సంపాదకీయం

సమగ్రతకు శ్రీకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయం ఇది, కశ్మీరీ
జాగృత జన మనోరథం,
విజయం ఇది, మాతృదేశ
భక్తికి మంగళ శిఖరం,
విజయం ఇది, మహోదధీ
మథన జనిత మధుకలశం,
భరత మాతృ నయనాంచల
స్ఫురిత హర్షవర్ష జలం....
సూర్యోదయ శుభవేళ వికసిస్తున్న కమల సుమదళాల వలె జాతీయ భావ నిష్ఠులైన ప్రజల హృదయాలు... సూర్యుని వెలుగును చూడలేక రోదిస్తున్న ‘గుడ్లగూబల’ వలె విచ్ఛిన్నవాదుల గళాలు! భారత రాజ్యాంగం నుంచి ‘మూడువందల డెబ్బయ్యవ అధికరణం’ తొలగిపోతున్న సమయంలో అతి సహజంగా ఆవిష్కృతమైన పరస్పర విరుద్ధ దృశ్యాలివి. మాతృభూమి పట్ల మమకారం సనాతనమైన- శాశ్వతమైన వెలుగు. మాతృదేశ విద్రోహం వికృతమైన చీకటి! వెలుగును వెక్కిరించి, ధిక్కరించి, నిక్కినిక్కి చూసిన చీకటి అసంఖ్యాక కిరణాల ఆదిత్యుని ఆగమనంతో ‘తోక ముడిచి’ పారిపోవడం అనివార్యమైన పరిణామం! ఆ అనివార్యం సోమవారం ఉదయం రాజ్యసభలో సంభవించింది. ఈ సంభవం- ఊహించని పరిణామం.. ఊహించిన పరిణామం కూడ! ‘‘మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని’’ రద్దుచేయగల రాష్టప్రతి చర్యకు వీలుకల్పించే తీర్మానాన్ని దేశ వ్యవహారాలమంత్రి అమిత్‌షా సభలో ప్రవేశపెట్టిన క్షణం భారత రాజ్యాంగ చరిత్రలో వినూతన శ్రీకారం.. కలియుగాబ్ది ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం, శుభ వికారి ఆషాఢ శుక్ల పంచమి నెలకొని ఉండిన క్షణం!! జమ్మూ కశ్మీర్‌ను భారత భూమినుండి బయటకు నెట్టడానికి ఏడు దశాబ్దులకు పైగా యత్నించిన విచ్ఛిన్న విద్రోహ వికృత బీభత్స మూకలకు ‘ప్రాణం’గా మారి ఉండిన మూడు వందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణం తొలగిపోయింది. ఫలితంగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు మధ్య ‘వైరుధ్య కుడ్యం’గా మారి ఉండిన రాజ్యాంగపు ముప్పయి ఐదవ అధికారణంలోని ‘ఏ’ నిబంధన కూడ నిష్క్రమించింది! ఈ నిష్క్రమణ జమ్మూ కశ్మీర్ నుంచి భారత జాతీయ సమగ్రతా వ్యతిరేక వికృతికి శాశ్వత నిష్క్రమణ! జమ్మూ కశ్మీర్ అనాదిగా భారతదేశంలో, హైందవ జాతిలో అవిభాజ్య అంగమన్న వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ... జమ్మూ కశ్మీర్ ఇకపై రెండు పరిపాలన విభాగాలుగా వ్యవస్థీకృతం అవుతుండడం మరో కొత్త చరిత్రకు శుభారంభం. ఈ చరిత్ర నిజానికి విదేశీయ దురాక్రమణ పూర్వయుగం నాటి భౌగోళిక వాస్తవానికి పునరావృత్తి! లడక్ ప్రస్తుతం టిబెట్‌లో భాగమై ఉన్న కైలాస పర్వతం వరకు, మానస సరోవరం వరకు విస్తరించి ఉండడం ఈ భౌగోళిక వాస్తవం! చిన్న రాష్ట్రాలు ఏర్పడడం ప్రగతికి, వికేంద్రకృత ప్రాధాన్యానికి వౌలిక, సోపాన పథం... జమ్మూ కశ్మీర్ నుంచి ‘లడక్’ను విడదీసి కొత్త ‘కేంద్ర పాలిత ప్రాంతం’గా ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్య అభినందనీయం! అవశేష జమ్మూ కశ్మీర్ కూడ ‘కేంద్ర పాలిత ప్రాంతం’గా అవతరించింది కనుక ఈ ప్రాంతంలో సర్వసమగ్ర వికసనం వేగవంతం అవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సమూకల నుంచి విముక్తి లభిస్తుంది, అంతర్గత భద్రత పెరుగుతుంది! సమైక్యభావం విస్తరిస్తుంది...
