సంపాదకీయం

సంస్కార పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు సౌశీల్యవంతులా? కాదా? అన్నది వౌలికమైన మహా విషయం. పరీక్షల ద్వారా విద్యార్థుల నిజాయితీని, సత్యనిష్ఠను, నియమ నిబద్ధతను సౌశీల్యాన్ని నిగ్గుతేల్చడానికి రాజస్థాన్ ప్రభుత్వం నడుం బిగించడం మరో బౌద్ధిక విప్లవం. అధ్యాపకుల పర్యవేక్షణ కాని ‘నిఘా’కాని లేకుండా రాజస్థాన్‌లోని రెండువందల ముప్పయి ఏడు ప్రభుత్వ కళాశాలలలో ఇరవై తొమ్మిదవ తేదీన పరీక్షలను నిర్వహించారట. ఈ స్నాతక పూర్వ- డిగ్రీ-, స్నాతకోత్తర- పోస్టుగ్రాడ్యుయేట్- కళాశాలలలోని దాదాపు లక్ష మంది విద్యార్థులు ‘నిఘా’ లేకపోయినప్పటికీ నిజాయితీగా ఈ ‘మాసిక పరీక్ష’- మన్‌త్లీ టెస్ట్-ను వ్రాసినట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్‌లోని కళాశాలలలో అమలులోకి వచ్చిన నూతన పరీక్షా కార్యాచరణ ప్రకారం విద్యార్థులకు ప్రతి నెలలోను ఇరవై తొమ్మిదవ తేదీనాడు పరీక్షను నిర్వహిస్తున్నారట. పరీక్ష ప్రారంభంలో అధ్యాపకులు ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందజేసి బయటకు వెళ్లిపోయారు. పరీక్షా కాలవ్యవధి ముగియగానే వారు మళ్లీ పరీక్షా ప్రాంగణంలోకి వచ్చి సమాధాన పత్రాలను సేకరించుకున్నారు. పరీక్షను విద్యార్థులు వ్రాసిన సమయంలో పరీక్షకుల నిఘా లేదు, ‘సిసిటివి’వంటి అత్యాధునిక ‘నిఘా’ చిత్రీకరణ సామగ్రిని తరగతి గదులలో అమర్చలేదట! ఇలా ప్రతి నెల జరిగే పరీక్షలలో పాటిస్తున్న ఈ ‘‘నిఘా లేని’’ పద్ధతిని సంవత్సరాంతంలో జరిగే విశ్వవిద్యాలయ పరీక్షలలో కూడ పాటిస్తారా అన్నది వేచి చూడదగిన అంశం. అదే జరిగినట్టయితే విద్యావ్యవస్థలో అది మరో నైతిక విప్లవానికి ‘నాంది’కాగలదు. ‘చూచి వ్రాయడం’- కాపీయింగ్- అన్న దుర్మార్గం పాఠశాలల స్థాయి పరీక్షలలోను ఉన్నతోన్నత కళాశాలల స్థాయి పరీక్షలలోను భయంకరంగా విస్తరించిపోయి ఉండడం విద్యారంగంలో దశాబ్దులుగా పాదుకొనిపోయి ఉన్న ఘోరమైన వైపరీత్యం. అన్ని జీవన రంగాలు, సార్వజనిక రంగాలు అవినీతి మయం అవుతుండడానికి వౌలికమైన విద్యారంగంలో అంకురించిన ఈ ‘దుర్మార్గ వర్తన’ కారణం. విద్యారంగంలోని ‘అంకురాలు’ మొలకెత్తి సమాజంలోని అన్ని రంగాలలోను విష వృక్షాలుగా విస్తరించిపోతున్నాయి. చదవకుండా, కష్టపడకుండా ‘ఉత్తీర్ణత’ను సాధించాలన్న దురాశ ఈ దుర్మార్గ వర్తనకు ప్రాతిపదిక! ఈ దురాశ విద్యార్థులలోకంటె ఎక్కువ వారి తల్లిదండ్రులను ఆవహించి ఉండడం నడచిపోతున్న చరిత్ర. అర్హత లేకపోయినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు పట్టాలు కావాలి, ఈ నకిలీ పట్టాలు - డిగ్రీలు- ప్రాతిపదికగా ఉద్యోగాలు కావాలి! ఇలా ఉద్యోగాలను పదవులను అక్రమ పద్ధతి ద్వారా పొందినవారు, పొందాలన్న ప్రవృత్తికలవారు వాటిని పొందిన తరువాత చేస్తున్న ఘోరాలు చెప్పనలవి కానివి!
