సంపాదకీయం

సింధుశాఖ వైచిత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్షియా సింధుశాఖ దేశాలలో జరిపిన పర్యటన వల్ల ద్వైపాక్షిక మైత్రి ‘మారాకుల’ను తొడిగిందనడంలో సందేహం లేదు. ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపడినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగుపడడం కంటె ఆయా సింధుశాఖ దేశాల ప్రజలకు మన దేశం ప్రజల పట్ల పెంపొందదగిన సౌహార్దము, సౌజన్యము మరింత ప్రధానమైనవి. ఇరవై నాలుగవ తేదీన ‘ఐక్య అరబ్ సంస్థానాల’- యునైటెడ్ అరబ్ సంస్థానాల- యుఏఈ-లోను, ఇరవై ఐదవ తేదీన బహ్రయిన్‌లోను మన ప్రధాని పర్యటించడం వల్ల ఈ ప్రజా సౌహార్దం, సౌజన్యం ఎంత మేరకు విస్తరించాయన్నది వేచి చూడదగిన పరిణామ క్రమం. ప్రధాని మోదీ పట్ల గౌరవ సూచకంగా ఇంతవరకు జైళ్లలో మగ్గిన రెండు వందల యాబయి మంది భారతీయులను బహ్రయిన్ ప్రభుత్వం క్షమించిదంట, విడుదల చేయాలని నిర్ణయించిందట. మానవీయ దృక్కోణంలో బహ్రయిన్ ప్రభుత్వం నిర్బంధ గృహాలలో శిక్షలను అనుభవిస్తున్న వారిని క్షమించి విడుదల చేయాలని నిర్ణయించడం పట్ల మన ప్రధానమంత్రి కార్యాలయం వారు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ రెండు వందల యాబయి మంది భారతీయులు ఉపాధి కోసం బహ్రయిన్ వెళ్లినవారు. అసలు నిర్బంధ శిక్షలకు వీరు ఎందుకు గురికావలసి వచ్చింది? అన్నది వౌలికమైన ప్రశ్న. బహ్రయిన్‌లో మాత్రమే కాదు సింధుశాఖ ప్రాంతంలోని సౌదీ అరేబియా, కువైట్, కతార్ వంటి ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలన్నింటిలోను ఉపాధి కోసం వెళ్లిన భారతీయులలో అనేకులు ఆర్థిక మానసిక శారీరక చిత్రహింసలకు గురి అవుతుండడం నడుస్తున్న చరిత్ర. ఈ దేశాలలోని యజమానులు భారతీయ ఉద్యోగులను శ్రామికులను పైశాచికకాండకు గురి చేసిన సమాచారం ఏళ్ల తరబడి ప్రచారం అవుతూనే ఉంది. మోదీ పర్యటనతో ఈ ప్రభుత్వేతర యజమానుల పైశాచిక ప్రవృత్తిలో పరివర్తన రాగలదా? అన్నది వేచి చూడదగిన అంశం. ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యం, పదహైదు లక్షల జనసంఖ్య గల బహ్రయిన్ అతి చిన్న దేశాలలో ఒకటి. ఇంత చిన్న దేశంలో దాదాపు మూడున్నర లక్షల మంది భారతీయులు కూడ జీవిస్తుండడానికి కారణం బహ్రయిన్‌లోని ఇంధన సంపద. ఇలా పెద్దఎత్తున ఉపాధి కోసం బహ్రయిన్‌కు వెళ్లిన భారతీయులలో వందల వేలమంది నేరాలు చేసిన అభియోగాలలో ఇరుక్కుని నిర్బంధ గృహాల పాలవుతున్నారు. వారు చేసిన నేరాలు ఏమిటన్నది విచిత్రమైన వ్యవహారం..
బహ్రయిన్ రాజధాని మనామాలో రెండువందల ఏళ్లనాటి శ్రీకృష్ణ దేవాలయం- శ్రీనాథజీ మందిరం-లో మోదీ అర్చన చేయడం ఆయన పర్యటనలోని ఒక ప్రధాన కార్యక్రమం. ఈ మందిరం అభివృద్ధికి, మరమ్మతులకు దాదాపు ముప్పయి కోట్ల రూపాయల ఖర్చు కాగల కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించాడట. ఇస్లామేతర మతాల వారి మందిరాలను అభివృద్ధి చేసుకొనడానికి ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ’ రాచరిక వ్యవస్థగా ఉన్న దేశాలలో అనుమతి లభించడం గొప్ప మానవీయ ప్రవృత్తికి నిదర్శనం. కానీ బహ్రయిన్ వంటి ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు’ రాజరిక వంశపారంపర్య అధికార సంప్రదాయాలు ఇప్పటికీ ప్రపంచంలో కొనసాగుతుండడమే విచిత్రం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ- వరల్డ్ డెమొక్రాటిక్ ఆర్డర్- అన్నది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించే సూత్రం ఎందుకు కాలేదు? నేపాల్‌లో బ్రిటన్‌లో వలె ‘రాజ్యాంగ లాంఛన ప్రాయమైన’ రాజు దేశాధినేతగా కొనసాగే వ్యవస్థ 2008 వరకూ ఉండేది. ఇలాంటి దేశాధినేత ఉన్న బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థ.. సందేహం లేదు! కానీ ఇదే సూత్రం నేపాల్‌కు వర్తించలేదు. రాజు ‘లాంఛన ప్రాయమైన’ దేశాధినేతగాను, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు బాధ్యత వహించే మంత్రివర్గం ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థగాను నేపాల్ కొనసాగడానికి వీలు లేకపోయింది. లాంఛన ప్రాయమైన ‘రాజరికం’ కూడ రద్దయ్యింది. కానీ పర్షియా సింధుశాఖలలో ప్రజాస్వామ్య రహితమైన రాజరికం ఇప్పటికీ కొనసాగుతోంది! ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమైనట్టు? మన వంటి పరిణతి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశానికి ప్రభుత్వ అధినేత అయిన మోదీ బహ్రయిన్, ‘ఐక్య అరబ్ సంస్థానాల’లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రశ్న స్ఫురించడం సహజం!
