సంపాదకీయం

హాంగ్‌కాంగ్.. కైలాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్ ప్రాంతంలో ప్రస్తుతం చైనా ప్రభుత్వ వ్యతిరేక నిరసన జ్వాలలు చెలరేగుతుండడం, ‘కైలాస పర్వత మానస సరోవర’ ప్రాంతం చైనా అక్రమ అధీనంలో కొనసాగుతుండడం సమాంతర చరిత్రతో ముడివడిన విపరిణామ క్రమం. ఈ సమాన సమాంతర చరిత్ర బ్రిటన్ సామ్రాజ్యవాదుల దురాక్రమణ. చైనా ప్రధాన భూభాగాన్ని ఆనుకొని ఉన్న ‘హాంగ్‌కాంగ్’ను క్రీస్తుశకం 1842లో బ్రిటన్ కబళించింది. ఆ తరువాత యాబయి ఆరేళ్లకు చైనాకూ బ్రిటన్‌కూ మధ్య ‘సంధి’ కుదిరింది. హాంగ్‌కాంగ్ చుట్టుపక్కల ఉన్న కోలాన్ వంటి ప్రాంతాలను చైనా 1898లో బ్రిటన్‌కు ‘తాకట్టు’ పెట్టింది. తొంబయి తొమ్మిది ఏళ్లపాటు ఈ ‘హాంగ్‌కాంగ్’ సమీప ప్రాంతాలు బ్రిటన్ అధీనంలో ఉండాలన్నది 1898లో కుదిరిన ఒప్పందం. ఒప్పందం కాల వ్యవధి 1997లో పూర్తయింది. బ్రిటన్ ‘హాంగ్‌కాంగ్’ సమీప ప్రాంతాలను చైనాకు తిరిగి స్వాధీనం చేసింది. కానీ ‘‘చుట్టుపక్కల ఉన్న’’ ప్రాంతాలతోపాటు ‘హాంగ్‌కాంగ్’ను తమకు అప్పగించాలని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నిర్వాహకులు ‘పేచీ’పెట్టారు. బ్రిటన్ లొంగిపోయింది. లొంగదీయగలగడం చైనా సాధించిన విజయం. హాంగ్‌కాంగ్ సమీప ప్రాంతాలపై 1898కి పూర్వం చైనా పెత్తనం వహించింది. కానీ 1842కు పూర్వం ‘హాంగ్‌కాంగ్’- చైనాలో భాగమా? కాదా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. అందువల్ల నూట యాబయి ఐదు ఏళ్ల- 1842నుంచి 1997 వరకు- బ్రిటన్ పెత్తనం పరిసమాప్తం అయిన తరువాత ‘స్వతంత్ర నగర దేశం’- సింగపూర్ నగరం వలె, వాటికన్ నగరం వలె- గా ఏర్పడాలని ‘హాంగ్‌కాంగ్’ వాసులు కలలుకన్నారు. 1997 నాటికి ‘హాంగ్‌కాంగ్’లో బహుళపక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ రూపొందుతూ ఉండింది. కానీ బ్రిటన్ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిన కారణం స్వతంత్ర దేశంగా ఏర్పడాలన్న ‘హాంగ్‌కాంగ్’ కలలు కల్లలయ్యాయి. చైనాకు 1898కి పూర్వం చెందిన సమీప ప్రాంతాలతోపాటు ‘హాంగ్‌కాంగ్’కూడ చైనాతో కలసిపోవలసి వచ్చింది. చైనాలో 1949నుంచి ఏకపక్ష ‘కమ్యూనిస్టు’ నియంతృత్వ వ్యవస్థ కొనసాగుతోంది. కానీ ‘హాంగ్‌కాంగ్’లో మాత్రం బహుళపక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను కొనసాగించడానికి 1997లో చైనా ప్రభుత్వం అంగీకరించింది. ‘హాంగ్‌కాంగ్’ ప్రజలకు హామీఇచ్చింది. ఒకే దేశంలో రెండు రకాల రాజ్యాంగ వ్యవస్థలు- ఒన్ కంట్రీ టు సిస్టమ్స్- అన్న సూత్రాన్ని చైనా ప్రభుత్వం నిర్ధారించింది. అందువల్ల చైనా అంతటా ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ, హాంగ్‌కాంగ్‌లో మాత్రం బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ 1997నుంచి కొనసాగుతున్నాయి. ఈ బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తిని నీరుకార్చడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తుండడం హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుతం నిరసన జ్వాలలు చెలరేగుతుండడానికి కారణం! ఈ హాంగ్‌కాంగ్ కథకు పూర్తి భిన్నంగా ఒకప్పుడు మన దేశంలో ఉండిన ‘‘కైలాస మానస ప్రాంతం’’ ఇప్పుడు మన దేశంలో లేదు.