ఇదంతా విద్యారంగం భ్రష్టుపట్టిపోయినందువల్ల జరిగిన జరిగిపోతున్న ఘోరం. ఇలా విద్యారంగం భ్రష్టుపట్టడానికి ప్రధాన కారణం విద్యల ద్వారా నీతిని, నిజాయితీని, నిబద్ధతను, నిష్ఠను నేర్పించిన ‘భారతీయ’ పద్ధతులు అడుగంటిపోవడం. మన విద్యావిధానాన్ని ఈ దేశాన్ని మాతృభూమిగా, ఈ భూమిని తల్లిగా, ఈ సమాజాన్ని మాతృ సమాజంగా, ఈ దేశ హితాన్ని తమ హితంగా గుర్తించినవారు నిర్వహించినంత కాలం విద్యావంతులు సౌశీల్యవంతులుగా రూపొందారు. కానీ ఈ దేశాన్ని మాతృభూమిగా భావించని, ఈ దేశం హితం తమ హితం కాదని గుర్తించిన బ్రిటన్ దురాక్రమణదారులు ఈ దేశంపై పెత్తనం సాగించిన దాదాపు రెండు శతాబ్దుల కాలంలో ఈ జాతీయ విద్యా పద్ధతిని పాడుచేశారు. ‘విజ్ఞానాన్ని’మాత్రమే నేర్పి ‘వివేచన’ను నేర్పించని విద్యావిధానాన్ని బ్రిటన్ దొరలు వ్యవస్థీకరించారు. అందువల్ల సౌశీల్యం లేని విద్యాధికులు రూపొందడం మొదలైంది. బ్రిటన్ నుంచి మన దేశం విముక్తమైంది. కానీ బ్రిటన్ దొరలు మననెత్తికెత్తిపోయిన గుదిబండ విద్యావిధానంనుంచి మాత్రం మనం విముక్తిని సాధించలేదు. అందువల్లనే ‘హృదయం’లేని ‘బుద్ధి’ పెరిగింది. ‘వివేచన’లేని ‘విజ్ఞానం’ విస్తరిస్తోంది. ‘కాపీ’కొట్టి డిగ్రీలు పొందినవారు... పరీక్షలు వ్రాయకుండానే డిగ్రీలు పొందినవారు అన్ని రంగాలలోను చొరబడిపోయారు. ఉన్నత ఉన్నతోన్నత పదవులలోని అధికారులు, రాజకీయవేత్తలు, వైద్యులు, స్థపతులు- ఇంజినీర్‌లు-, అధ్యాపకులు, న్యాయమూర్తులు- ఇలా దాదాపు అన్ని రంగాలలోను అవినీతిపరులు, లైంగిక బీభత్సకారులు, సమాజ వ్యతిరేకులు, జాతి విద్రోహులు చొరబడిపోయి ఉన్నారు! ఈ దౌర్భాగ్యస్థితికి ఏకైక కారణం విద్యాలయాలనుంచి బయటికి వస్తున్న ‘విద్యాధికుల’లలో అత్యధికులు చరిత్రహీనులు, శీలరహితులు. వౌలికమైనది విద్యారంగం. ‘కాపీ’కొట్టి ఉత్తీర్ణుడయినవాడు అధ్యాపకుడుగా వస్తున్నాడు. ఇలాంటి అధ్యాపకులు మళ్లీ ‘కాపీ’కొట్టిస్తున్నారు. ఇదీ విష విలయం, బ్రిటన్ దురాక్రమణదారులు మన వ్యవస్థను ఈ విలయంలో ఇరికించి పోయారు!