కశ్మీరియత్- కశ్మీరీయత-, ఇన్‌సానియత్- మానవీయత-, జంభోరియత్- ప్రజాస్వామ్య వ్యవస్థ- అన్న మూడు స్తంభాలపై డెబ్బయి ఏళ్లకు పైగా జమ్మూ కశ్మీర్ ‘రాజ్యాంగ వ్యవస్థ’ నిలచి ఉందన్న ప్రచారం జరిగింది. కానీ నాలుగవ స్తంభం, అత్యంత ప్రధానమైన నాలుగవ స్తంభం కనిపించలేదు! ఇందుకు కారణం భారత రాజ్యాంగంలోకి చొఱబడిపోయిన మూడువందల డెబ్బయ్యవ అధికరణం! ఇప్పుడు ఈ అధికరణం తొలగిపోయింది కనుక నాలుగవ స్తంభం ప్రస్ఫుటిస్తోంది. ఈ నాలుగవ స్తంభం భారత జాతీయత! నిజానికి కశ్మీర్‌లో ‘కశ్మీరీయత్’ కూడ ఏళ్లతరబడి మోడువారిపోయింది. జమ్మూ కశ్మీర్‌లో ఏడు దశాబ్దులుగా ‘కశ్మీరీ భాష’కు నిలువ నీడలేదు, కశ్మీర్‌కు కశ్మీరీ భాష అధికార భాష కాలేదు. కనీసం రెండవ అధికార భాష స్థానం కూడ దక్కలేదు. ‘ఉర్దూ’ అధికార భాష అయింది. అనాదిగా ‘కశ్మీరీ’ భాషకు లిపి ‘శారద’... డెబ్బయి ఏళ్ల ‘మూడువందల డెబ్బయి’ అధికరణం మతోన్మాదులకు కల్పించిన ‘‘ప్రత్యేకత’’ ఫలితంగా స్వజాతీయ కశ్మీరీ భాష, ‘శారదా’లిపి అడుగంటిపోయాయి- కశ్మీరీ భాష లేని ‘కశ్మీరియత్’ అర్థం ఏమిటి? నిజమైన ‘కశ్మీరీయత్’ భారత జాతీయతలో భాగం. సర్వమత సమభావం హైందవ జాతీయ వౌలికతత్త్వం. ‘‘ప్రత్యేకత’’ కారణంగా కశ్మీరీ లోయలో ఈ వౌలిక తత్త్వం నష్టమైపోయింది. భారత దేశం బ్రిటన్ విముక్తమైన నాటికి కశ్మీర్ ‘లోయ’లోని జనాభాలో హిందువుల సంఖ్య ఇరవైమూడు శాతం, కానీ నలబయి మూడేళ్ల తరువాత ‘లోయ’లో హిందువులు నిశే్శషమయ్యారు. కేవలం ఐదువందల నలబయి మూడు హిందూ కుటుంబాలు మిగిలి ఉన్నాయన్నది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శాసనసభలో చెప్పిన మాట! 1947 అక్టోబర్ నుంచి కూడ ‘జిహాదీ’లు వేల మంది హిందువులను ‘కశ్మీర్ లోయ’లోను, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోను హత్యచేశారు. లక్షల మంది హిందువులను తరిమేశారు!! ఈ హిందువులు దేశంలోని ఇతర ప్రాంతాలలో దశాబ్దులుగా శరణార్థులు.. మూడువందల డెబ్బయ్యవ అధికరణం ఫలితం కశ్మీర్ ‘లోయ’లో సర్వమత సమభావ వ్యవస్థ అంతరించడం....
