్తోంది. ఇలాంటి చైనా విధానాలలో ‘ఉవూహాన్’ సమావేశం తరువాత మార్పు రాలేదు. ఇదీ గీటురాయి. మహాబలిపురం సమావేశం తరువాత మార్పురాగలదా?? జమ్మూ కశ్మీర్ వ్యవహారంలో బుధవారం మనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం శుక్రవారం జరిగే సమావేశానికి వికృత నేపథ్యం. 1956లో అప్పటి చైనా ప్రధాని ఝల్‌ఎన్‌లయ్ మహాబలిపురానికి వచ్చి వెళ్లాడట.. ఇప్పుడు ఝీజింగ్ పింగ్ వస్తున్నాడు!