సంపాదకీయం

అయ్యో.. ఆడపిల్ల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినడానికి విడ్డూరంగాను, విస్మయాన్ని కలిగించేదిగాను ఉన్నా ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో గత మూడు నెలల వ్యవధిలో జన్మించిన వారంతా మగ శిశువులేనట! ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకూ నమోదైన జనన గణాంకాలను విశే్లషిస్తే గనుక- దేశంలోని అనేక ప్రాంతాలలో ఆడపిల్లల జననాలు భారీగా తగ్గుముఖం పడుతున్నట్టు తేటతెల్లమవుతుంది. ‘ఆడపిల్లను కంటే అన్నీ ఖర్చులే.. బోలెడు డబ్బు పెట్టి- పెళ్లి చేసి పంపాలి.. తిరిగి ఆదాయం వచ్చే మార్గమే లేదు..’ ఈ తరహా భావజాలం వల్ల మగపిల్లలను కనడమే అన్ని విధాలా ఉత్తమం అనే మాట భారతీయ సమాజంలో ఇంకా పాతుకొనిపోయి ఉంది. ఆడపిల్లల పట్ల కుటుంబాల్లో ఆదరణ పెరగాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘బేటీ బచావ్, బేటీ పఢావ్..’ అని గతంలోనే పిలుపు ఇచ్చినా- పరిస్థితిలో ఆశించిన మార్పు కానరావడం లేదన్నది కాదనలేని కఠోర వాస్తవం. తెలంగాణ, ఉత్తరాఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో లింగవివక్ష ఇంకా అంతరించి పోలేదని తాజా గణాంకాలు ఘోషిస్తున్నాయి.
ఆడపిల్లల జననాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయా? ప్రజానీకంలో లింగవివక్షపై ఆశించిన స్థాయిలో అవగాహన కలగడం లేదా?? తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఈ-బర్త్’ పోర్టల్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఎనిమిది నెలల కాలంలో నమోదైన గణాంకాలను గమనిస్తే ఈ అనుమానాలు ఎవరికైనా కలగక మానవు. ఎనిమిది నెలల లోపు శిశువులకు సంబంధించి లింగ నిష్పత్తిలో భారీ తేడా ఉండడం ఆందోళన కలిగించే విపరిణామం అని అంగీకరించక తప్పదు. తెలంగాణలో ఎనిమిది నెలల లోపు శిశువుల్లో- ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు సగటున 929 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారన్నది అధికారిక సమాచారం. ఎనిమిది నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 1,61,769 మంది మగపిల్లలు జన్మించగా, ఆడశిశువులు 1,50,212 మంది పుట్టారు. మగపిల్లల జనన శాతం ఏభై రెండుగా, ఆడపిల్లల జనన శాతం నలభై ఎనిమిదిగా నమోదైంది. తెలంగాణలో ప్రత్యేకించి వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో ఈ సగటు 900 లోపుగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర సగటుతో పోల్చి చూస్తే వికారాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ జిల్లాలో వెయ్యి మంది మగపిల్లలకు 973 మంది ఆడశిశువులున్నారు. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాలలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. ఇక, వరంగల్ రూరల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ప్రతి వెయ్యి మంది మగశిశువులకు కేవలం 881 మంది ఆడశిశువులు జన్మించారని గణాంకాలు చెబుతున్నాయి.
సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆడపిల్లను కనేందుకు భయపడే పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ఆ భయం పోతే తప్ప లింగ నిష్పత్తిలో అంతరం తొలగిపోదని వైద్యులు, సామాజిక నిపుణులు చెబుతున్నారు. చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఖర్చుల వల్ల ఆడపిల్లలను పెంచడం అన్ని విధాలా నష్టదాయకమనే భావనతో పాటు ఆధునిక సమాజంలో నెలకొన్న మరికొన్ని పరిస్థితులు కూడా లింగ నిష్పత్తిలో తేడాకు కారణాలు కావడం గమనార్హం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లకు రక్షణ లేని దుస్థితి కొనసాగుతోంది. ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. ఈ దుష్ట సంస్కృతి విస్తరిస్తున్నందున విద్యావంతులైన దంపతులు సైతం ఆడపిల్లలను వద్దనుకొనే పరిస్థితి నేడు దాపురించిందని సామాజిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తే తప్ప ఆడపిల్లల సంఖ్య పెరిగే అవకాశం లేదు.
