సంపాదకీయం

‘విముక్త’ బాల్యం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేనకువేల పూజతలు వేకువతో వికసించె చూడుమీ రాగిణి!
నేల పాలగుచు రాలెడి ఇంకొక వేయి పూలు..
-అన్నది సుప్రసిద్ధకవి రాయప్రోలు సుబ్బరావు ఆవిష్కరించిన ప్రాకృతిక వాస్తవం! అనాదిగా అనంతంగా ఉన్న ఈ సనాతన జీవన సత్యాన్ని ఎందరో మహనీయులు వివరించారు. రాయప్రోలు మరోసారి వివరించారు. ఇది సహజమైన పునరావృత్తి. చిగురులు మొగ్గలు తొడగడం, పువ్వులుగా వికసించి పరిమళించి, ఫలించి, తరువాత రాలిపోవడం.. మళ్లీమళ్లీ ‘మొగ్గలు’ పువ్వులుగా ఎదగడం పునరావృత్తి! ఇదీ ప్రాకృతిక పరిణామ క్రమం! కానీ సమాజంలో సహజ ‘పునరావృత్తి’తోపాటు, అసహజమైన, అన్యాయమైన ‘పునరావృత్తి’ జరుగుతోంది. ‘మొగ్గలు’ మొగ్గలుగానే మిగిలిపోతున్నాయి, మొగ్గలు ‘మొగ్గలు’గానే రాలిపోతున్నాయి. ఇలా ‘వికసించని మొగ్గలు’ బాల కార్మికులు! డెబ్బయి ఏళ్ల ప్రజాస్వామ్య రాజ్యాంగ మహావృక్ష వికాసక్రమంలో ‘మొగ్గలు’ మొత్తం ఇప్పటికీ వికసించక పోవడం మానవీయ హృదయం ఉన్న వారిని విషాద కల్లోలితం చేస్తున్న విపరిణామ క్రమం.. తెలంగాణ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఉద్యోగులు, ఇలాంటి మానవీయ హృదయం ఉన్న మరికొందరు, స్వచ్ఛంద సంస్థలవారు కార్మిక వృత్తినుంచి శిశువులను, బాలబాలికలను విముక్తం చేస్తుండడానికి కృషిచేస్తుండడం ఎంతో కొంత ఊరట.. ఐదేళ్లుగా ‘చిరునవ్వు చర్య’- ఆపరేషన్ ‘ముస్కాన్’- ను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకించి పోలీసు విభాగం వారు వేలాది శిశువులను, బాలబాలికలను వెట్టిచాకిరీ నుంచి విముక్తం చేయడం, వారిని ‘బడిబాట’ పట్టించడం మానవీయ స్వభావ విజయం. ఇలా చిన్నపిల్లలను దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలలోను ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలవారు పసికట్టి వారిని ‘కార్మిక వృత్తి’నుంచి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి ప్రసాదిస్తూనే ఉన్నారు. కానీ మళ్లీ మళ్లీ బాల ‘కార్మికులు’ ఎందుకని తయారవుతున్నారు?! అన్నది వౌలికమైన ప్రశ్న. తెలంగాణలో పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ను ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తున్నారట. జనవరిలోను, జూలైలోను నెల పొడువునా ఇలా బాల ‘కార్మికుల’ను గుర్తించి విముక్తిని ప్రసాదించే ప్రక్రియ ఐదేళ్లుగా కొనసాగుతోంది. మధ్యమధ్యలో కూడ అక్కడక్కడ అప్పుడప్పుడు ‘బాల కార్మికుల’కు విముక్తి జరుగుతూనే ఉంది. అయినప్పటికీ మళ్లీమళ్లీ ‘బాలల’ను కార్మికులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. చిన్న పిల్లలను అపహరించుకునిపోతున్న ‘ముఠాలు’ పుట్టుకొని వస్తూనే ఉన్నాయి. రెండేళ్లు, ఐదేళ్లమధ్య వయసుకల పిల్లలను సైతం అపహరించుకొని ‘నిర్బంధం’లో ఉంచుకుంటున్న ‘ముఠాలు’ సాధించ దలచిన ప్రయోజనం ఏమిటన్నది అంతుపట్టని వ్యవహారం. హైదరాబాద్ పోలీసు విభాగం వారు విముక్తం కలిగించిన శిశువులలో రెండేళ్ల వయసువారు, ఐదేళ్లలోపు వయసువారు ఉన్నారట. ఇలాంటి పిల్లలు తప్పిపోయారా? రాక్షస ప్రవృత్తికల వారు దొంగిలించారా?? లేక తల్లిదండ్రులే వీరిని వదిలించుకున్నారా?? అపహరణకు కాని, వదిలించుకొనడానికి కానీ గురి అయిన ఐదేళ్లలోపు శిశువులకు బహుశా ఈ సంగతులేమీ తెలీవు..
విముక్తి లభించిన శిశువులను, బాలబాలికలను బడికి పంపించడం బాగుంది. కానీ ఇలా తప్పిపోయి లేదా పారిపోయి లేదా అపహరణకు గురి అయి చివరికి విముక్తిని సాధించిన బాలబాలికలలో తల్లిదండ్రులు ఉన్నవారు అత్యధికులు. హైదరాబాద్ పరిధిలో పోలీసులు పసికట్టి విముక్తి కల్పించిన- జూలై నెలలో- నాలుగువందల నలబయిఐదు మంది పిల్లలలో మూడువందల ఎనబయి ఒక్క మందిని తల్లిదండ్రులకు అప్పగించారట. మిగిలిన అరవై నలుగురికి గురుకుల పాఠశాలలలోను అధికారుల సంరక్షణలోను ఆశ్రయం కల్పించారట. జూలై నెలలో తెలంగాణలో మూడువేల నాలుగువందల డెబ్బయి మంది శిశువులకు, బాలబాలికలకు ‘విముక్తి’కలిగిందట. వీరిలో అత్యధికులు వెట్టిచాకిరీకి, ఇతర కార్మిక వృత్తులకు గురి అయినవారు. మిగిలినవారు ‘యాచక’ వృత్తికి గురి అయినవారు. వీరిలో కూడ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నవారే కావచ్చు. హైదరాబాద్, తెలంగాణ ‘ప్రతీక’లు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎంతమంది అనాథ శిశువులు- తల్లిదండ్రులు ఉన్నవారు- ఇలాంటి వైపరీత్యాలకు గురి అవుతున్నారో మరి?! పదిహేను ఏళ్లకు పూర్వం వీధులలోను, కుండీల వద్ద బాలబాలికలు చెత్త ఏరుకొని సంచులలో వేసుకుంటుండిన దృశ్యాలు విరివిగా ఆవిష్కృతమయ్యాయి. కానీ పదునాలుగేళ్ల లోపు పిల్లలకు ‘నిర్బంధ నిశ్శుల్క విద్యార్జన అధికారం’- రైట్ టు ఎడ్యుకేషన్- ఆర్‌టిఇ- రాజ్యాంగం ప్రసాదించిన తరువాత ఈ వికృత దృశ్యాలు క్రమంగా తగ్గిపోయాయి. జనంలో అవగాహన పెరిగింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలైన తల్లిదండ్రులు కూడ తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. కొందరైతే అష్టకష్టాలుపడి మితిమిరీన శ్రమచేసి ప్రభుత్వేతర వాణిజ్య-కార్పొరేట్- పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారు. ఈ నిరుపేదలను ‘కార్పొరేట్’ పాఠశాలల కామాంధులు భయంకరంగా దోపిడీ చేస్తుండడం వేఱుకథ..
కానీ ప్రభుత్వ సహాయ పథకాలు విస్తరించిన తరువాత కూడ, సమాజంలో అవగాహన పెరిగిన తరువాత కూడ బడికి వెళ్లవలసిన పిల్లలు ‘వెట్టిచాకిరీ’ కేంద్రాలకు వెళ్లవలసిన దుస్థితి తొలగడం లేదు. కొందరు పదునాలుగేళ్ల వయసువారు కుటుంబ పోషణ కోసం ‘చాకిరీ’చేస్తున్నారన్న వాస్తవాలు కూడ తరచు వెలువడుతూనే ఉన్నాయి. వలసపోతున్న కార్మికుల పిల్లలు సహజంగానే బడికి దూరమవుతున్నారు.
