సంపాదకీయం

‘కొండ’ను తవ్వి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలంతా పంచెలు నేశాను, దీపం తేరా దిగనేస్తాను... అన్నది సామెత! కానీ ఈ సామెతను కేంద్ర ప్రభుత్వం నిజం చేసినట్టుంది. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొఱబడిన విదేశీయుల సంఖ్య రెండు కోట్లని మూడు కోట్లని దశాబ్దుల తరబడి ప్రచారం జరిగింది. వీరిలో కనీసం కోటి మంది అస్సాంలోనే తిష్ఠవేసి ఉన్నారని కూడ ప్రచారమైంది. ఈ అనధికార ప్రచారం సంగతి ఎలా ఉన్నప్పటికీ మన దేశంలోకి చొఱబడిన విదేశీయుల సంఖ్య కోటి నలబయి లక్షలన్నది కేంద్ర ప్రభుత్వం పలుమార్లుచేసిన అధికార ధ్రువీకరణ. కానీ ఆగస్టు ముప్పయి ఒకటవ తేదీనాడు వెల్లడయిన అస్సాం సంబంధిత ‘జాతీయ పౌర సంకలనం’- నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్- ఎన్‌ఆర్‌సి- ప్రకారం అస్సాంలో కేవలం పంతొమ్మిది లక్షల ఆరువేల ఆరువందల యాబయి ఏడుగురు మాత్రమే భారతీయ పౌరులు కానివారు నివసిస్తున్నట్టు నిర్ధారణ జరిగింది. వీరు అందరూ విదేశీయులన్నది కూడ నిర్ధారణ జరగలేదు. ‘సంకలనం’లో తమ పేర్లు లేనివారు అంటే ఈ పంతొమ్మిది లక్షల మంది నూట ఇరవై రోజుల లోగా ‘విదేశీయులను నిర్ధారించే న్యాయమండలుల ’- ఫారినర్స్ డిటర్మినేషన్ ట్రిబ్యునల్-లో న్యాయ యాచికలను దాఖలు చేయవచ్చు, తాము భారతీయ పౌరులమని విదేశీయులు కామని ధ్రువపరచుకోవచ్చు... ‘న్యాయ మండలి’ తీర్పును చెప్పిన తరువాత ఆ తీర్పును ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలలో సవాలుచేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసేవరకూ దాదాపు ఈ పంతొమ్మిది లక్షల ఏడువేల మంది ‘‘్భరతీయ పౌరులు కానివారి’పై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజమైన భారతీయ పౌరులను పొరపాటున కాని, సాంకేతిక లోపాలవల్ల కాని ‘జాతీయ సంకలన’ సూచికల నుంచి తొలగించి ఉంటే వారికి న్యాయం జరుగవలసిందే, వారిని భారతీయ పౌరులుగా నిర్ధారించి ‘జాబితా’లలో చేర్చవలసిందే! కొంతమందిని, కొన్ని వేల లేదా కొన్ని లక్షల మంది నిజమైన భారతీయులను దుర్బుద్ధి పూర్వకంగా కూడ సంకలనం నుంచి తొలగించారు. ఉదాహరణకు లక్ష మంది నేపాలీ భాష మాట్లాడే అస్సామ్‌లోని భారతీయులను ‘జాబితా’నుంచి తొలగించారట! ఇలాంటి ఉదంతాలు ఇంకెన్ని ఉన్నాయో?? ఇదే నిజమైతే ‘ఎన్‌ఆర్‌సి’కి చెందిన కొందరి అధికారుల దేశ వ్యతిరేకత ఇందుకు కారణం. ఎందుకంటే దశాబ్దుల తరబడి లక్షల విదేశీయ నకిలీ పత్రాల ప్రాతిపదికగా భారతీయులుగా మారిపోయారు, అస్సాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిపోయారు... ఇలాంటి నకిలీ పౌరులలో వందల మంది ‘ఎన్‌ఆర్‌సి’ ప్రక్రియలో ఉద్యోగులుగా అధికారులుగా పనిచేశారన్నది అస్సాం ప్రభుత్వం స్వయంగా చేసిన ఆరోపణ. అందువల్ల ఇలాంటి దేశ వ్యతిరేక అధికారులు భారతీయులను విదేశీయులుగా నిర్ధారించి ‘సంకలనం’నుంచి తొలగించి ఉండవచ్చు, విదేశీయులను భారతీయులుగా నిర్ధారించి తుది ‘సంకలనం’లో చేర్చి ఉండవచ్చు! కానీ జాబితానుంచి ‘‘తొలగింపున’’కు గురిఅయిన భారతీయుల కంటె జాబితాలో ‘‘చేరిపోయిన’’ విదేశీయుల సంఖ్య పది రెట్లు. ఇరవై రెట్లు లేదా యాబయి రెట్లు అధికంగా ఉందన్నది మాత్రం నిరాకరింపజాలని నిజం....
