సంపాదకీయం

చారిత్రక న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతీయ జీవన ప్రస్థానంలో ఇది మంచి వైపు మలుపు. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు మరో గెలుపు. మహిళా సాధికార సూత్రం మరింత బలపడింది, వివాహిత ముస్లిం మహిళల జీవన భద్రత మరింత పటిష్ఠమైంది. ముమ్మారు ‘తలాక్’ను ఎలాపడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చెప్పడం- అన్న ‘రుగ్మత’ ఇకపై నేరం. ఈ నేరానికి పాలుపడే ఇస్లాం మతస్థులైన పురుషులు శిక్షను అనుభవించవలసి ఉంటుంది. దశాబ్దులపాటు ఈ ‘సామాజిక రుగ్మత’కు వేల మంది ఇస్లాం వివాహిత మహిళలు బలికావడం చరిత్ర. ‘ముమ్మారు తలాక్’ చెప్పడం ద్వారా భార్యను తక్షణం వదిలించుకొనడానికి ఇంత కాలం ఇస్లాం పురుషులకు వీలుండేది. పురుష దురహంకారానికి అందువల్ల దశాబ్దుల పాటు- నిజానికి శతాబ్దులపాటు- లక్షలాది వివాహిత ముస్లిం మహిళలు ఆహుతైపోయారు. బ్రిటన్ విముక్త, విదేశీయ బీభత్సపాలనా విముక్త భారతదేశంలో కూడ ఏడు దశాబ్దులపాటు ఈ పురుష దౌర్జన్యకాండకు లక్షల మంది వివాహిత ఇస్లాం మహిళలు గురికావడం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను వెక్కిరించిన విపరిణామ క్రమం, మానవీయ మూల్యాలకు విరుద్ధంగా కొనసాగిన ఘోరమైన అన్యాయం. ఇన్నాళ్లకు ఈ దురన్యాయాన్ని రూపుమాపడానికి వీలైన ‘చట్టాన్ని’, ‘ముస్లిం మహిళల వివాహ సంబంధ అధికారాల పరిరక్షణ’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించగలగడం చారిత్రక అధ్యాయానికి అవసానం.. ఈ ‘ముస్లిం మహిళల వివాహ సంబంధ అధికారాల పరిరక్షణ’- ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మారేజ్- ‘విధేయక’- బిల్లు-ను మంగళవారం ఆమోదించడం అందువల్ల మహిళా సాధికార ఉద్యమ చరిత్రలో మరో వినూతన ఘట్టానికి శ్రీకారం, ముస్లిం మహిళల మనోభావాలకు సాకారం! కలియుగం ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం, శుభ వికారి ఆషాఢ బహుళ త్రయోదశి వివాహిత ముస్లిం మహిళల జీవన భద్రతను పెంపొందించిన పండుగ దినం! ఈ ‘బిల్లు’ను లోక్‌సభ ఆమోదించి ఉంది కనుక రాష్టప్రతి ఆమోదం పొంది చట్టంగా మారడం కేవలం లాంఛనం. పురుషులలో కాని మహిళలలో కాని మతాలలో కాని సమాజంలో కాని, సర్వమత సంపుటమైన జాతీయ జీవన ప్రస్థానంలో కాని న్యాయంగా ప్రవర్తించేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇస్లాం మతంలో కూడ పెళ్లిచేసుకున్న మహిళను ఆజీవనం ధర్మపత్నిగా భావించి జీవిస్తున్న పురుషుల సంఖ్య అత్యధికం, పెళ్లిచేసుకున్న తరువాత వందేళ్లు భార్యాభర్తలుగా జీవిస్తున్నవారి సంఖ్య అత్యధికం. పెళ్లిచేసుకున్న మహిళలకు దుర్మార్గ రీతిలో ముమ్మారు తలాక్ చెప్పి వదిలించుకో చూసిన, వదిలించుకో చూస్తున్న ఇస్లాం పురుషుల సంఖ్య తక్కువ. అందువల్ల ఇస్లాం మతానికి చెందిన అత్యధిక శాతం పురుషులు కూడ పార్లమెంటు ఆమోదించిన చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు, ముస్లిం మహిళల అంతరంగం ఆనంద తరంగ మహార్ణవం.. ఈ ఆనంద తరంగాలు దేశమంతటా ప్రస్ఫుటిస్తున్నాయి. ఇన్నాళ్లకు వివాహిత ముస్లిం మహిళలకు న్యాయం జరిగింది! ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ సామాజిక న్యాయ సాధన పథంలో ముందుముందుకు కదలుతోంది!
పార్లమెంటు ఇలా బిల్లును ఆమోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన శుభ పరిణామం. దేశమంతటికీ దేశ ప్రజలందరికీ వర్తించగల ‘సమష్టి పౌరస్మృతి’- యూనిఫారమ్ సివిల్ కోడ్- ను రూపొందించడానికి ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యాంగంలోని నలబయి నాలుగవ అధికరణం నిర్దేశిస్తోంది. కానీ డెబ్బయి ఏళ్లుగా ప్రభుత్వం ఈ దశలో కృషి చేయలేదు. మతోన్మాదులను, వారి నిర్దేశంలోని మూక ఉమ్మడి వోటర్లను అక్రమంగా సంతృప్తిపరచడానికి మాత్రమే ఈ ఏడు దశాబ్దులలో అత్యధిక రాజకీయవేత్తలు యత్నించడం చరిత్ర. అందువల్ల నలబయి నాలుగవ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విఘాతకరమైన రీతిలో చట్టాలు ఏర్పడిపోవడం కూడ చరిత్ర. ఈ ప్రవృత్తివల్ల దారుణమైన కష్టనష్టాలకు గురి అయింది ఇస్లాం మతానికి చెందిన మహిళలు మాత్రమే. ‘‘స్వర్గానికిపోయినా సవతిపోరు తప్పలేదు..’’అన్నది తరతరాలుగా మహిళలను మనోవ్యధకు గురిచేసిన సామెత! ఒక భార్య ఉన్న పురుషుడు మరో మహిళను పెళ్లిచేసుకోవడం- అన్న భయంకర వికృతికి మహిళలు బలి అయ్యారు. ఈ వికృతి నుంచి ఇతర మతాల మహిళలకు దశాబ్దులకు పూర్వమే విముక్తి లభించింది. కానీ ఇస్లాం మహిళలు మాత్రం తమ భర్త మళ్లీమళ్లీ ఇతర మహిళలను పెళ్లాడినప్పటికీ భరించి పడి ఉండవలసిన దుస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. విడాకులిచ్చిన భర్తవద్దనుంచి జీవన భృతిని కోరే అధికారం ఇస్లాం మహిళలకు లేదన్నది మరో సామాజిక వికృతి. ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం ఇందుకు కారణం. దేశంలోని పౌరులందరికీ సమానమైన ‘నేర నిరోధక’ చట్టాల వ్యవస్థ- క్రిమినల్ లా- ఏర్పడి ఉంది. దీనికి ఏ మత నియమాలు కూడ అడ్డురావడం లేదు. దేశ పౌరులందరికీ సమాన ‘పౌరస్మృతి’- సివిల్ లా- మాత్రం ఎందుకు ఉండరాదు?
ఈ ప్రశ్నకు మాత్రం రాజకీయ వేత్తలలో అత్యధికులు సమాధానం చెప్పకపోవడం ఏడు దశాబ్దుల చరిత్ర. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యవంలోని కేంద్ర ప్రభుత్వం వారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి యత్నిస్తున్నారు. ‘ముమ్మారు తలాక్’- ట్రిపుల్ తలాక్-ను నేరంగా నిర్ణయిస్తున్న ‘చట్టాన్ని’ రూపొందించడం ఇందులో భాగం. ఈ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీవారు, ఇతర రాజకీయ పక్షాలవారు జాతీయ జీవన ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో వీరందరూ పశ్చాత్తాపం ప్రకటించే ఘట్టం ఆవిష్కృతం కాక మానదు. కాలానుగుణమైన మార్పులను భారత జాతి అనాదిగా స్వీకరిస్తోంది. గ్రీష్మ ఋతువులో దుప్పటి కప్పుకోవలసిన పని లేదు, కానీ హేమంత ఋతువులో- చలికి గడ్డకట్టే సమయంలో- తప్పక దుప్పటిని కప్పుకోవాలి. తరతరాలుగా భారత జాతి ఇలా మార్పులను చేసుకొంటోంది, మార్పులను స్వీకరిస్తోంది. అందువల్లనే యుగం మారినప్పుడల్లా ‘స్మృతి’- చట్టం- మారడం భారత జాతీయ చరిత్ర. కృత యుగంలో మానవ- మనువునకు సంబంధించిన- స్మృతిని పాటించారు. త్రేతాయుగంలో గోతముని స్మృతి వర్తించింది. ద్వాపరంలో ‘శంఖ లిఖిత’ ధర్మశాస్త్రం అన్వయించింది. కలియుగంలో పరాశరుని స్మృతి వర్తించడం మారుతున్న కాలానికి అనుగుణంగా ‘స్మృతి’-చట్టం, న్యాయ నిబంధనలు- మారాలన్న సహజ న్యాయసూత్రాలకు అనుగుణమైన వ్యవహారం. ఇంతటితో మార్పు ఆగిపోలేదు. కాలం గడుస్తున్నకొద్దీ జీవన సూత్రాలు మారుతూనే ఉన్నాయి. అందువల్లనే అనాదిగా ఈ దేశంలో ‘‘జీవన ధర్మానికి పరమప్రమాణం శ్రుతి- వేదం! రెండో ప్రమాణం స్మృతి... శాస్త్రం, చట్టం!! మూడవది, మరింత ప్రధానమైన ప్రమాణం ప్రజల అభిమతం..- ‘‘్ధర్మం జిజ్ఞా సమానానాం ప్రమాణం పరమం శ్రుతిః ద్వితీయం ధర్మశాస్తన్త్రు, తృతీయం ‘లోక సంగ్రహః’’-!!
‘లోక సంగ్రహము’ లేదా ‘ప్రజల అభిమతం’ వర్తమాన కాలంలో భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వివిధ మతాల, భాషల, సంప్రదాయాల, అసంఖ్యాక వైవిధ్యాల సమష్టి అయిన మొత్తం జాతికి వర్తిస్తోంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రూపొందే చట్టాలు మత, భాషా, సంప్రదాయ, వైవిధ్య రీతులకు ‘అతీతం’గా జాతి ప్రజలందరూ పాటించాలి, జాతీయులందరికీ ఈ చట్టాలు వర్తించాలి! ఈ జాతీయ స్వభావానికి వ్యతిరేకంగా ప్రత్యేక మత నియమాలు ఉండరాదు. ఉన్నట్టయితే వాటిని తొలగించుకోవాలి! ఏ మతం వారి ప్రత్యేక నిబంధనలయినా అవి సమిష్టి జాతీయ తత్త్వానికి విరుద్ధంగా ఉన్నట్టయితే వాటిని తొలగించుకోవాలి. అలా తొలగించుకొనే ఒక ప్రయత్నం ముస్లిం మహిళలకు మంగళవారం రాజ్యసభలో జరిగిన చారిత్రక న్యాయం. అన్ని మతాల వారూ భారత జాతిలో భాగస్వాములు, భరతమాత బిడ్డలు.