సంపాదకీయం

అరణ్య ఘోష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంతాల కోసం ఏనుగులను, చర్మాలు- గోళ్ల కోసం పులులను, మాంసం కోసం ఇతర వన్యప్రాణులను వేటాడి వధించడం మన దేశంలో వింతేమీ కాదు. ఈ ‘వేట’ నిరంతరం అడ్డూ అదుపులేకుండా సాగిపోతుండడంతో అడవి జంతువుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టాలు పకడ్బందీగా అమలు జరగపోవడంతో కొన్ని జాతుల జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండగా, మరికొన్ని జంతువులు అంతరించే ప్రమాదం దాపురించింది. ఓవైపు వేటగాళ్లు, స్మగ్లర్లు కొనసాగిస్తున్న అకృత్యాల వల్ల వందలు, వేల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండగా, మరోవైపు రైల్వేట్రాక్‌లు అడవి జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో అటవీ హననం యథేచ్ఛగా జరుగుతుండగా, మరోవైపు చిట్టడవులను చీల్చివేసి ఆధునిక సౌకర్యాలను కల్పించుకుంటున్నాం. దీంతో అరణ్యాలను ఆవాసాలుగా చేసుకొన్న వన్యప్రాణులు అనుకోని ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోతున్నాయి. మన దేశంలో రైల్వేట్రాక్‌లపై రోజుకు సగటున 31 జంతువులు మృత్యువు కాటుకు బలైపోతున్నట్టు సాక్షాత్తూ కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ఇటీవల పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. అటవీ ప్రాంతాల్లో రైల్వేట్రాక్‌లను దాటుతూ మరణిస్తున్న వన్యప్రాణుల సంఖ్య ఏటా పెరుగుతూ పోవడం గమనార్హం. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం- గత మూడేళ్ల వ్యవధిలో రైళ్లు ఢీకొని మరణించిన అడవి జంతువుల సంఖ్య 35,732. మృత్యువాత పడిన ఈ జంతువుల్లో 65 ఏనుగులు ఉన్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువులు అనూహ్యంగా రైల్వేట్రాక్‌లను దాటడం, అవి సంచరించే ప్రాంతాల్లో రక్షణ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మూగజీవాలు రైళ్లకింద పడి ప్రాణాలను కోల్పోతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి పకడ్బందీ ప్రణాళికలను ఆచరణలో అమలు చేయకపోవడంతో రైల్వేట్రాక్‌లపై నుజ్జునుజ్జవుతున్న అడవి జంతువుల సంఖ్య ఏటికేడు పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదన్నది కఠోర వాస్తవం.
రహదారులు, రైల్వేట్రాక్‌లపై వన్యప్రాణుల మరణాలను నివారించేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలను చేపడుతున్నట్లు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నట్టు మూడేళ్ల క్రితమే అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా, అవేవీ ఆచరణలో కానరావడం లేదు. కారణాలేవైనా రైళ్లకింద పడి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సంఘటనలు ఒక్క వెస్ట్-సెంట్రల్ రైల్వే పరిధిలోనే గత మూడేళ్లలో 12,748 జరిగాయి. 2016-18 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రైల్వేట్రాక్‌లపై 49 ఏనుగులు మరణించాయి. ఇందులో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో మరణించిన ఏనుగుల సంఖ్య 37. గత మూడేళ్లలో రైల్వేట్రాక్‌లు దాటుతూ పదకొండు పులులు, పదమూడు సింహాలు విగతజీవులుగా మారాయి. 2016లో 7,945 అడవి జంతువులు రైల్వేట్రాక్‌లకు బలై పోగా, 2017లో ఆ సంఖ్య 11,683కు, 2018లో 12,625కు చేరడం వన్యప్రాణి ప్రేమికులను ఆందోళనకు గురిచేసే విపరిణామం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఆగస్టు అంతానికి 110 వన్యప్రాణులు రైళ్లను ఢీకొని మృత్యువాత పడ్డాయి. దేశవ్యాప్తంగా చూస్తే సౌత్-వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో ఇలాంటి మరణాలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. ఈ జోన్‌లో గత మూడేళ్లలో రైల్వేట్రాక్‌లపై వన్యప్రాణులు మరణించిన ఘటనలు ఆరు మాత్రమే చోటుచేసుకున్నాయి. రైల్వేట్రాక్‌లపై ఏనుగుల మరణాలను నివారించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గతంలోనే నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని తగ్గించడం, విద్యుత్ తీగలను వీలైనంత ఎత్తులో ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 2009- 2019 మధ్య కాలంలో విద్యుత్ తీగలు తగలడంతో వివిధ రాష్ట్రాల్లో 461 ఏనుగులు మరణించాయి.
దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్లను విస్తరించడం, ఇందుకు సంబంధించిన ట్రాక్‌లను వన్యప్రాణి ఆవాసాల మధ్య నుంచి ఏర్పాటు చేయడంతో మృత్యువాత పడుతున్న అడవి జంతువుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య దీర్ఘకాలంగా ఉన్నదే అయినా, ఇది పరిష్కరించలేనిది కాదని నిపుణులు చెబుతున్నారు. అడవులను ఛేదిస్తూ హైస్పీడ్ రైళ్లకు వౌలిక సదుపాయాలను కల్పించినప్పటికీ, ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని వారు పేర్కొంటున్నారు. రైల్వేట్రాక్‌లపై, రహదారులపై జంతువులు మరణించకుండా చర్యలు తీసుకోవాలంటూ ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ఇదివరకే కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఉత్తరాంచల్‌లో ప్రముఖ అభయారణ్యం (రాజాజీ నేషనల్ పార్క్) ప్రాంతంలో ఇరవై మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన రైల్వేట్రాక్ వన్యప్రాణులకు ‘యమగండం’గా మారింది. గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో రైళ్లకింద పడి 18 ఏనుగులు మరణించాయి. ఎత్తయిన చోట రైల్వేట్రాక్‌ను సులువుగా దాటలేక పోవడం, వేసవిలో దాహం తీర్చుకొనేందుకు ట్రాక్‌లను దాటివెళ్లాల్సి రావడంతో ఏనుగులు రైళ్లను ఢీకొంటూ మరణించడం లేదా తీవ్రంగా గాయపడడం పరిపాటిగా మారింది. రైల్వేట్రాక్‌లను దాటాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ నీటి కుంటలను ఏర్పాటు చేయాలని, ప్రమాద రహితంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయాలని ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ఉత్తరాంచల్‌లో జరిపిన విస్తృత అధ్యయనం సందర్భంగా రూపొందించిన నివేదికలో సూచించింది. హరిద్వార్- డెహ్రాడూన్ మధ్య పర్యాటకులు ఆహార పదార్థాల వ్యర్థాలను, పాస్టిక్ కవర్లను రైల్వేట్రాక్ పక్కన పడవేయడం ఏనుగుల పాలిట శాపంగా మారింది. రైలు ప్రయాణీకులు, కేటరింగ్ సంస్థలు పారవేసే ఆహార పదార్థాలను తినేందుకు ఏనుగులు రైల్వేట్రాక్‌ల వద్దకు చేరుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్లను మింగేస్తున్న ఏనుగులు జీర్ణసంబంధ సమస్యలతో సతమతమవుతున్నాయి.
ఇక, అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లు సాధారణంగా గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అయితే, రాజాజీ నేషనల్ పార్క్ వంటి వన్యప్రాణి ఆవాసాల మధ్య గంటకు 72 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మర్నాడు తెల్లవారు జాము వరకూ ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. చీకటి వేళ రైల్వేట్రాక్‌లను దాటుతూ ఏనుగులు, ఇతర వన్యప్రాణులు మృత్యువు ముంగిటకు చేరుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలన్న ఉద్దేశంతో గతంలో అటవీ, రైల్వే శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొన్ని సూచనలు చేసినా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. ట్రాక్‌లపై ట్రాఫిక్ పెరిగినందున రైళ్ల స్పీడ్‌ను బాగా తగ్గించడం సాధ్యం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైళ్ల వేగం గంటకు 35 కిలోమీటర్ల స్పీడ్ మించకుండా ఉండాలని రైల్వే, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేసినా ఫలితం కనిపించలేదు. రైల్వేట్రాక్ వెంబడి మలుపులు ఉన్నచోట రాత్రివేళ ఎయిర్ బ్రేక్స్ వాడేందుకు, ట్రాక్‌కు ఇరువైపులా తుప్పలను తొలగించేందుకు చర్యలు తీసుకొంటున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ట్రాక్‌లకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ట్రాక్ పక్కన ఆహార పదార్థాలను, ప్లాస్టిక్ కవర్లను పడవేయరాదని కరపత్రాలు, పోస్టర్ల ద్వారా పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నారు. స్టేషన్ మాస్టర్లకు, రైలు డ్రైవర్లకు కూడా ఏనుగుల సంచారం గురించి సమగ్ర సమాచారం అందజేస్తున్నారు. వన్యప్రాణులు ఎక్కువగా మరణిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖ సహకారంతో రైల్వే మంత్రిత్వశాఖ ‘యాక్షన్ ప్లాన్’ను అమలు చేయాలని నిర్ణయించింది. రైల్వే సిబ్బందికి, పర్యాటకులకు వన్యప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఈ ‘యాక్షన్ ప్లాన్’ ముఖ్య ఉద్దేశం. ఏనుగులు, ఇతర జంతువుల సంచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత సమాచారాన్ని రైలు డ్రైవర్లకు చేరవేసి, వారిని అప్రమత్తం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అడవుల్లో జంతువుల సంచారాన్ని అడ్డుకోవడం అసాధ్యం గనుక రైల్వేట్రాక్‌ల వద్ద రక్షణ వలయాలను, ట్రాక్ దాటాల్సిన పనిలేకుండా ‘అండర్ పాస్’లను ఏర్పాటు చేయాలన్నది నిపుణుల సూచన. పశ్చిమ కనుమల్లో నీటికుంటలు ఎక్కువగా ఉంటాయి గనుక వాటిని చేరుకొనేందుకు జంతువులు ట్రాక్‌లను దాటాల్సిన పనిలేదు. వెస్ట్-సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో అటవీ ప్రాంతం ఎక్కువ గనుక వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడకుండా ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది.