సంపాదకీయం

పాకిస్తానీ దౌష్ట్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష బీభత్సకాండను కొనసాగించడానికి అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి ప్రచ్ఛన్న బీభత్సకాండను ఉద్ధృ తం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పూనుకొంది. తమ దేశంలోని మన రాయబారి- హైకమిషనర్- అజయ్ విసారియాను బహిష్కరించడం ఈ ప్రచ్ఛన్న బీభత్సకాండలో ఒక అంశం మాత్రమే! మన దేశంతో వాణిజ్య సంబంధాలను రద్దుచేసుకుంటున్నట్టు పాక్ ప్రభుత్వం బుధవారం ప్రకటించడం కూడ దౌత్య దౌర్జన్యంలో భాగం. ఈ దౌత్య దౌర్జన్యం ప్రచ్ఛన్న- పరోక్ష- బీభత్సకాండలో ఒక భాగం. ఉభయ దేశాల మధ్య రాకపోకలను కూడ ఆ ప్రభుత్వం రద్దుచేసుకుంటోందట! ఇందులో భాగంగా సంఝౌతా రైలు సేవలను నిలిపివేస్తున్నట్టు గురువారం ఆర్భాటించింది. మన దేశంలో ప్రస్తుతం పాకిస్తానీ రాయబారి లేడు. అందువల్ల అతగాడిని మనం వెళ్లగొట్టవలసిన అవసరం లేదు. గగన యానానికి సంబంధించిన ఆంక్షలను కూడ పాకిస్తాన్ మళ్లీ విధిస్తోందట. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తీపుర సమీపంలో గత ఫిబ్రవరి 14న దాదాపు నలబయి మంది మన కేంద్ర పోలీసులను పాకిస్తానీ ప్రభుత్వ ప్రేరిత ‘జాయిష్ ఏ మొహమ్మద్’- జెఇఎమ్- బీభత్సకారులు హత్యచేయడం పాకిస్తాన్ జిహాదీ కాండకు పరాకాష్ఠ. ఈ రాక్షసులను శిక్షించడానికై మన వైమానిక దళం ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోకి చొచ్చుకొని పోయింది. బీభత్సపు బట్టీలను పగులగొట్టి వచ్చింది. ఈ సాయుధ చికిత్సను నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం హర్షించి ఉండాలి. ఎందుకంటె మన దళాలు బీభత్సకారులను శిక్షించి వచ్చాయి. తమ దేశంలో ముప్పయి నుంచి నలబయి వేల మంది ఉగ్రవాదులు, బీభత్సకారులు పనిచేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం గత నెల 24న స్వయంగా అంగీకరించింది. ఈ బీభత్సకారులతో పాకిస్తాన్ ప్రభుత్వానికి నిజంగా సంబంధం లేనట్టయితే- మన వైమానిక దళం జరిపిన చర్యను ఆ ప్రభుత్వం హర్షించి ఉండాలి. ఎందుకంటె ఏ దేశంలోని బీభత్సకారులయినా ప్రపంచానికి శత్రువులు, మానవత్వానికి ప్రబల విరోధులు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దులుగా ఈ నలబయివేల మంది జిహాదీ హంతకులను పెంచి పోషించింది. ఈ ‘పోషణ’కు అవసరమైన నిధులను సౌదీ అరేబియా తదితర పర్షియా సింధుశాఖ దేశాల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి లభిస్తున్నాయి. ఈ దేశాలలోని సంపన్నులు పాకిస్తాన్‌లోని జిహాదీలను పోషిస్తున్నారు. అందువల్ల ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రచ్ఛన్న సైనికులు మాత్రమే. అందువల్లనే మన వైమానిక దళం తమ దేశంలోని జిహాదీ మూకలను శిక్షించడం పట్ల పాక్ ప్రభుత్వం నిరసన తెలిపింది, మన పౌర విమానాలు తమ దేశం గుండా పయనించకుండా గగన తల ఆంక్షలను విధించింది. గత నెలలో ఈ గగనతల ఆంక్షలను రద్దుచేసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాటిని విధిస్తోందట..
