సంపాదకీయం

వాణిజ్య ‘జలశక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణిజ్య జలాలు పల్లెలలోని ఇళ్లకు సైతం పరుగులు తీస్తుండడం సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘జలశక్తి అభియాన్’కు విచిత్రమైన నేపథ్యం. భారత జాతీయ అస్తిత్వాన్ని ‘ప్రపంచీకరణ ఆర్భాటం’ దిగమింగుతుండడం వాణిజ్యపు నీరు ఇంటింటికీ సరఫరా అవుతుండడానికి కారణం. స్వచ్ఛమైన నీరు బహుశా దేశంలో ఎక్కడ కూడ లేదు... స్వచ్ఛ జలాలు భారతీయ అస్తిత్వం! పాలకంటె నీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం ప్రాకృతిక సత్యం, సృష్టిగత వాస్తవం! ఈ వాస్తవం అనాదిగా భారత జాతీయ జీవనంలో భాగం! ‘ప్లాస్టిక్’పొట్లాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ తిత్తులలో, ప్లాస్టిక్ సీసాలలో, ప్లాస్టిక్ డిప్పలలో నిండి ఉన్న నీరు ‘ప్రపంచీకరణ’ విస్తరణ ఫలితం. ఈ ‘అంగడి’ నీటికి దేశంలో కొదవలేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ ‘వాణిజ్య జలం’ పుష్కలంగా లభ్యవౌతోంది! అందువల్ల కొని తాగేవారికి గొంతులు ఎండటం లేదు. ఇదీ ప్రపంచీకరణ... సహజంగా లభించిన బావినీరు, చెఱువునీరు, నదుల నీరు, ‘నల్లా’నీరు మాత్రం ఇంకిపోయింది, ఎండిపోయింది! నీటి వ్యాపారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించలేకపోవడం డెబ్బయి ఏళ్ల ‘ప్రగతి’కి వ్యవహార సూచిక! స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- డెబ్బయి లక్షల కోట్ల రూపాయల స్థాయి- ఒక ట్రిలియన్ అమెరికా డాలర్లు- చేరడం గొప్ప చారిత్రక ఘటన. బ్రిటన్ దురాక్రమణ విముక్త ‘అవశేష’ భారత్ ఈ విజయం సాధించడానికి అరవై ఏళ్లు పట్టింది. కానీ ఈ అరవై ఏళ్లలో పుష్కలమైన స్థాయినుంచి ప్లాస్టిక్ పొట్లం స్థాయికి మంచినీటి ప్రగతి దిగజారిపోవడం సమాంతర చరిత్ర. ‘జిడిపి’ గురించి, ‘ప్రాంతీయ స్థూల ఉత్పత్తుల’ గురించి ‘డబడబడబ’ డప్పులు కొడుతున్న ప్రభుత్వాలకు సామాన్యుడు మంచినీటిని కొనుగోలుచేస్తున్న దయనీయ దృశ్యాలు కనిపించడం లేదు. ‘సీసాల’ నీరు ఉత్పత్తిచేసి జనాలకు అమ్మి దోచుకోవడానికి వీలుగా ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలను ప్రోత్సహిస్తున్నారు! ఇదీ ‘జలశక్తి’ అభియాన్ ఆరంభమైన సోమవారంనాటి స్థితి. అరవై ఏళ్లలో డెబ్బయి లక్షల కోట్ల రూపాయలకు చేరిన మన ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ మరో ఏడేళ్లలో రెట్టింపు అయిందట. ఇప్పుడు మూడురెట్లు కావడానికి రంగం సిద్ధం అయింది. మరో ఐదేళ్లలో మన ‘జిడిపి’ ఐదు ట్రిలియన్ల అమెరికా డాలర్ల స్థాయికి చేరుతుందట. ఈ ప్రగతిని రూపాయలలో చెప్పరు. మన ప్రజలకు అర్థంకాకపోయినా లెక్కలేదు. ఈ ‘ప్రగతి’ అమెరికా వారికి అర్థమైతే చాలు! ‘పెట్టుబడులు’ ప్రవాహాలై మన దేశాన్ని ముంచెత్తుతాయి. ఈ పెట్టుబడుల ప్రవాహాలు పెరుగుతున్నకొద్దీ దేశంలోని నీటి ప్రవాహాలు ఇంకిపోతున్నాయి. ఇదీ ప్రగతి... ‘ప్రపంచీకరణ’ భారతీయతకు పట్టించిన గతి.
జలశక్తి ‘అభియాన్’-ఉద్యమం జనశక్తి ఉద్యమంగా మారాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట. కేంద్ర ప్రభుత్వం వారి ఆకాంక్ష. తీవ్రమైన నీటి ‘కటకట’కు గురి అవుతున్న రెండువందల యాబయి ఐదు జిల్లాలలో నీటిని పదిలపరచి ప్రజలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమ లక్ష్యం... వర్షపు నీటిలో ఎనిమిది శాతం మాత్రమే దేశ ప్రజలు ఉపయోగించుకుంటుండడం పట్ల తొంబయి రెండు శాతం వృథా అవుతుండడం పట్ల నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశాడు. జలశక్తి పరిరక్షణ ఉద్యమం విజయవంతం అయితే జనం మంచినీటిని కొనుగోలుచేసే అవసరం ఉండదా?? గోదావరీ నదీ జలాలు భారీగా సముద్రం పాలవుతుండడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆవేదనను వ్యక్తం చేయడం జల పరిరక్షణ పట్ల వారి తపనకు తార్కాణం. గోదావరీ జలాలను భారీగా తరలించి కృష్ణానదిలో కలపడానికి ఉభయ రాష్టాల ప్రభుత్వాలు కృషిచేస్తుండడం ముదావహం. పట్టిసీమ పథకం ద్వారా గోదావరీ కృష్ణా నదుల అనుసంధానం 2016లో మొదలైంది. శ్రీశైలం జలాశయానికి గోదావరి నీరు తరలించడం ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సంకల్పం. తెలంగాణ అంతటా కాళేశ్వరం ‘గంగ’ పరుగులు తీయడం మహాద్భుత సుజల విప్లవం! గంగానదీ జలాల ప్రక్షాళనకోసం, ‘అవిరళ’- ఎడతెగని- ప్రవాహం కొనసాగడంకోసం కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగే’ బృహత్ పథకాన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరుపుతోంది. 2017 సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో సద్గురు జగ్గీవాసుదేవ్ నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు- హరిద్వారం వరకు- నిర్వహించిన ‘నదుల పరిరక్షణ మహాయాత్ర’ నీటి కొరత సమస్యలకు అద్దం పట్టింది...
