సంపాదకీయం

మారని మతోన్మాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కులపై జిహాదీల అత్యాచారాలు తీవ్రతరం అవుతుండడం నానక్ గురుదేవుని ‘సార్థ పంచ శతజయన్తి’- ఐదువందల యాబయ్యవ పుట్టినరోజు- ఉత్సవాలకు నేపథ్య వైపరీత్యం. నానక్ గురుదేవుడు జన్మించిన ‘నంకానా సాహిబ్’ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది! ‘నంకానా సాహిబ్’లో నివసిస్తున్న తన సోదరి ఇంటికి వచ్చిన పదిహేడు ఏళ్ల సిక్కు యువతిని ఈనెల ఇరవై ఏడవ తేదీన రాత్రి ‘జిహాదీ’ దుండగుల అపహరించుకొని వెళ్లినట్టు ఇరవై తొమ్మిదవ తేదీన వెళ్లడయింది. అపహరణకర్తలు ఆ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి మహమ్మద్ ఏడుసాన్ అనే జిహాదీ దుండగుడికి ‘పెళ్లి’చేసినట్టు దృశ్యమాధ్యమాలలో ప్రసారమైంది. నానక్ గురుదేవుడు సిక్కు మతాన్ని స్థాపించిన హైందవ జాతీయ ధర్మాచార్యుడు. ‘అఖండ భారత్’లో పంజాబ్‌లోని ఈ ‘నంకానా సాహిబ్’లో జన్మించాడు. క్రీస్తుశకం 1947లో అఖండ భారతదేశం ముక్కలైంది, ఇస్లాం మతస్థులు జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి... పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యం...’ పాకిస్తాన్‌లోని అవశేష హిందువులను నిశే్శషం చేయాలన్నది ‘జిహాదీ’ల లక్ష్యం. ఈ లక్ష్యసాధనకోసం జరుగుతున్న వివిధ బీభత్సకృత్యాలలో బలవంతంగా మతం మార్చడం ఒకటి. హిందూ కుటుంబాలకు చెందిన బాలికలను అపహరించుకొనిపోతున్న ‘జిహాదీ’లు వారిని బలవంతంగా ‘ఇస్లాం’మతంలోకి మార్చుతున్నారు, ‘జిహాదీ’ ముష్కరులు ఈ బాలికలను బలవంతంగా ‘‘పెళ్లి’’చేసుకుంటున్నారు. 1947తో పాకిస్తాన్ ఏర్పడిన నాటికి ఆ ప్రాంతపు జనాభాలో హిందువుల సంఖ్య ఇరవై నాలుగు శాతం. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ‘జిహాదీ’లు, ప్రభుత్వ నిర్వాహకులుగా చెలామణి అయిన ప్రచ్ఛన్న బీభత్సకారులు కలసికట్టుగా హిందువులను నిర్మూలించారు, హత్యచేశారు, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. అవశేష భారత్‌లోకి తరిమివేశారు. ఫలితంగా పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఆరు నెలలు తిరగకముందే పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య రెండు శాతం కంటె తక్కువకు దిగజారిపోయింది. ఈ అవశేష హిందువులను సైతం నిర్మూలించడానికి ఏడు దశాబ్దులుగా ‘జిహాదీ’లు జరుపుతున్న బీభత్సకాండలో మంగళవారం నాటి పైశాచిక ఘటన భాగం.... నానక్ గురుదేవుడు ఎక్కువకాలం నివసించిన కర్తార్‌పూర్ సాహిబ్ కూడ ప్రస్తుతం పాకిస్తాన్‌లో చేరి ఉన్న పంజాబ్ ప్రాంతంలోనే ఉంది. ఉభయ దేశాల సరిహద్దునకు పాకిస్తాన్ వైపున నాలుగు కిలోమీటర్ల దూరంలో ‘కర్తార్‌పూర్’ నెలకొని ఉంది. సరిహద్దునకు ఈవలి వైపున రెండు కిలోమీటర్లదూరంలో మన దేశంలోని ‘డేరాబాబా నానక్’ పట్టణం నెలకొని ఉంది. ‘డేరాబాబా నానక్’నుంచి ‘కర్తార్‌పూర్’వరకూ ఆరు కిలోమీటర్ల రహదారిని నిర్మించే కార్యక్రమం గత నవంబర్‌లో మొదలైంది. వచ్చే నవంబర్ నాటికి, నానక్ గురుదేవుని సార్థ పంచ శత జయన్తి సంవత్సర ఉత్సవాల నాటికి, ఈ రహదారి నిర్మాణం పూర్తికావాలన్నది లక్ష్యం. కర్తార్‌పూర్‌లో జరుపనున్న నానక్ గురుదేవుని ఈ ఉత్సవాలకోసం ఉభయ దేశాల ప్రతినిధి బృందాలు సరిహద్దు రేఖవద్ద చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ సిక్కు బాలికను జిహాదీ దుండగులు అపహరించుకొని పోయి ఇలా అత్యాచారం జరుపడం పాకిస్తానీ ప్రభుత్వ బీభత్స స్వభావానికి మరో నిదర్శనం.