విద్య కత్తి, విద్య సాధనం, విద్య తుపాకి... విద్య బ్రహ్మాస్త్రం! కానీ ఈ ‘కత్తి’ని ఎందుకు ఎలా ఉపయోగించాలన్నది ‘వివేచన’. సౌశీల్యవంతుడైనవాడు ‘కత్తి’ని సమాజ రక్షణకు ఉపయోగిస్తున్నాడు. సమాజ సమష్టి హితానికి జాతి ప్రయోజనానికి ఉపయోగిస్తున్నాడు. కానీ దుర్మార్గుడు అదే ‘కత్తి’ని, అదే విద్యను సమాజాన్ని దోపిడీ చేయడానికి, లంచాలు తీసుకొని కోట్లు గడించడానికి ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి వారే తమ అక్రమ ప్రయోజనంకొరకు దేశానికి సైతం ద్రోహం తలపెట్టగలరు! అందువల్లనే ‘కత్తుల’ను ‘అస్త్రాలను’ అందిస్తున్న విద్యారంగం వాటి లక్ష్యాలను కూడ నిర్దేశించాలి. లేనట్టయితే ఇప్పుడు దాపురించి ఉన్న- బ్రిటన్ విద్యావిధానం ప్రదానంచేసిన దుస్థితి- మరింత విషమించి తీరుతుంది. ‘‘మా అబ్బాయి ఇంజినీర్ కావాలి, కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి.... అమెరికాకు వెళ్లాలి, ఆస్ట్రేలియాలో స్థిరపడాలి, డబ్బుల మూటలు మోసుకొని రావాలి.... ‘డాలర్ల’తో స్నానం చేయాలి...’’అని తల్లిదండ్రులలో అత్యధికులు కలలు కంటున్నారు. ‘‘అమ్మాయి గురించి కూడ ఇదే రీతిలో భౌతిక ప్రగతి స్వప్నం...!’’ కానీ ‘‘మా పాప, మా బాబు మంచి మనుషులు కావాలి...’’అని ఎంతమంది తల్లిదండ్రులు కోరుతున్నారు?? పరోక్షంగా ప్రత్యక్షంగా అవినీతి ‘విద్యాధికుల’ బతుకులలో నిహితమై ఉంది, నిక్కిచూస్తోంది... బ్రిటన్ దురాక్రమణ పూర్వయుగంలో, యుగయుగాలుగా భారతీయ అధ్యాపకులు, తల్లిదండ్రులు విద్యార్థులకు స్నాతకోత్తర సమయంలోను, స్నాతకం- కాన్వొకేషన్- సమయంలోను ఏమని బోధించారు?- ‘‘సుప్రజా ప్రజయా భూయాసం- సంతానంలో శ్రేష్ఠుడవు కావాలి, శ్రేష్ఠవుకావాలి’’అని బోధించారు. ‘‘సువీరో వీరైః’’- ‘‘వీరులలో మేటివయి దేశరక్షణ చేయాలి’’... ‘‘సుపోషః పోషైః- పోషకులలో మంచి పోషకుడవు కావాలి... సమాజాన్ని పోషించాలి!’’, ‘‘విద్యార్థులలో అత్యుత్తమ విద్యార్థివి కావాలి- సుబ్రహ్మా బ్రహ్మచారిభిః’’
ఇలాంటి సౌశీల్యవంతులైన విద్యాధికులు యుగాయుగాలు గురుకులాలనుంచి బయటికి వచ్చారు. సంస్కార పరిమళంవలె సమాజంలో విస్తరించారు. ఈ కలియుగంలో సైతం నాలుగువేల ఐదువందల ఏళ్లపాటు, క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్దివరకూ ఇలాంటి విద్య- సంస్కారదాయకమైన విద్య-మన దేశంలో పల్లవించింది, పరిమళించింది. ఆ తరువాత క్రమంగా విదేశీయ దురాక్రమణకుగురై మోడువారింది. ఈ ‘మోడు’ను మళ్లీ చిగురింప చేయడానికి దేశంలో ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి... ఇలాంటి ప్రయత్నాలలో ఒకటి రాజస్థాన్‌లో జరుగుతున్న ప్రయోగం.... ‘‘విద్యార్థుల ప్రతిభాపాటవాన్ని మాత్రమేకాదు, వారి నిజాయితీ, సత్యనిష్ఠను, సంయమనాన్ని, సక్రమ పద్ధతిలో విజయం సాధించగలమన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ కొత్త పరీక్షల పద్ధతి దోహదం చేస్తుంది...’’అన్నది రాజస్థాన్ కళాశాల విద్యామండలి ప్రధాన అధికారి ప్రదీప్‌కుమార్ బోరద్ వ్యక్తం చేస్తున్న విశ్వాసం!