సంపాదకీయం

‘అంతటివారు’ లేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే..! ‘అంతటివారు’ వారు.. వారంతటివారు వారే! వారు తప్ప కాంగ్రెస్ మహాసంస్థను నడిపించడానికి మరో దిక్కులేదు! ఈ సంగతి ఇప్పుడిలా మరోసారి ధ్రువపడింది. సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఈ ధ్రువీకరణ. నూట ముప్పయి మూడేళ్ల కాంగ్రెస్ మహా రాజకీయ సంస్థలో అధ్యక్ష పదవిని నిర్వహించగలవారు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమేనన్నది ఈ ధ్రువీకరణ!! ‘‘నిన్నిడిస్తే గతి లేదు, నీవే మాకు దిక్కు...’’ అని గత రెండున్నర నెలలకు పైగా కాంగ్రెస్ ‘‘మహామహులందరూ’’ రాహుల్ గాంధీని ప్రాధేయపడినట్టు ప్రచారం జరిగింది. రాజీనామా చేసిన ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకోవాలన్నది ఈ ‘‘మహామహులు’’ చేసిన అభ్యర్థన. మే నెలలో ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. ‘‘మరోసారి’’ అన్నది ఎందుకంటె 2014లో జరిగిన ఎన్నికలలో పొందగలిగిన దారుణ పతనానికి మే నెలనాటి పరాజయం పునరావృత్తి కాబట్టి. ప్రభుత్వ పరాజయాలకు కాని, పార్టీ పరాజయాలకు కానీ నైతిక బాధ్యతనో, ప్రత్యక్ష బాధ్యతనో వహించడం 1946 నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబానికి తెలియని వ్యవహారం. అందువల్ల పార్టీ పరాజయానికి బాధ్యత వహించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవలసిన అవసరం లేదన్నది ఈ ‘మహామహుల’ అభిప్రాయం. 1962లో మన దేశంలోకి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ దళాలు చొరబడి మన భూభాగాలను కాజేయడానికి దోహదం చేసిన ‘‘విపరిణామ క్రమానికి’’ ఏకైక దోహదకుడు జవహర్‌లాల్ నెహ్రూ. 1949 నుంచి ఆయన చైనా కమ్యూనిస్టు నియంతల స్నేహం కోసం, వారినుంచి లభించగల ప్రశంసల కోసం తహతహలాడిపోయాడు. అందువల్లనే మన దేశానికీ చైనాకు మధ్య ‘‘అడ్డుగోడ’’వలె నిలచి ఉండిన సువిశాల టిబెట్ స్వతంత్ర దేశాన్ని చైనా దురాక్రమించడాన్ని నెహ్రూ అంగీరించాడు. టిబెట్‌లో- చైనా దురాక్రమణను నిరోధించడానికి క్రీస్తుశకం 1914లో బ్రిటన్ ప్రభుత్వం నెలకొల్పిన భారతీయ సైనిక దళాలను నెహ్రూ ఉపసంహరించుకున్నాడు. 1947 నుంచి 1964 వరకు ప్రధానమంత్రిగా ఉండిన జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ విధానానికి చైనాతో ద్వైపాక్షిక స్నేహం, అంతర్జాతీయంగా చైనా ప్రయోజనం ప్రాతిపదికలు కావడం చరిత్ర. ఈ స్నేహ మోహంతోనే స్వతంత్ర టిబెట్ ఆవలి వైపున పడి ఉండిన చైనా సరిహద్దులను టిబెట్ ఈవలకు చేర్చి మనకు చైనాను పొరుగు దేశంగా మార్చాడు నెహ్రూ. మన సరిహద్దులకు చేరిన చైనా ఆ తరువాత మన దేశంలోకి తోడేలు వలె దూకింది. 1962లో జరిగిన ఈ దురాక్రమణ ఇప్పటికీ కొనసాగుతోంది. అయినప్పటికీ 1962లో నెహ్రూ ఎలాంటి బాధ్యతను స్వీకరించలేదు, ప్రధాని పదవికి రాజీనామా చేయలేదు...
జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబ రాజకీయ వారసులు ఇదే ‘‘ఆదర్శ నీతి’’ నిలబెట్టారు. 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయిన నాటికి జవహర్‌లాల్ నెహ్రూ మనుమడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కానీ పరాజయం తరువాత రాజీవ్ గాంధీ రెండు పదవులలో దేన్ని కూడ వదలుకోలేదు. ప్రధానమంత్రి పదవి పోయిన తరువాత కూడ ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడిగా మళ్లీ ఎన్నికయ్యాడు, అధ్యక్ష పదవిలోనూ కొనసాగాడు. ఇలా రెండు పదవులలోను ఒక్కరే కొనసాగే నిరంకుశ సంప్రదాయాన్ని ఆరంభించినవాడు జవహర్‌లాల్ నెహ్రూ. 1951లో పార్లమెంటరీ పార్టీ నాయకుడి- ప్రధాని-గా ఉండిన నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడ ఎన్నిక కావడం చరిత్ర. ఇలా ఎన్నిక కావడం కోసం అప్పుడు అధ్యక్షుడుగా ఉండిన పురుషోత్తమదాస్ టాండన్‌ను బలవంతంగా గద్దెదింపడం విచిత్ర చరిత్రకు శ్రీకారం. సర్దార్ వల్లభభాయి పటేల్ 1950 డిసెంబర్‌లో మరణించిన తరువాత పార్టీలో నెహ్రూకు ఎదురులేకుండాపోయింది. నెహ్రూ కుటుంబం వారి ఏక ఛత్రాధిపత్యానికి ప్రాతిపదిక ఏర్పడింది. కానీ రాజర్షి వంటి స్వాతంత్య్ర సమరయోధుడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం నెహ్రూ నిరంకుశత్వానికి నిరోధకంగా పరిణమించింది. అందువల్లనే టాండన్ ‘రాజఋషి’ని గద్దెదించడానికి ప్రధాని నెహ్రూ గొప్ప ‘ప్రహసనం’ ప్రారంభించి నడిపించాడు. టాండన్‌తో విభేదాల కారణంగా నెహ్రూ కాంగ్రెస్ కార్యవర్గం నుంచి ‘‘రాజీనామా చేశాడు..’’ ఈ రాజీనామా వల్ల పార్టీలో అత్యంత తీవ్రమైన కల్లోలం చెలరేగినట్టు ప్రచారమైంది. ‘అఖిల భారత కాంగ్రెస్ సంఘాల’-ఏఐసిసి- ప్రతినిధుల సమావేశం జరిగిందట. ఈ సమావేశం సందర్భంగా నెహ్రూకు ‘‘మద్దతు’’గా అనేక మంది కార్యవర్గ సభ్యులు పదవులకు రాజీనామా చేశారట! కొత్త కార్యవర్గ సభ్యులను ‘ఏఐసిసి’ సమావేశం ఎన్నుకోవాలని టాండన్ కోరినట్టు చరిత్ర. కానీ నెహ్రూ మొండి పట్టుదల కారణంగా నూతన కార్యవర్గం ఎన్నిక జరగలేదు. విసిగిపోయిన టాండన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. టాండన్ మద్దతుదారులు తీవ్ర నిరసనలు తెలిపారు. కానీ పార్టీలో ‘కలహం’ కొనసాగడం ఇష్టం లేని, పదవీ వ్యామోహం లేని రాజర్షి టాండన్ వారిని శాంతింపచేశాడు! నెహ్రూ అధ్యక్షుడయ్యాడు.