శరణార్థుల శిబిరంలో
పురుడు పోసుకున్న వధువు,
ఆకాశపు నీడలందు
ఆటలాడుతున్న శిశువు,
ఆర్భాటపు ప్రగతి పరిధి
కావలపడి ఉన్న నెలవు,
‘మోడు’వడిన బీడు వడిన
బతుకుల కథలెన్నొ కలవు!!
బాలబాలికలను ఆవహించి ఉన్న వ్యథలలో ఈ అక్రమ కార్మిక వృత్తి ఒకటి మాత్రమే! ‘నిరాదరణ’మరింత భయంకరమైన వైపరీత్యం. తల్లిదండ్రులిద్దరూ పనిచేసి లక్షలను, కోట్ల రూపాయలను గడిస్తున్న కుటుంబాలలో సైతం శిశువులు, బాలబాలికలు ‘నిరాదరణ’్భవంతో నలిగిపోతున్నారు. ఈ శిశువులు తమ బాధను వ్యక్తం చేయడం లేదు. సంపన్నుల కుటుంబాలలోని ఈ ‘నిరాదరణ’ బాలబాలికలను నిర్లిప్తతకు గురిచేస్తోంది, ఈ ‘నిర్లిప్తత’ సృష్టించిన సమస్యలు, సృష్టిస్తున్న సవాళ్లు కోకొల్లలు. నిరుపేద కుటుంబాలలోని పిల్లలు ఈ ‘నిర్లిప్తత’కు, ‘నిరాదరణ’కు గురి అవుతున్నారు. వారిలో కొందరు పారిపోతున్నారు. ‘వీధి పిల్లలు’గా ముద్రను వేయించుకుంటున్నారు. బాలకార్మికులుగా, యాచకులుగా బయటపడిన పిల్లలు ‘మనో వ్యథ’ బహిరంగం.. నాలుగు గోడల మధ్య ‘నిరాదరణ’కు గురి అయిన శిశువుల ‘అంతరంగ కల్లోలం’ అతి రహస్యం! కుటుంబ వ్యవస్థ పునాదులు క్రమంగా బీటలు వారుతుండడం ఈ నిరాదరణకు కారణం!!
చిన్న పిల్లలచేత పనిచేయించడం నేరం. కానీ ‘‘పని చేయించడమన్న’’ సూత్రానికి సరైన ‘్భష్యం’లేదు. వాణిజ్య ప్రకటనల్లో పిల్లలను పనిచేస్తున్నారు. దృశ్య మాధ్యమాలు విస్తరించిన తరువాత ఈ ప్రకటనల రూపకల్పనలో బాల బాలికలను ఇరికించి పనిచేయిస్తున్నారు. కానీ ఇదికూడ ‘బాల కార్మిక వృత్తి’అన్న అవగాహన ఎంతమందికి ఉంది? బాల కళాకారులు ఉండవచ్చు. సంగీతం, నాట్యం, అభినయం వంటి కళలను వారు అభ్యసించవచ్చు, మాథ్యమాలలో ప్రదర్శనలివ్వవచ్చు! చలన చిత్రాలలో, నాటకాలలో చిన్నపిల్లల పాత్రలలో చిన్న పిల్లలు నటించడం ‘కళ’.. అది పెంపొందవచ్చు! కానీ వాణిజ్య సంస్థలు ప్రత్యేకించి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ తమ నాసిరకం వస్తువులను మేలురకం వస్తువులన్న భ్రమను కల్పించడానికి రూపొందిస్తున్న ‘ప్రకటనల’లో పిల్లలను ఇరికించడం, నటింపచేయడం బాల కార్మిక వృత్తికి మరో రూపం. బురద చాక్లెట్లను, బూజు ఐస్‌క్రీమ్‌లను పిల్లల చేత తినిపించి ఎంగిలి మూతులను ప్రదర్శింప చేయడం వాణిజ్య పారిశ్రామిక సంస్థలు అమలు జరుపుతున్న బాల కార్మిక వ్యవస్థ.. ప్రభుత్వాలు ఆలోచించాలి... నిషేధించాలి.