నంకానాసాహిబ్‌లో మంగళవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అపహరణకు గురిఅయిన బాలిక తండ్రి సిక్కు మత పురోహితుడు, ‘గురుద్వారా తాంబూ సాహిబ్’లో అర్చకుడు.- గ్రంథి- ఆయన పెద్ద కుమార్తె ఆమె భర్త ‘నంకానాసాహిబ్’లో నివసిస్తున్నారు. అపహరణకు గురిఅయిన ఈ చిన్న కుమార్తె తన అక్కగారి ఇంటికి వచ్చింది. ఈమెకు మరో సిక్కు యువతితో పెళ్లికూడ నిశ్చయమైంది, నిశ్చితార్థం కూడ జరిగింది. మంగళవారం పెద్ద కుమార్తె భర్త వ్యాపారం నిమిత్తమై ఫయిసలాబాద్‌కు వెళ్లాడట! అక్కాచెల్లెలు అక్క పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అనేక మంది జిహాదీలు హంతకులు బలవంతంగా ఇంట్లోకి చొఱబడి అందరినీ చంపేస్తామని బెదిరించారు. అందరినీ ఒక గదిలోకి పంపి బంధించారు. ఈ బాలికను మాత్రం బలవంతంగా ఈడ్చుకొని, ఎత్తుకొనిపోయి మతం మార్చారు! ఇస్లాం మత నియమాల ప్రకారం ‘మహమ్మద్ ఏడుసాన్’అన్న దుండగుడు ఆ హిందూ బాలికను బలవంతంగా పెళ్లిచేసుకున్న దృశ్యాలను చిత్రీకరించారట కూడ.... బుధవారం అనేకసార్లు ఫిర్యాదుచేసినప్పటికీ పోలీసులు కాని అధికారులు కాని పట్టించుకోకపోవడం అల్పసంఖ్య మతస్థుల పట్ల ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’లో నిహితమై ఉన్న పైశాచిక వివక్ష ఒక నిదర్శనం మాత్రమే!! ఇదంతా 1947నాటి ‘అఖండ భారత’ విభజనతో ముడివడి ఉన్న భయంకర విషాదం....
ఈ విషాదానికి ఏకైక కారణం పాకిస్తాన్ సమాజ సమష్టి మనఃప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఇస్లామేతర మతాలను ద్వేషించడం, నిర్మూలించడం, తమ మతమైన ఇస్లాం మాత్రమే ప్రపంచంలో ఏకైక మతంగా మిగిలి, మిగిలిన అన్ని మతాలు నామరూపాలు లేకుండా నశించిపోవాలన్న ‘జిహాదీ’ స్వభావం పాకిస్తాన్ సమాజ సమష్టి స్వభావం. దీనికి పూర్తి విరుద్ధంగా ఇస్లాం సహా అన్ని మతాలవారు కలసి మెలసి జీవించాలన్నది 1947 తరువాత కూడ అవశేష భారత సమాజ సమష్టి మనఃప్రవృత్తి! అందువల్లనే పాకిస్తాన్ ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ’ వ్యవస్థగా ఏర్పడి ఉంది, అవశేష భారత్ సర్వమత సమభావ వ్యవస్థగా ఏర్పడి ఉంది, ఈ సర్వమత సమభావ అనాదిగా హైందవ జాతీయ స్వభావం, అందువల్లనే హైందవ జాతి అనేక మతాల, భాషల, వైరుధ్య రీతుల సహజ సమాహారంగా పరిఢవిల్లింది. అఖండ భారత్‌లో యుగాలుగా సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ పరిఢవిల్లింది. 