అనాదిగా హైందవ జాతీయతలో భాగమైన ‘కశ్మీరీయత్’ సర్వమత సమభావం! కానీ దేశమంతటా అనాదిగా నెలకొని ఉన్న ‘సర్వమత సమభావ వ్యవస్థ’ ఇలా కశ్మీరీలోయలో నశించిపోయింది. ఇందుకు కారణం ‘‘ప్రత్యేకత’’. ఈ ప్రత్యేకత నకిలీ ‘కశ్మీరియత్’ను పెంపొందించింది. సర్వమత సమభావం, సర్వవైవిధ్య సమభావం మానవీయత! సమభావం లేని నకిలీ ‘మానవీయత’కు ప్రాతిపదిక ‘మూడువందల డెబ్బయ్యవ అధికరణం’కల్పించిన ప్రత్యేకత! 1947లో బ్రిటన్ దురాక్రమణ ముగిసేనాటికి మూడు తప్ప దేశంలోని ‘సంస్థానాలు’ మొత్తం భారత్‌లో విలీనమయ్యాయి. అప్పటి మన ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్ సలహాపై ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ అప్పటి అధ్యక్షుడు- సర్ సంఘచాలక్- మాధవ సదాశివ గోళ్వల్కర్ 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌కు వెళ్లి సంస్థానాధీశులైన హరిసింగ్‌ను ఒప్పించాడు. అక్టోబర్ 26వ తేదీన జమ్మూ కశ్మీర్‌ను హరిసింగ్ భారత్‌లో విలీనం చేశాడు! మిగిలిన ఏ ఇతర సంస్థానానికి లభించని ‘‘ప్రత్యేక ప్రతిపత్తి’’ కశ్మీర్‌కు మాత్రమే ఎందుకు లభించాలన్నది అప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ‘మీమాంస’. ఇప్పుడు ఈ ‘అధికరణం’ రద్దయింది. అందువల్ల దేశంలోని అన్ని ప్రాంతాల మధ్య సమానత్వం సిద్ధించింది. అందువల్ల ఇది ‘రాజ్యాంగ సమానత్వ దినోత్సవం’! నిజానికి ఈ ‘ప్రత్యేకత’ను జమ్మూ కశ్మీర్ ప్రజలు కోరలేదు. పాకిస్తాన్ సమర్ధకులు, భారత వ్యతిరేక రాజకీయవేత్తలు కోరారు. మరింత కచ్చితంగా చెప్పాలంటే రెండు, మూడు కుటుంబాల ‘‘వారసత్వ పాలన’’ ఏడు దశాబ్దులు జమ్మూ కశ్మీర్‌లో కొనసాగడం మాత్రమే ‘‘ప్రత్యేకత’’. ఇలా ‘జంభోరియత్’- ప్రజాస్వామ్యం కూడ నీరుకారి పోయింది!! ఈ ‘అధికరణం’, దీనితో ముడిపడిన ముప్పయి ఐదవ అధికరణంలోని ‘ఏ’నిబంధన రద్దుకావడం వల్ల నిజమైన కశ్మీరీయత, మానవత, ప్రజాస్వామ్యాలతోపాటు భారత జాతీయ భావనిష్ఠకూడ జమ్మూ కశ్మీర్‌లో విస్తరించే చారిత్రక క్రియ మొదలైంది! దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి లేని విధంగా జమ్మూ కశ్మీర్‌కు ‘ప్రత్యేక రాజ్యాంగం’ ఏర్పడి ఉండడం ‘ప్రత్యేకత’! భారత జాతీయ పతాకంతోపాటు ‘జమ్మూ కశ్మీర్’కు మరో ప్రత్యేక ‘పతాకం’కూడ కొనసాగింది. ఒకే దేశంలో ‘దో విధాన్’- రెండు రాజ్యాంగాలు-, ఇద్దరు ప్రధానులు- దో ప్రధాన్-, రెండు జెండాలు- దో నిశాన్ ఉండరాదన్న ఉద్యమం 1950వ దశకంలోనే మొదలైంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, అప్పటి ‘జనసంఘ్’అధ్యక్షుడు డాక్టర్ శామాప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ఈ ఉద్యమం సాగింది. అప్పటి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆయనను నిరవధికంగా నిర్బంధించింది. 1953 జూన్ ఇరవైమూడున ఆయన నిర్బంధ గృహం- జైలు-లోనే మరణించడం చరిత్ర....
ముఖర్జీ బలిదానం ఫలితంగా జమ్మూ కశ్మీర్ ‘ప్రధానమంత్రి’ పదవి రద్దయింది, ‘ముఖ్యమంత్రి’ పదవి ఏర్పడింది. కానీ ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం రద్దుకాలేదు. ఇప్పుడు అవికూడా రద్దయిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభల కాలవ్యవధి ఐదేళ్లు. జమ్మూ కశ్మీర్ శాసనసభ కాల వ్యవధి మాత్రం ఆరేళ్లు... ఇదీ ప్రత్యేకత!! పాకిస్తాన్ నుంచి నిర్మూలనకు గురి అయిన హిందువులు లక్షల సంఖ్యలో మన దేశానికి వచ్చేశారు. వారందరూ దేశమంతటా స్థిరపడినారు. వారికి భారతీయ పౌరసత్వం లభించింది. జమ్మూ కశ్మీర్‌లో స్థిరపడిన వారికి కూడ భారతీయ పౌరసత్వం లభించింది. అందువల్ల వారు లోక్‌సభ ఎన్నికలలో వోట్లువేస్తున్నారు. కానీ వారికి ‘ప్రత్యేకత’ఉన్న జమ్మూ కశ్మీర్ పౌరసత్వం లభించలేదు. అందువల్ల వారికి జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలలో వోటువేసే అధికారం లేదు... వారికి కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగాలు దక్కలేదు. వారికి మాత్రమే కాదు, కశ్మీర్ వెలుపలి భారతీయులు కశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ, కశ్మీర్‌లో ఆస్తులను సంపాదించడం కానీ వీలు కాలేదు! ‘ప్రత్యేకత’ రద్దుకావడం అందువల్ల చరిత్రలో మరో సమైక్య ఘట్టం... సమగ్రతా అధ్యాయం.