చైనాను చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉందన్నది ఆ దేశానికి వెళ్లివచ్చిన మన ప్రముఖులలో ఎక్కువమంది చెప్పిన మాట. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మాత్రమేకాక ప్రధానమంత్రులు సైతం చైనాను చూసి మనకు పాఠాలు బోధించడానికి తహతహలాడిపోవడం చరిత్ర. కానీ చైనా చరిత్రను చూసి మన నాయకులు నేర్చుకోలేదు. కైలాస పర్వత మానస సరోవర ప్రాంతాలు చైనా దురాక్రమణగ్రస్తం అయి ఉండడం- ‘‘మనవారి ఈ చైనాను చూసి నేర్చుకోని తనానికి’’ ప్రత్యక్ష సాక్ష్యం. బ్రిటన్ తదితర పాశ్చాత్య దురాక్రమణదారులు మన దేశాన్ని ముక్కలుచేసి పోవడం మనం చైనాను చూసి నేర్చకోలేదనడానికి నిదర్శనం. తనవికాని భూభాగాలను చైనా శతాబ్దుల తరబడి దురాక్రమించి విలీనం చేసుకొనడం చరిత్ర. ఈ చారిత్రక పాఠాన్ని మన దేశం శతాబ్దుల తరబడి ‘‘నేర్చుకోకపోవడం’’ మన చరిత్ర. మన దేశం అనాదిగా ఇతర దేశాలను దురాక్రమించలేదు! దురాక్రమణ జరిపిన విదేశీయ బర్బర మూకలను, బీభత్స జాతులను తిప్పి కొట్టడం లేదా తిప్పికొట్టలేకపోవడం మాత్రమే అనాదిగా అఖండ భారత చరిత్ర. టిబెట్, హూణ- సింకియాంగ్-, మంచూరియా, మంగోలియా వంటి దేశాలను దశలవారీగా చైనా దురాక్రమించింది. మంగోలియాలో కొంత భాగం స్వతంత్ర దేశంగా ఇప్పటికీ మిగిలి ఉంది. దక్షిణాన ఉన్న టిబెట్‌ను 1949లో చైనా దురాక్రమించింది. పశ్చిమాన ఉన్న ‘సింకియాంగ్’ ప్రాంతం ఒకప్పుడు ‘హూణ’ దేశం. ‘హూణ’ దేశానికీ, ‘హాణ’- చైనా- దేశానికీ మధ్య శతాబ్దులపాటు యుద్ధాలు జరిగాయి. 1885వరకూ ‘హూణ’ దేశం- సింకియాంగ్- చైనా దురాక్రమణను నిరోధించింది. ఈ ‘హూణ’ ప్రాంతంలో వేద సంస్కృతి, ఆ తరువాత బౌద్ధమతం విలసిల్లడం క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దివరకూ నడచిన చరిత్ర. ఆ తరువాత ‘జిహాదీ’ బీభత్సకారులు చొరబడి ‘హూణ’ప్రాంతాన్ని ‘తుర్కీస్థాన్’గా మార్చారు. చైనా 1885 ఈ ప్రాంతాన్ని దురాక్రమించి విలీనం చేసుకొంది. ప్రస్తుతం ఈ ప్రాంతం పేరు ‘జింఝియాంగ్’! ఇలాగే ఉత్తరాన కూడ మంచూరియా, మంగోలియాలో కొంత చైనా శాశ్వత దురాక్రమణకు గురికావడం నడుస్తున్న చరిత్ర. ఇలా ఇరుగుపొరుగు దేశాలను కబళించడం చైనా చారిత్రక స్వభావం!!