పాకిస్తాన్ ఇలా దౌత్య దౌర్జన్యకాండకు పాలుపడడం ఆశ్చర్యకరం కాదు. ఇదంతా 1947 నుంచి పునరావృత్తం అవుతున్న పాకిస్తాన్ ప్రవర్తన పద్ధతులలో భాగం. రాయబారులను, దౌత్యవేత్తలను బహిష్కరించడం, ఐక్యరాజ్యసమితిలోను, అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి వ్యతిరేకంగా విషం కక్కడం పాకిస్తానీ రాజకీయ వేత్తల మనుగడకు వౌలికమైన ప్రాతిపదిక! మన దేశం పట్ల మైత్రిని పాటిస్తున్నట్టు ఏ రాజకీయవేత్తకైన పేరువచ్చినట్టయితే పాకిస్తాన్‌లోని జిహాదీలకు ఆ రాజకీయవేత్త పట్ల దురాగ్రహం కలుగుతుంది. ఈ దురాగ్రహం సైనిక దళాల దుశ్చర్యల ద్వారా విరుచుకొని పడుతుంది. ఎందుకంటె సైనిక దళాలు పాకిస్తాన్‌లోని ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారులు ఇలా సైనిక దళాల దురాగ్రహానికి గురి అయిన రాజకీయవేత్తలు పాకిస్తాన్‌లో మనుగడ సాగించడం కల్ల. భారత అనుకూలతను ప్రదర్శిస్తున్నట్టు ఏ పౌర ప్రభుత్వం పట్ల అయినా సైనిక దళాల అధిపతులకు అనుమానం కలిగినా ఆ ప్రభుత్వాన్ని సైనిక దళాలు కూల్చివేస్తాయి. ఇదీ పాకిస్తాన్ చరిత్ర. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వ అధినేతలు కాని, ప్రభుత్వ నిర్వాహకులు కాని భారత్ పట్ల మైత్రీభావం కలిగినవారు కాదు. కానీ అంతర్జాతీయ సమాజంలో తమ దౌత్య ఔదార్యాన్ని చాటుకోవడం అప్పుడప్పుడు మన దేశంలో సత్సంబంధాలను నెలకొల్పుకునే అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అభినయం కొంత ఎక్కువయినప్పుడల్లా సైనిక దళాలవారు ‘చర్య’కు పూనుకుంటుండడం చరిత్ర. జుల్ఫికర్ అలీ భుట్టో 1970వ దశకం చివరిలో ఇలా కొంత ఔదార్యాన్ని అభినయించాడు. ఆయనను సైనిక దళాల అధిపతి అయిన జియా ఉల్‌హక్ పదవీచ్యుతిడిని చేసి, ‘విచారణ’జరిపి ఉరితీసి చంపించాడు. ఢిల్లీ-లాహోర్‌ల మధ్య బస్సు సేవలను ప్రారంభించడానికి అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో ఒప్పందం కుదుర్చుకున్న అప్పటి పాకిస్తాన్ ‘పౌర’ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను 1999లో సైనిక దళాల అధిపతి పరవేజ్ ముషారఫ్ పదవీచ్యుతుడిని గావించాడు.
