సంపాదకీయం

శార్దూల సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్లలో దేశంలోని పులుల సంఖ్య ముప్పయి మూడు శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి అంటే కేవలం వృక్షజాలం కాదు. అడవి జీవజాలం! జంతుజాలం వృక్షజాలం కలసి అడవి అవుతోంది, జీవజాలం అవుతోంది, ప్రకృతి అవుతోంది. పంచభూతముల- నేల, నీరు, నిప్పు, గాలి, నింగి- సమాహారమైన ప్రకృతిలో ప్రస్ఫుటిస్తున్న, సాకారం అవుతున్న ‘జీవజాలం’ సయోధ్యకు సమన్వయానికి మాధ్యమం. సమన్వయం సహజం. సంఘర్షణ అపవాదం! అందువల్ల వనప్రాణుల వన జీవుల విస్తరణ అటవీ విస్తరణ... కుంచించుకొనిపోయిన ‘అడవి’ మెల్లమెల్లగా విస్తరిస్తోందట... ఇలా దేశంలోని అభయారణ్యాలలోని పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నది ‘అంతర్జాతీయ శార్దూల దినోత్సవం’- ఇంటర్నేషనల్ టైగర్స్ డే- సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించిన వాస్తవం. క్రీస్తుశకం 1973లో ‘శార్దూల సంరక్షణ కార్యాచరణ పథకం’ మొదలయ్యేనాటికి దేశంలోని అడవులలోని పులుల సంఖ్య వెయ్యిలోపే. గత శతాబ్ది ఆరంభంనాటికి- కచ్చితంగా శార్దూల గణన జరగనప్పటికీ- ఐదారువేల పులులు దేశంలో ఉండేవన్నది చరిత్ర. పులులను వేటాడి చంపడం- కేవలం చంపడంకోసమే చంపడం- జీవన ఆనందంగా మారడం విదేశీయ దురాక్రమణ ఫలితం, బ్రిటన్ బీభత్సపాలన ఫలితం. పులులను మాత్రమేకాదు సకల ‘వన’చరాలను నిష్కారణంగా, నిష్కరుణగా వేటాడడం పాశ్చాత్యులవల్ల మనకు సంక్రమించిన ‘విలాసం’-్ఫ్యషన్-! అందువల్ల బ్రిటన్ విముక్త భారత్ పులుల వేట మరింత ఊపందుకుంది- ఇలా ఊపందుకొనడానికి మరో కారణం చైనాలోని సంప్రదాయ వైద్యం. చైనాలోని సంప్రదాయ వైద్య చికిత్సలో అవసరమైన మందుల తయారీలో పులి గోళ్లు, పులి చర్మాలు, పులి అవయవాలు ఉపయోగపడుతున్నాయట. సంప్రదాయ వైద్యచికిత్సకు సంబంధించిన ఔషధాల- మందుల-ను ఓషధుల- మొక్కలు తీగెలు-నుంచి తయారుచేసుకోవడం భారతీయ పద్ధతి. కానీ చైనా వైద్యం జంతువులను హతమార్చింది హత మార్చుతోంది. చైనా వైద్యం మన దేశంలో పులుల పాలిట మృత్యువుగా మారి ఉంది. అందువల్ల దశాబ్దులపాటు పులులను, పులుల అవయవాలను చైనా తరలించుకొనిపోతున్న ‘ముఠాలు’ ఏర్పడి ఉన్నాయి. ఫలితంగా 1973లో ‘శార్దూల సంరక్షక కార్యాచరణ పథకం’ మొదలయే నాటికి పులుల సంఖ్య పలుచబడింది. తొమ్మిదేళ్ల క్రితం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నిర్ణయించిన మేరకు 2022నాటికి ప్రపంచంలోని పులుల సంఖ్యను రెట్టింపుచేయవలసి ఉంది. మన దేశంలో మాత్రం 2018నాటికే- ఎనిమిది ఏళ్లలో పులుల సంఖ్య రెట్టింపుఅయింది. మన సంకల్పం ఇలా ముందుగానే సిద్ధించడం హర్షణీయ పరిణామమన్నది నరేంద్ర మోదీ చెప్పిన మాట... పులి-శార్దూలం- మన జాతీయ వన్యప్రాణి!
