సంపాదకీయం

‘నిజాం’ నిజరూఫం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సంస్థానం క్రీస్తుశకం 1948లో నిజాం బీభత్స పాలన నుంచి విముక్తం అయిందన్న వాస్తవానికి ఇది సరికొత్త ధ్రువీకరణం. 1947 నాటికి విలీనమైన ఇతర సంస్థానాల వలె ‘హైదరాబాద్’ కూడ 1948లో భారత్‌లో విలీనమైందన్న అబద్ధపు ప్రచారం చేస్తున్నవారికి బుధవారం వెలువడిన తీర్పు తీవ్రమైన అభిశంసన! లండన్‌లోని బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. 1948లో హైదరాబాద్ సంస్థానం చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్తాన్ సైనిక సహాయం అర్థించిన వాస్తవం ఈ తీర్పువల్ల మరోసారి ప్రముఖంగా ప్రచారవౌతోంది. సైనిక సహాయం కోసం 1948లో హైదరాబాద్ సంస్థానం ప్రభుత్వం పాకిస్తాన్‌కు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల- పదిలక్షల బ్రిటన్ పౌండ్ల-ను చెల్లించింది. భారతదేశానికి వ్యతిరేకంగా నిజాం జరిపిన విద్రోహకాండలో ఈ ‘చెల్లింపు’ భాగం. పాకిస్తాన్ నుంచి సైనిక సహాయం పొంది భారత్‌కు వ్యతిరేకంగా పోరాడి, భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్ర దేశంగా తమ సంస్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది 1948 నాటి నిజాం దుర్బుద్ధి. దేహం మధ్యలో పుండు వలె భారతదేశం మధ్యలో పుండుగా ‘స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం’ కొనసాగాలన్నది నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ విష వాంఛ. ఈ వాంఛ నెరవేరలేదు. పాకిస్తాన్ సైనికులను పంపలేక పోయింది. ఆలోగా మన కేంద్ర ప్రభుత్వం జరిపిన ‘పోలీసు చర్య’ ఫలితంగా హైదరాబాద్ సంస్థానం నిజాం బీభత్స ముఠా మతోన్మాద పైశాచిక పాలన నుంచి విముక్తమైంది. భారత్‌లో యథాపూర్వంగా ఒక ప్రాంతం అయింది. ఈ యథాపూర్వ స్థితి క్రీస్తుశకం 1323లో విదేశీయ జిహాదీల వంచనతో కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన నాటిది. ఆరువందల ఇరవై ఐదేళ్ల జిహాదీల బీభత్స పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి 1948 నాటి భారత ప్రభుత్వ చర్య!
బ్రిటన్ రాజధాని లండన్‌లోని ‘వెస్ట్ మినిస్టర్ బ్యాంకు’లో 1948లో- విముక్తికి పూర్వం- నిజాం ప్రభుత్వం వారు పాకిస్తాన్ ప్రభుత్వం ఖాతాలో జమకట్టిన పదిలక్షల పౌండ్లు ఆ బ్యాంకులోనే ఉండిపోయాయి. 1948 సెప్టెంబర్ 20వ తేదీన ‘హైదరాబాద్ సంస్థాన విమోచనం’ తర్వాత మూడు రోజులకు పాకిస్తాన్ ఖాతాలోని ఈ పదిలక్షల పౌండ్ల మొత్తాన్ని బ్రిటన్ బ్యాంకు యాజమాన్యం స్తంభింపజేసింది. ఈ ‘స్తంభన’కు 1955లో బ్రిటన్ న్యాయస్థానం ఆమోదం లభించింది. ఆ ఖాతాలోని అప్పటి తొమ్మిది కోట్ల రూపాయల సొమ్ము ప్రస్తుతం మూడు వందల ఆరుకోట్ల రూపాయలు- మూడున్నర కోట్ల బ్రిటన్ పౌండ్లు- అయిందట! లండన్‌లోని ఆ ‘వెస్ట్ మినిస్టర్ బ్యాంక్’ పేరు ప్రస్తుతం ‘నేషనల్ వెస్ట్’- నేట్ వెస్ట్- బ్యాంక్! 1948లో హైదరాబాద్ సంస్థానం తరఫున సంస్థానం ఆర్థికమంత్రి ఈ సొమ్మును లండన్‌లోని అప్పటి పాకిస్తానీ రాయబారి- హైకమిషనర్- హబీబ్ ఇబ్రహీం రహమతుల్లా ఖాతాలోకి బదిలీ చేశాడు. అందువల్ల ఈ డబ్బు అప్పటి హైదరాబాద్ సంస్థానం ప్రభుత్వానిదన్నది స్పష్టం. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం వారు నిజాం బీభత్సపాలన నుంచి విమోచనం చేసిన తర్వాత ఆ సొమ్ముకు- విదేశాలకు సంబంధించినంత వరకు- భారత ప్రభుత్వమే యజమాని. అందువల్లనే 1965లో మాజీ నిజాం- ‘ భారత రాష్ట్రపతిదే లండన్ బ్యాంకులోని సొమ్ముపై అధికారం’ అని అంగీకరించవలసి వచ్చింది. అప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం మాటను కాని, నిజాం- అతని వారసుల మాటను కాని బ్రిటన్ న్యాయస్థానాలు పట్టించుకోలేదు. ఆ ఖాతాలోని సొమ్ము తమకు చెందాలని పాకిస్తాన్ ప్రభుత్వం వారు, తమకు తిరిగిరావాలని నిజాం కుటుంబం వారు చేసిన వాదనలకు ఫలితం లభించలేదు. 