జుల్ఫికర్ అలీ భుట్టోకు విధించినట్టే సైనిక దళాలవారు నవాజ్ షరీఫ్‌కు కూడా శిక్ష విధించారు. కానీ ‘ఔదార్యం’ ప్రకటించి దేశం నుంచి వెళ్లగొట్టారు. 2008లో జుల్ఫీకర్ అలీ భుట్టో కుమార్తె బేనజీర్ భుట్టోను ఎన్నికలలో గెలవకుండా నిరోధించడానికి మాత్రమే సైనిక దళాలవారు నవాజ్ షరీఫ్‌కు దేశంలో పునఃప్రవేశం కల్పించారు. బేనజీర్ భుట్టో హత్యకు గురి అయిన తరువాత ఆమె భర్త అసఫ్ అలీ జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’కి నాయకత్వం వహించడం చరిత్ర. ఈ ‘పీపుల్స్‌పార్టీ’కంటె నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ‘ముస్లిం లీగ్’ ఎక్కువ జిహాదీ స్వభావం కలిగి ఉంది. అందువల్లనే 2013లో నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని కావడానికి సైనిక దళాలవారు దోహదం చేశారు. ఐదేళ్ల తరువాత ఇమ్రాన్‌ఖాన్ భయంకర ప్రచ్ఛన్న బీభత్సకారుడిగా ఎదిగాడు, భారత వ్యతిరేక రాజకీయవేత్తలలో- ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారులలో- మొదటి స్థానంలో నిలిచాడు. అందువల్లనే గత ఏడాది పాకిస్తాన్ జాతీయ శాసనసభకు జరిగిన ‘‘ఎన్నికల’’లో ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలోని ‘‘పాకిస్తాన్ తారీక్ ఏ ఇన్‌సాఫ్’’- పిటిఐ-ను సైనిక దళాలవారు గెలిపించారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఏడాదిగా ఈ పదవిని నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మొక్కవోని దీక్షతో భారత వ్యతిరేక బీభత్సకాండను కొనసాగిస్తూండడానికి ఇదీ నేపథ్యం. భారత వ్యతిరేకతను ఏమాత్రం సడలించినప్పటికీ సైనికుల రూపంలోని ‘జిహాదీ’లకు కోపం వస్తుంది! పాకిస్తాన్‌లో రెండు రకాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మొదటిది సైనిక ప్రభుత్వం. ఈ సైనిక ప్రభుత్వం తనంత తానుగా ప్రత్యక్షంగా కొన్ని సంవత్సరాలు పెత్తనం వహించింది. కానీ ‘సైనిక ప్రభుత్వాల’కు అంతర్జాతీయ సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు, మర్యాదా సమాదరణలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి. ‘ప్రజాస్వామ్య వ్యవస్థ’ అత్యంత ఆదర్శవంతమైన రాజ్యాంగ పద్ధతిగా గుర్తింపు పొందింది. అందువల్ల పాకిస్తాన్ సైనిక దళాల వారు కూడ తమ దేశంలో ‘‘ప్రజాస్వామ్య రాజ్యంగ వ్యవస్థ పరిఢవిల్లుతోందని’’ అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించ యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగం పౌర ప్రభుత్వం... ఎన్నికల అభినయం!
ఇలా పాకిస్తాన్‌లోని రెండు ప్రభుత్వాలలో మొదటిది ‘జిహాదీ’ స్వభావులైన సైనికుల ‘ప్రభుత్వం’. రెండవది సైనిక ప్రభుత్వం అదుపాజ్ఞలలో ప్రజాస్వామ్యాన్ని అభినయిస్తున్న ‘పౌర’ప్రభుత్వం. ఇలా పౌర ప్రభుత్వ నేతలు, నిర్వాహకులు ప్రచ్ఛన్న బీభత్సకారులు. ప్రత్యక్ష బీభత్సకారులతో తమకు సంబంధం లేదని పౌర ప్రభుత్వ నిర్వాహకులైన ప్రచ్ఛన్న - పరోక్ష- జిహాదీలు ప్రకటించడం సైనిక దళాల విస్తృత విష వ్యూహంలో భాగం. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బుధ, గురువారాలలో ప్రకటించిన భారత వ్యతిరేక చర్యలు స్వభావాత్మకమైనవి. ఏ ఇతర పరిణామం పట్ల ప్రతి క్రియగా ఈ చర్యలు జరగడం లేదు. కానీ ఈ చర్యల వల్ల మనకు మేలు జరుగుతోంది. నిజానికి మన ప్రభుత్వమే ‘‘పాకిస్తాన్‌ను బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’’గా ప్రకటించి ఉండాలి, ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను రద్దుచేసుకొని ఉండాలి. బీభత్సకాండను విడనాడే వరకూ పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలి! ‘వాణిజ్యం’ ముసుగులో బీభత్సం పాకిస్తాన్ నుంచి చొరబడుతుండడం దశాబ్దుల వైపరీత్యం! వాణిజ్యం రద్దుకావడం వల్ల బీభత్సకారుల చొఱబాటు తగ్గిపోగలదు!!