మన దేశం ఇలాంటి ‘దురాక్రమణ’ను చైనా నుండి నేర్చుకోలేదు, నేర్చుకోవలసిన అవసరం లేదు. కానీ మన దేశం నుంచి మన ప్రాంతాలు విడిపోకుండా మనం నిరోధించ లేకపోవడం మన శతాబ్దుల చారిత్రక వైఫల్యం.. ఈ వైఫల్యం కారణంగానే ‘కైలాస మానస’ప్రాంతం మన దేశం నుంచి విడిపోయింది. అనాదిగా భారతీయుల ధార్మిక సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు జాతీయ భౌగోళిక పరిధి లోపలనే ఉన్నాయి, వెలుపల లేవు! సింహ ద్వీపం - శ్రీలంక-లోని కొలంబో సమీపంలో ఉన్న ‘శాంకరీదేవీ శక్తిపీఠం’నుంచి త్రివిష్టపం- టిబెట్-లోని ‘కైలాసం’వరకు దక్షిణోత్తరాలుగా అఖండ భారతం విస్తరించింది. తనది కాని ‘హాంగ్‌కాంగ్’ను చైనా దిగమింగింది. కానీ తనవైన ‘శాంకరీదేవి’ని కైలాస పర్వతాన్ని భారత్ పోగొట్టుకొంది. ఇదీ చైనాను చూసి నేర్చుకోని పాఠం.. టిబెట్ అనాదిగా అఖండ భారత వర్షంలో భాగం, భారత ఖండానికి ఉత్తర భాగం! మహాభారత యుద్ధం తరువాత ‘రూపతి’అన్న కురువంశీయుడు టిబెట్‌ను పాలించాడు. కలియుగంలో ఇతడు టిబెట్ తొలి పాలకుడు. ఆ తరువాత టిబెట్ భారత్ నుంచి రాజకీయంగా విడిపోయింది. దాదాపు రెండువేల ఐదువందల ఏళ్లుగా మిగిలిన భారత్ కంటె భిన్నమైన దేశంగా టిబెట్ కొనసాగింది. అయినప్పటికీ భారత్‌తో టిబెట్‌కున్న సాంస్కృతిక జాతీయ సమానత్వం నశించలేదు. ఉభయ దేశాల మధ్య 1914లో భౌగోళికమైన సరిహద్దును ఏర్పరచిన బ్రిటన్ పెత్తందార్లు ధారాళంగా భారత ప్రాంతాలను టిబెట్‌కు ధారాదత్తం చేశారు. ఫలితంగా అంతవరకు భారత్‌లోనే ఉండిన ‘కైలాస మానసం’ టిబెట్‌లో కలసిపోయింది. బ్రిటన్ దాస్యగ్రస్తులై ఉండిన భారతీయులకు ప్రతిఘటించాలన్న ధ్యాస లేదు... కానీ టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండినంతవరకు ‘వీసా’- ప్రవేశ అనుమతి పత్రం- లతో పనిలేకుండా భారతీయులు నిర్నిరోధంగా కైలాసానికి మానస సరోవరానికి వెళ్లివచ్చారు. కానీ టిబెట్‌ను చైనా కబళించాక కైలాసం కథ మారిపోయింది....
ఇదీ మన దేశానికీ చైనాకు మధ్యగల స్వభావం- భేదం. అటు హాంగ్‌కాంగ్ కథ. ఇటు కైలాసం వ్యథ.. చైనాలోని అమానవీయ న్యాయ వ్యవస్థను, చట్టాలను తమపై రుద్దే యత్నాన్ని హాంగ్‌కాంగ్ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు.. కైలాస దర్శనం చేయదలచిన భారతీయ యాత్రికులు చైనా ‘అనుమతి’ కోసం పడిగాపులు కాస్తున్నారు...