సంపాదకీయం

కార్గిల్ ద్యుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దుల రేఖ దాటి
దురాక్రమణ దూకువేళ,
‘కార్గిల్’ కంఠం చుట్టూ
ఉరి బిగించి ఉన్నవేళ..
నిగమాగమ స్వర విపంచి
నిప్పుల రాగం పలికెను,
వరములిచ్చు కరములందు
శత శతఘ్ని చెలరేగెను..
ఇరవై ఏళ్లు గడిచాయి, కార్గిల్ సమర స్మృతులు సజీవంగా ఉన్నాయి. నిన్న మొన్న ఈ ‘యుద్ధం’ జరిగిందన్న అనుభూతి దేశ ప్రజలను ఆవహించి ఉంది. ఈ అనుభూతికి రెండు భంగిమలు. మన జమ్మూ కశ్మీర్‌లోని ‘కార్గిల్’లోకి 1999 మే నెలలో చొఱబడి ఉండిన పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులను తిప్పికొట్టిన మన సైనికుల సమర పటిమ ‘‘ఒక కంట ఆనందాశ్రువుల’’ను చిలికింప చేసింది. సమర వీరులలో అనేక మంది ఆ యుద్ధంలో అమరులయ్యారు. అమరులైన వారిని తలచుకొని ‘‘మరో కంట శోక జలము’’ పొంగి వచ్చింది! పొంగి వస్తోంది. అప్పటికీ, ఇరవై ఏళ్ల తరువాత ఇప్పటికీ ఇదే ద్విధావిభక్తమైన అనుభూతి..!! ‘‘హర్ష వ్యథా సంగమ స్థితి ఆవహించె ‘్భరతి’ మది, ఉద్వేగపు హృదయాందోళన వేగపు రాగాలను శ్రుతిచేస్తున్నది భరత జాతి..!!’’ అప్పటికీ ఇప్పటికీ ఇదే అనుభూతి, ఇదే సంగమ స్థితి! ప్రభుత్వం నివాళులు అర్పిస్తోంది, ప్రజలు అంజలి ఘటిస్తున్నారు... భరతమాత వజ్రాల బిడ్డలయిన కార్గిల్ సమర వీరులకు.. అమరులకు, విజయ శోభల విరాజిల్లుతున్న సైనికులకు! తలపై గాయం మానని తల్లిభారతి తల్లడిల్లుతూనే ఉంది. కశ్మీరం భరతమాతకు తల, కార్గిల్ పర్వతశ్రేణి ఈ ‘తల’పై వెలసిన ధవళ తరమైన మణి మకుటం. ఈ మణి కిరీటాన్ని భగ్నం చేయదలచిన పాకిస్తానీ ముష్కరుల పన్నాగం భగ్నమైంది. కార్గిల్ మణి మకుటపు తెల్లదనం మరింత తెల్లగా భరత కీర్తి పతాకం వలె వెలిగిపోతోంది. కానీ 1947 అక్టోబర్‌లో భరతమాత తలకు తగిలిన గాయం ఇప్పటికీ మానలేదు, మూడవ వంతు జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ పాకిస్తాన్ దురాక్రమణలో ఉండడం ఈ ‘గాయం’. 1950వ దశకంలో చైనా ముష్కరులు జమ్మూ కశ్మీర్‌లోని లడక్‌లోకి చొఱబడి దాదాపు ముప్పయి ఎనిమిది చదరపు కిలోమీటర్లను దురాక్రమించడం భరతమాత తలపై ఏర్పడిన ‘పుండు’మీద చల్లిన ‘కారం’.. ఉత్తర కశ్మీర్‌లోని ‘కారాకోరమ్’ ప్రాంతంలోని దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమిని 1963లో పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు అప్పగించింది.. ఇదీ భరతమాత తలపై ఏర్పడి ఉన్న ‘గాయం’! ఈ ‘గాయం’ ఇరవై ఏళ్ల క్రితం పాకిస్తానీ ముష్కరులు కార్గిల్‌లోకి చొఱబడడానికి దశాబ్దుల నేపథ్యం..
కార్గిల్ పర్వతశ్రేణి నుంచి పాకిస్తానీ మూకలను తిప్పికొట్టిన, తరిమివేసిన మన సైనికుల పరాక్రమం మనకు ఆనందకరం. కానీ ముష్కరులను తరిమివేసిన సమయంలో నిర్నిద్ర శ్రమజీవులైన సైనికులకు అది భయానక అనుభవం. క్షణం క్షణం శత్రువుతో, మృత్యువుతో పోరాడిన ఘట్టం ఇప్పుడు మధుర స్మృతి కావచ్చు! కానీ పోరాటం జరిగిన సమయంలో అది భరింపరాని ఉద్వేగం..!! మన సైనికులు భరించారు, విజయం సాధించారు. కార్గిల్‌లోకి పాకిస్తానీ ‘జిహాదీ’లు చొరబడడం చారిత్రక పునరావృత్తి. 1947 అక్టోబర్‌లో పాకిస్తానీలు జరిపిన చొఱబాటు తీరుకు అది పునరావృత్తి. పాకిస్తాన్‌లో 1947 నుంచి కూడ జిహాదీ బీభత్స భూమికపై అరాజక వ్యవస్థ ఏర్పడి ఉంది. ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలు, సైనికులు పరోక్ష-ప్రచ్ఛన్న- బీభత్సకారులు. వీరంతా ‘రాజ్యాంగ’ పద్ధతుల పట్ల నిబద్ధతను అభినయిస్తున్నారు. కిరాయి మూకలు ప్రత్యక్ష జిహాదీ బీభత్సకారులు. ఈ ప్రత్యక్ష జిహాదీ బీభత్సకారులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పరోక్ష బీభత్సకారులు నాటినుంచి నేటివరకు బుకాయించడం పాకిస్తాన్ చరిత్ర. తమ దేశం జిహాదీ బీభత్సకారులకు ఆలవాలం అయి ఉందని అప్పుడప్పుడు పాకిస్తాన్ ‘‘పాలకులు’’గా చెలామణి అవుతున్న పరోక్ష బీభత్సకారులు ప్రకటిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ, సైనిక నియంత పరవేజ్ ముషారఫ్ ఇలా ప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా చెలామణిలో ఉన్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ఇమ్రాన్‌ఖాన్ కూడ అదే మాట అంటున్నాడు. ‘‘నిజమే! మా దేశంలో ముప్పయి, నలబయి వేల మంది బీభత్సకారులు- టెర్రరిస్టులు-, సాయుధ హంతకులు- మిలిటెంట్స్- పనిచేస్తున్నారు-’’ అని ఇమ్రాన్‌ఖాన్ మంగళవారం అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌లో జరిగిన ఒక గోష్ఠిలో ప్రకటించాడు. వీరందరూ మన కశ్మీర్‌లోను, అప్ఘానిస్థాన్‌లోను తయారయి తమ దేశంలోకి చొరబడ్డారన్నది ఇమ్రాన్‌ఖాన్ చెప్పిన అబద్ధం. ఈ జిహాదీ హంతకులు నిజానికి పాకిస్తాన్‌లో తయారయి మన కశ్మీర్‌లోకి చొఱబడుతున్నారు. తమకు ఈ ‘టెర్రరిస్టుల’తో సంబంధం లేదని 2015నుంచి జిహాదీ బీభత్సకారులను ఏరివేయడానికి తమ ప్రభుత్వాలు కార్యాచరణ పథకాన్ని అమలుచేస్తున్నాయన్నది ఇమ్రాన్‌ఖాన్ చెప్పిన మరో అబద్ధం...