‘ఐక్య అరబ్ సాంస్థానాల’ ప్రభుత్వం వారు శనివారం మన ప్రధానికి తమ దేశపు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జారుూద్’ను ప్రదానం చేయడం మైత్రి మరింత దృఢపడిందనడానికి నిదర్శనం. ఈ అత్యున్నత పురస్కారాన్ని ‘ఆరబ్ సంస్థానాల’వారు ఇదివరకే చైనా అధ్యక్షుడు ఝీ జింగ్ పింగ్‌కు, బ్రిటన్ రాణి ఎలిజెబెత్‌కు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కట్టబెట్టారట. ఆ దేశాల తరువాతనే భారత దేశానికి మైత్రీ ప్రాధాన్యం అన్న ధ్వని స్ఫురించడం సహజం. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోను పశ్చిమ ఆసియా ప్రాంతంలోను మన దేశం కంటె చైనాకు ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నాయన్నది జరిగిన ప్రచారం. ఆరబ్ ఎమిరెట్స్ ప్రభుత్వం కూడ ఇదే పద్ధతిని పాటిస్తోంది. మనది ప్రజాస్వామ్య సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ. చైనాలో నియంతృత్వ వ్యవస్థ పాదుకొని ఉంది. అయినప్పటికీ చైనావారు పశ్చిమ ఆసియాలోను, ఆఫ్రికాలోను, దక్షిణ అమెరికాలోను ఎక్కువ పలుకుబడిని సంపాదించగలిగారు. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైన తర్వాత చైనా సంస్థలు ఆయా దేశాలలోకి చొఱబడిపోయి వాణిజ్య పారిశ్రామిక నియంత్రణను సాధించడం ఇందుకు కారణం. ఆయా ప్రభుత్వాలకు మన దేశం పట్ల గౌరవం ఉంది. మన వ్యవస్థ పట్ల ప్రశంసాపూర్వకమైన అభిప్రాయాలను ఈ దేశాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఈ అన్ని దేశాలకూ చైనా పట్ల ‘్భయం’ నెలకొని ఉంది. ఇదీ తేడా! గత ఐదేళ్లుగా మన ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాలతోను, ప్రత్యేకించి సింధుశాఖ దేశాలతోను సంబంధాలను మెరుగుపరచుకోగలిగింది. ఈ పెంపొందిన సంబంధాలకు ప్రతీక మోదీకి ‘యూఏఈ’ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం. ఇలా ప్రభుత్వ స్థాయి మైత్రి పెంపొందుతోంది. కానీ సింధుశాఖ దేశాల ప్రజల సమష్టి స్వభావంలో ఇప్పటికీ ఇస్లామేతర మతాల పట్ల వ్యతిరేకత నిహితమై ఉంది. ఈ వ్యతిరేకత కారణంగానే సింధుశాఖ దేశాలలోని సంపన్నులు ప్రత్యేకించి సౌదీ అరేబియా, కతార్ వంటి దేశాలలోని సంపన్నులు పాకిస్తాన్‌లోని, పశ్చిమ ఆసియాలోని, ఉత్తర ఆఫ్రికాలోని ‘జిహాదీ’ బీభత్స ముఠాలకు నిధులను సమకూర్చుతున్నారు. బహ్రయిన్‌లోని ‘నేషనల్ డెమొక్రాటిక్ యాక్షన్ సౌసైటీ’ బీభత్సకాండను హింసాకాండను ప్రోత్సహిస్తోందని బహ్రయిన్ ప్రభుత్వం 2017లో ఆరోపించింది. మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం బహ్రయిన్ రాజధాని మనామాలో విడుదలైన సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను పరోక్షంగానైనా అభిశంసించడం శుభ పరిణామం. కానీ బీభత్సకాండకు ప్రేరకమైన మతోన్మాదాన్ని నియంత్రించడం వౌలికమైన అవసరం. సింధుశాఖ దేశాలలో మతోన్మాదం సహజంగానే సమాజంలో నిహితమై ఉంది. ఇందుకు కారణం ఆ దేశాలలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కాని, ప్రజాస్వామ్యం కాని వికసించకపోవడం.
దాదాపు కోటిమంది జనాభా గల ఆరు ‘సంస్థానాల’ కూటమి అయిన ‘యూఏఈ’లో డెబ్బయి ఏడు శాతం మంది ఇస్లాం మతస్థులు. తొమ్మిది శాతం హిందువులు, పనె్నండు శాతం క్రైస్తవులు ఉన్నారట. అయినప్పటికీ ఈ దేశం సర్వమత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థగా ఇప్పటికీ ఎందుకని రూపొందలేదు? వర్ణ వివక్ష జాత్యహంకార వ్యవస్థలు అంతర్గత సమస్యలు కాదన్నది దక్షిణ ఆఫ్రికా విషయంలో ధ్రువపడిన చారిత్రక వాస్తవం. ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ వ్యవస్థలు, సర్వమత సమభావ వ్యతిరేక ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు మాత్రం ఎందుకని అంతర్గత వ్యవహారాలు కావాలి? అన్ని దేశాలలోను సర్వమత సమభావ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకని ఏర్పడరాదు? ఇందుకు ఎప్పుడో అప్పుడు ప్రయత్నం ప్రారంభించవలసింది మన దేశమే..