కేవలం పంతొమ్మిది లక్షల మంది ‘‘విదేశీయులు’’మాత్రమే అస్సాంలో ఉన్నట్టు తేల్చడం ఈ నిజానికి నిదర్శనం. ‘‘కొండను తవ్వి తవ్వి ఎలుకను పట్టడం’’అని అంటే ఇదే మరి, తోడేళ్లు నక్కలు ఇతర క్రూర మృగాలు తప్పించుకున్నాయి, భారతీయ పౌరులుగా చెలామణి అయిపోయాయి, అస్సాంలోను దేశంలోని ఇతర ప్రాంతాలలోను భారీ సంఖ్యలో స్థిరపడిపోయాయి. భారత రాజ్యాంగ వ్యవస్థను, దేశ సమగ్రతను, జాతీయ సార్వభౌమ అధికారాన్ని వెక్కిరిస్తున్నాయి. దశాబ్దుల తరబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించిన క్రూరమైన నిర్లక్ష్యం ఫలితమిది. విదేశాలనుంచి ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి పధకం ప్రకారం మన దేశంలోకి లక్షల మంది చొఱబడడం జిహాదీ బీభత్స వ్యూహంలో భాగం. 1947నాటి దేశ విభజన ఈ వ్యూహానికి ప్రాతిపదిక. ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న ప్రాంతాలను ‘అఖండ భారత్’నుంచి విభజించి పాకిస్తాన్‌గా ఏర్పాటుచేయడం ఈ జిహాదీ వ్యూహానికి ప్రాతిపదిక! అందువల్ల అవశేష భారత్‌లో సైతం ప్రధానంగా పాకిస్తాన్ సరిహద్దునకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో- జనాభాలో ఇస్లాం మతస్థులను పెంచడం ద్వారా ఎప్పటికైనా ఈ ప్రాంతాలను ఇస్లాం బహుళ సంఖ్య ప్రాంతాలుగా మార్చాలన్నది జిహాదీల వ్యూహం! అలా మారిన ప్రాంతాలను మరోసారి భారత్’నుంచి - అవశేష భారత్‌నుంచి- విడగొట్టడం ‘జిహాదీ’ల అంతిమ లక్ష్యం! ఈ లక్ష్యసాధనలో భాగంగానే జమ్మూకశ్మీర్‌లోని ‘లోయ’ప్రాంతం నుంచి ఇస్లాం మతేతరులను జిహాదీలు పూర్తిగా నిర్మూలించారు, అస్సాంలోకి ఈశాన్యంలోకి పశ్చిమ బెంగాల్‌లోకి భారీ సంఖ్యలో బంగ్లాదేశీయ ఇస్లాం మతస్థులను తరలించడం కూడ ఈ జిహాదీ పథకంలో భాగం....