‘జనాభా నియంత్రణ జరగాలన్నది’ పాతకాలపు నినాదం. ‘మగపిల్లాడిని కనడం మేలు’ అన్నది నేటి నవ నాగరిక విధానం. మగ సంతానం కోసం పరితపించే దంపతులు చట్ట విరుద్ధమైన, అనైతికమైన చర్యలకు సైతం బరితెగిస్తున్నారు. ఆడశిశువుల సంఖ్య తగ్గిపోవడానికి, లింగ నిష్పత్తి బాగా పడిపోవడానికి ‘లింగ నిర్ధారణ పరీక్షలు’ పెరిగిపోవడమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావాలు చట్టవ్యతిరేకమని తెలిసినా ఎన్నో కుటుంబాల వారు ఈ చర్యలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. గర్భస్థ శిశువు మగా? ఆడా? అనే విషయాన్ని నిర్థారించేందుకు వైద్య పరీక్షలు జరపడాన్ని ప్రభుత్వం ఏనాడో నిషేధించింది. ఇలాంటి పరీక్షలు చేసే వైద్యులపైన, ఆస్పత్రుల యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్దిష్టమైన చట్టాలున్నాయి. చాలా ఆస్పత్రుల్లో, స్కానింగ్ కేంద్రాల్లో ‘ఇక్కడ లింగ నిర్థారణ పరీక్షలు జరుపబడవు..’ అని బోర్డులు కనిపిస్తున్నా, తెర వెనుక తతంగాలు గుట్టుగా సాగిపోతుంటాయి. గర్భస్థ శిశువు గురించి వివరాలు చెప్పడంపై నిషేధం ఉన్నా, చాలామంది వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా దీన్ని ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి, డయాగ్నస్టిక్ కేంద్రం ‘ప్రీ కానె్సప్షన్ ప్రీ న్యాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ యాక్ట్’ (పీసీపీఎన్‌డీటీ) కింద రిజిస్టర్ కావాలి. లింగ నిర్ధారణ పరీక్షల విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నందున చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో లింగ నిర్థారణ పరీక్షలు జోరుగా సాగిపోతున్నాయి. ఈ పరీక్షలో పుట్టబోయేది ఆడపిల్ల అని తేలితే- గర్భంలోనే చిదిమి వేసేందుకు వెనుకాడడం లేదు. లింగ నిర్థారణ పరీక్షలకు అడ్డుకట్ట వేయనందున దశాబ్ద కాలంలో ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తి ఆందోళనకర స్థాయికి చేరింది. ఈ రాష్ట్రంలో 2001 సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది మగపిల్లల సంఖ్యతో పోల్చితే ఆడపిల్లల సంఖ్య 908 కాగా, 2011 నాటికి ఆ సంఖ్య 890గా దిగజారింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన 132 గ్రామాల్లో ఇటీవల అధికారులు సర్వే నిర్వహించగా నివ్వెరపరచే వాస్తవం వెలుగు చూసింది. గత మూడు నెలల కాలంలో ఈ 132 జిల్లాల్లో 216 మంది పిల్లలు జన్మించగా- అందులో ఒక్క ఆడశిశువు కూడా లేకపోవడం ఆందోళనకరం. ఆడపిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టడం సమాజంలో రాబోయే విపరిణామాలకు ప్రమాద ఘంటికలేనని ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. చట్టాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి అధికారుల్లో లేకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల కాసుల కక్కుర్తి వంటి పరిస్థితులే ప్రస్తుత వైపరీత్యానికి కారణమని వేరే చెప్పనక్కర్లేదు.