పులుల సంఖ్యతోపాటు మన అటవీ పరిమాణం కూడ పెరుగుతోందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట! పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగని రీతిలో ఆర్థికప్రగతి సాధించాలన్న సంకల్పం సిద్ధిస్తోందన్నది ప్రధానమంత్రి వ్యక్తంచేసిన ఆశాభావం. అడవుల విస్తీర్ణం, వన్యప్రాణుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం బ్రిటన్ విముక్త భారత్‌లో సంభవించిన దశాబ్దుల విపరిణామం. దాదాపు రెండు దశాబ్దులుగా పులుల సంఖ్య ఏనుగుల సంఖ్య ఇతర వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ చర్యలు ఫలితం నిస్తున్నాయన్నది సంతరించదగిన వ్యవహారం. 2006నాటికి పులుల సంఖ్య దాదాపు పదునాలుగు వందలు, 2010నాటికి దాదాపు పదిహేడువందలు. 2014నాటకి పులుల సంఖ్య 2,226. గత ఏడాది జరిగిన ‘గణన’ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య దాదాపు మూడువేలు! - రెండువేల తొమ్మిది వందల అరవై ఏడన్నది ప్రభుత్వం నిర్దిష్టపరచిన గణాంకాలు! మన దేశంలో ప్రతిరోజు మూడువందల ముప్పయి ఎనిమిది ఎకరాలలో అడవులు ధ్వంసమైపోతున్నాయన్నది పర్యావరణ పరిరక్షణ, అటవీ పరిరక్షణ మంత్రిత్వశాఖవారు 2013లో వెల్లడించిన విషయం. ఈ నష్టాన్ని అతిగమించి 2015నుంచి ప్రతి ఏటా అటవీ విస్తీర్ణం పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ‘అడివి’ స్వరూప స్వభావాల గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల దట్టమైన అడవుల విస్తీర్ణం ఎంత అన్నది స్పష్టంకావడం లేదు. పులుల సంఖ్యకు కూడ ఈ అస్పష్టత వర్తిస్తోంది. 2014లో నలబయిమూడు ‘శార్దూల సంరక్షణ కేంద్రాలు’ ఉండగా వాటి సంఖ్య ఇప్పుడు వందకు పైగా పెరిగిందట. ఇలాంటి సంరక్షక అటవీ ప్రాంతాలు ఎనిమిది వందలకు పైగా ఉండడం వివిధ వన్యప్రాణుల మనుగడకు దోహదకరం. గత ఐదేళ్లలో అటవీ వైశాల్యం పదహైదు వేల కిలోమీటర్లమేర పెరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పినమాట.
ఏమయినప్పటికీ పులులకు మాత్రమేకాదు ఏ అటవీ ప్రాణికి కూడ ‘స్థలం’ చాలడం లేదన్నది నిరాకరింపజాలని నిజం. అందువల్లనే వన్యప్రాణులు ప్రధానంగా ఏనుగులు జనావాసాలలోకి, వ్యవసాయ క్షేత్రాలలోకి చొఱబడి పోతున్నాయి. ఇది మొదటి వైపరీత్యం. రెండవది ప్రకృతిలో భాగమైన మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తుండడం, మానవుని క్రౌర్యం మిగిలిన సమస్త జీవజాలాన్ని బలిగొంటోంది. ‘‘నితాంత అపార భూత దయ’’అన్నది వౌలికమైన హైందవ జాతీయతత్త్వం. ఈ జాతీయ స్వభావానికి బ్రిటన్ దురాక్రమణ సమయంలో గ్రహణం పట్టింది. ఈ గ్రహణం ఇప్పటికీ వదలకపోవడం వౌలికమైన వైపరీత్యం. రెండువేల వంద సంవత్సరాలకు పూర్వం భారతదేశాన్ని పాలించిన విక్రమ సమ్రాట్టు ఆస్థాన కవి మహాకవి కాళిదాసు ‘రఘువంశ’మన్న కావ్యాన్ని వ్రాశాడు. పార్వతీదేవి స్వయంగా నీరుపోసి ఒక దేవదారు వృక్షాన్ని పెంచుకొందట. పార్వతీ పరమేశ్వరులు ఆ వృక్షాన్ని కన్నబిడ్డవలె పాలించారు. ఆ వృక్షానికి దెబ్బ తగిలితే తమ కుమారుడు సుబ్రహ్మణ్యునికి గాయమయినట్టు పార్వతీదేవి తల్లడిల్లిపోయేదని మహాకవి చెప్పాడు. ఈ పరంపరను బ్రిటన్ వారు భంగపరిచారు. మన దేశంలోని అడవులను ధ్వంసంచేసి కలపను తరలించుకొనిపోయారు. వన్యప్రాణులను విచక్షణ రహితంగా హత్య చేయడం నేర్పిపోయారు. ‘‘మాల్‌గుడిలోని మానవ భక్షక మృగం’’- మాన్ ఈటర్ ఆఫ్ మాల్‌గుడి-అన్న తన ఆంగ్ల నవలలో ప్రసిద్ధ రచయిత ఆర్.కె.నారాయణ్ ఈ హంతక స్వభావం గురించి విశే్లషించి ఉన్నాడు. విచక్షణ రహితంగా జంతువధ చేసిన నరరాక్షసుడు చివరికి ‘్భస్మాసురుని’వలె తుద ముట్టిపోయాడు. అటవీ విధ్వంసం చేస్తున్నవారు భస్మాసురులు! పులికి రక్షణ... అడవికి రక్షణ!
కుంభమేళాలు మన జాతీయ సనాతన ఉత్సవాలు. ఒక ‘కుంభమేళా’ జరిగిన సమయంలో ఒక ధర్మాచార్యుని వెంట ఒక పెద్దపులి వచ్చింది. ఆ పులి ఆ ధర్మాచార్యుని వెంట ‘కుక్క’వలె, సాధుజంతువులవలె నడిచింది. ఆ పులిని ఆయన గొలుసుతో కాని తాడుతో కాని కట్టి పట్టుకోలేదు. అయినప్పటికీ పులి జనంపై కాని ఇతర జంతువులపై కాని దాడి చేయలేదు. వింతగా చూసిన యాత్రికుల పట్ల పులి నిర్లిప్త దృక్కులను సారించింది. కుంభమేళా జరిగినంత కాలం ఈ పులి, ఆ ధర్మాచార్యుడు గంగానది తీరంలో ప్రతిరోజు విహరించినట్టు పత్రికలలో ప్రచారమైంది. ఇది దశాబ్దులకు పూర్వం జరిగిన ఘటన. ఇది వాస్తవం. ఈ వాస్తవ ఘటన ప్రాతిపదికగా ఆర్.కె.నారాయణ్ ‘‘మాల్‌గుడికి వచ్చిన పులి’’- ఏ టైగర్ ఫర్ మాల్‌గుడి- అన్న ఆంగ్ల నవలను వ్రాశాడు.
పులిని మేకను, జంతువులు, జీవజాలాన్ని చరమైన, స్థిరమైన విశ్వవ్యవస్థను తుది మొదలు లేని రీతిలో ఆవహించి ఉన్న, అంతర్లీనమై ఉన్న చైతన్యం అద్వితీయమైనది- అన్న సత్యం ఈ నవలకు ప్రాతిపదిక! ఈ సత్యమే ప్రకృతి పరిరక్షక సూత్రం, సృష్టినిహిత వౌలిక తత్త్వం!! ‘అంతర్జాతీయ శార్దూల దినోత్సవం’ సందర్భంగా మన ప్రభుత్వం ఈ వౌలిక వాస్తవాన్ని మరోసారి ప్రస్తావించింది! పులికీ వ్యథ ఉంది, పులికీ కథ ఉంది... పులికీ ఆనందం ఉంది, పులికీ ఆత్మ ఉంది!