బీభత్సపు బట్టీలలో హంతకులను రూపొందించి వారిని మన దేశంలోకి ఉసిగొల్పడం పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏడు దశాబ్దులకు పైగా నిర్వహిస్తున్న కార్యక్రమం. మొదట కిరాయి హంతకులు- ప్రత్యక్ష జిహదీలు- మన కశ్మీర్‌లోకి చొఱబడడం, వారి వెంట పాకిస్తాన్ సైనికులు - ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారులు- చొరబడిపోవడం.. 1947 అక్టోబర్‌లో ఇదే జరిగింది, 1999 ఫిబ్రవరి, మే నెలల మధ్య ఇదే జరిగింది. అందువల్లనే 1947నాటి చొఱబాటునకు 1999లో కార్గిల్‌లోకి చొఱబడడం పునరావృత్తి. ఫిబ్రవరి, మార్చి నెలలలో దట్టంగా ఏర్పడి ఉండిన మంచు తెరల మాటున పాకిస్తానీ ముష్కరులు ‘కార్గిల్’లోకి చొఱబడ్డారు. 1999 మేనెలలో ఈ పర్వతశ్రేణిలో మంచు తెరలు పలుచబడిన తరువాత పాకిస్తానీ ముష్కరులను మన భద్రతా దళాలవారు గుర్తించారు. జూలై నెలవరకు సాగిన పోరాటంలో మన సైనికులు పాకిస్తానీ మూకలను కార్గిల్ ప్రాంగణం నుంచి పూర్తిగా నిర్మూలించగలిగారు. సముద్ర మట్టానికి పదునాలుగు వేల నుంచి పదిహేడు వేల అడుగుల ఎత్తున విస్తరించి ఉన్న కార్గిల్ ప్రాంతం జమ్మూ కశ్మీర్ మధ్యలో నెలకొని ఉంది. కానీ కార్గిల్‌కు ఉత్తరంగాను వాయువ్యంగాను ఉన్న ప్రాంతం పాకిస్తాన్ అక్రమ అధీనంలో- 1948నుంచి ఉంది. తూర్పుగా, ఈశాన్యంగా ఉన్న లడక్ ప్రాంతంలోని భూభాగాలు కొన్ని చైనా దురాక్రమణలో ఉన్నాయి. అందువల్ల మన అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లో ‘కార్గిల్’ ఉత్తర భాగాన ఉన్నట్టు భ్రమ కలుగుతోంది. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌కూ, జమ్మూ కశ్మీర్‌కూ మధ్య ఏర్పడిన ‘అధీనరేఖ’ సమీపంలో నెలకొని ఉన్న కార్గిల్‌ను కబళించడం ద్వారా పర్వతప్రాంత యుద్ధవ్యూహంలో పైచేయి సాధించాలన్న పాకిస్తాన్ కుట్ర అలా భగ్నమైంది...
వంచించడం పాకిస్తాన్ ప్రభుత్వ నైజం, సహజ స్వభావం. కార్గిల్‌లోకి చొఱబడడం ఈ వంచన క్రీడలో మరో ఘట్టం. తాము మన దేశంతో మైత్రిని వాంఛిస్తున్నట్టు అప్పటి పాకిస్తాన్ ప్రధానిగా చెలామణి అయిన ప్రచ్ఛన్న ‘జిహాదీ’ నవాజ్ షరీఫ్ ప్రకటించాడు. ఈ ‘మైత్రి మాటలు’ నిజమని మన ప్రభుత్వం నమ్మింది. ఢిల్లీనుంచి పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ వరకు బస్సులు నడపడం ఈ ‘‘మైత్రి’’లో భాగం. 1999 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీ నుంచి లాహోర్‌కు బస్సులు నడపడం మొదలైంది. ఫిబ్రవరి 20వ తేదీన అప్పటి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి బస్సెక్కి లాహోర్‌కు వెళ్లాడు. పంజాబ్‌లోని అత్తారీ- వాఘా సరిహద్దు ద్వారం వద్ద అటల్ బిహారీకి నవాజ్ షరీఫ్ ఘనస్వాగతం పలికాడు. ఇలా మైత్రిని నటించిన సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొలిపిన ప్రత్యక్ష, ప్రచ్ఛన్న బీభత్సకారులు కార్గిల్‌లోకి చొఱబడినారు. దరహాసపు తెరల వెనుక దాగిన నవాజ్ షరీఫ్ విష హృదయం అలా బద్దలైంది. ఇలా బద్దలు చేయగలిగినవారు భరతమాతృ యశో విభవ రక్షకులైన మన సైనికులు....
వీరుల ‘బల’దానంతో
విజయం మనదే అయ్యెను,
కార్గిల్ మణిమకుట ధవళ
కాంతి ధవళతమమయ్యెను!
వారికి ఏమివ్వగలం?
ఎలా తీరు వారి ఋణం??
భరత జనని చరితలోన
వారిది బంగరు ఘట్టం..