విదేశీయులను అస్సాంనుంచి వెళ్లగొట్టాలని కోరుతూ 1970వ దశకం చివరి నుంచి పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. 1983లో ప్రభుత్వం ‘న్యాయ మండలుల ద్వారా అక్రమ ప్రవేశకుల నిర్ధారణ’-ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్- ఐఎమ్‌డిటి- చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టం అక్రమ ప్రవేశకుల నిర్ధారణకు దోహదపడకపోగా అక్రమ ప్రవేశకుల నిర్ధారణకు నిరోధకంగా మారింది. ఇరవై రెండేళ్ల తరువాత సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టాన్ని రద్దుచేయవలసి వచ్చింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ 2014 వరకూ ప్రభుత్వాలు దారుణమైన నిర్లక్ష్యం వహించడం చరిత్ర... అక్రమ ప్రవేశకులు అస్సాంలో స్థిరపడుతున్న కారణంగా అంతర్గత కల్లోలం చెలరేగే ప్రమాదం ఉందని, విదేశీయ దురాక్రమణ దూసుకొని రావచ్చునని సర్వోన్నత న్యాయస్థానం పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడ. అస్సాంలోకి బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులు చొరబడి ఉండడం ఆందోళనకరమైన పరిణామమని సర్వోన్నత న్యాయస్ణానం వ్యాఖ్యానించింది. ఇలా న్యాయవ్యవస్థ పదే పదే అభిశంసించినప్పటికీ 2014వరకూ ప్రభుత్వంలో కదలిక రాకపోవడం దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విపరిణామక్రమం. ఫలితంగా 1983నాటికి చొఱబడి ఉన్న విదేశీయులు ఈ ముప్పయి ఆరేళ్లలో కుటుంబాలను ఏర్పాటుచేసుకొని పిల్లలను కన్నారు. ఆ పిల్లలంతా పెరిగి పెద్దవారై దేశ పౌరులుగా చెలామణి కావడానికి వీలుకల్గింది. 1983నుంచి ముప్పయి ఏళ్లపాటు మరిన్ని లక్షల మంది బంగ్లాదేశీయులు అస్సాంలోకి బెంగాల్‌లోకి చొరబడిపోయారు. ఇలా దాదాపు మూడుతరాలపాటు జిహాదీల కుట్ర నిర్నిరోధంగా సాగింది. అస్సాంలోని అనేక జిల్లాలలో ‘బంగ్లాదేశీయ ముస్లిం’ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇలా పెరిగిన చోటల్లా ‘జిహాదీ’లు స్థానిక ప్రజలను నిర్మూలించడానికి పూనుకున్నారు, ఈ జిహాదీ బీభత్సకారులు హిందూ బాలికలపై జరిపిన అత్యాచారాలకు లెక్కలేదు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా మారిన ప్రాంతాలలో జిహాదీలు సగటున రోజుకొక హిందూ బాలికను అపహరించినట్టు, అత్యాచారం జరిపినట్టు 2003లో ఆ ప్రాంతాలను దర్శించిన పూర్ణిమా అద్వానీ నాయకత్వంలోని మహిళల హక్కుల సంఘంవారు నిర్ధారించారు. ‘జిహాదీ’ల విస్తరణను, బంగ్లాదేశీయుల భూదురాక్రమణను నిరోధించడానికే వనవాసులైన ‘బోడో’లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ బోడో ఉద్యమంలో దేశ వ్యతిరేకులు చొరబడడం తరువాతి కథ....
ఇలా అస్సాం దశబ్దుల తరబడి కల్లోలగ్రస్తం కావడానికి దోహదం చేసిన విదేశీయుల చొరబాటుదారులను పసికట్టి మన దేశంనుంచి తరలించడానికై ‘ఎన్‌ఆర్‌సి’కార్యక్రమం మొదలైంది. కానీ కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే చొఱబాటుదారులన్నది ప్రాథమిక నిర్ధారణ. మిగిలిన చొఱబాటుదారులు ఏమయ్యారు?? ఎక్కడికిపోయారు?? వీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా విస్తరించిపోయారా?? అన్ని రాష్ట్రాలకు వర్తించే ‘జాతీయ పౌర సంకలనం’తయారుచేసే కార్యక్రమం నిజానికి 1951లోనే మొదలైంది. కానీ ఆ తరువాత ఈ ‘జాతీయ పౌర సంకలనాన్ని’ దశాబ్దులపాటు ప్రభుత్వాలు మూలపడేయడం దేశ భద్రత పట్ల ఘోరమైన నిర్లక్ష్యానికి చిహ్నం. ఇప్పుడైనా మొత్తం దేశానికి వర్తించే ‘ఎన్‌ఆర్‌సి’ని ఎందుకు రూపొందించరాదు??
*