ఇదే సంప్రదాయాన్ని ‘రెండు పదవులను ఒక్కరే నిర్వహించే సంప్రదాయాన్ని’ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 1980 నుంచి 1984 వరకు, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 నుంచి 1991 వరకు కొనసాగించడం చరిత్ర. తాము ఒక పదవిని నిర్వహించి మరో పదవిని ఇతరులకు కట్టబెట్టినట్టయితే సమాంతరంగా మరో నాయకుడు పార్టీలో ఎదగవచ్చు. అందువల్ల తమ నిరంకుశ నిర్నిరోధ ఏకఛత్రాధిపత్యానికి విఘాతం ఏర్పడుతుంది. అందువల్ల నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీలు పార్టీలో మరో నాయకుడన్న వాడిని, నాయకుడుగా ఎదగగలడన్న వాడిని లేకుండా చేయగలిగారు. ఇలా పోటీగా ఎదిగే నాయకులను పథకం ప్రకారం పక్కకు తప్పించడం బ్రిటన్ దురాక్రమణ సమయంలో కాంగ్రెస్‌లో అంకురించిన సంప్రదాయం. గత శతాబ్ది ఆరంభంలోనే లోకమాన్య తిలక్ నాయకత్వంలోని జాతీయ తత్త్వనిష్ఠులను- గోపాల కృష్ణగోఖలే, సురేంద్రనాథ బెనర్జీ వంటి ‘మితవాదులు’ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తప్పించగలిగారు. ఈ మితవాదుల కూటమిలోని మరో ప్రముఖుడు జవహర్‌లాల్ నెహ్రూ జనకుడైన మోతీలాల్ నెహ్రూ.. 1938-1939లో రెండవసారి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన సుభాష్‌చంద్ర వసు అర్ధాంతరంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఇందుకు కారణం ఈ ‘మితవాదుల’ కూటమి జరిపించిన కుట్ర. కార్యవర్గ సభ్యులు రాజీనామా చేయడం ఈ కుట్ర.. విసిగిన నేతాజీ సుభాస్ చంద్రవసు అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. దీనికి పునరావృత్తి 1951లో టాండన్ వైదొలగడం.. ఇందిరాగాంధీ 1969లో పార్టీ చీలిన తరువాత ఏకైక నాయకురాలుగా మిగిలింది. ఆమె నాయకత్వాన్ని అంగీకరించిన గుల్జారీలాల్ నందా వంటి నాయకులు 1971 తరువాత ప్రాముఖ్యం కోల్పోయారు. రాజీవ్ గాంధీ పి.వి.నరసింహారావు, ప్రణవ్ ముఖర్జీ వంటివారి ప్రాధాన్యాన్ని తగ్గించి వేశాడు. సోనియాగాంధీ శరద్ పవార్ వంటి నేతలను పార్టీనుంచి వెళ్లగొట్టించింది!
అందువల్ల కాంగ్రెస్‌లో ఈ నెహ్రూ, గాంధీ కుటుంబం వారు తప్ప మరో నాయకుడు మిగిలి లేడు. నాయకత్వం వహించగలమన్న విశ్వాసం ఉన్నవారందరూ- కొందరు ‘గెంటివేత’కు గురై మరికొందరు స్వచ్ఛందంగా- పార్టీనుంచి నిష్క్రమించి కొత్త పార్టీలను పెట్టుకున్నారు! అందువల్ల తండ్రి తాతల సంప్రదాయానికి భిన్నంగా రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటికీ అధ్యక్ష పదవీ గురుతర బాధ్యతను నిర్వహించగల ‘ఇతరులు’ పార్టీలో ఇప్పుడు లేరు. అందువల్ల పంతొమ్మిది ఏళ్లు ఇదివరకే అధ్యక్ష పదవిని నిర్వహించిన సోనియాగాంధీ మళ్లీ అధ్యక్ష పదవిని స్వీకరించింది. ప్రియాంక గాంధీ ‘‘అధ్యక్ష పదవిని స్వీకరించే వరకు’’ బహుశా ఈ వృద్ధ నాయకురాలు ఈ గురుతర బాధ్యతా భారాన్ని మోయక తప్పదట!