1965లో మన ప్రభుత్వం ఈ వివాదంలో చేరింది. ఈ మూడు వందల ఆరుకోట్ల రూపాయలపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని బుధవారం లండన్‌లోని బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం- హైకోర్టు- తీర్పు చెప్పడం సహజమైన పరిణామం. ఈ డబ్బు భారత ప్రభుత్వానికి, నిజాం వారసులకు చెందాలని లండన్ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఈ డబ్బు భారత ప్రభుత్వానికి చెందినది కాబట్టి, ఈ మొత్తాన్ని బ్యాంకువారు భారత ప్రభుత్వానికి అప్పగించాలన్న తీర్పు దేశాల సార్వభౌమ అధికారానికి, అంతర్జాతీయ న్యాయ నియమాలకు అనుగుణంగా ఉంది. కానీ నిజాం కుటుంబ వారసులకు కూడ ఇందులో వాటా లభించాలని కోర్టు తీర్పు చెప్పడం మాత్రం ఘోరమైన వైపరీత్యం. నిజాం కుటుంబానికి కాని, వారసులకు కాని వాటా లభించాలనడం చారిత్రక వాస్తవాలకు, రాజ్యాంగ రాజ్యాధికార నియమాలకు అనుగుణంగా లేదు. పాకిస్తాన్‌కు డబ్బు చెల్లించి కిరాయి సైనికులను దిగుమతి చేసుకొనడం అలనాటి హైదరాబాద్ సంస్థాన ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. చెల్లించిన డబ్బు కూడ నిజాం వ్యక్తిగత లేదా కుటుంబ సంబంధమైనది కాదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ డబ్బును చెల్లించారు. నిజాం కుటుంబ సభ్యులు కాని, వ్యక్తిగత ప్రతినిధులు కాని ఆ సొమ్మును చెల్లించలేదు. సంస్థానం ఆర్థికమంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వపు ఖజానా నుంచి ఆ సొమ్మును చెల్లించాడు. అందువల్ల ఆ ధనం తిరిగి చేరవలసింది భారత ప్రభుత్వ ఖజానాకు మాత్రమే! హైదరాబాద్ సంస్థానం ‘స్వతంత్ర దేశం’గా కొనసాగాలన్న పగటికలను నిజం చేయడానికి యుద్ధం చేసిన నిజాం ఓడిపోయాడు. హైదరాబాద్ సంస్థానాన్ని అతని అధికార పరిధి నుంచి విమోచనం చేసి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నిజాం పాలన అంతమైంది. వారసత్వంగా రాజ్యాధికారం సంక్రమించే వ్యవస్థ కూడ రద్దయిపోయింది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. అందువల్ల 1948 సెప్టెంబర్ 17వ తేదీ తరువాత ఆ డబ్బుపై అప్పటి ‘పదవీచ్యుతికి గురైన నిజాం’కు అధికారం లేదు. అంతకుముందు కూడ ఆ సొమ్ము హైదరాబాద్ ప్రభుత్వానిది, నిజాం వ్యక్తిగత ఆస్తి కాదు. నిజాం కుటుంబ వారసులకు ప్రభుత్వ నిధిపై ఎలాంటి హక్కు సంక్రమించదు. భారత ప్రభుత్వంతో పాటు నిజాం కుటుంబ సభ్యులకు కూడ బ్యాంకులో ఉన్న మొత్తంపై వాటా ఉందని లండన్ కోర్టు తీర్పు చెప్పడం విచిత్రమైన వ్యవహారం.
మొత్తం సొమ్ము భారత ప్రభుత్వానికే చెందాలి. అప్పటి హైదరాబాద్ సంస్థానం ప్రస్తుతం మూడు రాష్ట్రాలలో చేరి ఉంది. అత్యధిక భూభాగం, అత్యధిక జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కర్నాటక, మహారాష్టల్ల్రో మిగిలిన భూమి, ప్రజలు ఉన్నారు. అందువల్ల కేంద్రం ఈ మూడు వందల ఆరు కోట్ల రూపాయలను తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిత నిష్పత్తి ప్రకారం పంచవచ్చు. అంతేకాని నిజాం కుటుంబం వారికి పాలు పంచడం ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. తీర్పును సవరించాలని ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం లండన్ కోర్టులో న్యాయయాచికను దాఖలు చేయాలి. ఇన్ని దశాబ్దుల పాటు కేంద్ర ప్రభుత్వానికి ఈ ధ్యాస కలుగకపోవడమే అంతుపట్టని వ్యవహారం. తనకు తెలియకుండానే ఈ ‘నగదు బదిలీ’ జరిగిందని హైదరాబాద్ విమోచనం తర్వాత నిజాం ప్రకటించాడట! తనతో చెప్పకుండా, తన అనుమతి లేకుండా ఆర్థికమంత్రి ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు నిజాం ప్రకటించాడట! అదంతా బుకాయింపు. భారత్‌లో కలవకుండా స్వతంత్ర దేశంగా ఉండడం కోసం నిజాం ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడం చరిత్ర. ‘సమితి’లో శృంగభంగం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో మంతనాలు జరిపాడు. కిరాయి సైన్యం కొనుగోలు కోసం పాకిస్తాన్‌తో జరిగిన సంప్రదింపులు నిజాం అనుమతితో మాత్రమే కాదు, అతగాడి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్‌ను నిజాం భారత్‌లో విలీనం చేయలేదన్న వాస్తవానికి, భారత ప్రభుత్వం నిజాం బందిఖానా నుంచి ‘సంస్థానాన్ని’ విమోచనం చేసిందన్న సత్యానికి ఇదంతా నేపథ్యం!