ఇలా ఒకవైపున జలరక్షణకు జరుగుతున్న కృషిని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ జల భక్షణ కుట్ర కబళించి వేస్తోంది. 2010లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ‘నీటి నిర్వహణ, నీటి పంపిణీ’లపై ఒక సదస్సు జరిగింది. సంపన్న దేశాల ప్రతినిధులు మాత్రమే హాజరయిన ఈ సదస్సులో ‘‘ప్రవర్థమాన దేశాలలోని’’ ప్రజలు నీటిని వృథాగా ఖర్చుచేస్తున్నారని నిర్ణయించారు. అందువల్ల వ్యవసాయానికి, తాగడానికి ఉపయోగిస్తున్న నీటి ‘్ధర’లను పెంచాలన్నది ఈ సంపన్న ప్రభుత్వ ప్రతినిధులైన మేధావులు చేసిన నిర్ణయం. ఆర్థిక సహకార అభివృద్ధి సమాఖ్య- ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్- ఓఇసిడి-లోని సభ్య దేశాల ప్రతినిధులు మాత్రమే హాజరయిన ఆ సదస్సులో ఆయా దేశాల ‘వాణిజ్య సంస్థలు’ ప్రవర్ధమాన దేశాలలోని నీటి వనరులను దోపిడీ చేయడానికి వలసిన మార్గాలను అనే్వషించారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐరోపాలోని సంపన్న దేశాలు ఈ ‘ఓఇసిడి’గా ఏర్పడినాయి. భారతదేశంలో ‘వాణిజ్య జలాల’కు రానురాను ‘గిరాకీ’పెరుగుతుండడం గురించి కూడ ఆ సదస్సులో చర్చించినట్టు అప్పుడు ప్రచారమైంది. మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్- ఆర్థిక మంత్రిగా ఐదు ఏళ్లు, ప్రధానిగా పది ఏళ్లు- రూపకల్పన చేసి వ్యవస్థీకరించిన ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలో నీటి నిర్వహణను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడం భాగం! మన్‌మోహన్‌సింగ్ నెత్తికెత్తిన ‘ప్రపంచీకరణ’ గంపను ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటికీ మోస్తుండడం నీటి కొరత, కాలుష్యం విస్తరించడానికి ప్రధాన కారణం... 1977 నుంచి 1979వరకు మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిత్వంలో ‘జనతాపార్టీ’ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించింది. ‘‘చేద బావులలోని నీటిని శుభ్రపరచడానికి’’ కొంతమంది శాస్తవ్రేత్తలు ఒక పథకాన్ని రూపొందించారట! ఈ పథకాన్ని వారు మొరార్జీదేశాయ్‌కి వివరించారట. ‘‘నేను, మా నాయన, మా తాత చేదబావుల నీరు తాగాము. లక్షలాది గ్రామాలలో ప్రజలు తరతరాలుగా బావి నీరు త్రాగుతున్నారు... అందువల్ల మీరు కొత్తగా ప్రక్షాళన చేయవలసిన పని లేదు...’’ అని మొరార్జీదేశాయ్ అన్నాడట!
భూగర్భ జలాలు ‘అవిరళం’గా- ఎడతెగక ప్రవహించిన రోజులలో ఊట బావులలో నీరు నిర్మలంగా ఉండేది. స్థిరాస్థి వ్యాపారులు, వాణిజ్య వ్యవసాయదారులు భూగర్భాన్ని తవ్వి, కుళ్లగించి పెళ్లగించి వేల అడుగుల లోతువరకు గొట్టాలను దింపి నీరు జుర్రేశారు. ఫలితంగా బావులన్నీ ఎండిపోయాయి. రసాయనాలు ఇంకిన భూగర్భం కలుషితం అయింది. అందువల్ల వర్షపునీరు ఇంకినప్పటికీ భూగర్భ జలాలు తాగడానికి పనికిరాని స్థితికి చేరాయి. వ్యవసాయానికి సైతం ఈ ‘రసాయన’జలాలు పనికిరావు. ‘శీతల పానీయాలు’ ‘సీసాల నీరు’తయారుచేస్తున్న సంస్థలు, కొండలను అడవులను నీటి చుక్కలేకుండా ఎండగట్టారు. ఈ వాణిజ్య ‘సామ్రాజ్య వాదం’ నుంచి ‘ప్రపంచీకరణ’ విధానాల నుంచి విముక్తి లభించేవరకు నీటికి రక్షణ ఉండదు... ప్రభుత్వాలు మథనం సాగించాలి!!