సంపాదకీయం

స్వాతంత్య్ర రక్షణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర మధుర మాతృ మమత
మది మదిలో పండాలి..
సుధానిహిత భ్రాతృప్రేమ
ఎద ఎద ఉప్పొంగాలి..
చందమామ సొగసు వంటి
స్నేహం విరబూయాలి..
అందరమూ కలసి మెలసి
అభ్యుదయము పంచాలి!
భౌతిక ప్రగతి, సాంస్కృతిక సుగతి స్వతంత్ర జాతీయ జీవన ప్రస్థాన రథానికి చక్రాలు! భౌతిక ప్రగతి స్వరూప సౌందర్యం.. సాంస్కృతిక సుగతి స్వభావ సౌజన్యం... ‘రక్షాబంధన ఉత్సవం’ అనాదిగా స్వరూప సౌందర్య సంరక్షణ ధ్యాసను పెంపొందిస్తోంది, సౌశీల్య స్వభావ పరిరక్షణ నిష్ఠను పెంపొందిస్తోంది! ఈ ‘్ధ్యస’, ఈ ‘నిష్ఠ’ శతాబ్దులపాటు కొనసాగిన విదేశీయ వికృత మూకల దురాక్రమణ సమయంలో కొడిగట్టడం చరిత్ర. బ్రిటన్ నుండి వచ్చిపడిన దుర్మార్గుల బీభత్స పాలన ఫలితంగా మాతృదేశపు భౌగోళిక స్వరూపం ముక్కలు చెక్కలైపోయింది, మాతృ జాతీయ స్వభావం సహజత్వాన్ని కోల్పోయింది. కలియుగం ఐదువేల నలబయి తొమ్మిదవ సంవత్సరం- క్రీస్తుశకం పంతొమ్మిది వందల నలబయి ఏడవ సంవత్సరంలో భారత జాతి బ్రిటన్ దురాక్రమణ నుండి విముక్తమైన నాటికి ఇలా స్వరూప వైకల్యం, స్వభావ వైక్లబ్యం దాపురించి ఉండడం చరిత్ర.. అనాది వాస్తవమైన ‘అఖండ భారత్’ నుంచి వివిధ సమయాలలో సగానికి పైగా భూభాగాలు విడిపోయాయి, బ్రిటన్ విముక్తి జరిగిన నాటికి మిగిలి ఉన్న ‘అవశేష’ భారత జాతిని భారత జాతీయ బుద్ధిని బ్రిటన్ భావదాస్యం ఆక్రమించి ఉండడం కఠోర వాస్తవం! ఇలా మాతృభూమి స్వరూపం వైకల్యానికి గురి అయి ఉందన్న, మాతృ జాతీయ స్వభావం పాశ్చాత్య భావ దాస్య మయమై ఉందన్న ధ్యాస ఈ దేశంలో విద్యావంతులలో అత్యధికులకు లేకపోవడం డెబ్బయి రెండేళ్ల వైపరీత్యం...
భావదాస్య మధువు క్రోలి
స్వభావాన్ని మరచి సోలి
విజాతీయ సైద్ధాంతిక
విషపు మత్తుతో తూలి..
స్వభూమీయ స్మృతి తప్పిన
స్వజాతీయ మతి తప్పిన
తన సంతతి ‘‘స్వాతంత్య్రం
వచ్చిందని’’ వదరుచుంటె
‘‘ఏదీ ఎక్కడ ఉంద’’ని
వెదకుచున్నదోయ్ భారతి!
వేకువ వికసిస్తున్న ఛాయలు ఇప్పుడిప్పుడు ప్రస్ఫుటిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ తొలగిపోయి మిగిలిన ప్రాంతాలతో సమానమైన ప్రతిపత్తి ఏర్పడడం స్వరూప వైకల్యాన్ని తొలగించి భారత భౌతిక సమగ్రతను సాధించడానికి అంకురార్పణం. భారత భౌగోళిక సమగ్రతను మళ్లీ సాధించడం అంటే ఎప్పటికైనా సరే అఖండ భారత పునరుద్ధరణ. జమ్మూ కశ్మీర్ భౌగోళిక సమగ్రతను సాధించడం ఇందుకు మొదటి మెట్టు. జమ్మూ కశ్మీర్‌లో రెండుచోట్ల చైనా తిష్ఠవేసింది. మూడవ వంతు భూమి పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో అలమటిస్తోంది. ఈ చైనా, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌కు విముక్తిని సాధించడం మాతృభూమి స్వరూప సమగ్రతను పునరుద్ధరణకు ప్రేరకం కాగలదు. మాతృభూమి దశల వారీగా ముక్కలు కావడం చరిత్ర. డెబ్బయి రెండేళ్ల క్రితం భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోవడం స్వరూప సమగ్రతకు ఏర్పడిన పెద్ద గాయం. ఈ గాయం గురించి మనలో కొందరికి ధ్యాస ఉంది. కానీ అంతకు పూర్వమే ‘అఖండ భారత్’నుంచి అనేక భూభాగాలు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయన్న చారిత్రక ధ్యాస మాత్రం ఈ కొందరిలోని అత్యధికులకు లేదు. 1937 వరకు బర్మా భారత్‌లో భాగం, అనాదిగా అంతర్భాగం. 1885 వరకు బ్రిటన్ దురాక్రమణను బర్మా ప్రజలు నిరోధించగలిగారు. ఆ తరువాత బర్మా కూడ బ్రిటన్ దాస్యగ్రస్తమైంది. బ్రిటన్ విముక్త భారత్‌లో బర్మా సహజంగా భాగమై ఉండాలి! కానీ భారత్‌ను బలహీనపరిచే దుస్తంత్రంలో భాగంగా బ్రిటన్ ‘పాలకులు’ 1947 కంటె పదేళ్లు ముందుగానే బర్మా- మ్యాన్‌మార్-ను భారత్ నుంచి విడగొట్టారు. తమ ప్రాంతాన్ని భారత్ నుంచి విడగొట్టరాదని కోరుతూ 1935 నుంచి బర్మా ప్రజలు ఉద్యమాలు జరిపారు. అప్పుడు బ్రిటన్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండిన కాంగ్రెస్ మహాసంస్థవారు బర్మా ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం చారిత్రక దౌర్భాగ్యం. అలా ‘అఖండ’ భారత్ నుంచి బర్మా విడిపోయింది. ప్రస్తుతం శ్రీలంకగా స్వతంత్ర దేశంగా ఉన్న సింహళ ద్వీపం బ్రిటన్ దురాక్రమణ మొదలయ్యేవరకు అఖండ భారత్‌లో అవిభాజ్యం. కొలంబో సమీపంలోని ‘శాంకరీదేవి’ శక్తిపీఠాల వరుసలో మొదటిది. ‘లంకాయాం శాంకరీదేవీ..’ అంటూ భరత దేశపు స్వరూప వివరణ మొదలౌతూ ఉంది. వివేకానందస్వామి అమెరికా ఐరోపా ఖండాలలో పర్యటించి తిరిగి మాతృదేశానికి తిరిగి వచ్చాడు. సింహళంలోని కొలంబోలో ఓడ దిగిన స్వామి మళ్లీ భరత మాత ఒడిలో చేరినందుకు మురిసిపోయాడు. అంటే క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది చివరివరకు కూడ సింహళం భారతదేశంలోని ఒక- దక్షిణ ప్రాంతమన్న వాస్తవ ధ్యాస సజీవమై ఉండేది. బ్రిటన్ బీభత్స పాలకులు ఈ ‘్ధ్యస’ను హత్యచేసిపోయారు. సింహళ ద్వీపాన్ని ‘సిలోన్’గా మార్చి భారత్ నుంచి విడగొట్టారు. ‘మాల్ ద్వీపాలు’లను ‘మాల్ దీవులు’గా మార్చిన విదేశీయుల దుస్తంత్రం అఖండ భారత విభజనలో మరో చారిత్రక వైపరీత్యం. బ్రిటన్ వ్యతిరేక ఉద్యమం జరిపిన కాంగ్రెస్ మహాసంస్థవారు ఈ చారిత్రక సత్యాలను పట్టించుకోకపోవడం విధి విలాపం..
ఎల్లలు మరచిన నేతలు
కల్లల కథ వల్లించిరి,
తల్లి ఎదను గునపాలతో
పెల్లగించి పెంపెల్లిరి,
నేస్తపుమాటల వంచన
పరులకు బానిసలైరి,
వాస్తవ చరితకు దొంగల
వక్రదృష్టి జోడించిరి..