1947 తరువాత కూడ అవశేష భారత్ సమాజ సమష్టి స్వభావం సర్వమత సమభావం... భారత రాజ్యాంగం ఈ సనాతన- శాశ్వత- స్వభావానికి సరికొత్త ధ్రువీకరణ మాత్రమే! ఇందుకు విరుద్ధంగా పాకిస్తాన్ ఈ సర్వమత సమభావ జాతీయ వారసత్వాన్ని నిరాకరించింది. మతోన్మాద భూమికపై ‘ఏకమత రాజ్యాంగ’ వ్యవస్థగా ఏర్పడింది. అందువల్లనే భారత్‌లో ఇస్లాం సహా అన్ని మతాలవారు సమానంగా జీవిస్తున్నారు, ప్రగతిని సాధిస్తున్నారు, పాకిస్తాన్‌లో ఇస్లాం మతాన్ని తప్ప మిగిలిన మతాలను నిర్మూలిస్తున్నారు. భారతదేశంనుండి ఏ మతంవారు కాని ప్రాణభయంతో పారిపోవడం లేదు. ఇతర దేశాలలో హత్యాకాండకు గురికాకుండా తప్పించుకున్న మతాలవారు భారతదేశానికి ప్రాణ భయంతో పారివస్తున్నారు. పాకిస్తాన్‌లో హత్యాకాండకు గురికాకుండా తప్పించుకున్న ఇస్లామేతర మతాలవారు ప్రధానంగా అనాదిగా అక్కడ జీవించిన హైందవ జాతీయ మతాలకు చెందినవారు ఆ దేశంనుండి పారిపోయారు. ఇలా పారిపోయినవారు ‘అవశేష భారత్’కు తరలిరావడం సహజం. అఖండ భారత్ అనాదిగా ఇప్పుడు పాకిస్తాన్‌లో జీవిస్తున్న వారికి కూడ మాతృభూమి... అందువల్ల సిక్కులపై ఇతర హిందూ మతాలవారిపై పాకిస్తాన్‌లో దశాబ్దుల తరబడి జరుగుతున్న బీభత్సకాండకు కారణం అఖండ భారత విభజన, అఖండ భారత్‌లో వికసించిన సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ పాకిస్తాన్‌లో అంతరించిపోవడం, అవశేష భారత్‌లో మాత్రమే వర్ధిల్లుతుండడం...
అందువల్ల మన దేశంలోవలె పాకిస్తాన్‌లో కూడ ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడడం మాత్రమే అన్నది మిగిలిఉన్న అత్యల్ప సంఖ్యాకులైన హిందువులు నిశే్శషంకాకుండా నిరోధించడానికి మార్గం. ఈ దిశగా ద్వైపాక్షికంగాను, అంతర్జాతీయ సంస్థల ద్వారాను కృషిచేయవలసిన నైతిక బాధ్యత మన ప్రభుత్వానిది. ఎందుకంటె పాకిస్తాన్‌లోని అవశేష హిందువుల కడగండ్లకు కారణం 1947నాటి దేశ విభజన. ఆ ‘విభజన’జరుగకపోయి ఉండినట్టయితే ఇప్పుడు పాకిస్తాన్‌గా ఏర్పడిన అఖండ భారత ప్రాంతంలో కూడ యధాపూర్వంగా సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగి ఉండేది. అందువల్ల ‘ప్రపంచ సర్వమత సమభావ వ్యవస్థ’- వరల్డ్ సెక్యులర్ ఆర్డర్-లో భాగంగా పాకిస్తాన్‌లో సైతం ఈ వ్యవస్థ ఏర్పాటుకావాలి! అప్పుడు మాత్రమే పాకిస్తాన్‌లోని న్యాయస్థానాలు సిక్కులకు హిందువులకు న్యాయంచేసే అవకాశం ఉంది. లేనట్టయితే హిందూ బాలికలను అపహరిస్తున్న, వారిని అత్యాచారాలకు గురిచేస్తున్న జిహాదీ దుండగులను పాకిస్తాన్ న్యాయ స్థానాలు శిక్షించవు. డెబ్బయి రెండేళ్ల చరిత్ర ఇందుకు సాక్ష్యం! దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షను పాటించిన వ్యవస్థను దశాబ్దుల తరబడి అంతర్జాతీయ సమాజం బహిష్కరించింది. దక్షిణ ఆఫ్రికా దారికి వచ్చింది! ఇదే రీతిలో మత వివక్షను పాటిస్తున్న పాకిస్తాన్ వంటి మతోన్మాద వ్యవస్థలను అంతర్జాతీయ సమాజం దారికి తేగలదు... మొదట మన ప్రభుత్వం పూనుకోవాలి!