కలియుగం ఆరంభం నుంచి దాదాపు ముప్పయి ఎనిమిది శతాబ్దులపాటు, అంటే క్రీస్తుశకం ఏడవ శతాబ్దివరకు మొత్తం ‘అఖండ భారత్’ను పదకొండు రాజవంశాల వారు పాలించడం ప్రాచీన సమీకృత రాజ్యాంగ వ్యవస్థకు చారిత్రక సాక్ష్యం. ‘గిరివ్రజం’, ‘పాటలీ పుత్రం’, ‘ఉజ్జయినీ’నగరాలు క్రమంగా దేశానికి రాజధానులుగా విలసిల్లాయి. నేటి ‘అఫ్ఘానిస్థాన్’లో గాంధార, యోన వంటి రాజ్యాలు ఏర్పడి ఉండేవి. ఇస్లాం మాత్రమే ప్రపంచమంతటా ఏకైక మతంగా మిగిలి ఉండాలన్న లక్ష్యం కల ‘జిహాదీ’ బీభత్సకారులు గాంధార, యోన, హోర, రామర, ఉత్తర జ్యోతిషం వంటి రాజ్యాలలోకి చొరబడి భారతీయ మతాల వారిని నిర్మూలించారు. ఫలితంగా ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఏర్పడిన ఈ ‘రాజ్యాలుండిన’ ప్రాంతం అఫ్ఘానిస్థాన్‌గా పేరు మార్చుకుంది. బ్రిటన్ దురాక్రమణ కాలంలో అప్ఘానిస్థాన్ అఖండ భారత్ నుండి విడిపోయింది. అనాదిగా అఖండ భారత్‌లోని ప్రాంతాలయిన నేపాల్, భూటాన్ ప్రాంతాలు క్రీస్తుశకం 1947వరకు కూడ బ్రిటన్ దురాక్రమణకు లొంగలేదు. ఇలా స్వతంత్రంగా మిగిలిన అఖండ భారత ప్రాంతాలు భటాన్, నేపాల్! బ్రిటన్ దురాక్రమణ నుండి దేశం విముక్తమైన తరువాత కూడ ఈ రెండు ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడి భారత్‌కు దూరం కావడం ఆంగ్లేయుల దుస్తంత్రం.. టిబెట్ కలియుగంలో దాదాపు రెండువేల ఐదు వందల ఏళ్లవరకు అఖండ భారత్‌లో భాగం, ఆ తరువాత అది స్వతంత్ర దేశం కావడం వేఱుకథ. కానీ 1914లో బ్రిటన్ దొరలు లడక్ తూర్పు ప్రాంతాన్ని కైలాస మానస సరోవర ప్రాంతాన్ని టిబెట్ దేశానికి చెందినవిగా నిర్ధారించడం మరో చారిత్రక వైపరీత్యం. టిబెట్‌ను చైనా దురాక్రమించిన తరువాత ‘కైలాస్’ ‘మానస’ ప్రాంతాలను దర్శించడానికై మనం చైనా దురాక్రమణకారుల ‘అనుమతుల’ను తీసుకోవలసి వస్తోంది!
ఇలా 1947 నాటికే ముక్కలుచెక్కలై ఉండిన భారత్‌ను బ్రిటన్‌వారు మళ్లీ మూడు ముక్కలుచేసి రెండు ముక్కలను పాకిస్తాన్‌గా ఏర్పాటుచేశారు. ఇలా దశలవారీగా విభజనకు బలై క్షతగాత్ర అయిన భరతమాత విలపిస్తూ ఉండడం స్వరూప వైకల్యానికి నిదర్శనం. స్వరూప వైక్లబ్యం కథ వేఱు. భారతీయ స్వరూపం పొంది ఉన్నవారిలో అత్యధికుల జీవన రీతి, ఆలోచనారీతి, సంస్కార సమాహారం బ్రిటన్, ఐరోపా వికృతులతో ప్రభావితమై ఉండడం ఈ స్వభావ వైక్లబ్యం.. ఏ ‘గూటి’చిలుక ఆ పాట పాడుతుందట! కానీ భారతీయ గృహంలోని ‘చిలుకలు’ పాశ్చాత్య గీతాలను ఆలపిస్తుండడం స్వభావ విలాపం! వేకువ నడుస్తోంది, కానీ చీకటి తొలగడం లేదు! బహుళ జాతీయ వాణిజ్య సంస్థల విదేశాల నుంచి మన దేశంలోకి చొరబడిపోవడం ‘చీకటి తొలగకపోవడం..’. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో ఒక్క ‘ఈస్టిండియా కంపెనీ’ దేశమంతటా విస్తరించింది, భారత దేశానికి స్వాతంత్య్రం పోయింది! ఇప్పుడు ఒకటి కాదు, వందల ‘ఈస్టిండియా కంపెనీ’లు దేశమంతటా చెదల వలె వ్యాపించాయి. స్వాతంత్య్రానికి రక్షణ..??
బంగరు సొగసుల భారత
మంగళకర భావ రథం
‘పడమటి’ జలతారు తెరల
‘బందీ’యై నడుస్తోంది...
సొంత ఇంటి వంటల రుచి
మరచిన బానిస బుద్ధి
‘తెల్ల’మత్తు ‘చాక్లెట్ల’ను
తెగ నమిలేస్తూ ఉన్నది..